అమెరికాలో ఇటివల హరికేన్ ఇర్మా ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం విదితమే. ఆ రాష్ట్రంలోని ప్రవాస భారతీయులు చాలామంది ఆ తుఫాను తాకిడికి లోనయ్యారు. కేటగిరీ -5 గా వర్గీకరించిన ఇర్మా అమెరికాకి కలిగించిన నష్టం బిలియన్లలో ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.అయితే వందలాది ప్రవాస భారతీయులు తుఫాన్‌కు గురవుతున్న విషయాన్ని అమెరికా తెలుగు సంఘం(అటా) ముందుగానే గ్రహించి వెంటనే రంగంలోకి దిగింది.
అధికారిక తుఫాను హెచ్చరిక, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఉత్తర్వులు వెలువడిన వెంటనే అటా సేవా జట్టు అవసరమైన పనులను చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి పర్యవేక్షణలో, టెన్నిస్సీ,అలబామ రాష్ట్రాల ప్రాదేశిక శాఖల సహాయంతో శివకుమార్ రామడుగు అటా సేవా జట్టుకు నేతృత్వం వహించారు. అట్లేంటాకే చెందిన కిరణ్ పాశం, అనిల్ బోద్ధిరెడ్డి, వేణు పిసికే, తిరుమల పిట్టా, ప్రశాంత్ పొద్దుటూరి, శ్రీధర్ తిరుపతి, రామకృష్ణా రెడ్డి ఈ పనులలో కీలక పాత్ర పోషించారు.
బాధితులకు సహాయం చేసేందుకు అటా జట్టు ఒక పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులోనే భాగంగా ఏర్పడ్డ ఏక్షన్ టీం ముందుగా ఒక హెల్ప్‌లైన్ నెలకొల్పి, సోషల్ మీడియా, బంధు మిత్ర వర్గాల ద్వారా ఫ్లోరిడాకు చేరవేసింది. ఇది కాక అట్లాంటా, నాష్విల్, అలబామలో నివాసముంటున్న అటా సభ్యులకు విషయాన్ని తెలియజేసి వారి ఇండ్లలో బాధితులకు నివాసం కల్పించే ఏర్పాట్లు కూడా ఆటా చేసింది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ఇతరుల వర్గీకరణ పనులను త్వరగా పూర్తిచేసి సమయానికి నిర్వాసితులకు సహాయ సహకారాల్ని అందించగలిగింది.
అమెరికాలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా అట్లంటాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్వచ్చందంగా మంచి మనసుతో ఆపదలో ఉన్న సాటి భారతీయులకు స్వాగతం పలకడంలో సఫలీకృతులయ్యారు. కేవలం తెలుగువారికే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు సమస్త ప్రవాస భారత ప్రజానీకానికి సహాయ సహకారాలు అందించిన అటా సేవ టీం పలువురి ప్రశంసలందుకుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా వేయి మంది నిర్వాసితులకు ఆశ్రయం కల్పించారు. ఒక వ్యక్తి ఏకంగా 12 కుటుంబాలకు చెందిన 33 మందికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. ఇటువంటి సేవ అటాకే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. నిర్వాసితులు అటాకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు.
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో అమెరికాలోని భారతీయ రాయభార కార్యాలయం తమ అధికారులను ఆప్రమత్తం చేసింది. అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్ నగరం నుంచి కన్సులేట్ జనరల్ శ్రీ హుటాహుటీన అట్లాంటా నగరం చేరుకుని సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. అమెరికా తెలుగు సంఘం కొన్ని వందల మంది భారతీయులకు సంఘం సభ్యుల, వారి మిత్రుల ఇండ్లలో నివాసం కల్పించడాన్ని కొనియాడారు.
ఈ సహాయ కార్యక్రమాలని గుర్తించిన స్థానిక పోలీసు వ్యవస్థ, జార్గియా రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ విభాగ అధికారులు ఫ్లొరిడా నుంచి వారిని స్వయంగా కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చిన సహాయం చేయటానికి ముందుంటామని, వారిని సంప్రదించాల్సిందిగా అమెరికా తెలుగు సంఘం సభ్యులను కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందించి వెళ్ళారు.
ఫ్లొరిడా నుండి వచ్చిన మన భారతీయులకు అవసరమైన భోజన సౌకర్యాలు టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ యాజమాన్యం కల్పించింది. వారి బాంక్వెట్ హాల్‌ని 5 రోజులపాటు 24 గంటలు అటాకి సహాయం అందించడంలొ ప్రధాన పాత్ర వహించారు.
శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్, బావర్చి రెస్టారెంట్, కాకతీయ రెస్టారెంట్ వారు భోజనం సమకూర్చడంలో ప్రధాన భూమిక వహించారు. వీరితో పాటు ఉత్తర భారతనికి చెందిన మిత్రులు సీమ గార్గ్, వినీత్ గార్గ్ ల ఆధ్వర్యంలో వారి ఇండ్లలో వంటలు వండి అందించారు. అలానే ఫ్లోరిడా మిత్రులు తిరిగి వెళ్ళే సమయంలో దారిలో తినేందుకు ఆహార పదార్థాలు, పండ్లు, పాలు, బ్రెడ్, కేకులను, మంచి నీటిని అందించి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బోజనాన్ని వడ్డించేందుకు "విటి సేవ" కి చెందిన కార్యకర్తలు అన్నివేళలా ముందుండి వారి సహకారాన్ని అమెరికా తెలుగు సంఘానికి అందించారు.