ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ప్రజల నుంచి మరో అసొసియేషన్ ప్రారంభమయింది. ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ (మాట) పేరుతో న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ పాలెస్ వేదికగా లాంచింగ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అమెరికాలో వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన 2500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 వేల మంది లైఫ్ మెంబర్లతో 20 నగరాల్లో చాప్టర్లను ప్రకటించారు.
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించడం, అమెరికాలో ఉంటోన్న తెలుగు వారికి అండగా నిలవడం, మహిళా సాధికారతతో పాటు యువతను ప్రోత్సహించడం, సీనియర్ సిటిజన్లకు మరింత మెరుగైన సంరక్షణను అందించడం లక్ష్యంగా మన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
మాట కోర్ టీంలో శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, శ్రీ అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గెడల, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, స్టాన్లీ రెడ్డి, పవన్ దర్శి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ వెంపరాల, హరి ఇప్పనపల్లి, గంగాధర్ ఉప్పల, కిరణ్ దుగ్గడి, విజయ్ భాస్కర్ కలాల్ తదితరులున్నారు.
ఈ కార్యక్రమంలో మాట ఫౌండర్లయిన శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల సంస్థ లక్ష్యాలను వివరించారు. అలాగే యూత్ టీంకు సంబంధించిన విజన్‌ను లక్ష్మీ మోపర్తి తెలియజేశారు. వడ్డేపల్లి కృష్ణ రాసిన ‘మాట’ స్వాగత గీతాన్ని స్వాతి అట్లూరి నేతృత్వంలోని బృందం ప్రదర్శించగా, పార్థసారథి మ్యూజిక్ అందించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత, అనిరుధ్ తమ సంగీతంతో ఆహుతులను అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment