జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వండి
నవీన్ మిట్టల్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి నిబంధనలు, అడ్డంకులు సృష్టించకుండా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. అక్రెడిటేషన్ల జారీకి డిగ్రీ సర్టిఫికెట్లతో ముడిపెట్టడం, చిన్న పత్రికలకు అక్రెడిటేషన్ల జారీపై ఆంక్షలు విధించడం, అక్రెడిటేషన్లతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు జారీ కాకపోవడం పట్ల బుధవారం పలు జర్నలిస్టు యూనియన్లు సచివాలయంలో మంత్రిని కలసి ఫిర్యాదు చేశాయి.
దీనికి స్పందించిన కేటీఆర్.. నవీన్ మిట్టల్‌తో మాట్లాడారు. డిగ్రీ విద్యార్హతతో సంబంధం లేకుండా జిల్లాల్లో చిన్న పత్రికలకు వెంటనే అక్రెడిటేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఏసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాత జిల్లాల ప్రకారమే జర్నలిస్టులకు బస్‌పాస్‌లు జారీ చేయాలని మంత్రి మహేందర్‌రెడ్డిని కోరారు. కేటీఆర్‌ను కలసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పలు యూనియన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.