న్యూఢిల్లీ: నకిలీ వార్త రాస్తే జర్నలిస్టుల గుర్తింపు (అక్రెడిటేషన్) రద్దు చేస్తామన్న ప్రతిపాదన నుంచి కేంద్రం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద మార్గదర్శకాలపై అటు ప్రతిపక్షాలు, ఇటు జర్నలిస్టుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. వాటిని రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించారు.
అక్రెడిటేషన్ రద్దుపై విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఆ మంత్రిత్వ శాఖకు సూచించింది. ప్రింట్ మీడియాకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ), టెలివిజన్ మీడియాకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) నియంత్రణా వ్యవస్థలుగా ఉన్నాయని, ఆ సంస్థలే నకిలీ వార్తలా, కాదా అనే నిర్ధారణకు వస్తాయని ప్రధాని పేర్కొన్నట్లు పీఎంవో అధికారి తెలిపారు.
ఈ విషయంలో ప్రభుత్వ జోక్యం సరికాదని ప్రధాని అభిప్రాయపడినట్టు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో పీఎంవో సూచన మేరకు ఈ వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా తమ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి స్మృతీ ఇరానీ సమర్థిస్తూ ట్వీట్ చేసిన వెనువెంటనే ప్రధాని కార్యాలయం ఆ మార్గదర్శకాలను ఉపసంహరించుకోమని ఆదేశించడం విశేషం.
ప్రధాని ఆదేశాల మేరకు...
సమాచార ప్రసార శాఖ సోమవారం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. తొలిసారి నకిలీ వార్త రాసిన జర్నలిస్టుకు గుర్తింపును ఆరు నెలలపాటు, రెండో సారి అదే తప్పు చేస్తే సంవత్సరం పాటు, మూడో సారి కూడా తప్పు చేస్తే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తారు. అయితే ఈ నిబంధనలను ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మంగళ వారం ఉపసంహరించుకున్నారు.
భగ్గుమన్న ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు
నకిలీ వార్తలకు సంబంధించి సోమవారం కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వెలిబు చ్చాయి. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. పత్రికలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గౌతమ్ లాహిరి అన్నారు. నకిలీ వార్తలపై ఫిర్యాదులుంటే ప్రెస్ కౌన్సిల్ చూసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రం నిరంకుశ ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎడిటర్స్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అలాంటి ఆదేశాల ద్వారా మీడియాపై పర్యవేక్షణ బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వం తనపై వేసుకోవాలని భావిస్తోందని, ఇలాంటి వాటివల్ల జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడేలా పనికిరాని ఫిర్యాదు చేసేందుకు ద్వారాలు తెరిచినట్లవుతుందని ఎడిటర్స్ గిల్డ్ విమర్శించింది.
ఫేక్ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా ముప్పుగా పరిణమించిందని, వాటిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే అందులో తప్పేమీ లేదని, అయితే స్వతంత్ర రాజ్యాంగ సంస్థ మాత్రమే వాటి ప్రామాణికతను నిర్ధారించాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. వివేకం కలిగిన ఎవరూ కూడా ఫేస్ న్యూస్‌ను సమర్ధించరని తెలిపింది. పత్రికా స్వేచ్ఛను హరించే నిర్ణయమిదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment