జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
⇒ రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా.. అందరికీ అక్రిడిటేషన్ కార్డులు
⇒ పాత్రికేయ వృత్తి శిక్షణ కోసం యూనివర్శిటీ ఏర్పాటు
⇒ టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలో మహమూద్ అలీ, హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకప్రాత పోషించిన జర్నలిస్టుల రక్షణ, సంక్షేమం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, హెల్త్‌కార్డులు, కేజీ టూ పీజీ ఉచిత విద్య పథకాలను జర్నలిస్టు కుటుంబాలకు సైతం వర్తింపజేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులతో పాటు జర్నలిస్టులు ముఖ్యపాత్ర పోషిం చారని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. జర్నలిస్టులకు మెరుగైన ప్యాకేజీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తుండటం వల్లే కొంత ఆలస్యమవుతోందని చెప్పారు.
ఆదివారం లళిత కళాతోరణంలో జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(టీయూడబ్ల్యూజే) ప్రథమ మహాసభలో మంత్రులిద్దరూ పాల్గొని జర్నలిస్టుల సమస్యలపై పలు హామీలిచ్చారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు రూ. 2 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించడంతో పాటు రూ. 4 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత గృహాలు, పట్టణాల్లో ఒక అంతస్తు(జీ+1) పద్ధతిలో ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు.
ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు మంజూరు చేస్తామన్నారు. వృత్తిలో కొనసాగుతూనే నైపుణ్యాల పెంపుదల, ఉన్నత విద్య అభ్యసించాలనుకునే జర్నలిస్టుల కోసం విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలనే ఆలోచన ఉందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీపీఐఎల్పీ నేత రవీంద్రకుమార్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడమే ఉద్యోగ భద్రతకు అసలు పరిష్కారమని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు తదితర అంశాలపై తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వైద్య సదుపాయాలతో హెల్త్ కార్డులు, రాష్ట్ర, జిల్లా స్థాయి కేటగిరీలుగా అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని సిఫారసు చేశామన్నారు.
జర్నలిస్టుల వేజ్ బోర్డు సిఫారసులు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఐజేయూ అధ్యక్షుడు ఎస్‌ఎన్ సిన్హా కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ నేతలు దేవులపల్లి అమర్, కె.శ్రీనివాసరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ స భ్యులు అమర్‌నాథ్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు నగనూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నల్లి ధర్మారావు, టీఎన్జీవోల అధ్యక్షుడు కె.రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఈ మహాసభకు తెలంగాణ జిల్లాల నుంచి జర్నలిస్టులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ వార్తలు రాసి హత్యకు గురైన జర్నలిస్టు షోయబుల్లాఖాన్ పేరును సభాప్రాంగణానికి పెట్టారు. సభ ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా, జర్నలిస్టుల సాక్షిగా ఈ సభలో టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం సాగింది.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు సంకెళ్లు వేస్తోందని, తెలంగాణ కోసం పోరాడిన జర్నలిస్టులు తమ హక్కుల కోసం ప్రభుత్వం ముందు చేతులు చాచి అడుక్కోవాల్సి రావడం బాధాకరమని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఆరోపించారు. దీనిపై శాసనసభ అంచనాల కమిటీ చెర్మైన్ సోలిపేట రామలింగారెడ్డితో పాటు తెలంగాణ రచయితల ఫోరం అధ్యక్షులు నందిని సిధారెడ్డి తీవ్ర స్థాయిలో ప్రత్యారోపణలు చేశారు.