ఐఐటీ.. కొలువుల్లో మేటి! | This year IITs have record jobs | Sakshi
Sakshi News home page

ఐఐటీ.. కొలువుల్లో మేటి!

Published Wed, Jul 18 2018 1:40 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

This year  IITs have record jobs - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌:  ఈ ఏడాది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థుల పంట పండింది. వారిని నియమించుకునేందుకు కంపెనీలు క్యూ కట్టాయి. మునుపెన్నడూ లేని రీతిలో జూలై మొదటి వారం పూర్తయ్యే సరికి పాత ఐఐటీల్లో 99 శాతం, హైదరాబాద్, గాంధీనగర్, మండి, భువనేశ్వర్, రూపార్‌ వంటి పదేళ్ల క్రితం మొదలైన ఐఐటీల్లో 90 శాతం మేర విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. మామూలుగా ఐఐటీల్లో ఆగస్టులో క్యాంపస్‌ నియామకాలు మొదలై సెప్టెంబర్‌ దాకా జరుగుతాయి.

కానీ కంపెనీలు ఈసారి జూన్‌ చివరి వారం నుంచే నియామకాల ప్రక్రియను ప్రారంభించాయి. సాధారణంగా టాప్‌ రేటెడ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి విద్యార్థులను నియమించుకునే ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఈసారి ఐఐటీయన్ల కోసం పోటీ పడ్డాయి. టాప్‌ రేటెడ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో విద్యార్థులకు ఏడాదికి రూ.3.30 లక్షల వేతనం మాత్రమే ఆఫర్‌ చేస్తున్న ఈ కంపెనీలు ఐఐటీయన్ల వద్దకు వచ్చేసరికి రూ.7.5 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా ఆఫర్‌ చేశాయి.

డెలాయెట్, పబ్లిషైజ్, సాపినెట్, మహేంద్ర అండ్‌ మహేంద్ర కంపెనీలు పాత కాలేజీల కంటే కొత్త కాలేజీల్లో నియామకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. చెన్నై, ఖరగ్‌పూర్, ముంబై, ఢిల్లీ, కాన్పూర్, గౌహతి వంటి ఐఐటీల్లో క్యాంపస్‌ నియామకాల్లో పాల్గొన్న 99 శాతం మంది విద్యార్థులకు రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. అయితే ఈ క్యాంపస్‌లలో నియామకాలకు హాజరైన విద్యార్థుల సంఖ్య 60 నుంచి 70 శాతం లోపే కావడం విశేషం. మిగిలిన విద్యార్థులు స్టార్టప్‌ కంపెనీలు స్థాపించడమో లేదా ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడమో వంటి వాటికి ప్లాన్‌ చేస్తున్నారని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సీనియర్‌ టాలెంట్‌ ఆఫీసర్‌ ఒకరు చెప్పారు.

హైదరాబాద్‌ ఐఐటీయన్లకు భారీ వేతనాలు
హైదరాబాద్, భువనేశ్వర్, గాంధీనగర్, రూపార్‌ ఐఐటీల్లో విద్యార్థులకు అమెజాన్, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్, రిలయన్స్‌ జియో, మారుతి సుజుకీ భారీ వేతనాలు ఆఫర్‌ చేశాయి. హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థులు ఇప్పటివరకు 100 కంపెనీల నుంచి 268 ఉద్యోగ ఆఫర్లు పొందారు. ఇది గడచిన ఆరేడేళ్లలో రికార్డు. గతంలో మాదిరి కంపెనీలు విద్యార్థులకు ఆఫర్‌ చేస్తున్న మొత్తాలను బయటకు వెల్లడించకూడదని ఐఐటీ ప్లేస్‌మెంట్‌ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ హైదరాబాద్‌ ఐఐటీ విద్యార్థి ఒకరికి ఏడాదికి రూ.1.25 కోట్లు, అమెజాన్‌ కంపెనీ గాంధీనగర్‌ విద్యార్థికి రూ.1.05 కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలిసింది. గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ జూలై పదో తేదీ నాటికి 65 మంది ఐఐటీయన్లకు ఆఫర్‌ లెటర్లు ఇవ్వగా వారిలో కనిష్ట వేతనం రూ.65 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. ‘‘పాత ఐఐటీల్లో నియామకాలకు కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ రద్దీ తీవ్రంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అంతే సమానమైన టాలెంట్‌ ఉన్న నూతన ఐఐటీల్లో నియామకాలు చేపట్టాం’’అని డెలాయెట్‌ చీఫ్‌ టాలెంట్‌ ఆఫీసర్‌ ఎన్‌.వి.నాథన్‌ చెప్పారు.

మహేంద్ర అండ్‌ మహేంద్ర తాను తీసుకుంటున్న కొత్త ఇంజనీర్లలో 40 శాతం మందిని కొత్త ఐఐటీల నుంచే తీసుకుంటోంది. ఇంతకుముందు సంవత్సరాలలో ఈ కంపెనీ టాప్‌ రేటెడ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల నుంచి 85 శాతం, ఐఐటీల నుంచి 15 శాతం మాత్రమే తీసుకునేది. ‘‘మేం పాత ఐఐటీల నుంచి నియామకాలు బాగా తగ్గించాం. ఎందుకంటే వారు సంస్థలో చేరిన వెంటనే ఇతర కంపెనీలకు వలస పోతున్నారు. అందువల్ల కొత్త ఐఐటీయన్లపై దృష్టి సారించాం’’అని ఈ కంపెనీ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రాజేశ్వర్‌ త్రిపాఠి వ్యాఖ్యానించారు.

గతేడాది కంటే 18 శాతం ఎక్కువ వేతనం
హైదరాబాద్, గాంధీనగర్, మండీ, భువనేశ్వర్‌ ఐఐటీల్లోని విద్యార్థులకు కంపెనీలు బేసిక్‌ వేతనం గత ఏడాది కంటే 18 శాతం ఎక్కువగా ఆఫర్‌ చేశాయి. హైదరాబాద్, గాంధీనగర్‌ ఐఐటీల్లో ఈ ఏడాది ఇద్దరు విద్యార్థులకు ఇంటర్నేషనల్‌ కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్‌ చేశాయి. గాంధీనగర్‌లో గత సంవత్సరం ఏ ఒక్క విద్యార్థికి ఈ అవకాశం దక్కలేదు.

ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ దిగ్గజం శ్యామ్‌సంగ్‌ ఈ ఏడాది ఇప్పటికే 60 మంది ఐఐటీ విద్యార్థులకు భారీ వేతనాలు ఆఫర్‌ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన 24 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్నెట్‌ అప్‌ థింగ్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా, బయోమెట్రిక్స్‌ వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐఐటీ విద్యార్థులకు శ్యామ్‌సంగ్‌ ఉద్యోగాలు ఆఫర్‌ చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement