ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోనూ డ్రాప్ అవుట్స్
ముంబై: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎమ్) లలో సీటు సాధిస్తే చాలు జీవితం సెటిల్ అయిపోయినట్లే నని అందురూ భావిస్తుంటారు. ఇందు కోసం రేయింబవళ్లు తీవ్రంగా కష్టపడి చదువుతారు. తీవ్ర పోటీని తట్టుకొని సీటు సాధిస్తారు. కానీ సీటు సాధించిన వారు కోర్సు మధ్యలోనే మానేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు 2000 మంది ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులు కోర్సు మధ్యలోనే మానేశారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇందులో అధికంగా ఐఐటీ విద్యార్థులే ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఢిల్లీ ఐఐటీ కి చెందిన 699 మంది విద్యార్థులున్నారు. తర్వాత వరుసగా ఐఐటీ ఖరగ్ పూర్ 544 , బాంబే ఐఐటీ 143 మంది విద్యార్ధులతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. డ్రాప్ అవుట్స్ అవుతున్న వారిలో పీహెచ్ డీ చేస్తున్నవారు ఎక్కువగా ఉన్నారని బాంబే ఐఐటీ డైరెక్టర్ దేవంగ్ ఖఖర్ తెలిపారు. ఐఐఎమ్ లో గడిచిన రెండేళ్లలో 104 మంది విద్యార్థులు కోర్సును మానేశారని ఐఐఎమ్ కోల్ కతా ఫ్యాకల్టీ సభ్యుడొకరు తెలిపారు. ఇందులో రాయ్ పూర్ లోని ఐఐఎమ్ నుంచి అత్యధికంగా 20 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. విద్యార్ధుల మానసిక ఆహ్లాదం కోసం ప్రతీ ఐఐటీ, ఐఐఎమ్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కోర్సులు అత్యంత కఠినంగా ఉండటం కారణంగానే డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం 16 ఐఐటీలున్నాయి.