మన దేశంలోని ఐఐటీలు 2018 నుండి 2023 వరకు 33 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. ఎన్‌ఐటీలు, ఐఐఎమ్‌లు అలాంటి 61 కేసులను నమోదు చేశాయి. ‘విజయం’ అనే కలలను అమ్మే బ్రహ్మాండమైన కోచింగ్ ఫ్యాక్టరీలకు అపఖ్యాతి గాంచిన రాజస్థాన్ లోని కోటాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు ప్రతి నెలా సగటున మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి. ప్లేస్‌మెంట్లు, జీతం ప్యాకేజీల కథలతో ఈ వ్యవస్థ యువ మనస్సులను హిప్నోటైజ్ చేస్తోంది. అర్థం లేని పరుగు కోసం గుర్రాలుగా మారుస్తోంది. గొప్ప ఆకాంక్షలను, కలలను చంపుతోంది. అయినా విద్యార్థుల ఆత్మహత్యలను మనం సాధారణీకరిస్తున్నాం. ఈ ప్రాణాపాయ విద్యకు బలంగా ‘నో’ అని చెప్పాలి.
ఈ మధ్య ఓ దీర్ఘకాలిక ఆందోళన నాతో ఘర్షించడం మొదలెట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలను మనం సాధారణీకరిస్తున్నామా? విద్య పేరిట, ‘విజయం’ కోసం జరిగే పరుగుపందెంలో కొందరు ‘బలహీనమైన’, ‘భావోద్వేగా నికి లోనయ్యే’ యువకులు తమ జీవితాలను అంతం చేసుకుంటున్న ప్పటికీ, దీన్నంతా మామూలు వ్యవహారం లానే చూస్తున్నామా?
ఇలాంటి విద్య... విద్యార్థి స్ఫూర్తినే నాశనం చేస్తుందనీ, సామాజిక మానసిక వ్యాధిని సాధారణీకరిస్తుందనీ చెబుతూ, మధ్యతరగతి తల్లిదండ్రులతోనూ, ఉపాధ్యాయులతోనూ నేను తరచుగా కమ్యూని కేట్ చేయడానికి ప్రయత్నించాను. గణాంకాల ద్వారా వారిని ఒప్పించేందుకు కూడా ప్రయత్నించాను. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం, ఆ ఏడాది 13,089 మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. అంటే ప్రతిరోజూ 35 కంటే ఎక్కువ చొప్పున అన్నమాట. అయినప్పటికీ, నేను ఒక తిరస్కరణ లేక నిరాకరణ స్థితిని ఎదుర్కొంటున్నాను.
మన కాలంలో వాతావరణ అత్యవసర పరిస్థితికి చెందిన కఠినమైన వాస్తవికతను మనం ఎలాగైతే తిరస్కరిస్తున్నామో దాదాపుగా ఇదీ అంతే! మన దేశంలోని ఐఐటీలు 2018 నుండి 2023 వరకు 33 మంది విద్యార్థుల ఆత్మహత్యలను నివేదించాయి. మరో వైపున ఎన్‌ఐటీలు, ఐఐఎమ్‌లు అలాంటి 61 కేసులను నమోదు చేశాయి. అయినప్పటికీ, మనం మౌనంగా ఉండటానికే ఇష్టపడతాం లేదా దానిని కేవలం ఒక అపసవ్యతగా భావిస్తాం. అదే విధంగా, ‘విజయం’ అనే కలలను అమ్మే బ్రహ్మాండమైన కోచింగ్ ఫ్యాక్టరీలకు అపఖ్యాతి గాంచిన రాజస్థాన్ లోని కోటాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు ప్రతినెలా సగటున మూడు ఆత్మహత్యలు నమోదయ్యాయి.
నిజానికి, జీవితాన్నే నిరాకరించే ఈ పోటీ వ్యాప్తికి సంబంధించిన వ్యవస్థీకృత, సామాజిక కారణాల గురించి నాకు తెలుసు. ఇంకా చెప్పాలంటే, అధిక జనాభా కలిగిన ఈ దేశంలో ఉద్యోగాల కొరత ఉంది. ఉదారవాద కళలు, మానవ శాస్త్రాల విలువ తగ్గిపోయింది.
ఇంజినీరింగ్, వైద్యశాస్త్రాలు, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇతర సాంకేతిక కోర్సులపై మక్కువ పెరిగింది. సంస్కృతిపై, విద్యపై నయా ఉదార వాద దాడి కారణంగా జీవిత ఆకాంక్షల మార్కెటీకరణ జరిగింది. అన్నింటికంటే మించి, ‘యోగ్యత’ లేదా ‘బలవంతులదే మనుగడ’ సిద్ధాంతాలకు పవిత్రత కల్పించడం కోసం... అన్యాయమైన సామాజిక వ్యవస్థలో ఒక జీవన విధానంగా అతి పోటీతత్వాన్ని లేదా సామాజిక డార్వినిజంను అంగీకరించడం జరిగింది. మన పిల్లలు, యువ విద్యార్థులు బాధపడుతున్న తీరును చూస్తూనే ఉన్నాం. దీర్ఘకాలిక ఒత్తిడి, భయం, ఆందోళన, ఆత్మహత్య ధోరణులతో వారు జీవిస్తున్నందున, మనం మౌనంగా ఉండలేం. ఈ అన్యాయాన్ని మనం సాధారణీకరించలేం.
ఒక ఉపాధ్యాయునిగా, ఈ విధమైన ఏ విద్యనైనా ఏమాత్రం సందిగ్ధత లేకుండా మనం విమర్శించాలనీ, దీని ద్వారా కొత్త అవ కాశాల కోసం ప్రయత్నించాలనీ నేను భావిస్తాను. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవడం లేదు. కానీ ఈ విద్యా వ్యవస్థలో భాగమైన ప్రతి యువ విద్యార్థి కూడా మానసిక ఒత్తిడి, ఆందోళన, ‘వైఫల్యానికి’ సంబంధించిన అమితమైన భయాలతో అననుకూల మైన వాతావరణంలో పెరుగుతున్నారనేది కూడా అంతే నిజం.
ప్రేమ, సహకారానికి సంబంధించిన ఆవశ్యకత; పట్టుదల, ప్రశాంతతకు సంబంధించిన కళ ద్వారా భూమ్మీద మన ఉనికి తాలూకు హెచ్చు తగ్గులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం; సాధారణ విషయాలలో జీవి తానికి సంబంధించిన నిజమైన నిధిని కనుగొనడానికి వీలు కల్పించే బుద్ధిపూర్వక స్థితి... ఇలా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి అవ కాశం లేని, నిజంగా ముఖ్యమైన వాటిని పెంపొందించడంలో ఆసక్తి లేని వ్యవస్థ ఇక్కడ ఉంది.
ఒక సీతాకోక చిలుక చిన్న పసుపు పువ్వుతో ఆడుకోవడం, ముసలి నాయనమ్మ కోసం ఒక కప్పు టీ తయారు చేయడం, ఆమెతో పారవశ్యంలో ఒక క్షణం పంచుకోవడం, లేదా శీతా కాలపు రాత్రి ఒక నవలను చదవడం... ఇలాంటి వాటికి బదులుగా, ఈ వ్యవస్థ అన్ని గొప్ప ఆకాంక్షలను, కలలను చంపుతోంది. ఇది యువ మనసులను అర్థం లేని పరుగు కోసం గుర్రాలుగా మారుస్తోంది.
పాఠశాలల నుండి కోచింగ్ ఫ్యాక్టరీల వరకు, మనం విద్యను అన్ని రకాల ప్రామాణిక పరీక్షలను ‘ఛేదించే’ ఒక వ్యూహంగా కుదించి వేశాము. గొప్ప పుస్తకాలను చదవడం, వినూత్న ఆలోచనలను అన్వేషించడం, చర్చించడం, వాదించడం, సైన్ ్స, సాహిత్యం, కళలతో ప్రయోగాలు చేయడం వంటి వాటి కంటే పరీక్షలు, మార్కులు చాలా ముఖ్యమైనవి కావడంతో నిజమైన అభ్యాసం దెబ్బతింటోంది. ‘వేగా నికి’ సంబంధించిన మాంత్రికతతో ఓఎమ్‌ఆర్ షీట్‌లో ‘సరైన’ సమా ధానాన్ని టిక్ చేయగల సామర్థ్యమే విలువైనది అయిపోయింది.
ఎమ్‌సీక్యూ – కేంద్రీకృత పరీక్షా వ్యూహాలను విక్రయించే మార్గ దర్శక పుస్తకాలు యువ అభ్యాసకుల మానసిక స్థితిని వలసీకరించడం ప్రారంభించాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.ఈ వ్యవస్థ సౌందర్యం, సృజనాత్మకత, ఉత్సుకత లేనిది. ఇది యాంత్రికమైన, ప్రామాణికమైన, కరుడు గట్టిన మనస్సులను తయారు చేస్తుంది. ఉపకరణ ‘మేధస్సు’కు మాత్రమే అది విలువ నిస్తుంది. దీనిలో సృజనాత్మక కల్పన లేదా తాత్విక అద్భుతం లేదు. కోచింగ్ సెంటర్ వ్యూహకర్త మీ బిడ్డను సూర్యాస్తమయాన్ని చూడ డానికీ, ఒక పద్యం చదవడానికీ లేదా సత్యజిత్ రే చలన చిత్రాన్ని మెచ్చుకునేలా ప్రేరేపించాలనీ మీరు ఆశించలేరు.
ఈ బోధకులు మీ పిల్లలను వేగంగా పరిగెత్తమని, ఇతరులను ఓడించమని, భౌతిక శాస్త్రాన్ని లేదా గణితాన్ని కేవలం ప్రవేశ పరీక్ష మెటీరియల్‌గా కుదించుకోమని, అతని/ఆమె స్వీయ–అవగాహనను ఐఐటీ–జేఈఈ లేదా నీట్ ర్యాంకింగ్‌తో సమానం చేయమని మాత్రమే అడగగలరు. మరో మాటలో చెప్పాలంటే, ఈ విధమైన విద్య ఒక వ్యక్తిని సాంస్కృతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా దారిద్య్రంలోకి నెడుతుంది. ఇది జీవితం కోసం, దాని లోతైన అస్తిత్వ ప్రశ్నల కోసం ఎవరినీ సిద్ధం చేయదు.
కార్ల్ మార్క్స్ ఒకప్పుడు ‘సరుకుల మాయ’గా భావించిన దానిని ఈ విధమైన సాధనా విద్య చట్టబద్ధం చేస్తోంది. అవును, మన పిల్లలు ఒక విధంగా శిక్షణ పొందవలసి ఉంటుంది, తద్వారా వారు ఒక ధర ట్యాగ్‌తో వస్తువులుగా లేదా ‘ఉత్పత్తులుగా’ ఉద్భవించవలసి ఉంటుంది. కఠినమైన వాస్తవాన్ని అంగీకరించండి. చాలా హైప్ చేయబడిన ఐఐటీలు, ఐఐఎమ్‌లు – మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చూసే అంతిమ మోక్షమైన ‘ప్లేస్‌మెంట్‌లు మరియు జీతం ప్యాకేజీల’ పురాణాల ద్వారా యువ మనస్సులను హిప్నోటైజ్ చేస్తాయి.
మన పిల్లలను, ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తి గల వ్యక్తు లుగా చూడకుండా, కేవలం ‘పెట్టుబడి’ లేదా విక్రయించదగిన వస్తు వుల స్థాయికి తగ్గించి, మనం న్యూరోటిక్, ఆందోళనతో కూడిన, అధిక ఒత్తిడితో కూడిన తరాన్ని సృష్టించడం కొనసాగిస్తాము. ‘మోటివేషనల్ స్పీకర్ల’ను ‘స్వయం–సహాయ’ పుస్తకాల మార్కెట్‌ను అభివృద్ధి చేయ డానికి వ్యవస్థ అనుమతించినప్పటికీ, పెరుగుతున్న ఆత్మహత్యల రేటును అరికట్టడం అసాధ్యం.
ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, శ్రద్ధగల పౌరులుగా, మనం అప్రమత్తంగా ఉండాలి, మన స్వరం పెంచాలి, ఈ ప్రాణాపాయ విద్యకు నో అని చెప్పాలి, కొత్త అవగాహనను ఏర్పరచాలి. మన పిల్లలకు జీవితాన్ని ధ్రువీకరించే, కరుణను పెంచే మరో దృక్పథాన్ని అందించాలి.
అవిజిత్ పాఠక్
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment