అమెరికా కలవరం.. డిపోర్టేషన్‌ పరేషాన్‌ | US deported 15756 illegal immigrants in 15 years | Sakshi
Sakshi News home page

అమెరికా కలవరం.. డిపోర్టేషన్‌ పరేషాన్‌

Published Sun, Feb 9 2025 3:48 AM | Last Updated on Sun, Feb 9 2025 3:48 AM

US deported 15756 illegal immigrants in 15 years

రూపాయి విలువ ఎక్కువున్న దేశానికి ఎందుకు వెళ్తాం? సంపాదించుకోవడానికి! చదువు పేరుతో వెళ్లినా అంతిమ లక్ష్యం అక్కడ కొలువు సాధించడమే! ఈ  ప్రస్తావన అమెరికా డిపోర్టేషన్‌ గురించే! స్టూడెంట్‌ వీసా మీదున్న వాళ్లు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేసుకోకపోతే కష్టం! అక్కడున్న చట్టాల ప్రకారం చదువుకునే క్యాంపస్‌  లోనే కొలువులు చేయాలి. అవి దొరకడం క్లిష్టం! 

క్యాంపస్‌కు ఆవల ఉద్యోగాలకు వెళితే డిపోర్టేషన్‌ ఖాయం! ఈ క్రమంలో అక్కడున్న భారతీయ కుటుంబాలు కొన్ని.. అవసరంలో ఉన్న స్టూడెంట్స్‌కి తమ ఇళ్లల్లో డొమెస్టిక్‌ హెల్ప్‌ ఉద్యోగాలను ఆఫర్‌  చేస్తున్నాయి. అవి చేయడం తప్పనిసరైతే భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని,  లీగల్‌ హెల్ప్‌ తీసుకుని అడుగేయడం మంచిది!

తెలంగాణకు చెందిన నేహా (పేరు మార్చాం) అమెరికాలో ఎమ్మెస్‌ చదువుతోంది. వాళ్లది వ్యవసాయ కుటుంబం. అందరి పిల్లల్లాగే తమ పిల్లలూ విదేశాల్లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నేహా తల్లిదండ్రుల ఆశ. అందుకే నేహా వాళ్ల అక్కను (యూకే), ఆమెను అప్పులు చేసి మరీ విదేశాలకు పంపారు చదివించడానికి. ఖర్చుల కోసం అమ్మా, నాన్న మీద ఆధారపడకూడదని చదువుతూనే పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ చేసుకుంటున్నారిద్దరూ. నేహా తన యూనివర్సిటీ దగ్గర్లోని సూపర్‌మార్కెట్‌లో సేల్స్‌ గర్ల్‌గా పనిచేసేది. 

ఆ ఏరియా పోలీసులు, ఇమిగ్రేషన్‌ సిబ్బంది ఆ సూపర్‌ మార్కెట్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న ఫారిన్‌ స్టూడెంట్స్‌ని తీసేయమని, లేదంటే ఆ షాప్‌ లైసెన్స్‌ రద్దవుతుందని యజమానికి వార్నింగ్‌ ఇచ్చారు. మరుక్షణమే నేహా జాబ్‌ పోయింది. ఖర్చులెలా? అప్పుడే నేహా స్నేహితురాలు ఆమెకు సబర్బ్‌లోని ఇండియన్‌ కమ్యూనిటీలో ఉన్న డొమెస్టిక్‌ హెల్పర్‌ కొలువు గురించి చెప్పింది. ‘వీకెండ్స్‌కి వెళ్లి ఇల్లు క్లీన్‌ చేయాలి. వాళ్లకు పిల్లలుంటే ఆడించాలి. గెట్‌ టు గెదర్స్‌కి అరెంజ్‌మెంట్స్‌ చేయాలి అంతే!’ అంటూ ఆ ఉద్యోగంలో చేయాల్సిన పనులను వివరించింది.  ‘పేమెంట్‌ ప్రామ్ట్‌గానే ఉంటుంది. మన ఐడెంటిటీ ఎక్కడా రివీల్‌ చేయర’నే అభయమూ ఇచ్చింది. మరో ఆప్షన్‌ లేదని మారు మాట్లాడకుండా ఓ గుజరాతీ కుటుంబంలో డొమెస్టిక్‌ హెల్పర్‌గా చేరింది నేహా.

ఇంకో స్టేట్‌లో...
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాలతి (పేరు మార్చాం) డిపెండెంట్‌ వీసా మీద అమెరికా వెళ్లింది. భర్తకు హెచ్‌1బీ ఉంది. ఆమె అక్కడ తమకు తెలిసిన వాళ్ల రెస్టరెంట్‌లో మేనేజర్‌గా పనిచేసేది. కానీ ఈ మధ్యే ఉద్యోగం మానేసింది. రెస్టరెంట్‌ ఓనర్‌ మీద ఇమిగ్రేషన్‌ అధికారుల ఒత్తిడి, డిపెండెంట్‌ వీసా మీద తాను ఉద్యోగం చేస్తున్నట్టు ఇమిగ్రేషన్‌ సిబ్బందికి తెలిస్తే తన భర్త హెచ్‌1బీ వీసా రద్దవుతుందేమోనన్న భయంతో! 

ఈ ఇద్దరే కాదు.. అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి.. అమెరికాలో విజిటింగ్‌ వీసా, స్టూడెంట్‌ వీసాల మీద ఆఫ్‌ క్యాంపస్‌ (వాళ్లు చదువుతున్న యూనివర్సిటీకి ఆవల) ఉద్యోగాలు చేస్తున్నవారు, డిపెండెంట్‌ వీసా మీద గుంభనంగా జాబ్స్‌ చేసుకుంటున్న వాళ్లందరి పరిస్థితి అలాగే ఉంది. కారణం.. వర్క్‌ పర్మిట్‌ లేకుండా ఫుల్‌ టైమ్‌ జాబ్స్‌ చేస్తున్నవారిని, అనుమతి లేని ప్రదేశాల్లో పార్ట్‌ టైమ్‌కి కుదిరిన వారిని, చట్టవిరుద్ధంగా ఆ దేశంలోకి చొరబడిన వారిని వెనక్కి పంపే కార్యక్రమాన్ని ట్రంప్‌ కఠినంగా అమలు చేస్తున్నాడు.

 పాస్‌పోర్ట్‌లో ఒక్కసారి డిపోర్టెడ్‌ అని ముద్ర పడితే మళ్లీ ఆ దేశానికి విమానమెక్కే చాన్స్‌ ఉండదు. ఆ స్థితికి రావద్దని   ప్రయత్నించని వారులేరు. అందుకే అది పాచి పనా.. ఇంకోటా అని చూడకుండా, పని చోట భద్రత ఉందా? రక్షణ ఎంత? అని ఆలోచించకుండా  తాము పనిచేస్తున్నట్టు అమెరికన్‌ గవర్నమెంట్‌కు తెలియకపోతే చాలు అనుకుంటూ దొరికిన పనిలో చేరిపోతున్నారు! అమెరికా అంతటా ఇలాంటి పరిస్థితే లేదని, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు గెలిచిన రాష్ట్రాల్లోనే డిపోర్టేషన్‌ కఠినంగా ఉందని చెబుతున్నారు అక్కడుంటున్న తెలుగువాళ్లు కొందరు. 

ఇలా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వాళ్లను సొంత దేశాలకు పంపించేయడం ఇదే మోదటిసారి కాదని, ఆందోళనలు.. భయాలు కొత్తేం కాదని తేలిగ్గా తీసుకుంటున్న అమెరికా పౌరసత్వం పొందిన భారతీయులూ ఉన్నారు. అయితే ఈ డిపోర్టేషన్‌ను ఆసరాగా తీసుకుని తక్కువ జీతానికే భారతీయ విద్యార్థుల చేత ఇంటి పనులు, దుస్తుల ఇస్త్రీ, తోట పని, కార్లు తుడిపించడం, పిల్లలను ఆడించడం వంటి బండెడు చాకిరీ చేయించుకుంటున్నారని వాపోతున్నవారూ ఉన్నారు. ఏమైనా సరే.. పరాయి దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ల చట్టాలను గౌరవించడం, ఆ ప్రకారం నడుచుకోవడం తప్పనిసరని చెబుతున్నారు న్యాయసలహాదారులు.

ఇది తెలుసుకోండి
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత 15 ఏళ్లుగా 15,000కి పైగా భారతీయులను అమెరికా ప్రభుత్వం డిపోర్ట్‌ చేసింది. చట్టవిరుద్ధంగా  ఆ దేశంలోకి ప్రవేశించినవారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొని గౌరవంగా వెనక్కి రావచ్చు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న మన పౌరుల్లో అక్కడ చదువుకున్నవారు, పెళ్లి చేసుకుని డిపెండెంట్‌ వీసా మీద వెళ్లి తర్వాత కుటుంబ కారణాల రీత్యా విడాకులు తీసుకున్నవారు, గృహహింసకు గురైనవారే ఎక్కువ. వీరు స్వచ్ఛందంగా  తమ వీసా స్టేటస్‌ను మార్చుకుంటే అమెరికాలోనే ఉండవచ్చు. భర్త వేధింపులకు గురైన అమ్మాయిలు చాలామంది స్టూడెంట్‌ వీసాకి మారి చదువుకుంటూ అక్కడే ఉండిపోతున్నారు. కొన్ని నేరాలలో విక్టిమ్స్‌ అయితే వీసాకు అర్హులవుతారు. ఇలా వారికి అర్హత ఉన్న వీసా తీసుకొని అక్కడే ఉండిపోవచ్చు.

అక్కడే ఉండాలనుకునేవారు చేయవలసిన పనులు
1.    ఆ దేశ కోర్టును ఆశ్రయించి, పరిస్థితులను వివరిస్తూ, ఆ దేశంలో ΄పౌరసత్వం కోసమో లేక వీసా కోసమో చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే మానవీయ కోణంలో కొంత గడువు కోరడం. 
2.    కొన్ని ప్రత్యేక కేసులలో.. ఏదైనా అమెరికా సంస్థ నుంచి ఉద్యోగావకాశం ఉందని చూపించగలిగితే వీసా గడువు తర్వాత కూడా మరలా వీసా వచ్చేంతవరకు ఉండొచ్చు. 
3.    అమెరికా ΄పౌరసత్వం లేదా శాశ్వత నివాసం (పర్మనెంట్‌ రెసిడెన్సీ) గల వ్యక్తి కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు అయ్యుండి, సదరు ΄పౌరుడిచే లేదా అతని కుటుంబ సభ్యులచే గృహహింసకు లోనయ్యుంటే వయొలెన్స్ అగైన్‌స్ట్‌ విమెన్‌ యాక్ట్‌ (Vఅగిఅ) కింద.. గృహహింసకు గురిచేసిన వ్యక్తికి తెలియకుండానే గ్రీన్‌ కార్డు ΄పొందవచ్చు. 
4. ప్రత్యేక పరిస్థితుల్లో ఆశ్రయం కోరవచ్చు. వీటన్నిటి కోసం ముందుగా మంచి ఇమిగ్రేషన్‌ అటార్నీ (లాయర్‌)ని కలవాలి. ఏజెంట్ల ద్వారా వెళ్తే మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇమిగ్రేషన్‌ చట్టం సులభంగా అర్థమయ్యేది కాదు కాబట్టి నిపుణుల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది

 

– సరస్వతి రమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement