drop out students
-
పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?
సాక్షి,మేడ్చల్ జిల్లా: బడి ఈడు పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. పలు కారణాలతో మధ్యలో బడిమానేసిన వారిని తిరిగి చదువు బాట పట్టించే చర్యలను విద్యాశాఖ తీసుకుంటోంది. ఇందులో భాగంగా బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాలని ఆదేశించింది. చదువుకు దూరమైన పాఠశాల స్థాయిలో 06–14. కళాశాల స్థాయిలో 15–19 ఏళ్ల వారిపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఆర్పీలు ఇంటింటికీ వెళ్లి ‘ప్రభంద’ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. నేటి నుంచి ప్రారంభం గ్రేటర్‌తో సహా శివారు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో 2,498 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో మేడ్చల్ జిల్లాలో 515, రంగారెడ్డి జిల్లాలో 1,301, హైదరాబాద్ జిల్లాలో 682 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో బడిమానేసిన విద్యార్థుల వివరాల జాబితా అందుబాటులో ఉంది. దీని ఆధారంగా పది, ఇంటర్, డిగ్రీ.. ఏ దశలో విద్యను మానేశారో స్పష్టంగా తేల్చనున్నారు. గురువారం నుంచి వచ్చే నెల 12 వరకు గ్రామపంచాయతీ, పురపాలక సంఘాలు, జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాశాఖకు చెందిన ఐఈఆర్పీలు, సీఆర్పీలు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. ఉదయం..సాయంత్రం.. ఎండల తీవ్రత బడి బయట పిల్లల సర్వేపై ప్రభావం చూపనుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వే చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆసక్తి ఉన్న వారిని వృత్తి విద్యా కోర్సులో చేర్పించనున్నారు. ఉన్నత విద్యా ఫలాలు అందించి జీవితంలో స్థిరపడేలా చేయూతనివ్వనున్నారు. సర్వే వేగవంతం చేసేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. పక్కాగా వివరాల సేకరణ చదువుకునే వయస్సులో ఆర్థిక స్తోమత, కుటుంబ పరిస్థితుల కారణంగా పలువురు చిన్నారులు బడికి వెళ్లడంలేదు. ఉన్నత విద్య అభ్యసించాలనే వారి ఆశయం నెరవేరడం లేదు. ఈ సర్వేలో విద్యార్థి పేరు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు, ఏ తరగతిలో బడి మానేశారు. కారణాలు ఏమిటి..? తల్లి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉందా? తల్లితండ్రుల వృత్తి, ప్రత్యేక అవసరాల పిల్లలు, వలస కూలీల పిల్లల సమాచారాన్ని సేకరించి నమోదు చేయనున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా సర్వే మొక్కబడిగా సాగింది. ప్రస్తుతం ఆయా వివరాల సేకరణ పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కొందరు ఇంటివద్దనే ఉంటూ కూలీ పనులకు వెళుతున్నారు. మరికొందరు కుల వృత్తిలో కొనసాగుతూ.. విద్యకు దూరమవుతున్నారు. గత సర్వేలో బడి బయట పిల్లల సంఖ్య –1226 బడి బయట పిల్లల వివరాలకు సంబంధించి 2020–21లో విద్యాశాఖ సర్వే నిర్వహించగా ,గ్రేటర్‌తో సహా శివారు జిల్లాల్లో 1226 మంది లెక్క తేల్చారు. ఇందులో మేడ్చల్ జిల్లాలో 294 , రంగారెడ్డి జిల్లాలో 413, హైదరాబాద్ జిల్లాలో 519 మంది ఉండగా, వీరందరికీ ఆయా పాఠశాలలు, సార్వత్రిక విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించి చదువుకునేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. (చదవండి: జల్లు..ఝల్లు) -
‘వలస’ పిల్లలకు సీజనల్ హాస్టళ్లు
బొంరాస్‌పేట : డ్రాపౌట్స్ నివారణ కోసం గ్రామాల్లో వలస కుటుంబాల పిల్లలకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పీపుల్స్ సర్వీస్ సొసైటీ(పీఎస్ఎస్) స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని చౌదర్పల్లి జెడ్పీహెచ్ఎస్, రేగడిమైలారం ఎంపీహెచ్ఎస్లో సీజనల్ హాస్టళ్లను జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిరెడ్డి, ఎంఈఓ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పరమేశ్వర్ మాట్లాడారు. సర్వశిక్షా అభియాన్ సహకారంతో పీఎస్ఎస్ ఆధ్వర్యంలో సీజనల్ హాస్టళ్లను నిర్వహించనున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన కుటుంబాల పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి, సాయంత్రం పూట ట్యూషన్ చెప్పించే ఏర్పాటు చేశామని వివరించారు. తద్వారా వలస కుటుంబాల విద్యార్థులు బడి మానేయకుండా చదువు కొనసాగిస్తారనే లక్ష్యంతో సీజన్ హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని ప్రధానంగా గిరిజన కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ, ఎంఈఓ సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు రమేశ్‌బాబు, వెంకటేశ్, ఉపాధ్యాయులు ఆనంద్‌రావు, మల్లికార్జున్ ఉన్నారు. -
ఈ హిందీ టీచర్ రూటే సపరేట్..!
సాక్షి, సోమశిల(నెల్లూరు): సాధారణంగా విద్యార్థులకు పాఠశాలకు రాకపోతే ఉపాధ్యాయులు ఆబ్సెంట్ వేస్తారు. వారం, పదిరోజులు రాకపోతే ఎవరో ఒక విద్యార్థి ద్వారా వాకబు చేస్తారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పీకేపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ పండిట్ కె.అనిల్ రెండు, మూడురోజులు విద్యార్థులు రాకపోతే వారింటికెళ్లిపోతాడు. సరైన కారణం ఉంటే సరేసరి. లేకపోతే తల్లిదండ్రులతో మాట్లాడి స్వయంగా బైక్‌పై పాఠశాలకు తీసుకెళతాడు. ఉదయగిరి శైలజ (మూడో తరగతి), కుంచం పద్మావతి (రెండో తరగతి)లు రెండురోజులుగా ఆరోగ్యం బాగోలేదని చెప్పి బడికి రాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన అనిల్ గురువారం వాళ్ల ఇంటికెళ్లాడు. విద్యార్థులు బాగానే ఉండటంతో తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి తీసుకెళ్లాడు. రకరకాల కారణాలతో డ్రాపౌట్స్ పెరుగుతున్నారని, అయితే విద్యార్థుల చదువు ఆగకూడదని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళుతున్నట్లు ఈ సందర్భంగా అనిల్ తెలిపారు. -
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లోనూ డ్రాప్ అవుట్స్
ముంబై: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్(ఐఐఎమ్) లలో సీటు సాధిస్తే చాలు జీవితం సెటిల్ అయిపోయినట్లే నని అందురూ భావిస్తుంటారు. ఇందు కోసం రేయింబవళ్లు తీవ్రంగా కష్టపడి చదువుతారు. తీవ్ర పోటీని తట్టుకొని సీటు సాధిస్తారు. కానీ సీటు సాధించిన వారు కోర్సు మధ్యలోనే మానేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు 2000 మంది ఐఐటీ, ఐఐఎమ్ విద్యార్థులు కోర్సు మధ్యలోనే మానేశారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అధికంగా ఐఐటీ విద్యార్థులే ఉన్నారు. వీరిలో అత్యధికంగా ఢిల్లీ ఐఐటీ కి చెందిన 699 మంది విద్యార్థులున్నారు. తర్వాత వరుసగా ఐఐటీ ఖరగ్ పూర్ 544 , బాంబే ఐఐటీ 143 మంది విద్యార్ధులతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి. డ్రాప్ అవుట్స్ అవుతున్న వారిలో పీహెచ్ డీ చేస్తున్నవారు ఎక్కువగా ఉన్నారని బాంబే ఐఐటీ డైరెక్టర్ దేవంగ్ ఖఖర్ తెలిపారు. ఐఐఎమ్ లో గడిచిన రెండేళ్లలో 104 మంది విద్యార్థులు కోర్సును మానేశారని ఐఐఎమ్ కోల్ కతా ఫ్యాకల్టీ సభ్యుడొకరు తెలిపారు. ఇందులో రాయ్ పూర్ లోని ఐఐఎమ్ నుంచి అత్యధికంగా 20 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. విద్యార్ధుల మానసిక ఆహ్లాదం కోసం ప్రతీ ఐఐటీ, ఐఐఎమ్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కోర్సులు అత్యంత కఠినంగా ఉండటం కారణంగానే డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం 16 ఐఐటీలున్నాయి. -
కస్తూర్బాధలు!
మధ్యలో చదువు ఆపేసిన బాలికలను మళ్లీ బడి బాట పట్టించేందుకు ఏర్పాటైన కస్తూర్బా పాఠశాలల ఆశయం నీరుగారుతోంది. బాలికల్లో డ్రాపవుట్లను మళ్లీ విద్యా వాతావరణంలోకి తీసు కు వచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలపై శ్రద్ధ కొరవడి కష్టాల చిట్టా పెరుగుతోంది. ఆర్భాటంగా ప్రారంభించిన వీటిల్లో కనీస సౌకర్యాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. తగినంత మంది ఉపాధ్యాయులు లేక చదువులు సాగడం లేదు. నర్సీపట్నం, న్యూస్‌లైన్: బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసింది. మధ్యలో బడి మానేసిన బాలికలను ఈ పా ఠశాలల్లో చేర్పించి, వసతి సౌకర్యం కూడా కల్పించి ప్రత్యేకంగా బోధన సాగించాలన్న ఆశయంతో ఈ పాఠశాలలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే చిత్తశుద్ధి కొరవడి లక్ష్యం మరుగున పడినట్టు కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రాజీవ్ విద్యామిషన్, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 34 పాఠశాలలను నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 3,500 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. వసతుల కొరతతో వీరంతా అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో సగం అద్దె భవనాల్లోనే నెట్టుకొస్తున్నాయి. మాకవరపాలెంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో 124 మంది విద్యార్థినులు రెండు గదుల్లోనే కాలం గడుపుతున్నారు. సామాన్లు ఆరుబయట ఉంచుకుంటున్నారు. వర్షం వస్తే వీరికి జాగారమే... ప్రభుత్వ భవనంలో నిర్వహిస్తున్న నాతవరం కస్తూర్బా పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో కౌమారదశలోని విద్యార్థినులంతా పొలాల్లోకి బహిర్భూమికి వెళ్లాల్సివస్తోంది. తగినంత మంది బోధన సిబ్బంది లేకపోవడంతో చదువుకోవడానికి విద్యార్థులు నానా అగచాట్లూ పడాల్సి వస్తోంది. నర్సీపట్నం మండలం వేములపూడిలో ఏర్పాటు చేసిన కస్తూర్బాలో బోధన సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ హైస్కూలులో పదో తరగతి విద్యార్థినులకు తరగతులు నిర్వహించాల్సివస్తోంది. ఏజెన్సీలోని 11 పాఠశాలల్లో మూడు సొసైటీ పరిధిలోను, ఎనిమిది గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మైదానంలోని 23 పాఠశాలలు రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. వీటిల్లో ఒక్కోదానిలో ఒక్కో సమస్య తాండవిస్తోంది. వృత్తి విద్య ను అందించేందుకు వీటిల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు బోధన సిబ్బంది లేక మూలకు చేరుతున్నాయి. రూ.లక్షలు ఖర్చు చేసి కొన్న కంప్యూటర్లు జిల్లా వ్యాప్తంగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మెనూ అమలులో సైతం కొన్ని పాఠశాలల నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం తగినన్ని నిధులు వసూలు చేస్తున్నా, కడుపు నిండక అవస్థలు పడుతున్నారు.