ప్రపంచ శ్రేణికి ‘పది’ | Indian Educational Institutions | Sakshi
Sakshi News home page

ప్రపంచ శ్రేణికి ‘పది’

Published Mon, Jul 31 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

ప్రపంచ శ్రేణికి ‘పది’

ప్రపంచ శ్రేణికి ‘పది’

భారతీయ విద్యాసంస్థల్లో ఐఐఎంలు, ఐఐటీలు మినహా మిగిలినవి ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయి. ఈ లోటు తీర్చే దిశగా కృషి చేయాలి.. అన్న పలువురు విద్యావేత్తల అభిప్రాయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది చర్యలు ప్రారంభించింది. ‘ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌’ పేరిట వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ రంగంలోని పది, ప్రైవేటు రంగంలోని పది (మొత్తం 20) విద్యా సంస్థలను
ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు, విధి విధానాలు రూపొందించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కి ఆదేశాలు జారీ చేసింది. వివరాలు..

తెరపైకి.. యూజీసీ గైడ్‌లైన్స్‌
ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన యూజీసీ.. గత ఏడాది యూజీసీ గైడ్‌లైన్స్‌–2016 (డిక్లరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ యాజ్‌ వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌) పేరుతో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం..

ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలుగా గుర్తింపు పొందాలనుకునే విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధన అత్యున్నత స్థాయిలో ఉండాలి.

బహుళ సామర్థ్య (మల్టీ డిసిప్లినరీ) కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

రెగ్యులర్‌ ప్రోగ్రామ్స్‌తో పాటు అంతర్గత సామర్థ్య (ఇంటర్‌ డిసిప్లినరీ)        ప్రోగ్రామ్స్‌కు సైతం సమ ప్రాధాన్యం ఇవ్వాలి.

విదేశీ ఫ్యాకల్టీ లేదా విదేశీ విశ్వవిద్యాలయాల అర్హతలున్న వారు ఫ్యాకల్టీ        సభ్యులుగా ఉండాలి.

ఈ విశ్వవిద్యాలయాల్లో స్వదేశీ విద్యార్థులతో పాటు, విదేశీ విద్యార్థుల నిష్పత్తి కూడా బాగుండాలి.
ఒక విద్యా సంస్థను ప్రపంచ శ్రేణి సంస్థగా నిర్ధారించిన తర్వాత మూడేళ్ల కాలంలోపు ఫ్యాకల్టీ– విద్యార్థి నిష్పత్తి 1:10 కంటే ఎక్కువగా ఉండకూడదు.

ఇతర మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలల పరంగా అత్యున్నత ప్రమాణాలు, పరికరాలు ఉండాలి.

ప్రపంచ శ్రేణికి మారాక పదిహేనేళ్ల కాలంలో కనీసం 20 వేల మంది విద్యార్థులు చదువుతుండాలి.

మొదటి పదేళ్ల కాలంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–500 జాబితాలో నిలవాలి. తర్వాత కాలంలో టాప్‌–100 జాబితాలో ఉండేలా నాణ్యత పాటించాలి.

ప్రత్యేక నిధులు.. పూర్తి స్వయం ప్రతిపత్తి
ప్రపంచ శ్రేణివిగా పేరొందాలని దరఖాస్తు చేసుకునే విద్యా సంస్థల విషయంలో యూజీసీ కల్పించిన ప్రధాన వెసులుబాటు.. అవి పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం. విదేశీ విద్యార్థులకు, స్వదేశీ విద్యార్థులకు తమ విచక్షణ మేరకు ఫీజులను నిర్ణయించొచ్చు. అంతేకాక కరిక్యులం రూపకల్పన, కోర్సు స్వరూపం, డిగ్రీ వ్యవధిని నిర్ణయించే విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే అవి ఎప్పటికప్పుడు తమ నిర్ణయాలను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా తమ సంస్థలో విద్యా నైపుణ్యాల పెంపు కోసం.. విదేశీ విశ్వవిద్యాలయాలతో ఎక్సే్ఛంజ్‌ ప్రోగ్రామ్స్‌ విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. ఆ దేశాలు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్న నిషేధిత దేశాల జాబితాలో ఉండకూడదు.

ఆర్థిక చేయూత.. రూ.వేల కోట్లలో
ప్రపంచ శ్రేణి విద్యా సంస్థగా.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా ఎంపికైన వాటికి ఆర్థిక చేయూత విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అయిదేళ్ల వ్యవధిలో ఒక్కో ఇన్‌స్టిట్యూట్‌కు రూ.500 కోట్ల చొప్పున కేటాయించాలని ప్రతిపాదించారు.

ప్రపంచ శ్రేణికి యూజీసీ నిర్దేశించిన అర్హత ప్రమాణాలు
ఆ విద్యా సంస్థ ఎంహెచ్‌ఆర్‌డీ ర్యాంకింగ్స్‌లో టాప్‌–25 జాబితాలో నిలిచి ఉండాలి.

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, లేదా క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–500లో ఉండాలి.

దరఖాస్తు ఇలా
ప్రపంచ శ్రేణి కోసం విద్యా సంస్థను ఎంపిక చేసేందుకు దరఖాస్తు ప్రక్రియ పరంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తారు. వచ్చిన దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. విద్యా సంస్థలు పేర్కొన్న పదిహేనేళ్ల ప్రణాళిక, రూపొందించుకున్న వ్యూహాల ఆధారంగా 20 సంస్థలను ఎంపిక చేస్తుంది.

యూజీసీ మార్గదర్శకాలకు మార్పులతో మంత్రివర్గ ఆమోదం ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలకు సంబంధించి గతేడాది యూజీసీ గైడ్‌లైన్స్‌–2016 (డిక్లరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ యాజ్‌ వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌)కు హెచ్‌ఆర్‌డీ మార్పులు చేసింది. వాటితో కూడిన బిల్లుకు తాజాగా కేబినెట్‌ ఆమోదం కూడా లభించింది. ఈ మార్పుల్లో ముఖ్యంగా పేర్కొనాల్సినవి.

వరల్డ్‌ క్లాస్‌ బదులుగా..
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా పేరు మార్పు తొలుత 20 విద్యా సంస్థలను ప్రపంచ శ్రేణిగా రూపొందించే విధంగా ప్రతిపాదనలు చేయగా.. ఈ క్రమంలో హెచ్‌ఆర్‌డీ చేసిన మొట్టమొదటి చర్య వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ పేరుకు బదులు ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా పేరు మార్చడం దీంతోపాటు హెచ్‌ఆర్‌డీ శాఖ మరికొన్ని మార్పులు చేసింది. అవి..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా ఎంపికైన సంస్థ తర్వాత పదేళ్ల కాలంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–500లోపు జాబితాలో నిలవాలి.

 ప్రారంభంలో ఫ్యాకల్టీ – స్టూడెంట్‌ నిష్పత్తి 1:20గా ఉన్నప్పటికీ సదరు ఇన్‌స్టిట్యూట్‌ దరఖాస్తును పరిశీలిస్తారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఆ నిష్పత్తి 1:10 కంటే ఎక్కువ ఉండకూడదు.

 పదిహేనేళ్ల కాలంలో పదిహేనువేల మంది విద్యార్థులు ఎన్‌రోల్‌ అవ్వాలి.

విదేశీ ఫ్యాకల్టీ పరంగా గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–500 జాబితాలో నిలిచిన యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రొఫెసర్ల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటారు.

ప్రతి ఫ్యాకల్టీ సభ్యుడు ఏటా కచ్చితంగా ఒక రీసెర్చ్‌ పబ్లికేషన్‌ను రూపొందించాలి.

మూల నిధి పెంపు
యూజీసీ ప్రతిపాదనలకు హెచ్‌ఆర్‌డీ చేసిన మార్పుల్లో అత్యంత ప్రధానమైంది మూల నిధి (కార్పస్‌ ఫండ్‌) రూపంలో ఇన్‌స్టిట్యూట్‌లకు అందించే ఆర్థిక చేయూత. వాస్తవానికి యూజీసీ తొలుత రూ. 500 కోట్లు ప్రతిపాదించగా.. తాజాగా ఆ మొత్తాన్ని రూ. వేయి కోట్లకు పెంచింది. ఇలా పది ఇన్‌స్టిట్యూట్‌లకు కలిపి రూ.10 వేల కోట్లు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని తొలి దశగా 50 శాతం, తర్వాత రెండు, మూడేళ్ల కాలంలో మిగతా శాతాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంలో వినిపిస్తున్న మరో మాట.. ప్రభుత్వం తొలుత ఇచ్చే 50 శాతం తీసుకునే ఇన్‌స్టిట్యూట్‌లు.., మిగతా మొత్తం పొందడంలో సొంతంగా సమకూర్చుకునే పరంగానూ ఆలోచించాలని సూచించనున్నట్లు సమాచారం.

ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లకు కార్పస్‌లో కోత
యూజీసీ ప్రతిపాదనకు.. హెచ్‌ఆర్‌డీ చేసిన మరో పెద్ద మార్పు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా ఎంపికయ్యే పది ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలకు కార్పస్‌ ఫండ్‌ను భారీగా తగ్గించడం. రూ.500 కోట్ల నుంచి రూ.60 కోట్లకు ఈ మొత్తాన్ని కుదించారు.

ఎంపికకు ఈఈసీ
నిర్దేశిత నిబంధనల ప్రకారం అర్హత జాబితాలో ఉండి.. ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ హోదాకు దరఖాస్తు చేసుకునే ఇన్‌స్టిట్యూట్‌ల దరఖాస్తులను సాధికార నిపుణుల కమిటీ (ఎంపవర్డ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ) పరిశీలిస్తుంది. వాటినుంచి 20 సంస్థలను ఎంపిక చేసి ఆ జాబితాను యూజీసీకి పంపుతుంది. దాన్ని యూజీసీ మరోసారి పరిశీలించి.. తన నిర్ణయాన్ని హెచ్‌ఆర్‌డీ శాఖకు తెలియజేస్తుంది. తర్వాత హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లతో ఒప్పందం చేసుకుంటుంది.

త్వరలోనే నోటిఫికేషన్‌
ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ను ఎంపిక చేసేందుకు.. అందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు త్వరలోనే ఈఈసీ పత్రికల ద్వారా ప్రకటనలు ఇవ్వనున్నట్లు సమాచారం. 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్న ఇన్‌స్టిట్యూట్‌లనే ఈఈసీ పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.

ఐఐఎంలకు మినహాయింపు
ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ హోదాపరంగా దరఖాస్తు విషయంలో.. ఇన్‌స్టిట్యూట్స్‌కు ఆ హోదా కల్పించే విషయంలో ఐఐఎం (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌)లకు మినహాయింపు కల్పించారు. ఇవి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఒక కారణమైతే.. ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ మార్గదర్శకాల్లో పేర్కొన్న ప్రకారం పదేళ్ల కాలంలో 15 వేల మంది విద్యార్థులకు ఒక్కో ఐఐఎం ప్రవేశం కల్పిస్తే వాటి నాణ్యత తగ్గుతుందనేది మరో కారణం.

భిన్నాభిప్రాయాలు
ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ ప్రణాళిక, ప్రతిపాదనల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పదేళ్ల గరిష్ట వ్యవధి పాటు నిరంతర పర్యవేక్షణ కష్టమని విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తి స్వయంప్రతిపత్తి కారణంగా ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement