సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో పెరిగిçపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఈ సంస్థలు బ్రిలియంట్ విద్యార్థుల బలవన్మరణాలతో వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ సంస్థల్లో ప్రవేశించిన విద్యార్థులు, వారి తల్లితండ్రుల కలలు కల్లలు చేస్తున్నాయి.
బంగారు భవిష్యత్తును ఊహించుకుని ఆ సంస్థల్లో అడుగిడుతున్న విద్యార్థులు అక్కడ ఒత్తిడి, వివక్ష, బెదిరింపులు, సరైన మార్గదర్శనం లేక బలవంతంగా తనువులు చాలిస్తున్నారు. కట్టడి నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇక్కడ విజయం సాధించకపోతే భవిష్యత్తు లేదన్నట్లుగా కుంగిపోతున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లతోపాటు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రాత్రింబవళ్లు కష్టపడితే గానీ సీటు రాదు. మంచి ర్యాంకులతో చేరుతున్న విద్యార్థులు అక్కడికెళ్లిన తరువాత సామాజిక పరిస్థితులు, విద్యా విధానం పూర్తి భిన్నంగా ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. సహచరæ విద్యార్థులతో పోల్చుకుని కూడా నిరాశా నిస్పృహల్లోకి వెళ్తున్నారు. దీంతో వారు ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారు.
ఏనిమిదేళ్లలో 130 మంది
దేశవ్యాప్తంగా గత ఎనిమిదేళ్లలో 130 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల బాగోగులను చూడాల్సిన ఆయా సంస్థల్లోని అధ్యాపకుల సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇలా బలవన్మరణాలు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే ఉండటం
గమనార్హం. ఇంటర్మీడియెట్ వరకు అధ్యాపకులు పూర్తిస్థాయిలో వారికి ప్రతీ అంశంలో సహకారం అందిస్తారు.
అయితే, ప్రీమియర్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు అవసరమైన మానసిక ధైర్యం, అక్కడ ఎలా మసలుకోవాలి లాంటి వాటి గురించి వివరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారు ఈ సంస్థల్లో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటివరకు ఐఐటీల్లో 38 మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 39 మంది, ఎన్‌ఐటీల్లో 32 మంది, ఐఐఎంలలో ఐదుగురు, ఐఐ ఎస్‌సీ అండ్ ఐఐఎస్‌ఈఆర్‌లో తొమ్మిది మంది, ట్రిపుల్ ఐటీల్లో నలుగురు, కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే విద్యాసంస్థల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఇటీవలే ఐఐటీ హైదరాబాద్‌లో...
ఇటీవలే హైదరాబాద్ ఐఐటీకి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విదితమే. ఇక్కడ ఎంటెక్ చదువుతున్న రాహుల్ హాస్టల్ గదిలోనే మంచానికి ఉరేసుకోగా.. ఈ మధ్యనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థి సంగారెడ్డిలో లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి చెందిన మరో ఐఐటీ విద్యార్థి కూడా హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్ష నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని ఘటనలు సంచలనంగా మారుతుంటే.. మరికొన్ని కేసులు పెద్దగా పట్టించుకోకుండానే ముగిసిపోతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులుగా గుర్తించిన వారిపై చర్యలు లేకుండా ముగుస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ఖరగ్‌పూర్ ఐఐటీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బోధించే ప్రొఫెసర్ దళితులను, ఆదివాసీ విద్యార్థులను అవమానించేలా మాట్లాడటంతో పెద్దఎత్తున నిరసన పెల్లుబుకడంతో ఆ ప్రొఫెసర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.
సాధారణ విద్యార్థుల ఆత్మహత్యలూ ఎక్కువే..
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2017లో 9,905 మంది, 2020లో 12,526 మంది, 2021లో 13,089 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. గతేడాది 18 ఏళ్లలోపు వయసున్నవారు 10,732 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారే ఇందులో అధికంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల ఆత్మహత్యలు మహారాష్ట్ర (1,834)లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (1,308), తమిళనాడు (1,246), కర్ణాటక (855), ఒడిశా (834) నిలిచాయి. మొత్తం విద్యార్థుల బలవన్మరణాల్లో గ్రాడ్యుయేట్, ఆపైస్థాయి వారి శాతం 4.6గా ఉంది.
మరో విద్యార్థి ఇలా కావొద్దు
బలవన్మరణం వల్ల తల్లిదండ్రులకు శోకం మిగల్చడం తప్ప... సాధించేది ఏమీ ఉండదు. ప్రతిభ ఉన్న విద్యార్థులే ఇలాంటి విద్యాసంస్థల్లో చేరుతారు. వారికి సరైన మార్గదర్శనం ప్రొఫెసర్లు చేయాలి. మా అబ్బాయి రాహుల్ ఆత్మహత్య చేసుకునే రకం కాదు. అంతకు ముందే పుట్టిన రోజు జరుపుకున్నాడు. షిర్డి వెళ్లి వచ్చాం. ఎక్కడా డిప్రెషన్‌కు గురైనట్లు కనిపించలేదు. ప్రొఫెసర్ల ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నా. ఏదైనా లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీని కోరా. ల్యాప్‌టాప్ ఇప్పటి వరకు మాకు ఇవ్వనేలేదు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దు. ఇది లేకపోతే భవిష్యత్తు లేదనే భావన విరమించుకోండి.
–ఐఐటీ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తండ్రి మధుసూధన్‌రావు
మానసిక ధైర్యం ప్రధానం
విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి. ఇంటర్ వరకు ఉన్న వాతావరణానికి æఐఐటీ, ఎన్‌ఐటీల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. విద్యా బోధనలో మార్పులు ఉంటాయి. స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎప్పుడూ చదువు కోసమేకాకుండా.. వారు మానసికంగా దృఢంగా ఉండేలా ధైర్యం చెప్పాలి. సహచర విద్యార్థులు కూడా తోటి విద్యార్థులు డిప్రెషన్‌లో ఉన్నట్టు తెలియగానే ధైర్యం చెప్పాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. అప్పుడు సరైన కౌన్సెలింగ్ తీసుకుని ధైర్యం నింపేందుకు వీలవుతుంది.
– ఎన్‌వీ రమణారావు, ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్
మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ క్యాంపులు అవసరం
వివిధ సాంస్కృతిక నేపథ్యాల్లో పెరిగిన వాతావరణానికి.. ఐఐటీల్లోని వాతావరణం పూర్తిభిన్నంగా ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇతర నేపథ్యం నుంచి వచి్చన సహచర విద్యార్థులతో కలవలేకపోవడం, వారితో పోల్చుకుని కుంగుబాటుకు గురికావడం, తక్కువ మార్కులొస్తే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సరైన ప్లేస్‌మెంట్లు రావనే భయాలు, బాగా మార్కులు తెచ్చుకుని పెద్ద పెద్ద ప్యాకేజీలు తెచ్చుకోవాలనే తల్లితండ్రుల అంచనాలు చేరుకోకపోవడం వంటివి ప్రభావం చూపిస్తున్నాయి. ఉన్నత చదువు, సంబంధిత అంశాల ఒత్తిళ్లతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అన్ని విద్యాసంస్థల్లో ‘మెంటల్ హెల్త్ అవేర్‌నెస్’క్యాంపులు నిర్వహించాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనైనప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? సహ విద్యార్థులు, ఇతరుల ద్వారా ఆయా దశలను ఎలా గుర్తించాలనే దానిపై పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలి. ఐఐటీలు, ఎన్‌ఐటీల వంటి చోట్ల సైకాలజిస్టులను పెట్టినా.. ఒత్తిళ్లు, ఇతర అంశాలపై సరైన అవగాహన కలి్పంచడం లేదు. క్లాస్‌లు జరిగేప్పుడు, డైనింగ్, టీవీ హాల్ తదితర చోట్ల జనరల్ అంశాలపైనా అవగాహన కల్పించాలి.
–వీరేందర్, సైకాలజిస్ట్
చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే..
Comments
Please login to add a commentAdd a comment