job offers
-
అమెరికా కలవరం.. డిపోర్టేషన్ పరేషాన్
రూపాయి విలువ ఎక్కువున్న దేశానికి ఎందుకు వెళ్తాం? సంపాదించుకోవడానికి! చదువు పేరుతో వెళ్లినా అంతిమ లక్ష్యం అక్కడ కొలువు సాధించడమే! ఈ ప్రస్తావన అమెరికా డిపోర్టేషన్ గురించే! స్టూడెంట్ వీసా మీదున్న వాళ్లు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకోకపోతే కష్టం! అక్కడున్న చట్టాల ప్రకారం చదువుకునే క్యాంపస్ లోనే కొలువులు చేయాలి. అవి దొరకడం క్లిష్టం! క్యాంపస్‌కు ఆవల ఉద్యోగాలకు వెళితే డిపోర్టేషన్ ఖాయం! ఈ క్రమంలో అక్కడున్న భారతీయ కుటుంబాలు కొన్ని.. అవసరంలో ఉన్న స్టూడెంట్స్‌కి తమ ఇళ్లల్లో డొమెస్టిక్ హెల్ప్ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. అవి చేయడం తప్పనిసరైతే భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని, లీగల్ హెల్ప్ తీసుకుని అడుగేయడం మంచిది!తెలంగాణకు చెందిన నేహా (పేరు మార్చాం) అమెరికాలో ఎమ్మెస్ చదువుతోంది. వాళ్లది వ్యవసాయ కుటుంబం. అందరి పిల్లల్లాగే తమ పిల్లలూ విదేశాల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నేహా తల్లిదండ్రుల ఆశ. అందుకే నేహా వాళ్ల అక్కను (యూకే), ఆమెను అప్పులు చేసి మరీ విదేశాలకు పంపారు చదివించడానికి. ఖర్చుల కోసం అమ్మా, నాన్న మీద ఆధారపడకూడదని చదువుతూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటున్నారిద్దరూ. నేహా తన యూనివర్సిటీ దగ్గర్లోని సూపర్మార్కెట్లో సేల్స్ గర్ల్‌గా పనిచేసేది. ఆ ఏరియా పోలీసులు, ఇమిగ్రేషన్ సిబ్బంది ఆ సూపర్ మార్కెట్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న ఫారిన్ స్టూడెంట్స్‌ని తీసేయమని, లేదంటే ఆ షాప్ లైసెన్స్ రద్దవుతుందని యజమానికి వార్నింగ్ ఇచ్చారు. మరుక్షణమే నేహా జాబ్ పోయింది. ఖర్చులెలా? అప్పుడే నేహా స్నేహితురాలు ఆమెకు సబర్బ్‌లోని ఇండియన్ కమ్యూనిటీలో ఉన్న డొమెస్టిక్ హెల్పర్ కొలువు గురించి చెప్పింది. ‘వీకెండ్స్‌కి వెళ్లి ఇల్లు క్లీన్ చేయాలి. వాళ్లకు పిల్లలుంటే ఆడించాలి. గెట్ టు గెదర్స్కి అరెంజ్మెంట్స్ చేయాలి అంతే!’ అంటూ ఆ ఉద్యోగంలో చేయాల్సిన పనులను వివరించింది. ‘పేమెంట్ ప్రామ్ట్గానే ఉంటుంది. మన ఐడెంటిటీ ఎక్కడా రివీల్ చేయర’నే అభయమూ ఇచ్చింది. మరో ఆప్షన్ లేదని మారు మాట్లాడకుండా ఓ గుజరాతీ కుటుంబంలో డొమెస్టిక్ హెల్పర్‌గా చేరింది నేహా.ఇంకో స్టేట్‌లో...ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాలతి (పేరు మార్చాం) డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్లింది. భర్తకు హెచ్1బీ ఉంది. ఆమె అక్కడ తమకు తెలిసిన వాళ్ల రెస్టరెంట్లో మేనేజర్‌గా పనిచేసేది. కానీ ఈ మధ్యే ఉద్యోగం మానేసింది. రెస్టరెంట్ ఓనర్ మీద ఇమిగ్రేషన్ అధికారుల ఒత్తిడి, డిపెండెంట్ వీసా మీద తాను ఉద్యోగం చేస్తున్నట్టు ఇమిగ్రేషన్ సిబ్బందికి తెలిస్తే తన భర్త హెచ్1బీ వీసా రద్దవుతుందేమోనన్న భయంతో! ఈ ఇద్దరే కాదు.. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి.. అమెరికాలో విజిటింగ్ వీసా, స్టూడెంట్ వీసాల మీద ఆఫ్ క్యాంపస్ (వాళ్లు చదువుతున్న యూనివర్సిటీకి ఆవల) ఉద్యోగాలు చేస్తున్నవారు, డిపెండెంట్ వీసా మీద గుంభనంగా జాబ్స్ చేసుకుంటున్న వాళ్లందరి పరిస్థితి అలాగే ఉంది. కారణం.. వర్క్ పర్మిట్ లేకుండా ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నవారిని, అనుమతి లేని ప్రదేశాల్లో పార్ట్ టైమ్‌కి కుదిరిన వారిని, చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి చొరబడిన వారిని వెనక్కి పంపే కార్యక్రమాన్ని ట్రంప్ కఠినంగా అమలు చేస్తున్నాడు. పాస్‌పోర్ట్‌లో ఒక్కసారి డిపోర్టెడ్ అని ముద్ర పడితే మళ్లీ ఆ దేశానికి విమానమెక్కే చాన్స్ ఉండదు. ఆ స్థితికి రావద్దని ప్రయత్నించని వారులేరు. అందుకే అది పాచి పనా.. ఇంకోటా అని చూడకుండా, పని చోట భద్రత ఉందా? రక్షణ ఎంత? అని ఆలోచించకుండా తాము పనిచేస్తున్నట్టు అమెరికన్ గవర్నమెంట్‌కు తెలియకపోతే చాలు అనుకుంటూ దొరికిన పనిలో చేరిపోతున్నారు! అమెరికా అంతటా ఇలాంటి పరిస్థితే లేదని, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు గెలిచిన రాష్ట్రాల్లోనే డిపోర్టేషన్ కఠినంగా ఉందని చెబుతున్నారు అక్కడుంటున్న తెలుగువాళ్లు కొందరు. ఇలా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను సొంత దేశాలకు పంపించేయడం ఇదే మోదటిసారి కాదని, ఆందోళనలు.. భయాలు కొత్తేం కాదని తేలిగ్గా తీసుకుంటున్న అమెరికా పౌరసత్వం పొందిన భారతీయులూ ఉన్నారు. అయితే ఈ డిపోర్టేషన్‌ను ఆసరాగా తీసుకుని తక్కువ జీతానికే భారతీయ విద్యార్థుల చేత ఇంటి పనులు, దుస్తుల ఇస్త్రీ, తోట పని, కార్లు తుడిపించడం, పిల్లలను ఆడించడం వంటి బండెడు చాకిరీ చేయించుకుంటున్నారని వాపోతున్నవారూ ఉన్నారు. ఏమైనా సరే.. పరాయి దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ల చట్టాలను గౌరవించడం, ఆ ప్రకారం నడుచుకోవడం తప్పనిసరని చెబుతున్నారు న్యాయసలహాదారులు.ఇది తెలుసుకోండివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత 15 ఏళ్లుగా 15,000కి పైగా భారతీయులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి ప్రవేశించినవారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని గౌరవంగా వెనక్కి రావచ్చు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న మన పౌరుల్లో అక్కడ చదువుకున్నవారు, పెళ్లి చేసుకుని డిపెండెంట్ వీసా మీద వెళ్లి తర్వాత కుటుంబ కారణాల రీత్యా విడాకులు తీసుకున్నవారు, గృహహింసకు గురైనవారే ఎక్కువ. వీరు స్వచ్ఛందంగా తమ వీసా స్టేటస్‌ను మార్చుకుంటే అమెరికాలోనే ఉండవచ్చు. భర్త వేధింపులకు గురైన అమ్మాయిలు చాలామంది స్టూడెంట్ వీసాకి మారి చదువుకుంటూ అక్కడే ఉండిపోతున్నారు. కొన్ని నేరాలలో విక్టిమ్స్ అయితే వీసాకు అర్హులవుతారు. ఇలా వారికి అర్హత ఉన్న వీసా తీసుకొని అక్కడే ఉండిపోవచ్చు.అక్కడే ఉండాలనుకునేవారు చేయవలసిన పనులు1. ఆ దేశ కోర్టును ఆశ్రయించి, పరిస్థితులను వివరిస్తూ, ఆ దేశంలో ΄పౌరసత్వం కోసమో లేక వీసా కోసమో చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే మానవీయ కోణంలో కొంత గడువు కోరడం. 2. కొన్ని ప్రత్యేక కేసులలో.. ఏదైనా అమెరికా సంస్థ నుంచి ఉద్యోగావకాశం ఉందని చూపించగలిగితే వీసా గడువు తర్వాత కూడా మరలా వీసా వచ్చేంతవరకు ఉండొచ్చు. 3. అమెరికా ΄పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (పర్మనెంట్ రెసిడెన్సీ) గల వ్యక్తి కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు అయ్యుండి, సదరు ΄పౌరుడిచే లేదా అతని కుటుంబ సభ్యులచే గృహహింసకు లోనయ్యుంటే వయొలెన్స్ అగైన్స్ట్ విమెన్ యాక్ట్ (Vఅగిఅ) కింద.. గృహహింసకు గురిచేసిన వ్యక్తికి తెలియకుండానే గ్రీన్ కార్డు ΄పొందవచ్చు. 4. ప్రత్యేక పరిస్థితుల్లో ఆశ్రయం కోరవచ్చు. వీటన్నిటి కోసం ముందుగా మంచి ఇమిగ్రేషన్ అటార్నీ (లాయర్)ని కలవాలి. ఏజెంట్ల ద్వారా వెళ్తే మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇమిగ్రేషన్ చట్టం సులభంగా అర్థమయ్యేది కాదు కాబట్టి నిపుణుల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది – సరస్వతి రమ -
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్..
దేశీయ ఐటి సేవల దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జాబ్ ఆఫర్ లెటర్లు పొందిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తామని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. టెక్ పరిశ్రమలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, టీసీఎస్ మాత్రం ఫ్రెషర్లను నియమించుకోవడానికి, వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని మనీకంట్రోల్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్కడ్ చెప్పారు. ఇదీ చదవండి: పనిచేయడానికి ఇదే బెస్ట్ కంపెనీ.. కెరియర్ గ్రోత్ సూపర్! జూనియర్ ఉద్యోగుల జీతాలు డబుల్! ఉద్యోగుల వేతన వ్యత్యాసాలను పరిష్కరించడానికి టీసీఎస్ ప్రయత్నాలను ప్రకటించింది. జూనియర్ ఉద్యోగులు తమ నైపుణ్యం పెంచుకుని జీతాలను రెట్టింపు చేసుకునే అవకాశాలను కల్పించనున్నట్లు మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకుని తమ కెరీర్లో ముందుకు సాగేలా అంతర్గత శిక్షణ అందిస్తామన్నారు. ఈ శిక్షణలో వివిధ స్థాయిల నుంచి వీలైనంత ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కంపెనీ యోచిస్తోందన్నారు. ఈ శిక్షణలో ప్రతిభ చూపి అసెస్మెంట్లను క్లియర్ చేసిన ఉద్యోగులు తమ జీతాలను రెట్టింపు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ అసెస్మెంట్లలో సంవత్సరానికి కేవలం 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. 100 శాతం వేరియబుల్ పే టీసీఎస్ ఫ్రెషర్లకు వేతనాలను పెంచడంతోపాటు జూనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు 100 శాతం త్రైమాసిక వేరియబుల్ వేతనం అందించడాన్ని కూడా పరిశీలిస్తోందని లక్కడ్ పేర్కొన్నారు. అయితే ఈ జీతాల పెరుగుదల ఎప్పటి నుంచి ఉంటుందో ఆయన వెల్లడించలేదు. ఒకేసారి ఉద్యోగుల జీతాలు పెంచడం కన్నా శిక్షణ కార్యక్రమాలు అమలు చేసి ప్రతిభావంతులకు జీతాలు పెంచడం మెరుగైన వ్యూహమని పేర్కొన్నారు. 44,000 జాబ్ ఆఫర్లు 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం.. టీసీఎస్ 44,000 మంది ఫ్రెషర్లకు జాబ్ ఆఫర్లను అందించింది. ఈ జాబ్ ఆఫర్లను అన్నింటినీ తాము గౌరవిస్తామని, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. తాము అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తున్నామని, 2023 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రాతిపదికన 22,600 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని లక్కడ్ చెప్పారు. ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. -
అది ఆఫర్ లెటర్ కాదు.. ఫ్రెషర్లకు షాకిచ్చిన క్యాప్‌జెమినీ!
ఆన్‌బోర్డింగ్ విషయంలో కాస్త ఓపిక పట్టాలని ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెషర్లను కోరింది. 2022లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేసినవారిని 2023లో ఎప్పుడైనా ఆన్‌బోర్డ్ చేయనున్నట్లు తెలియజేసింది. ఖాళీల లభ్యత ఆధారంగా ఆన్‌బోర్డింగ్ ఉంటుందని అభ్యర్థులకు సమాచారం అందించింది. (ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!) క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఆన్‌బోర్డింగ్‌పై స్పష్టత కోసం కంపెనీని సంప్రదించగా ఈ మేరకు బదులిచ్చింది. ఎంపికైన అభ్యర్థులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) మాత్రమే ఇచ్చామని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కంపెనీకి లేదని పేర్కొంది. దీన్ని ఆఫర్ లెటర్‌గా పరిగణించకూడదని యూనివర్సిటీ రిలేషన్స్ అండ్ టాలెంట్ హైరింగ్ టీమ్ తెలిపింది. (తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!) భారతదేశంలోని చాలా ఐటీ కంపెనీలు గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లను ఇంకా ఆన్‌బోర్డ్ చేయలేదు. మాంద్యం సంకేతాలు ఉన్న ఉత్తర అమెరికా, యూరప్‌లో వ్యాపార అనిశ్చితి దీనికి కారణం. దీంతో సిబ్బంది వ్యయాల విషయంలో ఆయా కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు, అంచనాలు గణనీయమైన మందగమనాన్ని సూచిస్తున్నాయి. -
ఆటోమేషన్.. జాబ్ ఆఫర్లు అపారం!
డిజిటలైజేషన్.. ఆటోమేషన్.. ఇప్పుడు అన్ని రంగాల్లో వినిపిస్తున్న మాట! మానవ ప్రమేయం తగ్గించి ఆటోమేషన్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకోసం రోబోటిక్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మొదలు తయారీ వరకు.. అన్ని రంగాల్లో రోబో ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా.. రోబోటిక్స్ రంగం యువతకు కొలువుల వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. రోబోటిక్స్ కొలువులు, తాజా ట్రెండ్స్, అవసరమైన నైపుణ్యాలు, అందుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. కొన్నేళ్ల క్రితం వరకు మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమల్లోనే ఇండస్ట్రియల్ రోబోల వినియోగం ఉండేది. క్రమేణా ఇది ఇతర రంగాల్లోకి దూసుకొస్తోంది. ఇప్పుడు ఐటీ, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, డిఫెన్స్,స్పేస్ టెక్నాలజీ తదితర విభాగాల్లో సైతం రోబో ఆధారిత కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లోని ఐటీ సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ద్వారా కార్యకలాపాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకోసం ఆర్పీఏ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అందుకే ఆటోమేషన్ డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా మానవ ప్రమేయం తగ్గించొచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అందుకోసం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లను వినియోగించాలనే ఆలోచన చేస్తున్నాయి. అంటే.. వ్యక్తులు చేయాల్సిన అనేక కార్యకలాపాలు రోబోల ద్వారా నిర్వహిస్తారు. నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–పది మంది చేసే పనిని ఒక్క రోబో ద్వారా వేగంగా పూర్తిచేయొచ్చు. ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వైపు దృష్టిపెడుతున్నాయి. కొత్త కొలువులు ► ముఖ్యంగా ఇటీవల కాలంలో ఐటీ విభాగంలో ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఐటీ అనుబంధ విభాగంగా పేర్కొనే బీపీఓలో చాట్ బోట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ పేరుతో రోబో ఆధారిత సేవలు అందించాలని సాఫ్ట్వేర్ సంస్థలు భావిస్తున్నాయి. ► సంస్థలు నిర్దిష్టంగా ఏదైనా ఒక విభాగంలో రోబోటిక్ సేవలు అందించాలని భావిస్తే.. దానికి సరితూగే విధంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ వంటివి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోబోల తయారీ, నిర్వహణ, నియంత్రణకు మానవ నైపుణ్యం తప్పనిసరి. పది లక్షల ఉద్యోగాలు ► నాస్కామ్,బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–2022నాటికి రోబోటిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ► ఐటీ బీపీఓ రంగంలో 2022 నాటికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ఆధారిత సేవలు 70శాతం మేర పెరగనున్నాయి. దీనికి తగ్గట్టుగా 2022 చివరి నాటికి లక్షల ఉద్యోగాలు ఆర్పీఏ, రోబోటిక్స్ విభాగాల్లో లభించనున్నాయని అంచనా. nఒక్క భారత్‌లోనే 2022 నాటికి ఆటోమేషన్ విభాగంలో దాదాపు మూడు లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. నైపుణ్యాలు రోబోటిక్స్ విభాగంలో కొలువులు అందుకోవాలంటే.. నిర్దిష్టంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్; నానో టెక్నాలజీ; డిజైన్ అండ్ టెక్నాలజీ; సంబంధిత కోర్ స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో రోబోటిక్స్ విభాగంలో రాణించాలంటే.. రోబోల రూపకల్పనకు అవసరమైన స్పీచ్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. అదే విధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలు కూడా రోబోటిక్ రంగంలో రాణించేందుకు ఉపయోగపడతాయి. కారణం..రోబోల రూపకల్పన, నిర్వహణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా ఉండటమే. ఈ రోబోలకు డిమాండ్ ఇండస్ట్రియల్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్; హెల్త్‌కేర్ రోబోట్స్, హాస్పిటాలిటీ రోబోట్స్, లాజిస్టిక్స్ రోబోట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. వీటిలోనూ సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్ మోషన్ ప్లానింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్,ఏఐ అండ్ రోబోటిక్స్ విభాగాలు మరింత కీలకంగా మారుతున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ లేదా రోబోటిక్స్ స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు.. రోబోటిక్స్ టెక్నీషియన్స్, రోబోట్ డిజైన్ ఇంజనీర్, రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్స్, సీనియర్ రోబోటిక్స్ ఇంజనీర్స్, ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, రోబోటిక్ సిస్టమ్ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. ఈ ఉద్యోగాల్లో నియమితులైన వారికి సంస్థ స్థాయి, కార్యకలాపాల ఆధారంగా రూ.మూడు లక్షల నుంచి రూ. పది లక్షల వరకూ వార్షిక వేతనం లభిస్తోంది. స్కిల్స్‌కు మార్గం ► ఇప్పుడు అకడమిక్ స్థాయి నుంచే రోబోటిక్స్ నైపుణ్యాలు పొందే వీలుంది. ► ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లు.. బీటెక్ స్థాయిలోనే రోబోటిక్స్‌ను మైనర్‌గా అందిస్తున్నాయి. ► ఎంటెక్ స్థాయిలో రోబోటిక్స్ స్పెషలైజేషన్‌తో పూర్తి స్థాయి ప్రోగ్రామ్‌లను సైతం పలు ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. ► ఎంటెక్‌లో మెడికల్ రోబోటిక్స్; సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోట్ మోషన్ ప్లానింగ్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్; ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ స్పెషలైజేషన్లు అభ్యసించడం ద్వారా ఆర్పీఏ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ► ఏఐసీటీఈ సైతం రోబోటిక్స్, ఏఐ విభాగాలకు సంబంధించిన స్కిల్స్ అందించేలా కరిక్యులం రూపొందించాలని అనుబంధ కళాశాలలకు మార్గనిర్దేశం చేసింది. ► వీటితోపాటు సీమెన్స్, రోబోటిక్స్ ఆన్లైన్, సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్, రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్ వంటి పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేషన్ కోర్సులు ► రోబోటిక్స్‌లో పూర్తి స్థాయి కోర్సులు అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు మూక్స్ విధానంలో పలు సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేసుకుని నిర్ణీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జాబ్ మార్కెట్లో పోటీ పడే అవకాశం లభిస్తుంది. పలు సంస్థలు రోబోటిక్స్ సర్టిఫికేషన్స్ అందిస్తున్నాయి. అవి.. ► రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్: వెబ్సైట్: www.onlinerobotics.com ► రోబో జీనియస్ అకాడమీ: వెబ్సైట్: www.robogenious.in ► రోబోటిక్స్ ఆన్లైన్: వెబ్సైట్: www.robotics.org ► సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్: వెబ్సైట్: www.isa.org రోబోటిక్స్.. ముఖ్యాంశాలు ► రోబోటిక్ ఇంజనీరింగ్ విభాగంలో.. వచ్చే ఏడాది చివరికి ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మేర పెరగనున్న నియామకాలు. ► పీడబ్ల్యూసీ, నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదికల ప్రకారం–వచ్చే ఏడాది చివరికి పది లక్షల ఉద్యోగాలు. ► అంతర్జాతీయంగా లక్షల కొలువులు లభిస్తాయని పలు సర్వేల అంచనా. ► రోబోటిక్ జాబ్స్ అందించడంలో మూడో స్థానంలో భారత్. ► ఈ విభాగాల్లో కనిష్టంగా రూ.మూడు లక్షలు, గరిష్టంగా రూ.10–12 లక్షల వార్షిక వేతనం. ► రోబోటిక్ ఇంజనీర్లు, డెవలపర్స్‌కు సగటున నెలకు రూ.50వేల నుంచి రూ.80వేల వేతనం లభిస్తోంది. ► బ్యాంకింగ్, హెల్త్‌కేర్ వంటి సర్వీస్ సెక్టార్లలో నెలకు రూ.60వేల వరకు వేతనం ఖాయం. n సాఫ్ట్వేర్, ప్రొడక్షన్, మెకానికల్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్, మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో అధిక శాతం నియామకాలు. ఇదే మంచి అవకాశం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కార్యకలాపాలు పెరుగుతూ..దానికి సంబంధించిన విభాగాల్లో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. యువత దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలి. సంబంధిత నైపుణ్యాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. రోబోలతో ఉద్యోగాలు తగ్గుతాయన్న మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. – ప్రొ.కె.మాధవ కృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్, ఐఐఐటీ–హైదరాబాద్ -
Cyber Crime: అందుకే శిరీష ఇలా డల్ అయిపోయింది..
శిరీష (పేరు మార్చడమైంది) నిద్రలేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. కాసేపు ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్స్ చూసి, విసుగనిపించి గదిలోనుంచి బయటకు వచ్చేసింది. నెల రోజులుగా ఇదే తంతు. చేస్తున్న ఉద్యోగం కరోనా కారణంగా పోయింది. ఉద్యోగం లేకుండా ఇంటిపట్టునే ఉంటే గడిచే రోజులు కావు. ఆలోచిస్తూనే తల్లి ఇచ్చిన టిఫిన్‌ను ముగించి, తిరిగి ఫోన్ అందుకుంది. అప్పుడే ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్ కావడంతో ఎవరై ఉంటారనుకుంటూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. ఆ వచ్చిన ఫోన్ కాల్‌తో శిరీష్ ముఖం వెలిగిపోయింది. ఆన్లైన్లో వచ్చిన జాబ్ ఆఫర్‌కి రాత్రే అప్లై చేసింది. తెల్లవారుజామునే ఉద్యోగానికి సెలక్ట్ అయ్యినట్టు ఫోన్ వచ్చింది. నాలుగు రోజులు గడిచాయి. ఎంత పిలిచినా శిరీష గది దాటి రావడం లేదు. దాంతో తల్లే తన గదిలోకి వెళ్లి భోజనం పెట్టి వస్తూ ఉంది. ‘ఉద్యోగం వచ్చిందని తెగ సంబరపడ్డావు. ఇప్పుడేమయ్యింది. ఇలా ఎందుకున్నావ్’ అంటూ తల్లి అడుగుతూనే ఉంది. కానీ, శిరీష మౌనంగా ఉంటోంది. ‘ఉద్యోగం లేదన్నారేమో.. అందుకే శిరీష ఇలా డల్ అయిపోయింది’ అనుకుంటూ.. కూతురును సముదాయించింది తల్లి. అర్ధరాత్రి మంచినీళ్ల కోసం లేచిన తల్లికి ఉరేసుకుంటూ కనిపించిన కూతుర్ని చూసి గుండెలదిరాయి. భర్తను లేపి, శిరీషను ముప్పు నుంచి తప్పించింది. విషయమేంటని నిలదీస్తే.. శిరీష చెప్పింది విని తల్లీతండ్రి తలలు పట్టుకున్నారు. పర్సనల్ ఫొటోలు పంపిస్తే.. ఫోన్ ఇంటర్వ్యూలోనే జాబ్‌కి ఎంపిక చేస్తారని రవి (పేరు మార్చడమైంది) అనే వ్యక్తి రోజూ ఫోన్ చేస్తుండేవాడు. కాల్ వచ్చిన ప్రతీసారి రిప్లై ఇవ్వమంటూ కోరాడు. చేసేది ఫ్రంట్ ఆఫీస్ జాబ్ కాబట్టి, అందంగా ఉండాలని చెప్పేవాడు. శిరీష అందంగా హీరోయిన్గా ఉండటం వల్లే ఈ జాబ్‌కి ఎంపిక చేసినట్టుగా చెప్పేవాడు. తక్కువ వ్యవధిలో బాగా తెలిసిన వ్యక్తిలా ఫోన్లోనే పరిచయం పెంచుకున్నాడు రవి. పర్సనల్ ఫొటోలు షేర్చేయమని చెప్పాడు. జాబ్ వస్తుందనే గ్యారెంటీ మీద రవి మీద నమ్మకంతో అతడు అడిగిన విధంగా ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేసింది శిరీష. ఆ మరుసటి రోజు నుంచే ఫొటోలను అడ్డు పెట్టుకొని రవి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. శిరీష పంపించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో విధి లేక అతను అడిగిన డబ్బును కొద్ది కొద్దిగా ఇస్తూ వచ్చింది. కానీ, ఇంటి పరిస్థితి బాగోలేకపోవడం, తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే వాళ్లేమవుతారో అని భయపడి చనిపోదామని నిర్ణయించుకుంది. 16 రాష్ట్రాలు.. 600 మంది యువతులు రిక్రూటర్‌గా నటించి దేశవ్యాప్తంగా 600 మంది మహిళలను మోసం చేసిన చెన్నైకి చెందిన టెక్కీని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. రాజ్ చెజియాన్ అనే వ్యక్తి రిక్రూటర్‌గా నటించి, 16 రాష్ట్రాలకు చెందిన యువతులను ఆకర్షించి, ఉద్యోగం నెపంతో వారి నగ్న, ప్రైవేట్ చిత్రాలను అతనితో పంచుకునేలా చేశాడు. ఎంక్వైరీలో మోసపోయిన యువతుల్లో హైదరాబాద్ నుండి కూడా 60 మంది ఉన్నట్టు గుర్తించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాల మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. అతను ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం మహిళలు అప్లై చేసుకున్న పోర్టల్‌ను చూసేవాడు. మహిళా ఉద్యోగుల అప్లికేషన్లు పెరుగుతుండటం గ్రహించి, ఈ పథకం వేశాడు. తప్పుడు పేరుతో ఫోన్ కాల్స్.. చేజియాన్ ఫైవ్ స్టార్ హోటల్ డైరెక్టర్ ప్రదీప్‌గా నటిస్తూ యువతులకు ఫోన్ కాల్స్ చేసేవాడు. మహిళలను ఇంటర్వ్యూలకు ఆహ్వానించి, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ నుండి పిలుపు కోసం ఎదురుచూడమని చెప్పేవాడు. ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం కాబట్టి అభ్యర్థి శరీర ఆకృతి గురించి సంస్థ నిబంధనలు పొందిపరిచి ఉందని, అందుకు వాట్సాప్ ద్వారా మహిళలను పలు కోణాల నుండి నగ్న చిత్రాలను పంచుకోవాలని కోరేవాడు. వీడియో కాల్ చేసి, సదరు మహిళను నగ్నంగా ఉండమని, ఆ దృశ్యాలను రికార్డు చేసేవాడు. చివరకు సైబర్ సేఫ్టీ ద్వారా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్దనున్న ల్యాప్‌టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో మహిళల నగ్న ఫోటోలు భద్రపరచి ఉండటం గమనించారు. ఈ చిత్రాలను అడ్డుగా పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు నిర్ధారించారు. ఉద్యోగ మోసాలు గుర్తించండిలా... ►అర్హత లేకపోయినా సులువుగా ఉద్యోగం ఇస్తాం అనే విషయాన్ని నమ్మకూడదు. ►వర్క్‌ఫ్రమ్ పేరుతో అధిక ఆదాయం ఎర చూపి, అర్హత లేకపోయినా ఇచ్చే ఉద్యోగాలు దాదాపుగా మోసపూరితమైనవే అని గుర్తించాలి. తక్కువ కష్టంతో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యోగం ఎందుకు ఇస్తున్నారు అని అనుమానించాలి. ►సోషల్ మీడియా మోసాలు అధిక ఆదాయానికి బదులుగా కొన్ని సరళమైన పనులు (ఫాలో, లైక్, షేర్, కామెంట్.. వంటివి) చేయటానికి ఆఫర్ ద్వారా బాధితుడు ఆకర్షితుడవుతాడు. ఇది కూడా తగదని గుర్తించాలి. ►కెరీర్ కన్సల్టింగ్ మోసాలలో రెజ్యూమ్ రైటింగ్, ఫార్వర్డింగ్, ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదా ఇతర వృత్తి సంబంధిత సేవలను ఆఫర్ చేస్తుంటారు. ►ఇంటర్వ్యూ అయిన వెంటనే సదరు ‘ఇంటర్వ్యూయర్’ మిమ్మల్ని సంప్రదించడం, ఆఫర్లు చెప్పడం చేస్తారు. ►ఇ–మెయిళ్ళు, టెలిఫోన్ సంప్రదింపుల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని అవతలి వారికి షేర్ చేయకూడదు. ►సాధారణ డేటా ఎంట్రీ ఉద్యోగమైనా చట్టపరమైన ఒప్పందంపై సంతకం చేయమని కోరండి. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫేండేషన్ ఫౌండర్ -
ఐఐటీయన్లకు కరోనా కష్టాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి భవిష్యత్తుకు ఆకాశమే హద్దు.. ప్రతిభ ఆధారంగా ప్రపంచస్థాయి ఐటీ కంపెనీల్లో ఉద్యోగం.. నెలకు ఊహించనంత వేతనం.. విలాసవంతమైన జీవనం.. అబ్బురపరిచే భవిష్యత్తు.. ఇవన్నీ కరోనా ముందటి మాట. ఇప్పుడు ఐఐటీయన్ల పరిస్థితి కరోనా దెబ్బకు మారిపోయింది. నెలకు లక్షల రూపాయల వేతనం ఆఫర్ చేసిన కంపెనీలు కరోనా ధాటికి ఆ ఆఫర్లను రద్దు చేసుకుంటున్నాయి. లేదంటే వాయిదా వేస్తూ కొన్నాళ్లు ఆగమంటున్నాయి. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓ విద్యార్థికి అమెరికాకు చెందిన ఓ ఐటీ కంపెనీ భారీ ఆఫర్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌లో విధుల్లో చేరాలి. కానీ కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. కొత్త ఉద్యోగాలు మాట పక్కన పెడితే అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడటమే గగనమైపోతోంది. దీంతో ఆ విద్యార్థి ఆఫర్‌ను సదరు కంపెనీ రద్దు చేసుకుంటున్నట్లు సమాచారమిచ్చింది. జూన్‌లో ఉద్యోగానికి వెళ్లాలని ఇప్పటికే సిద్ధమైన సదరు విద్యార్థి తన వీసా, ఇతర ఖర్చులకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. సాక్షి, హైదరాబాద్: పై రెండు సందర్భాలు భారతీయ మేధో సంపత్తికి అగ్ని పరీక్ష లాంటివే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దేశంలోని చురుకైన ప్రతిభావంతుల భవిష్యత్తును సంశయంలో పడేసింది. ఐఐటీలు, ఐఐఎంలలో చదువుకుని బ యటకొచ్చిన వారి బంగారు భవిష్యత్తును కరోనా వైరస్ కం గాళీలోకి నెట్టేసింది. 2019–20 విద్యా సంవత్సరంలో ఐఐటీ లు, ఐఐఎంల ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇప్పటికే ఆయా విద్యాసంస్థల్లో నిర్వహించిన క్యాంప స్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందారు. ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు, పలు రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు వారిని ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నట్టు ఆఫర్ లెటర్లు ఇచ్చా యి. రెండు నెలల క్రితమే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లు పూర్తి కాగా, సదరు విద్యార్థులు ఉద్యోగాల్లో చేరే సమయం కూడా ఆసన్నమవుతోంది. కరోనా కారణంగా ఇప్పుడు ఆ ఆఫర్లు సందిగ్ధంలో పడ్డాయి. భారీ వేతనంతో ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో వాటిని రద్దు చే సుకుంటున్నామని సమాచారమిస్తున్నాయి. మ రికొన్ని కంపెనీలు ఆఫర్లు రద్దు చేసుకోకపోయినా కొన్నా ళ్ల తర్వాత చెబుతామంటూ దాటవేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగా లు పొందిన వారిలో 40 మంది ఐఐటీయన్లు, 35 మంది ఐ ఐఎం విద్యార్థులకు ఇలాంటి సమాచారం వచ్చిందని తెలుస్తోంది. ఇంకా ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ ల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు పొందిన 50 వేల మంది భవిష్యత్తును కరోనా ఖతం చేసిందని అంచనా. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే యోచన: కేంద్ర మంత్రి ఐఐటీ క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు పొంది కరోనా కారణంగా ఆఫర్లు రద్దయిన వారికి ప్రత్యేక ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై దేశంలోని అన్ని ఐఐటీల డైరెక్టర్లతో మాట్లాడామన్నారు. సంక్షోభ సమయంలో దేశంలోని ప్రతిభావంతుల భవిష్యత్తుకు సాయం చేయాలని నిర్ణయిం చామన్నారు. ఆఫర్లను రద్దు చేసుకోవద్దని సోమవారమే ఆ యా కంపెనీలకు విజ్ఞప్తి చేసిన పోఖ్రియాల్.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించాలని 23 ఐఐటీల డైరెక్టర్లకు సూచించారు. కిం కర్తవ్యం? ఐఐటీ, ఐఐఎంల విద్యార్థులకు కంపెనీలు పెద్ద ఆఫర్లే ఇ స్తుంటాయి. వార్షిక వేతనం కింద కనీసం రూ.10 లక్షలు తక్కువ కాకుండా ఆఫర్ చేస్తుంటాయి. ఇప్పుడు అలానే పొందిన ఉద్యోగాలు దక్కకపోవడంతో ఈ ఏడాది పాసై న వారి పరిస్థితి గందరగోళంలో పడనుంది. ఐటీ రంగం లో పాసవుట్ల ప్రాతిపదికనే భవిష్యత్తు ఉంటుంది. అం దు నా ఐఐటీలు, ఐఐఎంల్లో అయితే అది ప్రాధాన్యతాం శం. ప్రస్తుత ఆఫర్ రద్దయితే వచ్చే ఏడాది పాసవుట్లకే ప్రాధాన్యం ఉంటుంది. దీంతో మళ్లీ క్యాంపస్ ప్లేస్మెం ట్స్ నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రద్దు చేసుకోకండి: ఏఐపీసీ ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం ముందుకొచ్చిన కంపెనీలు విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్లు రద్దు చేసుకోవద్దని ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) కోరింది. ఈ విషయమై ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రాంగోపాల్‌రావు ఇప్పటికే బహిరంగ విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఐఐటీలు ఒక వ్యక్తి, ఒక ఉద్యోగ అవకాశం అనే విధానాన్ని కచ్చితంగా పాటిస్తున్నాయని, ఈ సమయంలో కంపెనీలు ఆఫర్లు రద్దు చేసుకుంటే ఆ విద్యార్థులు ప్రస్తుతానికి ఉద్యోగాలు లేని వారిగా మిగిలిపోతారని గత వారమే ఆయా కంపెనీలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇది క్లిష్ట సందర్భమని అందరం అర్థం చేసుకోగలం. కానీ మీ వాగ్దానాలను ఉపసంహరించుకోకండి. మీ వాగ్దానం అమల్లోకి వచ్చేందుకు కొంత జాప్యం జరిగితే ఫర్వాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చురుకైన విద్యార్థుల జీవితాలను వివాదాస్పదం చేయకండి. ఈ మాంద్యం నుంచి మీరు ఊహించిన దాని కంటే ముందుగానే వారు మిమ్మల్ని బయటపడేయగల సమర్థులు’అని ఆయన పోస్ట్ చేశారు. -
బాబా రాందేవ్ భారీగా ఉద్యోగ ఆఫర్లు
న్యూఢిల్లీ : ఉద్యోగం కోసం వెతుకుతున్నారా....? అయితే ఈ అవకాశం అందిపుచ్చుకోడంట. ఎఫ్ఎంసీజీ రంగంలో వేగవంతంగా దూసుకెళ్తోన్న బాబా రాందేవ్ భారీగా ఉద్యోగ ఆఫర్లు ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 50వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని పతంజలి ఆయుర్వేద సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. తమ పతంజలి వ్యాపారాల్లో పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఈ సంస్థ బుధవారం ఈ ప్రకటన చేసింది. ప్రతి జిల్లాలో పతంజలి ఉత్పత్తులను నిర్వహించే బాధ్యతల కోసం సేల్స్‌మెన్ పోస్టులను ప్రకటించింది. ప్రతి జిల్లాలో 40 నుంచి 50 మంది వరకు సేల్స్‌మెన్‌ను నియమించుకోవాలని గ్రూప్ ప్లాన్ చేస్తోంది. ఫుడ్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఆశా పూజ ఐటమ్స్ వంటి పతంజలి బ్రాండుల్లో కూడా ఈ ఉద్యోగ అవకాశాలను ఆఫర్ చేస్తోంది. పతంజలి ఉద్యోగాలకు అర్హత : కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత, బీఏ/ఎంఏ/ఎంబీఏ. ఎఫ్ఎంసీజీ రంగంలో ఒకటి లేదా రెండేళ్ల అనుభవమున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత. ఎంపిక, శిక్షణ క్యాంప్‌ను 2018 జూన్ 23 నుంచి 27 తేదీల్లో నిర్వహిస్తారు. 2018 జూన్ 22 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. (రిజిస్ట్రేషన్ తప్పనిసరి) పతంజలి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా సేల్స్‌మెన్‌కు వేతనాలు చెల్లిస్తారు. ప్రతి జిల్లాలో 40 నుంచి 50 సేల్స్‌మెన్ కావాలి. హోమ్ డెలివరీ, రెడీ స్టాక్ సేల్స్‌కు 50 నుంచి 100 మంది యువత కావాలి. వేతనం నగరం, కేటగిరీ, అర్హత బట్టి రూ.8000 నుంచి రూ.15000 మధ్యలో ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ గురించి తమ అధికారిక కో-ఆర్డినేటర్‌ను లేదా ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్ల ద్వారా సంపద్రించాలని సూచించింది. ఈ ఉద్యోగానికి ఏ ఏజెంట్‌కు నగదు చెల్లించవద్దని తెలిపింది. -
టిసిఎస్‌లో ఉద్యోగ ఆఫర్లు
-
భారీగా ఉద్యోగ ఆఫర్లు: టీసీఎస్
బెంగళూరు : ఐటీ ఇండస్ట్రీలో ఓ వైపు నియామకాలు తగ్గిపోతూ ఉండగా... టెక్ దిగ్గజం టీసీఎస్ మాత్రం భారీగా ప్రెష్ గ్రాడ్యుయేట్లను తన కంపెనీలో చేర్చుకుంటోంది. ప్రెష్ గ్రాడ్యుయేట్లకు ఈ ఏడాది 20 వేల ఉద్యోగ ఆఫర్లు ఇచ్చామని, నాన్-ప్రెషర్లకు మరో 4000 జాబ్ ఆఫర్లు అందించామని టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఈ ఆఫర్లు అందుకున్న వారిలో 70 శాతం మంది కంపెనీలో చేరతారని అంచనావేస్తున్నామన్నారు. ఇంతకుముందు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిందన్నారు. జనవరి-ఫిబ్రవరి కాలంలో ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించినట్టు టీసీఎస్ గ్లోబల్ హ్యుమన్ రిసోర్సస్ అధినేత, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజోయేంద్ర ముఖర్జీ చెప్పారు. గతేడాది కూడా ఇన్నే ఆఫర్ లెటర్లను ఫ్రెషర్లకు ఇచ్చామని తెలిపారు. అయితే 2015లో కంపెనీ 40వేల ఆఫర్ లెటర్లను అందించింది. ఆ తర్వాత ఏడాది ఈ సంఖ్య 35 వేలకు పడిపోయింది. ఆటోమేషన్ కారణంతో ప్రస్తుతం ఐటీ రంగంలో నియామకాలు పడిపోతున్నప్పటికీ, ఈ ఆటోమేషనే కొత్త ఉద్యోగవకాశాలను కల్పిస్తుందని ముఖర్జీ చెప్పారు. కంపెనీలో ఉన్న ప్రస్తుత ఉద్యోగులకు కూడా భారీ ఎత్తున్న రీస్కిలింగ్ డ్రైవ్ చేపట్టామని, దీంతో కంపెనీ అవసరాల బట్టి జాబ్ రోల్స్‌ను కూడా మార్చుకునే అవకాశముందన్నారు. టీసీఎస్ ఇప్పటికే 3,95,000 మంది ఉద్యోగుల్లో 2,10,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చింది. ఈ రీస్కిలింగ్ డ్రైవ్, కంపెనీ మార్జిన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ముఖర్జీ చెప్పారు. గత కొన్నేళ్లుగా రీస్కిలింగ్ ప్రొగ్రామ్స్ చేపట్టడానికి తమ దగ్గర అవసరమైనంత పెట్టుబడులు ఉన్నాయని, బయట నుంచి తీసుకోవడం కంటే రీస్కిలింగ్ చేపట్టడమే మంచిదని తెలిపారు. డాలర్-రూపాయి మారకం విలువలో నెలకొన్న అనిశ్చితితోనే తమ ఆపరేటింగ్ మార్జిన్లు పడిపోయినట్టు ముఖర్జీ చెప్పారు. -
రూ.52 లక్షల వార్షిక వేతనం!
కోజికోడ్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–కోజికోడ్ (ఐఐఎం–కే) విద్యార్థులను భారీ ఆఫర్స్ వరించాయి. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఓ విద్యార్థికి అత్యధికంగా ఏడాదికి రూ.52లక్షల వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు రాగా మొత్తం విద్యార్థుల సరాసరి వేతనం రూ.17.76 లక్షలుగా ఉందని ఐఐఎం(కే) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది 382 మంది విద్యార్థుల బ్యాచ్‌లో అత్యధికంగా 367 మందిని డెలాయిట్, బీసీజీ, ఈవై, గోల్డ్‌మన్ సాక్స్, పీడబ్ల్యూసీ, ఆర్థర్ డీ లిటిల్, జేపీ మోర్గాన్ చేజ్ వంటి ప్రముఖ సంస్థలు ఎంపిక చేసుకున్నాయని తెలిపింది. మిగతా వారిలో 11 మంది ప్లేస్మెంట్ ప్రక్రియలో పాల్గొనలేదనీ, నలుగురు మాత్రం ఎంపిక కాలేదని వెల్లడించింది. ఈ ఏడాది క్యాంపస్ ఎంపికలకు అత్యధికంగా 178 కంపెనీలు పాల్గొన్నాయనీ, ఇది గత ఏడాది కంటే 58శాతం ఎక్కువని ఐఐటీ–కే తెలిపింది. -
పీజీ టెకీలకు భారీ ఆఫర్లు
సాక్షి,న్యూఢిల్లీ: ఐఐటీ పీజీ స్టూడెంట్లకు ఈ ఏడాది భారీ డిమాండ్ నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీల్లో వివిధ స్ధాయిల్లో పనిచేసేందుకు అభ్యర్ధుల వేటలో కంపెనీలు ఐఐటీల వైపు దృష్టి సారించాయి. ఈ ఏడాది చెన్నయ్, కాన్పూర్, రూర్కీ ఐఐటీల్లో పీజీ విద్యార్థులకు ఆఫర్లు 30 శాతం మేర పెరగ్గా, ప్రముఖ ఐఐటీల్లో పీజీ స్టూడెంట్లకు ఆఫర్లు 90 శాతం మేర పెరిగాయి.దశాబ్ధం కిందట ప్రారంభమైన ఐఐటీల్లో పీజీ స్టూడెంట్లకు ఆఫర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గాంధీనగర్ ఐఐటీలో ఆఫర్లు, టాప్ శాలరీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెండున్నర రెట్లు పెరగడం గమనార్హం. సహజంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పీజీ డిగ్రీ విద్యార్ధుల కంటే అండర్గ్రాడ్యుయేట్ విద్యార్ధులే ఎక్కువ శాతం జాబ్ ఆఫర్లను దక్కించుకుంటారు. అయితే టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, వ్యాపార ధోరణుల్లో మారిన వైఖరులతో ఈసారి పీజీ విద్యార్ధులను పెద్దసంఖ్యలో భారీ ప్యాకేజ్లతో జాబ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. సాంకేతిక బృందాలను పటిష్టం చేసుకోవాలని కంపెనీలు యోచిస్తుండటంతో పెద్దసంఖ్యలో పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ ఆఫర్లు వస్తున్నాయని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ అశోక్ పమిడి చెప్పారు. నూతన టెక్నాలజీల్లో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ పీజీ విద్యార్ధులతో పాటు హ్యుమనిటీస్ పీజీ విద్యార్ధులకూ మెరుగైన ఆఫర్లు వస్తున్నాయి. ఏ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనే దానిపై పీజీ విద్యార్ధులకు మెరుగైన అవగాహన ఉండటంతో కంపెనీలు వారి వైపు మొగ్గుచూపుతున్నాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక రీజినల్ కాలేజీల్లో రిక్రూట్మెంట్ చేపడుతున్న ఏఎండి ఇండియా హెడ్ (హెచ్ఆర్) కిరణ్మయి పెండ్యాల చెప్పారు. ల -
భారీ ప్యాకేజీలతో ఎగ్జిక్యూటివ్‌లకు జాబ్ ఆఫర్స్
ముంబై : మీ సీవీకి కాస్త మెరుగులు దిద్దండి.. లింక్డిన్ పేజీలో అప్డేట్ చేసేయండి. ఎందుకంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు స్టార్టప్‌లు గుడ్‌న్యూస్ అందిస్తున్నాయి. భారీ ప్యాకేజీలతో ఉద్యోగవకాశాలను ఆఫర్ చేస్తున్నాయి. కోట్ల రూపాయల వేతనం, వేరియబుల్స్, స్టాక్ ఆప్షన్లతో సీనియర్ స్థాయి ఉద్యోగులకు స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయని తాజా రిపోర్టులు తెలిపాయి. ఎమర్జింగ్ రంగంలో వచ్చే కొన్ని నెలల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆఫర్లు పెరుగనున్నాయని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. అప్‌గ్రాడ్, సింప్లీలెర్న్, టాపర్, పియర్సన్, ఎమెరిటస్ వంటి కంపెనీలు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు పెంచాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ అప్గ్రాడ్ను ప్రమోట్ చేస్తున్న ఎంటర్‌ప్రిన్యూర్ రోనీ స్క్రూవాలా ఇటీవలే నలుగురు సీనియర్ ఉద్యోగులను నియమించుకుంది. వారికి రూ.50 లక్షలకు పైగా ప్యాకేజీని ఆఫర్ చేసినట్టు తెలిసింది. మరో ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఎమెరిటస్ కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ముగ్గురు ఉద్యోగులను నియమించుకుందని, వారికి కూడా భారీగా వేతనాలు ఆఫర్ చేసినట్టు రిపోర్టులు తెలిపాయి. ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్పేస్‌లో నిధులు 2014లో 101.7 మిలియన్ డాలర్లుండగా.. 2015లో 126.4 మిలియన్ డాలర్లు, 2016లో 186.1 మిలియన్ డాలర్లకు పెరిగిందని ట్రాక్షన్ డేటా తెలిపింది. స్టార్టప్‌ల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్యోగాల ఆఫర్‌తో పాటు బ్యాంకింగ్, మానుఫ్రాక్ట్ర్చరింగ్, ఈకామర్స్ వంటి రంగాల్లో డేటా అనాలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఎక్కువ ఉద్యోగాలు ఉండనున్నాయని తెలిసింది. -
ఐఐటీ పాట్నా విద్యార్థికి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబయి: ఐఐటీల్లో ప్లేస్మెంట్లు ఊపందుకోవడంతో నూతనంగా ఏర్పాటైన ఐఐటీలకూ ఆఫర్లు, భారీ వేతన ప్యాకేజ్లతో రిక్రూటర్లు ముందుకొస్తున్నారు.గత ఏడాదితో పోలిస్తే నూతన ఐఐటీల్లోనూ అభ్యర్థులకు కంపెనీలు ఆఫర్ చేస్తున్న సగటు వేతనాలు భారీగా పెరిగాయి. నూతన ఐఐటీల్లో సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ ఇప్పటివరకూ అత్యధికంగా రూ 39.13 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. ఐఐటీ పాట్నాకు చెందిన విద్యార్థి ఈ భారీ వేతన ప్యాకేజ్‌ను అందుకున్నాడు. 2008-2009లో ఇండోర్, గాంధీనగర్, పాట్నా, మండీల్లో ప్రారంభమైన నూతన ఐఐటీలు ఈ ఏడాది మరికొన్ని దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. దీంతో గత ఏడాదికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు దక్కనున్నాయి. సగటు వేతనాల్లోనూ 6నుంచి 17 శాతం వరకూ వృద్ధి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది తాము ప్లేస్‌మెంట్స్ కోసం మరిన్ని కంపెనీలను సంప్రదిస్తున్నామని, గతేడాది 47 కంపెనీలు క్యాంపస్‌ను సందర్శిస్తాయని ఐఐటీ పాట్నా ట్రైనింగ్, ప్లేస్మెంట్ సెల్ ఇన్చార్జ్ అమర్నాథ్ హెగ్డే చెప్పారు.ఐఐటీ పాట్నా ఇప్పటికే తన బ్యాచ్‌లోని 65 శాతం మందికి పైగా అభ్యర్థులకు 117 ఆఫర్లను దక్కించుకుంది. ఐఐటీ మండీలో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల్లో 70 శాతం మందికి కొలువులు లభించాయని తెలిపారు. ఐఐటీ గాంధీనగర్ క్యాంపస్‌ను ఇప్పటి వరకూ గతేడాదితో పోలిస్తే 50 శాతం అధికంగా కంపెనీలు విజిట్ చేశాయని, జాబ్ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని కెరీర్ డెవలప్మెంట్ హెడ్ అభయ్ రాజ్ గౌతమ్ చెప్పారు. గతేడాది రూ ఏడు లక్షల సగటు వేతనం నుంచి ప్రస్తుతం రూ 7.45 లక్షలకు సగటు వేతనం పెరిగిందని తెలిపారు. ఐఐటీ ఇండోర్‌లోనూ రూ 17 లక్షల సగటు వార్షిక వేతనంతో ఇప్పటికే 74 ఆఫర్లు వచ్చాయి. తొలి దశలో నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ ప్లేస్మెంట్ లభించిందని ఐఐటీ ఇండోర్ ప్రతినిధి నిర్మలా మీనన్ చెప్పారు. -
‘వారిలో 20 శాతం మందికే ఉద్యోగాలు’
సాక్షి, న్యూఢిల్లీ: బిజినెస్ స్కూళ్లు ప్లేస్మెంట్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బిజినెస్ స్కూల్ విద్యార్ధుల్లో కేవలం 20 శాతం మందికే జాబ్ ఆఫర్లు వస్తున్నాయని పరిశ్రమ సంస్థ అసోచామ్ అంచనా వేసింది. ఈసారి ప్లేస్మెంట్ ఇయర్ ఇటీవల ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొందని ఆందోళన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు, నిరుత్సాహకర వ్యాపార వాతావరణం, నూతన ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి కారణాలతో బీ స్కూల్ విద్యార్ధులకు జాబ్ ఆఫర్లు తగ్గిపోయాయని అసోచామ్ అభిప్రాయపడింది. గత ఏడాది బీ స్కూల్ ప్లేస్మెంట్ 30 శాతంగా ఉంటే ఇప్పుడు 20 శాతం బీ స్కూల్ విద్యార్థులకే జాబ్ ఆఫర్లు పరిమితమయ్యాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వేతన ప్యాకేజీలు కూడా 40-45 శాతం తక్కువగా ఉన్నాయని వివరించింది. ఓ కోర్సుపై మూడు నాలుగేళ్ల సమయం వెచ్చించి రూ లక్షలు ఖర్చు చేయడంపై తల్లితండ్రులు, విద్యార్ధులు పునరాలోచిస్తున్నారని కూడా అసోచామ్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఏఈసీ) తెలిపింది. 400 విద్యా సంస్థల్లో తగినంత విద్యార్ధులు లేకపోవడంతో ఆయా సంస్థల మనుగడ ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో బీ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను తమ సంస్థల్లోకి ఆకర్షించలేకపోతున్నట్టు తమ అథ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. 2015 నుంచి ఇప్పటివరుకూ 250 పైగా బిజినెస్ స్కూళ్లు మూతపడ్డాయని వెల్లడించింది. -
ఉద్యోగాల పేరుతో గాలం..కోట్ల రూపాయలు టోకరా
-
ఆ విద్యార్థులకు సగటు వేతనం రూ.22లక్షలు
న్యూఢిల్లీ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) హైదరాబాద్ తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ విద్యార్థుల ఫైనల్ ప్లేస్ మెంట్లను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూటర్లను ఈ బీస్కూల్ 38 శాతం పెంచింది. దీనిలో భాగంగా మొత్తం 1,113 జాబ్ ఆఫర్స్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. సగటు వేతనం కింద రిక్రూటర్లు రూ.22 లక్షలను ఆఫర్ చేసినట్టు ఐఎస్బీ పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రైవేట్ రంగంలోనూ లీడర్ షిప్ పొజిషన్లకు విద్యార్థులు రిక్రూట్ అయినట్టు తెలిపింది. ఐఎస్బీ రిక్రూట్ మెంట్ సంస్థల్లో ఐటీ రంగ కంపెనీలే తొలిస్థానంలో నిలిచాయి. ప్రస్తుతం ఐటీ రంగం అనిశ్చితి పరిస్థితుల్లో కొనసాగుతున్నప్పటికీ, ఐఎస్బీ విద్యార్థులకు ఐటీ/ఐటీఈఎస్ రంగాలు మొత్తం ఆఫర్లలో 20 శాతం, 21 శాతం ఆఫర్లను ప్రకటించాయి. వీటి తర్వాత బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, ఫార్మా రంగాలు నిలిచినట్టు ఐఎస్బీ పేర్కొంది. 400కు పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ క్యాంపస్ ఆఫర్లలో పాల్గొన్నాయి. టాప్ రిక్రూటర్లుగా మెక్కిన్సీ అండ్ కంపెనీ, బీఎస్జీ, ఆపిల్, మైక్రోసాఫ్ట్, సిటీ బ్యాంకు, నోవర్టీస్, అమెజాన్, కాగ్నిజెంట్, హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్, జోన్స్ లాంగ్ లాసాల్లె, హవెల్స్, రెవిగో, పీ అండ్ జీ, లెండింగ్ కార్ట్, రిలయన్స్ జియో, మైండ్ ట్రీ కన్సల్టింగ్, రోనాల్డ్ బెర్జర్ లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది పబ్లిక్ అడ్వకసీ, స్ట్రాటజీ పోస్టులకు 21 జాబ్ ఆఫర్లను ఈ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేసింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, సిటీ బ్యాంకు, యస్ బ్యాంకు, ఫిల్లిప్స్ ఇండియా లిమిటెడ్, టెక్ మహింద్రా, మ్యాక్స్, గెన్ ప్యాక్ట్ సంస్థలు లీడర్ షిప్ పొజిషన్లనే ఐఎస్బీ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేశాయి. యాక్సిస్ బ్యాంకు, అశోక్ లేల్యాండ్ లు మహిళా గ్రాడ్యుయేట్లను తమ లీడర్ షిప్ పొజిషన్లకు ఎంపికచేసినట్టు ఐఎస్బీ చెప్పింది. కార్గిల్, ఆపిల్, ల్యాండ్ మార్క్ గ్రూప్, బేకరెంట్, క్రెడిట్ యాక్సిస్ ఆసియా వంటి అంతర్జాతీయ సంస్థలు తొలిసారి ఐఎస్బీ విద్యార్థులను తమ కంపెనీల్లో రిక్రూట్ చేసుకున్నట్టు ఐఎస్బీ హైదరాబాద్ పేర్కొంది. -
ఫేస్‌బుక్‌తో ఇక ఉద్యోగావకాశాలు!
పొద్దస్తమానం ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని చాటింగ్ చేయడం, లైకులు కొట్టడం ఇదే పనా అని పిల్లలను పెద్దవాళ్లు తిడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే ఫేస్బుక్ వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానని చెబుతోంది. దాంతో ఇక తల్లిదండ్రులే 'కాసేపు ఫేస్బుక్ చూడరా' అని చెప్పే పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం అమెరికా, కెనడాలలోని యువతీ యువకులు ఫేస్బుక్ నుంచే నేరుగా ఉద్యోగాలకు దరఖాస్తు కూడా చేసేసుకోవచ్చట. సాధారణంగా ఉద్యోగావకాశాల గురించి చెప్పే లింక్డ్ ఇన్, మాన్స్టర్ లాంటి సైట్లలో అకౌంట్లు లేని వాళ్లకు కూడా ఫేస్బుక్ అకౌంట్లు తప్పనిసరిగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కొత్తగా ఆలోచించింది. అకౌంటులో పేర్కొన్న వివరాలు, విద్యార్హతలు, వయసు తదితర అంశాల ఆధారంగా వాళ్లకు సరిపోయే ఉద్యోగాలు ఏవేం ఉన్నాయో డిస్ప్లే చేయడంతో పాటు.. అక్కడే దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించడం బాగా ఎక్కువైంది. తాము ఈ మార్గం ద్వారానే ఉద్యోగాలు పొందినట్లు అమెరికాలోని 1.44 కోట్ల మంది యువతీ యువకులు ఓ సర్వేలో తెలిపారు. మొత్తం కంపెనీలలో 73 శాతం తాము సోషల్ మీడియాను ఉపయోగించి విజయవంతంగా రిక్రూట్మెంట్లు చేసుకున్నట్లు చెప్పాయి. ఇక ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవాళ్లు కూడా ఏవో కారణాల వల్ల ఉద్యోగాలు మారాలని అనుకుంటారని, అలాంటి వాళ్లకు వాళ్ల అనుభవాన్ని బట్టి అదే రంగంలో కొత్త ఉద్యోగాలు ఏవేం ఉన్నాయో తెలియజేస్తామని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బాస్వర్త్ తెలిపారు. ఇటు ఉద్యోగాలు కావాలనుకునేవాళ్లతో పాటు మంచి ఉద్యోగులు కావాలని అనుకునేవాళ్లకు కూడా ఫేస్బుక్ ఒక మంచి అవకాశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మీడియా ద్వారా దరఖాస్తు చేసినప్పుడు వాళ్ల ప్రొఫైల్ ఎటూ తెలుస్తుంది కాబట్టి, వాళ్ల ఇష్టాయిష్టాలు, అభిరుచులు, ప్రవర్తన తదితర విషయాలను కూడా రిక్రూటర్లు తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఫేస్బుక్లో వచ్చే ఉద్యోగావకాశాలు అన్నీ ఒక లిస్టులా కనిపిస్తాయి. ప్రతిదాని పక్కన అప్లై నౌ అనే బటన్ ఉంటుంది. అది నొక్కితే చాలు.. అప్పటికే ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం ఆటోమేటిగ్గా ఫిలప్ అయి ఉంటుంది. వాటిలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే చేసి, అప్లోడ్ చేస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలతో పాటు పార్ట్ టైం ఉద్యోగాల గురించి కూడా ఇందులో చెబుతున్నారు. ఉదాహరణకు తమకు పియానో, గిటార్, సంగీతం నేర్పించేవాళ్లు కావాలని.. గంటకు 50 డాలర్లు చెల్లిస్తామని ఒక ప్రకటన ఈమధ్య వచ్చింది. ఇలా అన్నివర్గాలకూ ఫేస్బుక్ ఉద్యోగావకాశాలు బాగా పనికొస్తాయని అంటున్నారు. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్ త్వరలోనే భారతదేశంలో కూడా వచ్చేస్తుందని అనుకుంటున్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
శ్రీకాకుళం: ఐటీఐ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులంతా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ డిప్యూటీ డైరక్టర్ (విశాఖపట్నం) ఎం.గురునాథేశ్వరరావు సూచించారు. ప్రభుత్వ ఐటీఐ, డీఎల్టీసీ కార్యాలయంలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ అప్రంటీష్ షిప్ ట్రైనింగ్ అధికారి పి.ప్రేమ్‌చంద్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ఉద్దేశాలను వివరించారు. నైపుణ్యవంతమైన దేశంగా పేరు తీసుకురావాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సదస్సులో రీజనల్ ఎంప్లాయిమెంట్ అధికారి ఎ.ఉమాదేవి, జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కె.కామేశ్వరరావు, కన్వీనర్ ఆర్.కైలాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశాలు
శ్రీకాకుళం : కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డీడీయూ–జీకేవై పథకం ద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు రిటైల్ రంగంలో ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. మూడు నెలల శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం సదుపాయం కలదు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు అర్హులు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఈనెల 8వతేదీలోపు విశాఖపట్నంలోని ద్వారకానగర్ గోల్డ్ స్పాట్ బిల్డింగ్‌లో సంప్రదించాలి. మరిన్ని వివరాలకు 7032454555, 9985228575 నెంబర్లను సంప్రదించాలి. -
20 కంపెనీలపై ఐఐటీలు నిషేధం
న్యూఢిల్లీ : 20 స్టార్టప్, ఈ-కామర్స్ కంపెనీలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలు) నిషేధం విధించనున్నాయి. కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా ఈ కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నాయి. అధికవేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకోవడం వంటి ఘటనలపై సీరియస్‌గా స్పందించిన ఐఐటీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీల జాబితాను ఐఐటీల ప్లేస్మెంట్ కమిటీ(ఏఐసీసీ) ఇంకా వెల్లడించలేదు. బ్లాక్లిస్ట్తో పాటు ఆఫర్ లెటర్లు ఇచ్చి విత్ డ్రా చేసుకోవడం, ముందు ప్రకటించిన వేతనంలో కోత విధించడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి వరుస ఘటనల నేపథ్యంలో కంపెనీలు సీరియస్ వార్నింగ్ లెటర్లు కూడా అందుకోనున్నాయి. గతేడాది ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడిచినా స్పందించకపోవడంతో, ఆ కంపెనీ కూడా వార్నింగ్ లెటర్‌ను అందుకోనుందని తెలుస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ జాబ్ ఆఫర్లను పూర్తిగా ఉపసంహరించుకోకపోవడం వల్ల బ్లాక్‌లిస్ట్ విధించిన జాబితాలో ఉండకపోవచ్చని ఏఐపీసీ కన్వినర్ కౌస్తుబా మోహంతి అన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా జూమోటో కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కంపెనీలు ఇంకా స్పందించలేదు. క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో కంపెనీలు చేస్తున్న నిర్లక్ష్యపూరితమైన అంశాలపై ఐఐటీలు సీరియస్‌గా స్పందించాయని, ఏకగ్రీవంగా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ పెట్టడానికి ఆమోదించాయని చెప్పారు. ఐఐటీ కాన్పూర్‌లో 12 ఐఐటీలతో నిర్వహించిన 2017 ప్లేస్మెంట్ మీటింగ్‌లో ఏఐపీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఐఐటీ బొంబై ఈ మీటింగ్‌కు హాజరుకాలేదని మోహంతి చెప్పారు. -
ఐఐటీ ప్లేస్ మెంట్ కమిటీ బ్లాక్ లిస్ట్ లో ఆరు కంపెనీలు
ముంబై : అధిక వేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... ఉద్యోగాల్లో చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్న కంపెనీలపై ఐఐటీల ప్లేస్ మెంట్ కమిటీ(ఏఐపీసీ) సీరియస్ అయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో ఇటీవల నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) స్పందించింది. ఇకమీదట కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా అరు కంపెనీలను ఈ ఏడాది బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కంపెనీల్లో ఉద్యోగాల నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి వరుస ఘటనల నేపథ్యంలో ఏఐపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో శుక్రవారం భేటీ అయిన కమిటీ అరడజను కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్టు ప్రకటించింది. ఆఫర్ లెటర్లు ఇచ్చి విత్ డ్రా చేసుకోవడం, ముందు ప్రకటించిన వేతనంలో కోత విధించడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి మూడు కారణాలను పరిగణలోకి తీసుకుని ఈ బ్లాక్ లిస్ట్ ను విదించినట్టు ఐఐటీ మద్రాస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ అడ్వైజర్ వీ.బాబు తెలిపారు. అయితే ఏయే కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారో ఆ కంపెనీ వివరాలను వెల్లడించలేదు. ఏడాది పాటు ఈ కంపెనీలు ఐఐటీల్లో ప్లేస్ మెంట్లు నిర్వర్తించకుండా బ్లాక్ లిస్ట్ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవలే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో, ఐఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఐఐటీ గౌహతి క్యాంపస్ లో ఐదుగురు విద్యార్థులకు జింప్లీ సంస్థ, ఐఐటీ బొంబాయి క్యాంపస్ లో ఏడుగురు విద్యార్థులకు పోర్టియా అండ్ పెప్పర్ సంస్థ జాబ్ ఆఫర్లు ప్రకటించి, ఫిబ్రవరి మధ్యలో విత్ డ్రా చేసుకుంది. -
చదివింది మూడు.. మోసాల్లో పీజీ
బంజారాహిల్స్: మూడో తరగతి చదివిన ఓ యువకుడు మోటారు వెహికల్ ఇన్స్‌స్పెక్టర్ పోస్టులు ఇప్పిస్తానని డబ్బులు దండుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణాజిల్లా కలిగింగిడి మండలం సంతోష్‌పురం గ్రామానికి చెందిన మెండ్యాల తిరుపతయ్య అలియాస్ తిరుమలరాజు (33) శ్రీకృష్ణనగర్‌లో నివాసముంటూ నందగిరి హిల్స్‌లో ఉండే రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ చీఫ్ ట్రైనర్ వైపి రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన పామర్తి శ్రీనివాసరావు ఇటీవల పరిచయం కాగా, తనకు టీఎస్పీఎస్సీలో బాగా పరిచయాలు ఉన్నట్లు నమ్మించి ఏఎంవీఐ పోస్టు ఇప్పిస్తానని చెప్పి రూ. 40 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. మొదటి విడతగా రూ. 15,88 లక్షలు వసూలు చేశాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో శ్రీనివాసరావు పేరు కనిపించకపోవడంతో బాధితుడు వారిని నిలదీయగా మిగతా మొత్తం కూడా ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో తాను మోసయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తిరుపతయ్యతో పాటు అతనికి సహకరించిన ఎస్కె యాకూబ్అలీ అలియాస్ కోటేశ్వరరావు (31), మహ్మద్ అలీ (51), మీర్ అక్బర్ అలీ (51) లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
చనిపోయిన ఆ జర్నలిస్టు సోదరికి ఉద్యోగం
న్యూఢిల్లీ: వ్యాపం స్కాంకు సంబంధించి కవరేజ్‌కు వెళ్లి చనిపోయిన ఓ జర్నలిస్టు సోదరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగం ప్రకటించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆ జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించి ఇదే విషయం స్పష్టం చేశారు. జూలై 4 వ్యాపం కుంభకోణానికి సంబంధించి కవరేజ్‌కోసం వెళ్లిన అజ్ తఖ్ చానెల్ జర్నలిస్టు అక్షయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫలితంగా వారి కుటుంబం రోడ్డున పడినట్లయింది. దీంతో వారికి ఆర్థిక చేయూతనివ్వడంతోపాటు మనోధైర్యాన్నివ్వాలనే ఉద్దేశంతో తాము అక్షయ్ సింగ్ సోదరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని నిర్ణయించామని సిసోడియా తెలిపారు. -
డీఎస్సీ డౌటేనా?
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : డీఎస్సీ నోటిఫికేషన్ ‘గంట’ మోగేట్టు లేదు. అధికారంలోకి వచ్చాక ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి కానరావడం లేదు. స్పష్టత పేరుతో మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు డీఎస్సీకి మెలికపెట్టారు. బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అర్హులా? కాదా? అనే విషయమై స్పష్టత వచ్చాక డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ఆయన మాట మార్చారు. డీఎస్సీ ఉంటుందని పలుమార్లు ఆర్భాటంగా ప్రకటించిన మంత్రికి ఈ సంగతులు అప్పుడెందుకు తెలియలేదోనని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నేడూరేపూ అంటూ ఊరిస్తూ వచ్చిన డీఎస్సీ ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. డీఎస్సీపై కొండంత ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు పూర్తి కావస్తోంది. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బీఈడీ,డీఈడీ పూర్తిచేసుకున్న వేలాదిమంది డీఎస్సీ ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూశారు. అధికారుల ప్రతిపాదనల మేరకు జిల్లాకు మొత్తం 416 పోస్టులు కేటాయించా రు. వీటిలో ఎస్జీటీ 307, స్కూల్‌అసిస్టెంట్లు-57, లాంగ్వేజ్ పం డిట్స్-42, పీఈటీ-10 పోస్టులున్నాయి. రేషనలైజేషన్ విధానం పుణ్యమా అని పోస్టులు తగ్గిపోగా, కొన్నిపాఠశాలల మూతపడడం కూడా కారణంగా తెలుస్తోంది. ఈ విధానం లేకపోతే జిల్లాస్థాయిలో వెయ్యి నుంచి రెండు వేల పోస్టులు ఉండేవి. ఎక్కువ మంది అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవి. గత మూడేళ్లుగా డీఎస్సీ లేక పోవడంతో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగింది. ఎన్నికల హామీ పుణ్యమాని చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత డీఎస్సీ ఉంటుందని అందరూ భావించారు. ఈ మేరకు అధికారం చేట్టిన వెంటనే ముఖ్యమంత్రి డీఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆది నుంచి ప్రభుత్వం చిత్తశుద్ధితో డీఎస్సీ నిర్వహించేలా కనిపించలేదు. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల పోస్టులు ఉంటాయని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత వీటిని 10,200 పోస్టులకు కుదించినట్లు పేర్కొంది. ఇది జరిగిన తర్వాత సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ రోజు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆర్థిక శాఖ అనుమతులు కేవలం 7500 పోస్టులకే వచ్చాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అనంతరం మరో 5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని మంత్రి గంటా ప్రకటించి మరోమారు మాటలతో సరిపెట్టారు.అక్టోబర్ మాసం ముగుస్తున్నా ఆ ఊసే లేదు. మున్ముందుఇంకేం చెబుతారో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలు చూస్తే చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాటలతో సరిపెట్టేలా కనిపిస్తోంది తప్ప సకాలంలో డీఎస్సీ నిర్వహించేలా లేదు. -
కొలువుల వారధి.. సోషల్ మీడియా!
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం సందేశాలు, వినోదాత్మక అంశాలతో సరిపెట్టుకోకుండా ఉద్యోగార్థులకు, రిక్రూటర్లకు మధ్య వారధిలా పని చేస్తోంది. ఆన్లైన్ నెట్వర్కింగ్ కీలక జాబ్ సెర్చ్ టూల్‌గా మారిన తరుణంలో.. సోషల్ మీడియా మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. సమర్థులైన సిబ్బంది కోసం రిక్రూటర్లు సైతం సోషల్ మీడి యాను ఆశ్రయిస్తున్నారు. బెస్ట్ ప్రొఫైల్స్‌కు జాబ్ ఆఫర్లు అందిస్తున్నారు!! స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు కొనసాగించడానికి మాత్రమే సోషల్ మీడియా పరిమి తమవడం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగా న్వేషణలోనూ సహకరిస్తోంది. దీని సాయంతో కొలువుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువే. ఉద్యోగార్థుల్లో 65 శాతం మంది సోషల్‌మీడియానే తమ జాబ్‌సెర్చ్ టూల్‌గా ఉపయోగించుకుంటున్నా రని ఓ సర్వేలో తేలడం విశేషం. వృత్తి జీవితంలోనూ ఉన్నత స్థానాలు అధిరోహించడానికీ ఇది దోహదపడుతోంది. జాబ్ సెర్చింగ్! దాదాపు అన్ని కంపెనీలు ఫేస్బుక్, లింక్డ్ ఇన్, గూగుల్ ప్లస్ తదితర సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నాయి.తాజా సమాచారంతోపాటు ఖాళీల వివరాలను కూడా అందులో పేర్కొంటున్నాయి. వాటికి సంబంధించిన పేజీలను లైక్ చేయడం లేదా ఫాలో అవడం ద్వారా వాటి నెట్‌వర్క్‌లో భాగస్వాములవ్వొచ్చు. తద్వారా ఉద్యోగార్థులు కూడా ఎలాంటి శోధన లేకుండానే తాజా ఉద్యోగ సమాచారాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా సోషల్‌మీడియాలో ఉండే విభిన్న గ్రూప్‌ల్లో అభ్యర్థులు రిజిస్టర్ అవడం ద్వారా తమకు కావాల్సిన ఉద్యోగ సమాచారాన్ని మరింత సులభంగా పొందొచ్చు. వాటిల్లో కేటగిరీల వారీగా సమాచారాన్ని పోస్టు చేస్తారు. ఉదాహరణకు హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగాన్ని అన్వేషిస్తున్నవారు హెచ్ఆర్ జాబ్స్‌కు సంబంధించిన గ్రూప్‌లో రిజిస్టర్ అయితే సంబంధిత అప్డేట్స్ పొందుతారు. ఉద్యోగస్థులకూ ప్రయోజనం! ఉద్యోగాల్లో చేరి తర్వాత కూడా సోషల్ మీడియాను విస్మరించడంలేదు. తమ ప్రొఫెషనల్ కెరీర్లో ఎదుగుదలకు కూడా దీన్ని వినియోగించు కుంటున్నారు. ప్రస్తుత ఉద్యోగుల్లో 85 శాతం మంది సోషల్‌మీడియా సైట్లలో సభ్యులుగా ఉన్నారని అంచనా. వీరిలో 53 శాతం మంది కేవలం ప్రొఫెషనల్ కెరీర్ కోసం సోషల్ మీడియాలో సభ్యులుగా ఉండగా మిగతా 47 శాతం మంది సహచరులు, స్నేహితులు, బంధువులతో సంబంధాలు కొనసాగించడానికి సోషల్‌మీడియాను ఉపయోగించుకుంటున్నారు. లింక్డ్ ఇన్‌లో 35 శాతం, ట్విట్టర్ లో 7 శాతం, ఫేస్బుక్లో 15శాతం, గూగుల్ ప్లస్‌లో 13 శాతం, ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల్లో 12 శాతం మంది వృత్తి నేపథ్య కారణాలతో సభ్యులుగా ఉంటున్నారు. రోజులో ఒక గంట! ఎక్కువ మంది ఉద్యోగార్థులు లింక్డ్ ఇన్ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇప్పటికే వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారితో ‘కనెక్షన్స్’ ఏర్పరచుకుంటున్నారు. తరచుగా వారితో సంబంధాలు కొనసాగించడం ద్వారా ఉద్యోగా వకాశాలు మెరుగుపర్చుకోవచ్చని వారి భావన. ఉద్యోగులు సైతం తమ సోషల్ ప్రొఫైల్‌ను ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దుకుంటూ, ఉన్నత అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సామాజిక మాధ్యమం ద్వారా ఉద్యోగాల్లో చేరేవారు ఎక్కువే. రోజులో ఒక గంట సమయం ఈ సోషల్ సైట్లకు కేటాయిస్తున్నారు. రిక్రూట్మెంట్ విధానంలో సోషల్‌మీడియా విస్తృత ప్రాచుర్యం పొందుతోందని రిక్రూటర్లు సైతం పేర్కొంటున్నారు. అంచనా వేస్తారు: లింక్డ్ ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ తదితర నెట్వర్కింగ్ సైట్లు... ఉద్యోగ నియామకాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కంపెనీల అవసరాలకు తగిన ప్రతిభ, ప్రొఫైల్స్ ఉన్నవారిని వెతకడానికి ఈ మాధ్యమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సెలక్షన్ ప్రక్రియలో భాగంగా చివరి దశల్లో సోషల్‌మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అభ్యర్థుల ఇష్టాయిష్టాలు, అంకితభావం, వ్యక్తిత్వాన్ని కంపెనీలు అంచనా వేయడానికి సాయపడుతోంది. దాంతో ఉద్యోగ స్థాయికి తగిన అభ్యర్థులనే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. అప్డేట్ అవుతుండాలి! నిత్యం అప్డేట్ అవుతూ, కచ్చితమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచే సామాజిక ప్రొఫైల్స్కే రిక్రూటర్స్ ఆసక్తి చూపుతారు. సాధారణంగా వారు సోషల్ మీడియాలో అభ్యర్థుల సమాచారాన్ని పరిశీలించేటప్పుడు ఎక్కువ సమయాన్ని కేటాయించరు. ఒక్కో ప్రొఫైల్‌కు కేవలం రెండు లేదా మూడు నిమిషాల సమయాన్ని వెచ్చిస్తారు. కాబట్టి మొదటి చూపులోనే రిక్రూటర్ మెప్పును పొందేలా ప్రొఫైల్‌ను సిద్ధం చేసుకోవాలి. సమగ్ర వివరాలతో, సంక్షిప్తంగా ఉండేలా జాగ్రత్తపడాలి. సోషల్ మీడియాలో ఎలాంటి ఫైల్స్‌ను అప్లోడ్ చేస్తున్నారు? ఏయే అంశాలను స్నేహితులతో పంచుకుంటున్నారు? వాటి ద్వారా తమ అభిప్రాయాన్ని ఏ విధంగా వ్యక్తం చేయాలను కుంటున్నారు? అనే విషయాలపై స్పష్టత ఉండాలి. అభ్యర్థి పేరుతో సెర్చింగ్! ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలతోపాటు బ్యాంకింగ్ తదితర కంపెనీలు సైతం సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల ద్వారా ఉద్యోగులను పరిశీలిస్తున్నాయి. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవ డానికి చాలా వరకు కంపెనీలు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాయి. అభ్యర్థి పేరును ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సెర్చ్ చేస్తారు. లింక్డ్ ఇన్‌లో వారికి ఉన్న రికమెండేషన్లను, ట్విట్టర్లో ఫాలోయర్స్ సంఖ్యనూ గమనిస్తారు. ఫేస్బుక్ వాల్‌నూ పరిశీలిస్తారు. సోషల్ మీడియాతో ప్రయోజనం! ‘కంపెనీలు, ఉద్యోగులు, అభ్యర్థులకు మధ్య వివిధ స్థాయిల్లో సోషల్‌మీడియా ఉపయోగపడుతోంది. ఉద్యోగార్థులు జాబ్ సమాచారాన్ని పొందడం దగ్గర్నుంచి, కె రీర్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా మారుతోంది. వృత్తి నిపుణులు ఒకళ్లనొక ళ్లు సహకరించుకునేందుకూ ఇది ఉపకరిస్తోంది. ఆయా రంగాల్లోని వృత్తి నిపుణులతో, రిక్రూటర్లతో సోషల్ సంబంధాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. వివిధ కంపెనీల్లోని ఖాళీలు, నియామకాల సమాచారం అందరికంటే ముందుగా తెలిసే అవకాశం ఏర్పడుతుంది. అభ్యర్థుల సెలక్షన్‌లోనూ సోషల్ మీడియా ప్రముఖ పాత్ర వహిస్తోంది. కంపెనీలు అభ్యర్థుల ప్రొఫైల్‌నూ క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి. దాంతో వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంతోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలనూ పరిశీలిస్తున్నాయి. ఉద్యోగ నియామక ప్రక్రియ తుది దశలోనూ ప్రొఫైల్స్ సరిగ్గా లేనట్లయితే ఉద్యోగం చేజారే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి సోషల్‌మీడియా ఎన్ని అవకాశాలను అందిస్తుందో సరిగ్గా వినియోగించుకోకపోతే అంతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. - జి.ఆర్. రెడ్డి, ఫౌండర్ అండ్ చీఫ్ ఫెసిలిటేటర్, హ్యుసిస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్.