
న్యూఢిల్లీ : ప్రపంచ యూనివర్సిటీ ర్యాంక్‌ల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐఎస్ బెంగళూర్, ఐఐటీ ఢిల్లీలు టాప్ 200లో చోటుదక్కించుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే టాప్ 1000 వర్సిటీల జాబితాలో భారత యూనివర్సిటీల సంఖ్య 20 నుంచి 24కు పెరగడం గమనార్హం. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2019లో గత ఏడాదితో పోలిస్తే తాజా జాబితాలో ఐఐటీ బాంబే 17 స్ధానాలు మెరుగుపరుచుకుని 162వ ర్యాంక్‌లో నిలవడం ద్వారా దేశంలోనే టాప్ ఇనిస్టిట్యూట్‌గా పేరొందింది.
ఐఐటీ ఢిల్లీ 172వ స్ధానంలో నిలిచింది. ఐఐసీ బెంగళూర్ సైతం ఐఐటీ ఢిల్లీని తోసిపుచ్చి 170వ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంకింగ్ జాబితాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది. 15వ సారి ప్రకటించిన ఈ ర్యాంకింగస్‌లో వరుసగా ఏడవ సంవత్సరం సైతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ యూనివర్సిటీగా నిలవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలకు చెందిన ప్రముఖ 1000 విశ్వవిద్యాలయాల ర్యాంకులను ఈ జాబితా వెల్లడిస్తుంది. ఈ జాబితాలో భారత్ నుంచి 24 యూనివర్సిటీలు చోటు దక్కించుకోగా, ఏడు వర్సిటీలు తమ ర్యాంకును మెరుగుపరుచకున్నాయని, 9 సంస్థలు నిలకడగా ఉండగా, 5 వర్సిటీలు కొత్తగా చోటు దక్కించుకున్నాయని క్యూఎస్ రీసెర్చి డైరెక్టర్ బెన్ సోటర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment