
డీఎస్సీ డౌటేనా?
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : డీఎస్సీ నోటిఫికేషన్ ‘గంట’ మోగేట్టు లేదు. అధికారంలోకి వచ్చాక ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి కానరావడం లేదు. స్పష్టత పేరుతో మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు డీఎస్సీకి మెలికపెట్టారు. బీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టులకు అర్హులా? కాదా? అనే విషయమై స్పష్టత వచ్చాక డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ఆయన మాట మార్చారు.
డీఎస్సీ ఉంటుందని పలుమార్లు ఆర్భాటంగా ప్రకటించిన మంత్రికి ఈ సంగతులు అప్పుడెందుకు తెలియలేదోనని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నేడూరేపూ అంటూ ఊరిస్తూ వచ్చిన డీఎస్సీ ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. డీఎస్సీపై కొండంత ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు పూర్తి కావస్తోంది. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా బీఈడీ,డీఈడీ పూర్తిచేసుకున్న వేలాదిమంది డీఎస్సీ ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూశారు. అధికారుల ప్రతిపాదనల మేరకు జిల్లాకు మొత్తం 416 పోస్టులు కేటాయించా రు. వీటిలో ఎస్‌జీటీ 307, స్కూల్‌అసిస్టెంట్లు-57, లాంగ్వేజ్ పం డిట్స్-42, పీఈటీ-10 పోస్టులున్నాయి. రేషనలైజేషన్ విధానం పుణ్యమా అని పోస్టులు తగ్గిపోగా, కొన్నిపాఠశాలల మూతపడడం కూడా కారణంగా తెలుస్తోంది. ఈ విధానం లేకపోతే జిల్లాస్థాయిలో వెయ్యి నుంచి రెండు వేల పోస్టులు ఉండేవి. ఎక్కువ మంది అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేవి.
గత మూడేళ్లుగా డీఎస్సీ లేక పోవడంతో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగింది. ఎన్నికల హామీ పుణ్యమాని చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత డీఎస్సీ ఉంటుందని అందరూ భావించారు. ఈ మేరకు అధికారం చేట్టిన వెంటనే ముఖ్యమంత్రి డీఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆది నుంచి ప్రభుత్వం చిత్తశుద్ధితో డీఎస్సీ నిర్వహించేలా కనిపించలేదు. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల పోస్టులు ఉంటాయని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత వీటిని 10,200 పోస్టులకు కుదించినట్లు పేర్కొంది. ఇది జరిగిన తర్వాత సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ రోజు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ తర్వాత ఆర్థిక శాఖ అనుమతులు కేవలం 7500 పోస్టులకే వచ్చాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అనంతరం మరో 5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని మంత్రి గంటా ప్రకటించి మరోమారు మాటలతో సరిపెట్టారు.అక్టోబర్ మాసం ముగుస్తున్నా ఆ ఊసే లేదు. మున్ముందుఇంకేం చెబుతారో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలు చూస్తే చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాటలతో సరిపెట్టేలా కనిపిస్తోంది తప్ప సకాలంలో డీఎస్సీ నిర్వహించేలా లేదు.