
సాక్షి, ముంబయి: ఐఐటీల్లో ప్లేస్‌మెంట్‌లు ఊపందుకోవడంతో నూతనంగా ఏర్పాటైన ఐఐటీలకూ ఆఫర్లు, భారీ వేతన ప్యాకేజ్‌లతో రిక్రూటర్లు ముందుకొస్తున్నారు.గత ఏడాదితో పోలిస్తే నూతన ఐఐటీల్లోనూ అభ్యర్థులకు కంపెనీలు ఆఫర్ చేస్తున్న సగటు వేతనాలు భారీగా పెరిగాయి. నూతన ఐఐటీల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్ ఇప్పటివరకూ అత్యధికంగా రూ 39.13 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. ఐఐటీ పాట్నాకు చెందిన విద్యార్థి ఈ భారీ వేతన ప్యాకేజ్‌ను అందుకున్నాడు.
2008-2009లో ఇండోర్, గాంధీనగర్, పాట్నా, మండీల్లో ప్రారంభమైన నూతన ఐఐటీలు ఈ ఏడాది మరికొన్ని దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నాయి. దీంతో గత ఏడాదికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్లు దక్కనున్నాయి. సగటు వేతనాల్లోనూ 6నుంచి 17 శాతం వరకూ వృద్ధి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది తాము ప్లేస్‌మెంట్స్ కోసం మరిన్ని కంపెనీలను సంప్రదిస్తున్నామని, గతేడాది 47 కంపెనీలు క్యాంపస్‌ను సందర్శిస్తాయని ఐఐటీ పాట్నా ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ సెల్ ఇన్‌చార్జ్ అమర్‌నాథ్ హెగ్డే చెప్పారు.ఐఐటీ పాట్నా ఇప్పటికే తన బ్యాచ్‌లోని 65 శాతం మందికి పైగా అభ్యర్థులకు 117 ఆఫర్లను దక్కించుకుంది.
ఐఐటీ మండీలో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల్లో 70 శాతం మందికి కొలువులు లభించాయని తెలిపారు. ఐఐటీ గాంధీనగర్ క్యాంపస్‌ను ఇప్పటి వరకూ గతేడాదితో పోలిస్తే 50 శాతం అధికంగా కంపెనీలు విజిట్ చేశాయని, జాబ్ ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని కెరీర్ డెవలప్‌మెంట్ హెడ్ అభయ్ రాజ్ గౌతమ్ చెప్పారు. గతేడాది రూ ఏడు లక్షల సగటు వేతనం నుంచి ప్రస్తుతం రూ 7.45 లక్షలకు సగటు వేతనం పెరిగిందని తెలిపారు.
ఐఐటీ ఇండోర్‌లోనూ రూ 17 లక్షల సగటు వార్షిక వేతనంతో ఇప్పటికే 74 ఆఫర్లు వచ్చాయి. తొలి దశలో నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ ప్లేస్‌మెంట్ లభించిందని ఐఐటీ ఇండోర్ ప్రతినిధి నిర్మలా మీనన్ చెప్పారు.