సాక్షి, సోమశిల(నెల్లూరు): సాధారణంగా విద్యార్థులకు పాఠశాలకు రాకపోతే ఉపాధ్యాయులు ఆబ్సెంట్ వేస్తారు. వారం, పదిరోజులు రాకపోతే ఎవరో ఒక విద్యార్థి ద్వారా వాకబు చేస్తారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పీకేపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ పండిట్ కె.అనిల్ రెండు, మూడురోజులు విద్యార్థులు రాకపోతే వారింటికెళ్లిపోతాడు.
సరైన కారణం ఉంటే సరేసరి. లేకపోతే తల్లిదండ్రులతో మాట్లాడి స్వయంగా బైక్‌పై పాఠశాలకు తీసుకెళతాడు. ఉదయగిరి శైలజ (మూడో తరగతి), కుంచం పద్మావతి (రెండో తరగతి)లు రెండురోజులుగా ఆరోగ్యం బాగోలేదని చెప్పి బడికి రాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన అనిల్ గురువారం వాళ్ల ఇంటికెళ్లాడు.
విద్యార్థులు బాగానే ఉండటంతో తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడికి తీసుకెళ్లాడు. రకరకాల కారణాలతో డ్రాపౌట్స్ పెరుగుతున్నారని, అయితే విద్యార్థుల చదువు ఆగకూడదని తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకెళుతున్నట్లు ఈ సందర్భంగా అనిల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment