ముంబై: నాణ్యమైన విద్యార్థులను ఉద్యోగంలోనికి తీసుకోవడం కోసం కంపెనీలు ఎంత జీతాలివ్వడానికైనా ఏమాత్రం వెనకాడడం లేదని మరోసారి రుజువయింది. ఇలాంటి వారి కోసం ఐఐటీ, ఐఐఎమ్‌లను ఆశ్రయిస్తున్న కార్పొరేట్ కంపెనీలు... సాధారణ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ఇచ్చే జీతాల కంటే రెట్టింపు స్థాయిలో వీరికి ఆఫర్ ఇస్తున్నాయి. ఇతర కాలేజీలలో చదివిన వారికంటే ఐఐటీ విద్యార్థుల జీతాలు 137 శాతం అధికంగా ఉండగా, ఐఐఎమ్‌లో చదివిన విద్యార్థుల జీతాలు 121 శాతం అధికంగా ఉన్నట్లు గ్లోబల్ ఆన్‌లైన్ టాలెంట్ మెజర్‌మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ సంస్థ ‘మెటిల్’ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయ్యింది.
2017–18 ఆర్థిక సంవత్సరంలో జనవరి–జూన్ మధ్య కాలంలో ఈ సంస్థ 114 ఇంజనీరింగ్, 80 మేనేజ్‌మెంట్ కాలేజీలలో సర్వే నిర్వహించగా.. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్, ఐటీ చదివిన విద్యార్థులకు ఏడాదికి సగటున రూ.6.9 లక్షలు జీతం చెల్లిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఐఐఎమ్‌లో చదివిన టెక్నాలజీ డొమైన్ గ్రాడ్యుయేట్ల సగటు వార్షిక జీతం రూ.14.8 లక్షలుగా ఉన్నట్లు సర్వేలో వెల్లడయిందని మెటిల్ సంస్థ కో–ఫౌండర్ కేతన్ కపూర్ వెల్లడించారు. పశ్చిమ భారతదేశంలో చదివినవారి జీతాలు ఇతర ప్రాంతాలవారి కంటే 17 శాతం అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. నూతన తరం ప్రతిభను కలిగి ఉన్న విద్యార్థులకు పలు కంపెనీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment