మధ్యలో చదువు ఆపేసిన బాలికలను మళ్లీ బడి బాట పట్టించేందుకు ఏర్పాటైన కస్తూర్బా పాఠశాలల ఆశయం నీరుగారుతోంది. బాలికల్లో డ్రాపవుట్‌లను మళ్లీ విద్యా వాతావరణంలోకి తీసు కు వచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలపై శ్రద్ధ కొరవడి కష్టాల చిట్టా పెరుగుతోంది. ఆర్భాటంగా ప్రారంభించిన వీటిల్లో కనీస సౌకర్యాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. తగినంత మంది ఉపాధ్యాయులు లేక చదువులు సాగడం లేదు.
నర్సీపట్నం, న్యూస్‌లైన్: బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసింది. మధ్యలో బడి మానేసిన బాలికలను ఈ పా ఠశాలల్లో చేర్పించి, వసతి సౌకర్యం కూడా కల్పించి ప్రత్యేకంగా బోధన సాగించాలన్న ఆశయంతో ఈ పాఠశాలలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే చిత్తశుద్ధి కొరవడి లక్ష్యం మరుగున పడినట్టు కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా రాజీవ్ విద్యామిషన్, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 34 పాఠశాలలను నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 3,500 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. వసతుల కొరతతో వీరంతా అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో సగం అద్దె భవనాల్లోనే నెట్టుకొస్తున్నాయి. మాకవరపాలెంలో ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలలో 124 మంది విద్యార్థినులు రెండు గదుల్లోనే కాలం గడుపుతున్నారు. సామాన్లు ఆరుబయట ఉంచుకుంటున్నారు. వర్షం వస్తే వీరికి జాగారమే... ప్రభుత్వ భవనంలో నిర్వహిస్తున్న నాతవరం కస్తూర్బా పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో కౌమారదశలోని విద్యార్థినులంతా పొలాల్లోకి బహిర్భూమికి వెళ్లాల్సివస్తోంది. తగినంత మంది బోధన సిబ్బంది లేకపోవడంతో చదువుకోవడానికి విద్యార్థులు నానా అగచాట్లూ పడాల్సి వస్తోంది.
నర్సీపట్నం మండలం వేములపూడిలో ఏర్పాటు చేసిన కస్తూర్బాలో బోధన సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ హైస్కూలులో పదో తరగతి విద్యార్థినులకు తరగతులు నిర్వహించాల్సివస్తోంది. ఏజెన్సీలోని 11 పాఠశాలల్లో మూడు సొసైటీ పరిధిలోను, ఎనిమిది గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మైదానంలోని 23 పాఠశాలలు రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. వీటిల్లో ఒక్కోదానిలో ఒక్కో సమస్య తాండవిస్తోంది. వృత్తి విద్య ను అందించేందుకు వీటిల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు బోధన సిబ్బంది లేక మూలకు చేరుతున్నాయి. రూ.లక్షలు ఖర్చు చేసి కొన్న కంప్యూటర్లు జిల్లా వ్యాప్తంగా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. మెనూ అమలులో సైతం కొన్ని పాఠశాలల నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం తగినన్ని నిధులు వసూలు చేస్తున్నా, కడుపు నిండక అవస్థలు పడుతున్నారు.
కస్తూర్బాధలు!
Published Sat, Dec 14 2013 4:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement