IIMs
-
ఐఐఎంల నెత్తిన పిడుగు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి విద్యా సంస్థలు భవిష్యత్తు ఉద్యోగులను తయారు చేసే ఫ్యాక్టరీలు కాదు. ఎంచుకున్న రంగంలో విద్యార్థులకెదురయ్యే సవాళ్లనూ, సమస్యలనూ విప్పి చెప్పి వారిని ఆలోచింపజేయడం, వాటి పరిష్కారానికి సన్నద్ధపరిచేలా ప్రోత్సహించడం ఆ సంస్థల పని. ఆ ప్రక్రియలోనే మెరుగైన రేపటి తరం ఆవిర్భవిస్తుంది. అలాంటి సంస్థలు తమ లక్ష్యాలు సాధించా లంటే వాటిని ఉద్యోగస్వామ్య నియంత్రణ నుంచి తప్పించాలన్న సదుద్దేశంతోనే ప్రపంచ దేశాల న్నిటా వాటికి స్వయంప్రతిపత్తినిస్తారు. ఆ ప్రతిపత్తికి ఇప్పుడు ముప్పు ముంచుకొచ్చిందని దేశం లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లు బెంబేలెత్తుతున్నాయి. గవర్నర్ల బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఐఐఎం ప్రవర్తించిందని తేలినపక్షంలో చర్య తీసుకునేందుకు అనువుగా ప్రస్తుతం వున్న ఐఐఎం చట్టాన్ని సవరిస్తారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇది తమ స్వయం ప్రతిపత్తిలో జోక్యం చేసుకోవడమే అవుతుందన్నది ఐఐఎంల వాదన. ఆ సంస్థలకు ఇలాంటి పరిస్థితి కొత్తగాదు. అయిదేళ్లక్రితం స్మృతి ఇరానీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను చూస్తు న్నప్పుడు ఆ శాఖ ఐఐఎంల నియంత్రణ కోసం బిల్లు రూపొందించినప్పుడు ఆ సంస్థల నిర్వాహ కుల్లో కలవరం బయల్దేరింది. ఐఐఎం డైరెక్టర్ల నియామకం మొదలుకొని అధ్యాపకుల ఎంపిక, వారి జీతభత్యాల నిర్ణయం వరకూ అన్నిటిలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వుండేలా ఆ బిల్లును తయారు చేశారు. మొన్న ఆగస్టు నుంచి ఆ శాఖ పేరు మారింది. దాన్ని ఇప్పుడు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా పిలుస్తున్నారు. కానీ తమ స్వయంప్రతిపత్తి విషయంలో మాత్రం అప్పటికీ ఇప్పటికీ మారిం దేమీ లేదని ఐఐఎం నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఆ బిల్లు మూలనపడింది. అంతేకాదు... వాటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు పూచీపడేలా 2017లో ఐఐఎం చట్టం రూపొందింది. అది 2018 జనవరి నెలాఖరునుంచి అమల్లో కొచ్చింది. దాని ప్రకారం డైరెక్టర్లనూ, చైర్పర్సన్లనూ, బోర్డు సభ్యులనూ ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఐఐఎంలకే వదిలిపెట్టారు. అంతక్రితం ప్రధాని ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నియామకాల సంఘం (ఏసీసీ) ధ్రువీకరించాకే ఐఐఎంలు తాము అర్హులనుకున్నవారిని నియమించగలిగేవి. సమస్య చాలా చిన్నది. ఏడాది కోర్సుకు డిగ్రీ పట్టా ఇవ్వడంపైనే వివాదం. మొన్న జూలైలో ఇలా డిగ్రీలు ప్రదానం చేయడానికి నిర్ణయించారు. అంతవరకూ దాన్ని డిప్లొమాగానే పరిగణించేవారు. ఏ కోర్సునైనా డిగ్రీగా నిర్ణయించుకునే అధికారం ఐఐఎంలకు వుందని ఐఐఎం చట్ట నిబంధన చెబుతోంది. అయితే రెండేళ్ల కోర్సు చేసేవారికి మాత్రమే డిగ్రీ పట్టా ప్రదానం చేయాలని యూజీసీ స్పష్టం చేసింది. ఐఐఎం ప్రయత్నం తమ నిబంధనలకు విరుద్ధమం టోంది. ప్రభుత్వం కూడా యూజీసీనే సమర్థిస్తోంది. ఈ వివాదం తేలకుండానే రోహ్తక్ ఐఐఎం తమ గవర్నర్ల బోర్డుకు చైర్‌పర్సన్‌ను నియమించే ప్రయత్నం చేసింది. అది కూడా వివాదంగా మారింది. ఐఐఎంకు కావాల్సిన నిధుల్ని ప్రభుత్వం సమకూర్చుతున్నప్పుడు, దానిపై అజ్మాయిషీ కూడా అవస రమవుతుందని 2015లో స్మృతి ఇరానీ చెప్పారు. అయితే ప్రధాని కార్యాలయం దాన్ని తోసి పుచ్చింది. ఐఐఎంల స్వయంప్రతిపత్తిలో ఏ అధికారికీ ఎలాంటి పాత్ర వుండబోదని, ప్రభుత్వానికి వాటి నిర్వహణలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని మోదీ స్పష్టంగా చెప్పారు. అందుకు తగినట్టే ఐఐఎం చట్టం వచ్చింది. ఇతర ఉన్నత స్థాయి విద్యాసంస్థలకు కూడా ఈ నమూనానే వర్తింప జేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు కూడా. నాలుగు నెలలక్రితం కేంద్ర మంత్రివర్గం ఆమోదిం చిన జాతీయ విద్యా విధానం సైతం విద్యా సంస్థలకు స్వాతంత్య్రం ఇస్తామని తెలిపింది. అయితే తాజాగా కేంద్ర విద్యాశాఖ, యూజీసీ ప్రయత్నాలు అందుకు భిన్నంగా వున్నాయి. ఏ గవర్నర్ల బోర్డు అయినా ఐఐఎం చట్టాన్ని ఉల్లంఘించిన పక్షంలో విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవ డానికి అధికారమిచ్చేవిధంగా చట్టాన్ని సవరించాలని విద్యామంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఉన్నత విద్యా సంస్థలు మెరుగైన ప్రమాణాలతో సమున్నతంగా ఎదుగుతున్నాయా లేదా అన్నది చూడాలి తప్ప, వాటి పనిలో జోక్యం చేసుకుంటూ, అవి తమ చెప్పుచేతల్లో పనిచేయాలని తాపత్రయపడటం సరికాదు. ఐఐటీ, ఐఐఎం, జేఎన్‌యూ, ఐఐఎస్సీ వంటి ఉన్నత విద్యా సంస్థలు దశాబ్దాలుగా తమ స్వతంత్రతను కాపాడుకుంటూ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడిస్తున్నాయి. వాస్తవానికి తొలి వంద ప్రపంచ శ్రేణి సంస్థల్లో వాటికింకా చోటు దక్కటం లేదు. అవి సాధారణంగా ఎప్పుడూ 100–200 మధ్యనే వుంటాయి. ఆ విషయంలో ఇంకేం చేయాలో చూడాల్సిన తరుణంలో వున్న స్వతంత్రతనే దెబ్బతీసే ప్రయత్నాలు ఎంతవరకూ సమంజసమో ఆలోచించాలి. ఉద్యోగస్వామ్యం ఎప్పుడూ అధికారాలనూ, అజ్మాయిషీని కోరుకుంటుంది. ఏ పార్టీ అధికారంలోవున్నా ఆ వర్గం ఆలోచనా ధోరణి ఇలాగే వుంటుంది. మితిమీరిన జోక్యం ఎప్పుడూ వికటిస్తుంది. ఉన్నత స్థాయి సంస్థలపై ప్రభుత్వ అజ్మాయిషీ పెరిగినకొద్దీ అందులో ప్రమాణాలు క్షీణిస్తాయి. అంతిమంగా వాటినుంచి నిపుణులైన, ప్రతిభావం తులైన అధ్యాపకులు వలసపోయే ప్రమాదం కూడా వుంటుంది. పర్యవసానంగా అవి కుప్పకూల తాయి. ఐఐఎంలను కేవలం విద్యా సంస్థలుగా మాత్రమే చూడకూడదు. వాటినుంచి కార్పొరేట్ సంస్థల నిర్వాహకులుగా, వాటి అధిపతులుగా ఎదుగుతున్నవారు మాత్రమే కాదు... పాలనా వ్యవ స్థల్లో కీలకపాత్ర పోషించేవారు, విధాన నిర్ణేతలు రూపొందుతున్నారు. దేశాభివృద్ధిలో ఇతర ఉన్నత విద్యా సంస్థలతోపాటు ఐఐఎంల పాత్ర కూడా ఎంతో వుంది. ఆ ప్రమాణాలను నీరుగార్చే ఏ చర్యా మంచిది కాదు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా నినాదం స్ఫూర్తిని కూడా ఇలాంటి చర్యలు దెబ్బతీస్తాయి. కనుక ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. -
1 నుంచి మెట్రో సర్వీసులు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్న అన్‌లాక్–4 ప్రక్రియలో మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీలను తెరిచే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని అధికారవర్గాలంటున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి వాటిని ప్రారంభించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇప్పటిదాకా మూతపడి ఉన్న బార్లు కూడా తెరుచుకోనున్నాయి. అయితే, కేవలం కౌంటర్‌పై మద్యం విక్రయాలను మాత్రమే అనుమతించేందుకు వీలుంది. బార్లో కూర్చుని మద్యం తాగేందుకు అవకాశం ఉండదు. మెట్రో రైళ్ల పునఃప్రారంభంపై వివిధ వర్గాలతో సంప్రదింపులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. టోకెన్లకు బదులు మెట్రో కార్డుల ద్వారానే ప్రయాణానికి అనుమతించడం, స్టేషన్లలో రైలు ఆగే సమయాన్ని పెంచడం వంటి మార్పులు ఉంటాయని సమాచారం. -
ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులకు రెట్టింపు జీతాలు
ముంబై: నాణ్యమైన విద్యార్థులను ఉద్యోగంలోనికి తీసుకోవడం కోసం కంపెనీలు ఎంత జీతాలివ్వడానికైనా ఏమాత్రం వెనకాడడం లేదని మరోసారి రుజువయింది. ఇలాంటి వారి కోసం ఐఐటీ, ఐఐఎమ్‌లను ఆశ్రయిస్తున్న కార్పొరేట్ కంపెనీలు... సాధారణ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఇచ్చే జీతాల కంటే రెట్టింపు స్థాయిలో వీరికి ఆఫర్ ఇస్తున్నాయి. ఇతర కాలేజీలలో చదివిన వారికంటే ఐఐటీ విద్యార్థుల జీతాలు 137 శాతం అధికంగా ఉండగా, ఐఐఎమ్‌లో చదివిన విద్యార్థుల జీతాలు 121 శాతం అధికంగా ఉన్నట్లు గ్లోబల్ ఆన్లైన్ టాలెంట్ మెజర్మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ సంస్థ ‘మెటిల్’ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయ్యింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జనవరి–జూన్ మధ్య కాలంలో ఈ సంస్థ 114 ఇంజనీరింగ్, 80 మేనేజ్మెంట్ కాలేజీలలో సర్వే నిర్వహించగా.. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్, ఐటీ చదివిన విద్యార్థులకు ఏడాదికి సగటున రూ.6.9 లక్షలు జీతం చెల్లిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఐఐఎమ్‌లో చదివిన టెక్నాలజీ డొమైన్ గ్రాడ్యుయేట్ల సగటు వార్షిక జీతం రూ.14.8 లక్షలుగా ఉన్నట్లు సర్వేలో వెల్లడయిందని మెటిల్ సంస్థ కో–ఫౌండర్ కేతన్ కపూర్ వెల్లడించారు. పశ్చిమ భారతదేశంలో చదివినవారి జీతాలు ఇతర ప్రాంతాలవారి కంటే 17 శాతం అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. నూతన తరం ప్రతిభను కలిగి ఉన్న విద్యార్థులకు పలు కంపెనీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలిందని అన్నారు. -
ఐఐటీలు, ఐఐఎంలకు అక్రిడిటేషన్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, అక్రిడిటేషన్లను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు ఈ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంలను భాగస్వాములుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను యూజీసీ పర్యవేక్షణలో నడిచే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఒక్కటే చేపడుతున్నది. అయితే ప్రముఖ ప్రయివేట్ సంస్థలనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని నీతి అయోగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ వనరులను సమర్ధంగా ఉపయోగించుకుంటూ ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. అక్రిడిటేష్న్ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంల పాత్రను పెంచేందుకు త్వరలో ఎనిమిది ఐఐటీలు, ఐఐఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను పలువురు స్వాగతించగా, మరికొన్ని ఐఐటీలు, ఐఐఎంలు ఫ్యాకల్టీ కొరతను చూపి అదనపు బాధ్యతలపై నిరాసక్తత వ్యక్తం చేశాయి. -
ప్రపంచ శ్రేణికి ‘పది’
భారతీయ విద్యాసంస్థల్లో ఐఐఎంలు, ఐఐటీలు మినహా మిగిలినవి ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయి. ఈ లోటు తీర్చే దిశగా కృషి చేయాలి.. అన్న పలువురు విద్యావేత్తల అభిప్రాయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది చర్యలు ప్రారంభించింది. ‘ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్’ పేరిట వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ రంగంలోని పది, ప్రైవేటు రంగంలోని పది (మొత్తం 20) విద్యా సంస్థలను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు, విధి విధానాలు రూపొందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి ఆదేశాలు జారీ చేసింది. వివరాలు.. తెరపైకి.. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన యూజీసీ.. గత ఏడాది యూజీసీ గైడ్‌లైన్స్–2016 (డిక్లరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్) పేరుతో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం.. ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలుగా గుర్తింపు పొందాలనుకునే విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధన అత్యున్నత స్థాయిలో ఉండాలి. బహుళ సామర్థ్య (మల్టీ డిసిప్లినరీ) కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. రెగ్యులర్ ప్రోగ్రామ్స్‌తో పాటు అంతర్గత సామర్థ్య (ఇంటర్ డిసిప్లినరీ) ప్రోగ్రామ్స్‌కు సైతం సమ ప్రాధాన్యం ఇవ్వాలి. విదేశీ ఫ్యాకల్టీ లేదా విదేశీ విశ్వవిద్యాలయాల అర్హతలున్న వారు ఫ్యాకల్టీ సభ్యులుగా ఉండాలి. ఈ విశ్వవిద్యాలయాల్లో స్వదేశీ విద్యార్థులతో పాటు, విదేశీ విద్యార్థుల నిష్పత్తి కూడా బాగుండాలి. ఒక విద్యా సంస్థను ప్రపంచ శ్రేణి సంస్థగా నిర్ధారించిన తర్వాత మూడేళ్ల కాలంలోపు ఫ్యాకల్టీ– విద్యార్థి నిష్పత్తి 1:10 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇతర మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలల పరంగా అత్యున్నత ప్రమాణాలు, పరికరాలు ఉండాలి. ప్రపంచ శ్రేణికి మారాక పదిహేనేళ్ల కాలంలో కనీసం 20 వేల మంది విద్యార్థులు చదువుతుండాలి. మొదటి పదేళ్ల కాలంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–500 జాబితాలో నిలవాలి. తర్వాత కాలంలో టాప్–100 జాబితాలో ఉండేలా నాణ్యత పాటించాలి. ప్రత్యేక నిధులు.. పూర్తి స్వయం ప్రతిపత్తి ప్రపంచ శ్రేణివిగా పేరొందాలని దరఖాస్తు చేసుకునే విద్యా సంస్థల విషయంలో యూజీసీ కల్పించిన ప్రధాన వెసులుబాటు.. అవి పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం. విదేశీ విద్యార్థులకు, స్వదేశీ విద్యార్థులకు తమ విచక్షణ మేరకు ఫీజులను నిర్ణయించొచ్చు. అంతేకాక కరిక్యులం రూపకల్పన, కోర్సు స్వరూపం, డిగ్రీ వ్యవధిని నిర్ణయించే విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే అవి ఎప్పటికప్పుడు తమ నిర్ణయాలను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా తమ సంస్థలో విద్యా నైపుణ్యాల పెంపు కోసం.. విదేశీ విశ్వవిద్యాలయాలతో ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్ విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఆ దేశాలు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్న నిషేధిత దేశాల జాబితాలో ఉండకూడదు. ఆర్థిక చేయూత.. రూ.వేల కోట్లలో ప్రపంచ శ్రేణి విద్యా సంస్థగా.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంపికైన వాటికి ఆర్థిక చేయూత విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయిదేళ్ల వ్యవధిలో ఒక్కో ఇన్స్టిట్యూట్కు రూ.500 కోట్ల చొప్పున కేటాయించాలని ప్రతిపాదించారు. ప్రపంచ శ్రేణికి యూజీసీ నిర్దేశించిన అర్హత ప్రమాణాలు ఆ విద్యా సంస్థ ఎంహెచ్ఆర్డీ ర్యాంకింగ్స్‌లో టాప్–25 జాబితాలో నిలిచి ఉండాలి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో టాప్–500లో ఉండాలి. దరఖాస్తు ఇలా ప్రపంచ శ్రేణి కోసం విద్యా సంస్థను ఎంపిక చేసేందుకు దరఖాస్తు ప్రక్రియ పరంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తారు. వచ్చిన దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. విద్యా సంస్థలు పేర్కొన్న పదిహేనేళ్ల ప్రణాళిక, రూపొందించుకున్న వ్యూహాల ఆధారంగా 20 సంస్థలను ఎంపిక చేస్తుంది. యూజీసీ మార్గదర్శకాలకు మార్పులతో మంత్రివర్గ ఆమోదం ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలకు సంబంధించి గతేడాది యూజీసీ గైడ్‌లైన్స్–2016 (డిక్లరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్)కు హెచ్ఆర్డీ మార్పులు చేసింది. వాటితో కూడిన బిల్లుకు తాజాగా కేబినెట్ ఆమోదం కూడా లభించింది. ఈ మార్పుల్లో ముఖ్యంగా పేర్కొనాల్సినవి. వరల్డ్ క్లాస్ బదులుగా.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా పేరు మార్పు తొలుత 20 విద్యా సంస్థలను ప్రపంచ శ్రేణిగా రూపొందించే విధంగా ప్రతిపాదనలు చేయగా.. ఈ క్రమంలో హెచ్ఆర్డీ చేసిన మొట్టమొదటి చర్య వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్స్ పేరుకు బదులు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్‌గా పేరు మార్చడం దీంతోపాటు హెచ్ఆర్డీ శాఖ మరికొన్ని మార్పులు చేసింది. అవి.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా ఎంపికైన సంస్థ తర్వాత పదేళ్ల కాలంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–500లోపు జాబితాలో నిలవాలి. ప్రారంభంలో ఫ్యాకల్టీ – స్టూడెంట్ నిష్పత్తి 1:20గా ఉన్నప్పటికీ సదరు ఇన్స్టిట్యూట్ దరఖాస్తును పరిశీలిస్తారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఆ నిష్పత్తి 1:10 కంటే ఎక్కువ ఉండకూడదు. పదిహేనేళ్ల కాలంలో పదిహేనువేల మంది విద్యార్థులు ఎన్రోల్ అవ్వాలి. విదేశీ ఫ్యాకల్టీ పరంగా గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో టాప్–500 జాబితాలో నిలిచిన యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రొఫెసర్ల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి ఫ్యాకల్టీ సభ్యుడు ఏటా కచ్చితంగా ఒక రీసెర్చ్ పబ్లికేషన్‌ను రూపొందించాలి. మూల నిధి పెంపు యూజీసీ ప్రతిపాదనలకు హెచ్ఆర్డీ చేసిన మార్పుల్లో అత్యంత ప్రధానమైంది మూల నిధి (కార్పస్ ఫండ్) రూపంలో ఇన్స్టిట్యూట్లకు అందించే ఆర్థిక చేయూత. వాస్తవానికి యూజీసీ తొలుత రూ. 500 కోట్లు ప్రతిపాదించగా.. తాజాగా ఆ మొత్తాన్ని రూ. వేయి కోట్లకు పెంచింది. ఇలా పది ఇన్స్టిట్యూట్లకు కలిపి రూ.10 వేల కోట్లు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని తొలి దశగా 50 శాతం, తర్వాత రెండు, మూడేళ్ల కాలంలో మిగతా శాతాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంలో వినిపిస్తున్న మరో మాట.. ప్రభుత్వం తొలుత ఇచ్చే 50 శాతం తీసుకునే ఇన్స్టిట్యూట్లు.., మిగతా మొత్తం పొందడంలో సొంతంగా సమకూర్చుకునే పరంగానూ ఆలోచించాలని సూచించనున్నట్లు సమాచారం. ప్రైవేటు ఇన్స్టిట్యూట్లకు కార్పస్‌లో కోత యూజీసీ ప్రతిపాదనకు.. హెచ్ఆర్డీ చేసిన మరో పెద్ద మార్పు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా ఎంపికయ్యే పది ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు/యూనివర్సిటీలకు కార్పస్ ఫండ్‌ను భారీగా తగ్గించడం. రూ.500 కోట్ల నుంచి రూ.60 కోట్లకు ఈ మొత్తాన్ని కుదించారు. ఎంపికకు ఈఈసీ నిర్దేశిత నిబంధనల ప్రకారం అర్హత జాబితాలో ఉండి.. ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఎమినెన్స్ హోదాకు దరఖాస్తు చేసుకునే ఇన్స్టిట్యూట్ల దరఖాస్తులను సాధికార నిపుణుల కమిటీ (ఎంపవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ) పరిశీలిస్తుంది. వాటినుంచి 20 సంస్థలను ఎంపిక చేసి ఆ జాబితాను యూజీసీకి పంపుతుంది. దాన్ని యూజీసీ మరోసారి పరిశీలించి.. తన నిర్ణయాన్ని హెచ్ఆర్డీ శాఖకు తెలియజేస్తుంది. తర్వాత హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ.. ఆయా ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం చేసుకుంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ను ఎంపిక చేసేందుకు.. అందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు త్వరలోనే ఈఈసీ పత్రికల ద్వారా ప్రకటనలు ఇవ్వనున్నట్లు సమాచారం. 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లనే ఈఈసీ పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. ఐఐఎంలకు మినహాయింపు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ హోదాపరంగా దరఖాస్తు విషయంలో.. ఇన్‌స్టిట్యూట్స్‌కు ఆ హోదా కల్పించే విషయంలో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)లకు మినహాయింపు కల్పించారు. ఇవి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఒక కారణమైతే.. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రకారం పదేళ్ల కాలంలో 15 వేల మంది విద్యార్థులకు ఒక్కో ఐఐఎం ప్రవేశం కల్పిస్తే వాటి నాణ్యత తగ్గుతుందనేది మరో కారణం. భిన్నాభిప్రాయాలు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ ప్రణాళిక, ప్రతిపాదనల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పదేళ్ల గరిష్ట వ్యవధి పాటు నిరంతర పర్యవేక్షణ కష్టమని విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తి స్వయంప్రతిపత్తి కారణంగా ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్ల కొరత
న్యూఢిల్లీ : దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్‌లు). కానీ వాటిని చూసుకోవడానికి డైరెక్టర్లే కరువయ్యారట. 20 ఐఐఎమ్స్లో సగం ఇన్స్టిట్యూట్లు డైరెక్టర్ లేకుండానే నడుస్తున్నాయని తేలింది. ప్రపంచ విద్యాసంస్థల సరసన ఒకటిగా నిలుస్తున్న ఐఐఎమ్ బెంగళూరు కూడా డైరెక్టర్ లేకుండానే కొనసాగుతుందని తెలిసింది. గత ఆరు నెలల కిందట ఈ రోజున ఈ విద్యా సంస్థలకు డెరెక్టర్లను షార్ట్‌లిస్టు చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, సెర్చ్కమ్-సెలక్షన్ కమిటీ భేటీ అయ్యాయి. ఆ భేటీలో 10 ఐఐఎమ్‌ల్లో నాలుగు సంస్థలు ఐఐఎమ్-రాంచీ, బెంగళూరు, రాయ్‌పూర్, రోహ్తక్ డైరెక్టర్ల పేరును ఖరారు చేస్తూ ఆ ఫైల్స్‌ను డీఓపీటీకి పంపించింది. కానీ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో డీవోపీటీ ఆ ఫైల్స్‌ను తిరిగి హెచ్ఆర్-డీ మంత్రిత్వ శాఖకు అందజేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఐఐఎమ్స్లో డైరెక్టర్ల నియామకంపై ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు. మరో ఆరు ఐఐఎమ్‌లు అమృత్సర్, సిర్మౌర్, నాగ్‌పూర్, బోధ్‌గయ, సంబల్పూర్, విశాఖపట్నం పరిస్థితి చూసుకుంటే సెర్చ్కమ్-సెలక్షన్ కమిటీ షార్ట్‌లిస్టు చేసిన పేర్లను హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ ఇంకా ఖరారు చేసే ప్రక్రియలోనే ఉన్నాయని డీఓపీటీ అధికారులు తెలిపారు. అయితే హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ అధికారులు ఈ కామెంట్లపై స్పందించడానికి తిరస్కరిస్తున్నారు. బెంగళూరును మినహాయిస్తే, తొమ్మిది కొత్త ఐఐఎమ్ సంస్థలు డైరెక్టర్లు లేకుండా తాత్కాలిక క్యాంపస్‌ల్లో నడుస్తున్నాయి. చాలా ఇన్‌స్టిట్యూట్‌ల్లో అపాయింట్మెంట్స్, హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖలోనే మూలుగుతున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి. -
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోనూ డ్రాప్ అవుట్స్
ముంబై: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎమ్) లలో సీటు సాధిస్తే చాలు జీవితం సెటిల్ అయిపోయినట్లే నని అందురూ భావిస్తుంటారు. ఇందు కోసం రేయింబవళ్లు తీవ్రంగా కష్టపడి చదువుతారు. తీవ్ర పోటీని తట్టుకొని సీటు సాధిస్తారు. కానీ సీటు సాధించిన వారు కోర్సు మధ్యలోనే మానేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు 2000 మంది ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులు కోర్సు మధ్యలోనే మానేశారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అధికంగా ఐఐటీ విద్యార్థులే ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఢిల్లీ ఐఐటీ కి చెందిన 699 మంది విద్యార్థులున్నారు. తర్వాత వరుసగా ఐఐటీ ఖరగ్ పూర్ 544 , బాంబే ఐఐటీ 143 మంది విద్యార్ధులతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. డ్రాప్ అవుట్స్ అవుతున్న వారిలో పీహెచ్ డీ చేస్తున్నవారు ఎక్కువగా ఉన్నారని బాంబే ఐఐటీ డైరెక్టర్ దేవంగ్ ఖఖర్ తెలిపారు. ఐఐఎమ్ లో గడిచిన రెండేళ్లలో 104 మంది విద్యార్థులు కోర్సును మానేశారని ఐఐఎమ్ కోల్ కతా ఫ్యాకల్టీ సభ్యుడొకరు తెలిపారు. ఇందులో రాయ్ పూర్ లోని ఐఐఎమ్ నుంచి అత్యధికంగా 20 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. విద్యార్ధుల మానసిక ఆహ్లాదం కోసం ప్రతీ ఐఐటీ, ఐఐఎమ్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కోర్సులు అత్యంత కఠినంగా ఉండటం కారణంగానే డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం 16 ఐఐటీలున్నాయి. -
ఐఐటీ, ఐఐఎమ్‌ల్లో డ్రాపవుట్లకు కారణాలు అవే
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలని లక్షలాది మంది విద్యార్థులు తెగ తాపత్రయపడుతుంటారు. అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ల్లో సీటు రావడమే కష్టమంటే.. వాటిల్లో కూడా మధ్యలోనే సీటును వదిలేసి వెళ్లేవారి సంఖ్య ఏమంత తక్కువగా లేదంట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీస్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్స్) ల్లో డ్రాపవుట్ రేట్ పెరుగుతుందని వెల్లడైంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్. మహేంద్ర నాథ్ పాండే సమర్పించిన గణాంకాల్లో 201-16మధ్యకాలంలో మొత్తం 16 ఐఐటీల్లో 1,782 మంది విద్యార్థులు ఇన్స్టిట్యూట్ నుంచి..13 ఐఐఎంల్లో 104 మంది విద్యార్థులు కోర్సును మధ్యలోనే వదిలేసి వెళ్లారని తెలిపారు. ఐఐఎం-బీలో 2015-16 ఏడాదిలో నలుగురు విద్యార్థులు డ్రాపవుట్ అయ్యారని తెలిసింది. ఈ డ్రాపవుట్లు పెరగడానికి అనేక పరిమాణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మరొక ఇన్స్టిట్యూట్కు మారే క్రమంలో డ్రాపవుట్ల సంఖ్య పెరుగుతుందని ఐఐటీ బెంగళూరు డైరెక్టర్, ప్రొఫెసర్ ఎస్ సదాగోపాన్ తెలిపారు. బెటర్ ఆప్షన్‌కు, బెటర్ ఇన్స్టిట్యూట్కు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల కంటే ముంబై, న్యూఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ల్లో స్టడీస్‌కే నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో సీటు పొందిన వారు, ఈ ఇన్స్టిట్యూట్లకు తరలి వెళ్తుంటారని వెల్లడించారు. విద్యార్థుల డ్రాపవుట్‌కు మరో కారణంగా బెటర్ బ్రాంచ్ పొందలేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఐఐటీలో ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌ను, ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్సు బ్రాంచ్‌ను విద్యార్థులు పొందినప్పుడు, ఎన్ఐటీ కోసం విద్యార్థులు ఐఐటీని పరిత్యజిస్తున్నారని వివరించారు. విద్యార్థులు ఐఐటీలో సీటును వదులుకునేటప్పుడు రూ.1000 కంటే ఎక్కువ లెవీ విధించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలతో, తరచూ ఇలా జంపింగ్‌లకు పాల్పడుతుంటారని వెల్లడిస్తున్నారు. అకాడమిక్ ఒత్తిడి కూడా విద్యార్థులు సీటును వదులుకోవడానికి కారణంగా ఐఐటీ బెంగళూరు విద్యార్థి శ్రీకాంత్ శ్రీధర్ స్పష్టంచేశారు. ఫైనాన్సియల్ స్టెప్ కూడా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లు వదులుకోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఇన్స్టిట్యూట్లు ఫైనాన్సియల్ సహకారం కల్పిస్తాయని, కానీ అప్పటికీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని విద్యార్థులు సీటు కోల్పోతున్నారని వెల్లడించారు.