Indian families
-
ఇంటి కంటే రెస్టారెంట్ పదిలం
వీకెండ్ వచ్చిందంటే చాలు భార్యా పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సరదా సరదాగా షాపింగ్ చేసి మల్టీప్లెక్స్‌లో మూవీ చూసి, తర్వాత రెస్టారెంట్లో ఇష్టమైన ఫుడ్ లాగిస్తేనే భారతీయులకు అదో తుత్తి. ఒకప్పడు బయట హోటల్స్‌కు వెళ్లాలంటే బర్త్‌డే, మ్యారేజ్‌డే ఇలా ఏదో ఒక ఫంక్షన్ ఉంటేనే వెళ్లేవారు. ఇప్పుడు భారతీయుల మైండ్ సెట్ మారింది. శని ఆదివారాలు ఎన్ని రకాల వినోదాలున్నా హోటల్‌కి వెళ్లి చేతులు కడగవలసిందే. ప్రతీ నెలలో కనీసం ఏడుసార్లు భారతీయ కుటుంబాలు రెస్టారెంట్లలో తినడానికే ఇష్టపడుతున్నారని నేషనల్ రెస్టారెంట్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సర్వేలో తేలింది. దీని కోసం భారతీయులు నెలకి సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక స్విగ్గీలు, జోమాటో, యూబర్ ఈట్స్ వంటి యాప్‌లు వచ్చాక హోటల్ నుంచి ఇంటికి తెప్పించుకోవడాలు పెరిగిపోయాయి. అలా దేశ ప్రజలు నెలకి సగటున 6.6 సార్లు బయట తిండే తింటున్నారు. ఫుడ్ ట్రక్లు, ఫుడ్ పార్క్స్ , టేక్ ఎవేలు, హోమ్ డెలివరీలు అందుబాటులోకి వచ్చాక, ఆతిథ్య రంగం కొత్త దారి పట్టిందని, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే ఇంటి భోజనమనే భావన వస్తే ఇంటి కన్నా రెస్టారెంట్లకి రావడానికే జనం ఇష్టపడుతున్నారని ఢిల్లీకి చెందిన రెస్టారెంట్ యజమాని అనురాగ్ కటియార్ వెల్లడించారు. నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ బయట నుంచి తెప్పించుకునే తిండి తినేకంటే, కాస్త ఆరుబయట గాలి పీల్చుకుంటూ రెస్టారెంట్లో యాంబియెన్స్‌ను ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా తినడానికే 80 శాతం మంది భారతీయులు ఇష్టపడుతున్నారని ఎన్ఆర్ఏఐ సర్వేలో తేటతెల్లమైంది. ఎవరి టేస్ట్ వాళ్లదే రకరకాల ఘుమాయించే వంటకాలు,విభిన్న రుచులు, వైవిధ్యమైన డిషెస్ ఇప్పుడు ప్రతీచోటా దొరుకుతున్నాయి. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్.. ఢిల్లీ వాసులకి స్థానికంగా దొరికే ఆహారం పట్ల మోజు లేదు. నార్త్ ఇండియన్ ఫుడ్ చూస్తేనే వారికి నోరూరుతుంది. బెంగుళూరులో దక్షిణాది వంటకాలపై అంతగా మోజు లేదు. నార్త్ ఇండియన్ మీల్స్, హైదరాబాదీ బిర్యానీలనే ఇష్టపడతారు. ఇక వెరైటీ రుచుల్ని ఆస్వాదించడంలో ముంబైకర్ల తీరే వేరు. దక్షిణాది రుచులకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు, దోసె, ఇడ్లీలను అత్యంత ఇష్టంగా లాగిస్తారు. ఇతర దేశాల వంటకాల్లో 33% మంది ఇటాలియన్ ఫుడ్ అంటే పడిచచ్చిపోతే, 29% మందికి చైనీస్ ఫుడ్ తింటేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తప్ప ఎంతకని ఆ బయట తిండి తింటాం, ఇంట్లో చారు అన్నం తిన్నా అదే అమృతంలా అనిపిస్తుంది కదా అని 20శాతం మంది అభిప్రాయపడినట్టుగా సర్వేలో తేలింది. -
ఇర్మా బాధిత భారత కుటుంబాలకు అటా చేయూత
అమెరికాలో ఇటివల హరికేన్ ఇర్మా ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం విదితమే. ఆ రాష్ట్రంలోని ప్రవాస భారతీయులు చాలామంది ఆ తుఫాను తాకిడికి లోనయ్యారు. కేటగిరీ -5 గా వర్గీకరించిన ఇర్మా అమెరికాకి కలిగించిన నష్టం బిలియన్లలో ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.అయితే వందలాది ప్రవాస భారతీయులు తుఫాన్‌కు గురవుతున్న విషయాన్ని అమెరికా తెలుగు సంఘం(అటా) ముందుగానే గ్రహించి వెంటనే రంగంలోకి దిగింది. అధికారిక తుఫాను హెచ్చరిక, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఉత్తర్వులు వెలువడిన వెంటనే అటా సేవా జట్టు అవసరమైన పనులను చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి పర్యవేక్షణలో, టెన్నిస్సీ,అలబామ రాష్ట్రాల ప్రాదేశిక శాఖల సహాయంతో శివకుమార్ రామడుగు అటా సేవా జట్టుకు నేతృత్వం వహించారు. అట్లేంటాకే చెందిన కిరణ్ పాశం, అనిల్ బోద్ధిరెడ్డి, వేణు పిసికే, తిరుమల పిట్టా, ప్రశాంత్ పొద్దుటూరి, శ్రీధర్ తిరుపతి, రామకృష్ణా రెడ్డి ఈ పనులలో కీలక పాత్ర పోషించారు. బాధితులకు సహాయం చేసేందుకు అటా జట్టు ఒక పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులోనే భాగంగా ఏర్పడ్డ ఏక్షన్ టీం ముందుగా ఒక హెల్ప్‌లైన్ నెలకొల్పి, సోషల్ మీడియా, బంధు మిత్ర వర్గాల ద్వారా ఫ్లోరిడాకు చేరవేసింది. ఇది కాక అట్లాంటా, నాష్విల్, అలబామలో నివాసముంటున్న అటా సభ్యులకు విషయాన్ని తెలియజేసి వారి ఇండ్లలో బాధితులకు నివాసం కల్పించే ఏర్పాట్లు కూడా ఆటా చేసింది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ఇతరుల వర్గీకరణ పనులను త్వరగా పూర్తిచేసి సమయానికి నిర్వాసితులకు సహాయ సహకారాల్ని అందించగలిగింది. అమెరికాలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా అట్లంటాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్వచ్చందంగా మంచి మనసుతో ఆపదలో ఉన్న సాటి భారతీయులకు స్వాగతం పలకడంలో సఫలీకృతులయ్యారు. కేవలం తెలుగువారికే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు సమస్త ప్రవాస భారత ప్రజానీకానికి సహాయ సహకారాలు అందించిన అటా సేవ టీం పలువురి ప్రశంసలందుకుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా వేయి మంది నిర్వాసితులకు ఆశ్రయం కల్పించారు. ఒక వ్యక్తి ఏకంగా 12 కుటుంబాలకు చెందిన 33 మందికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. ఇటువంటి సేవ అటాకే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. నిర్వాసితులు అటాకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో అమెరికాలోని భారతీయ రాయభార కార్యాలయం తమ అధికారులను ఆప్రమత్తం చేసింది. అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్ నగరం నుంచి కన్సులేట్ జనరల్ శ్రీ హుటాహుటీన అట్లాంటా నగరం చేరుకుని సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. అమెరికా తెలుగు సంఘం కొన్ని వందల మంది భారతీయులకు సంఘం సభ్యుల, వారి మిత్రుల ఇండ్లలో నివాసం కల్పించడాన్ని కొనియాడారు. ఈ సహాయ కార్యక్రమాలని గుర్తించిన స్థానిక పోలీసు వ్యవస్థ, జార్గియా రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ విభాగ అధికారులు ఫ్లొరిడా నుంచి వారిని స్వయంగా కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చిన సహాయం చేయటానికి ముందుంటామని, వారిని సంప్రదించాల్సిందిగా అమెరికా తెలుగు సంఘం సభ్యులను కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందించి వెళ్ళారు. ఫ్లొరిడా నుండి వచ్చిన మన భారతీయులకు అవసరమైన భోజన సౌకర్యాలు టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ యాజమాన్యం కల్పించింది. వారి బాంక్వెట్ హాల్ని 5 రోజులపాటు 24 గంటలు అటాకి సహాయం అందించడంలొ ప్రధాన పాత్ర వహించారు. శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్, బావర్చి రెస్టారెంట్, కాకతీయ రెస్టారెంట్ వారు భోజనం సమకూర్చడంలో ప్రధాన భూమిక వహించారు. వీరితో పాటు ఉత్తర భారతనికి చెందిన మిత్రులు సీమ గార్గ్, వినీత్ గార్గ్ ల ఆధ్వర్యంలో వారి ఇండ్లలో వంటలు వండి అందించారు. అలానే ఫ్లోరిడా మిత్రులు తిరిగి వెళ్ళే సమయంలో దారిలో తినేందుకు ఆహార పదార్థాలు, పండ్లు, పాలు, బ్రెడ్, కేకులను, మంచి నీటిని అందించి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బోజనాన్ని వడ్డించేందుకు "విటి సేవ" కి చెందిన కార్యకర్తలు అన్నివేళలా ముందుండి వారి సహకారాన్ని అమెరికా తెలుగు సంఘానికి అందించారు. -
అమెరికా వీడి.. మీ దేశానికి వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో వరుసగా జాతి వివక్ష దాడులు జరుగుతుండటం.. శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీష్ పటేల్ దారుణ హత్యకు గురికావడం.. దీప్ రాయ్ సహా పలువురిపై దాడులు జరగడంతో ప్రవాస భారతీయులు అభద్రత భావానికి గురవుతున్నారు. శ్వేతజాతి వారి నుంచి.. విడిచి మీ దేశానికి వెళ్లిపోండి వంటి మాటలతో ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రం దబ్లిన్లోని కారా పార్క్ కమ్యూనిటీలో ప్రవాస భారతీయులు సాయంత్రం వేళల్లో కలుసుకునేవారు. వీరిలో చాలావరకు హెచ్ 1 బీ వీసా కలిగిన వారే. పార్క్‌లో పిల్లలను ఆడించేవారు. కాసేపు సరదాగా క్రికెట్ ఆడేవారు. భారత వంటకాలు, అమెరికాలో జీవితం గురించి ముచ్చట్లు చెప్పుకునేవారు. ఇదంతా గతం. ఇప్పుడు వారిలో ఆ సంతోషం మాయమైంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన. అభద్రతాభావం. బయటకు రావాలంటే భయపడుతున్నారు. క్రికెట్, ముచ్చట్లు బంద్ చేశారు. స్థానిక శ్వేతిజాతి వారికి తాము టార్గెట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. శ్వేతిజాతి వాళ్లు తమను మీ దేశానికి వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నారని, జాతివివక్షతో దూషిస్తున్నారని భారతీయులు వాపోయారు. రెండు దశాబ్దాలుగా ఒహియోలో ఉంటున్న మరో భారతీయుడు ఇలాంటి పరిస్థితి తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పాడు. ఓ యువకుడు తనను మీ దేశానికి వెళ్లిపో అంటూ హేళనగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు శ్వేతిజాతి దుండగులు భారతీయులను దూషిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అక్కడక్కడా భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు.