రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరుపొందిన కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. ఆత్మహత్యలను నిలువరించేందుకు అధికారులు ఎంతటి చర్యలు చేపట్టినా ఫలితం శూన్యంగా మారింది. విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పరీక్షల భయం, మానసిక ఒత్తిడితో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా కోటాలో మరో విద్యార్థి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. దీంతో ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 28కి చేరింది.
వివరాలు.. పశ్చిమబెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల ఫరీద్ హుస్సేన్ కోటాకు వచ్చి వైద్య విద్యలో అర్హత కోసం నిర్వహించే నీట్ పరిక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. వక్ఫ్ నగర్ ప్రాంతంలో ఇతర విద్యార్థులతో కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గదిలో ఒంటరిగా ఉన్న హుస్సేన్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
బయటకు వెళ్లిన స్నేహితులు రాత్రి 7 గంటలకు గది వద్దకు వచ్చేసరికి బయట నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కాల్ చేయగా ఫోన్ లిఫ్ట్‌చేయలేదు. తలుపులు పగలగొట్టి చూడగా.. హుస్సేన్ విగత జీవిగా కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి ఆత్మహత్యపై కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని, అతని మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు!
కాగా వివిధ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’ లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే 2023లోనే అత్యధికంగా ఆత్మహత్య కేసులు(28) నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
మరోవైపు విద్యార్థుల బలవన్మరణాలను ఆపేందుకు కోటాలోని వసతి గృహాల్లో , భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్ కాయిల్ ఫ్యాన్లు అమర్చుతున్నారు. భవనాల పై అంతస్తు నుంచి దూకినా గాయపడకుండా కింద ఆవరణల్లోనూ వలలు కడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment