రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఉద్యోగుల తరహాలోనే నగదు రహిత వైద్యం అందిస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రయోజనాలను కేవలం అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకే పరిమితం చేసింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ఉద్యోగుల తరహాలోనే నగదు రహిత వైద్యం అందిస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రయోజనాలను కేవలం అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకే పరిమితం చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మార్గదర్శకాలు జారీచేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ జారీచేసిన అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు మాత్రమే అందించాలని నిర్ణయించింది.
అక్రిడిటేషన్ గుర్తింపు కార్డులు ఉన్న ఎలక్ట్రానిక్, ప్రింట్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గుర్తించిన జర్నలిస్టుల వివరాలు త్వరలోనే సమాచార పౌరసంబంధాల శాఖ జారీచేయడంతో పాటు పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా కూడా వ్యవహరిస్తుంది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని, అలాంటి వివరాలు సమాచార పౌరసంబంధాల శాఖలో ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జర్నలిస్టుకు ఒక్కసారి వైద్యానికి రూ.2 లక్షలు నిర్ణయించారు. జర్నలిస్టులతో పాటు భార్య, పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. జర్నలిస్టుకు ప్రీమియం రూ.2500 నిర్ణయించారు. అంతే ప్రీమియాన్ని ప్రభుత్వమూ చెల్లిస్తుందని పేర్కొన్నారు.