20 కంపెనీలపై ఐఐటీలు నిషేధం
న్యూఢిల్లీ : 20 స్టార్టప్, ఈ-కామర్స్ కంపెనీలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు) నిషేధం విధించనున్నాయి. కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా ఈ కంపెనీలను బ్లాక్లిస్ట్లో పెట్టనున్నాయి. అధికవేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకోవడం వంటి ఘటనలపై సీరియస్గా స్పందించిన ఐఐటీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బ్లాక్లిస్టులో పెట్టిన కంపెనీల జాబితాను ఐఐటీల ప్లేస్మెంట్ కమిటీ(ఏఐసీసీ) ఇంకా వెల్లడించలేదు.
బ్లాక్లిస్ట్తో పాటు ఆఫర్ లెటర్లు ఇచ్చి విత్ డ్రా చేసుకోవడం, ముందు ప్రకటించిన వేతనంలో కోత విధించడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి వరుస ఘటనల నేపథ్యంలో కంపెనీలు సీరియస్ వార్నింగ్ లెటర్లు కూడా అందుకోనున్నాయి. గతేడాది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సంస్థ ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడిచినా స్పందించకపోవడంతో, ఆ కంపెనీ కూడా వార్నింగ్ లెటర్ను అందుకోనుందని తెలుస్తోంది. అయితే ఫ్లిప్కార్ట్ జాబ్ ఆఫర్లను పూర్తిగా ఉపసంహరించుకోకపోవడం వల్ల బ్లాక్లిస్ట్ విధించిన జాబితాలో ఉండకపోవచ్చని ఏఐపీసీ కన్వినర్ కౌస్తుబా మోహంతి అన్నారు.
వరుసగా రెండో ఏడాది కూడా జూమోటో కంపెనీని బ్లాక్లిస్ట్లో పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కంపెనీలు ఇంకా స్పందించలేదు. క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో కంపెనీలు చేస్తున్న నిర్లక్ష్యపూరితమైన అంశాలపై ఐఐటీలు సీరియస్గా స్పందించాయని, ఏకగ్రీవంగా కంపెనీలను బ్లాక్లిస్ట్ పెట్టడానికి ఆమోదించాయని చెప్పారు. ఐఐటీ కాన్పూర్లో 12 ఐఐటీలతో నిర్వహించిన 2017 ప్లేస్మెంట్ మీటింగ్లో ఏఐపీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఐఐటీ బొంబై ఈ మీటింగ్కు హాజరుకాలేదని మోహంతి చెప్పారు.