American Telugu Association
-
ఘనంగా ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ ప్రారంభోత్సవం
ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ప్రజల నుంచి మరో అసొసియేషన్ ప్రారంభమయింది. ‘మన అమెరికన్ తెలుగు అసొసియేషన్’ (మాట) పేరుతో న్యూజెర్సీలోని రాయల్ అల్బర్ట్ పాలెస్ వేదికగా లాంచింగ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అమెరికాలో వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన 2500 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 వేల మంది లైఫ్ మెంబర్లతో 20 నగరాల్లో చాప్టర్లను ప్రకటించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించడం, అమెరికాలో ఉంటోన్న తెలుగు వారికి అండగా నిలవడం, మహిళా సాధికారతతో పాటు యువతను ప్రోత్సహించడం, సీనియర్ సిటిజన్లకు మరింత మెరుగైన సంరక్షణను అందించడం లక్ష్యంగా మన అమెరికన్ తెలుగు అసొసియేషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మాట కోర్ టీంలో శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, శ్రీ అట్లూరి, శ్రీధర్ చిల్లర, దాము గెడల, స్వాతి అట్లూరి, జితేందర్ రెడ్డి, స్టాన్లీ రెడ్డి, పవన్ దర్శి, ప్రసాద్ కూనిశెట్టి, శేఖర్ వెంపరాల, హరి ఇప్పనపల్లి, గంగాధర్ ఉప్పల, కిరణ్ దుగ్గడి, విజయ్ భాస్కర్ కలాల్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మాట ఫౌండర్లయిన శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల సంస్థ లక్ష్యాలను వివరించారు. అలాగే యూత్ టీంకు సంబంధించిన విజన్‌ను లక్ష్మీ మోపర్తి తెలియజేశారు. వడ్డేపల్లి కృష్ణ రాసిన ‘మాట’ స్వాగత గీతాన్ని స్వాతి అట్లూరి నేతృత్వంలోని బృందం ప్రదర్శించగా, పార్థసారథి మ్యూజిక్ అందించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత, అనిరుధ్ తమ సంగీతంతో ఆహుతులను అలరించారు. -
తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్ కు అనూహ్య స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రతి రెండేళ్ళ ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జూలై 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలోని కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ మహాసభలకు ముందు జరిగే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. న్యూజెర్సీలో తానా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మీటింగ్ జరిగింది. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ డిన్నర్ ఈవెంట్‌కి అనుహ్య స్పందన వచ్చింది. పెద్దలు, మహిళలు, పిల్లలతో ప్రాంగణం అంత కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రదర్శించిన తానా సేవా కార్యక్రమాల వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగుతనం ఉట్టిపడేలా నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమనికి హాజరై, గొప్ప ఔన్నత్యంతో విరాళలు అందించిన పలువురు దాతలకు పుష్ప గుచ్చాలతో వేదిక మీదకి స్వాగతం పలికి గౌరవ మర్యాదలతో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన తానా సభ్యులు ఇటీవలే శివైక్యం చెందిన సుప్రసిద్ధ చిత్ర దర్శకులు పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్, శ్రీమతి జయలక్ష్మి గార్లకి, సినీనటుడు నందమూరి తారక రత్నకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. విరాళాల సేకరణకు ముందుగా తానా అధ్యక్షలు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ తానా ప్రస్థానం, నిర్వహించిన, నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు, ప్రవాస తెలుగువారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి తానా భరోసాగా నిలిచిన పలు సందర్భాల గురించి అక్కడికి విచ్చేసిన తానా సభ్యులకు వివరించారు. 23వ తానా మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ జులై 7,8,9 తేదిలలో జరగబోయే ప్రతిష్టాత్మక తానా మహాసభల యొక్క విశిష్టతను వివరిస్తూ, ఈ మహత్కార్యానికి ముందుకు వచ్చిన స్వచ్చంధ సేవకులకు, దాతలందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై 23వ తానా మహాసభలకు వారి సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, కార్యదర్శి సతీష్ తుమ్మల, డైరెక్టర్ వంశీ కోట, అడ్వైజర్ మహేందర్ ముసుకు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ కూకట్ల, తానా ఫౌండేషన్ ట్రస్టీలు విద్యా గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, సుమంత్ రామ్, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, తానా ప్రాంతీయ ప్రతినిధులు వంశి వాసిరెడ్డి, సునీల్ కోగంటి, శ్రీనివాస్ ఉయ్యురు, దిలీప్ ముసునూరు, తానా మహాసభల కల్చరల్ చైర్మన్స్వాతి అట్లూరి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ కన్వెన్షన్ కోఆర్డినేటర్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ తదితర నాట్స్ కార్యవర్గ సభ్యులు, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ విజయ్ కుందూరు, ఐటీ సర్వ్ అధ్యక్షులు వినయ్ మహాజన్, టిటిఏ డైరెక్టర్ శ్రీనివాస్ గనగోని తదితరులు అతిధులుగాహాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షులు మధు రాచకుళ్ల, సౌత్ జెర్సీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ కసిమహంతి, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ డెలావేర్ వాలీ అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ తదితరులు పాల్గొని తానామహాసభలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. -
ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృతోత్సవ్
అట్లాంటా: ఆగస్ట్ 15న ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అట్లాంటాలో భారతీయ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. అజాదీ కా అమృతోత్సవ్ పేరిట జరిగిన ఈ వేడుకలకు నాట్స్ ను కూడా భారతీయ దౌత్య కార్యాలయం ఆహ్వానించింది.. నాట్స్ తరపున నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని అజాదీ కా అమృతోత్సవ్‌లో పాల్గొన్నారు. అట్లాంటాలో నాట్స్ తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. భారతీయుల వీసా, ఇమిగ్రేషన్‌తో పాటు అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాట్స్ ను భారతీయ కాన్సులేట్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించింది. భారతీయ కాన్సులేట్ అట్లాంటాలో నాట్స్ ను గౌరవించడం.. నాట్స్ విన్నపాలను ఎప్పటికప్పుడు పరిశీలించి మద్దతు ఇవ్వడం పట్ల నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని కాన్సులేట్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాన్ని ట్విటర్లో కూడా షేర్ చేసి ప్రవాస భారతీయులంతా దేశభక్తిని చాటుతున్నారనే విషయాన్ని కాన్సులేట్ స్పష్టం చేసింది. -
ప్రాణ ప్రదాతలకు 'ప్రెసిడెంట్ సర్వీస్ అవార్డ్'ల ప్రదానం
గుంటూరు జిల్లా వినుకొండ మండలానికి చెందిన దేవకి శంకర్ రావు కుమార్తె ఆశాజ్యోతి దేవకి కరోనా ఆపత్కాలంలో తాను చేసిన సేవకు గాను 'ప్రెసిడెంట్ సర్వీస్ అవార్డు' దక్కింది. ఈ అవార్డ్ ను అమెరికాలోని 'విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్' ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరిలు పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందించారు. కోరోనా సమయంలో ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారని కొనియాడారు.ఇలా ఎన్నో రకాలుగా అందరికి సహాయం చేస్తూ, సేవలు అందిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పోతిరెడ్డి వాసుదేవ రెడ్డి కుమార్తె యామిని పోతిరెడ్డి అమెరికాలో మేరీలాండ్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. కోవిడ్ క్రైసిస్ లో వివిధ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తెలుగు రాష్ట్రల ప్రజల కోసం చేసిన సేవని గుర్తించి విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమండ్ల, ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారి అద్వర్యంలో "సూపర్ వుమన్ ఇన్ సర్వీస్ అవార్డు" పురస్కారాన్ని అందించారు. కరోనా సమయంలో మెడికల్ కిట్ డ్రైవ్ స్టార్ట్ చేసి వివిధ మండలంలో ఆక్సిమేటర్స్, కాంటాక్ట్ లెస్ థెర్మోమేటర్స్ అందించారు. అంతే కాకుండా రేణిగుంట కి చెందిన 'అభయ క్షేత్రం' సంస్థకు ఒక నెలకు సరిపడా సరుకుల్ని అందించారు. ఈ అవకాశం అందించి సేవల్ని గుర్తించిన 'వెట' కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థలో పని చేస్తున్నందుకు చాల ఆనందంగా ఉందని యామిని రెడ్డి అన్నారు. -
WETA ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కాలిఫోర్నియాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా సంస్థ ప్రెసిడెంట్ ,ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి మట్లాడుతూ దేశం అన్నింటా అభివృద్ధి చెందుతున్న సమయం లో ఒక వైరస్ అస్థిత్వానికి సవాల్ విసిరింది .కోవిడ్ సెకండ్ వేవ్ లో WETA ఎన్నో గ్రామాలలో సేవాకార్యక్రమాలని చేయగలిగిందని,సహాయం చేసిన దాతలకు ఈ సమయంలో ముందు ఉండి పని చేసిన కోవిడ్ వారియర్స్ కి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి , WETA వాలంటీర్స్ కి కృతజ్ఞత తెలిపారు. కోవిడ్ కష్ట కాలంలో చురుకు గా పని చేసిన కొంత మంది వాలంటీర్స్ ని అవార్డ్స్ తో సత్కరించామని తెలిపారు.స్వాతంత్ర దినోత్సవంలో ఝాన్సీ రెడ్డి పాల్గొని జాతీయ పథకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకలలో పలువురు ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి పాల్గొని ..శుభాకాంక్షలు తెలిపారు. -
నార్త్ కరోలినాలో ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
అమెరికాలో జననాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఉత్సవాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం సామూహిక వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేకా సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్స్, హెల్త్ క్యాంప్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, మెడికల్ కిట్స్ ను అందించినట్లు చెప్పారు. అదే విధంగా వైఎస్సార్ అభిమానులు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, వైఎస్సార్ ఫౌండేషన్ సేవల్ని వినియోగించుకోమని తెలియచేసారు. రాధాకృష్ణ కాలువాయి వైఎస్సార్ సేవల్ని కొనియాడుతూ వైఎస్సార్ అభిమానులకు ఘన స్వాగతం పలికారు. సునీత రెడ్డి మాట్లాడుతు వైఎస్సార్ రైతుల పక్షపాతి అని, ఎప్పుడు రైతుల గురించి వారి భరోసా గురించి ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఆ రైతులకు స్ఫూర్తిగా వైఎస్సార్ జయంతి నాడు వనభోజనాలు ఏర్పాటుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు వక్తలు వై ఎస్సార్ గారు చేసిన సేవలను కొనియాడారు. కేక్ కట్ చేసి, వై ఎస్సార్ గారి పుట్టినరోజు ని ఘనంగా జరుపుకొన్నారు. ఫుడ్ డ్రైవ్ దాతలకు, వాలంటీర్లకు పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియచేశారు. ఫుడ్ డ్రైవ్ చేయడం, ఆనందం గా వనభోజనాలు నిర్వహించినందుకు వై ఎస్సార్ అభిమానులు నిర్వాహకులను అభినందించారు. వాతావరణంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బా రెడ్డి మేకా, రాధాకృష్ణ కాలువాయి, సునీత రెడ్డి, సురేష్ దేవిరెడ్డి, సంజీవ రెడ్డి, మస్తాన్ రెడ్డి, బాజీ షేక్, ప్రసన్న కూసం, అశోక్ మోర ల సారధ్యంలో పలువురు వై ఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. దాతలు రాజశేఖర రెడ్డి సున్నం, రామి రెడ్డి కైపు, శ్రీనివాస్ సింగళరెడ్డి, అశోక్ మోర, రౌనక్ రెడ్డి, నారాయణ్ దొంతు, బాజీ షేక్, జగదీష్, సునీత రెడ్డి, రఘునాథ్ కొత్త, రాధాకృష్ణ కలువాయి సుబ్బా రెడ్డి మేకా సహకారం చేశారు. వాలంటీర్లు సురేష్ దేవిరెడ్డి, సునీత రెడ్డి, బాజీ షేక్, మస్తాన్ రెడ్డి, రామి రెడ్డి కైపు, శ్రీనివాస్ సింగళరెడ్డి, చందు రెడ్డి , నారాయణ్ దొంతు, సంజీవ రెడ్డి, దుశ్యంత్ రెడ్డి, జగదీష్ , అశోక్ మోర, ప్రసన్న కూసం, హరినాథ్ చేజెర్ల, వెంకట్ జమ్ముల , శ్రీధర్ రామిరెడ్డి, కిరణ్ అంకిరెడ్డి, వీర రెడ్డి గొట్టివీటి, శంకర్ రెడ్డి తమ్మాలు సేవలందించారు. -
పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..!
వాషింగ్టన్: భారత మాజీ ప్రధాని.. మన తెలుగు జాతి ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రవాస భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని తెలుగువారంతా పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ రిమెంబరింగ్ పీవీ, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న ఫర్ పవీ అంటూ మూడు ఆర్ల సిరీస్‌తో ఉద్యమంతో ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు పీవీ శతాబ్ది జన్మదినం సందర్భంగా రిమెంబరింగ్ పీవీ నరసింహా రావు, రిమైండ్ పీపుల్, రిక్వెస్ట్ భారత ప్రభుత్వం భారతరత్నఫర్ పీవీ అని డిమాండ్ చేస్తు ప్రవాస భారతీయ సంఘాలు కార్యక్రమాన్ని చేపట్టాయి. అంతేగాక ఆన్లైన్ ద్వారా కూడా ఈ సంఘాలు భారతీయుల మద్దతును కోరుతున్నాయి. అనేక ప్రవాస భారతీయ సంఘాలు, సంస్థలు పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు పీవీ ఘనతను స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమాల ద్వారా పీవీకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌కు మద్దతు కూడగడుతున్నాయి. అమెరికాలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా పీవీ నరసింహారావు గురించి తెలిసిన ప్రముఖులు, మేధావులు నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్( ఏఏపీఐఆర్) ఉత్తర అమెరికా తెలుగు సంఘము (టీఏఎన్‌ఏ), అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్ఏటీఎస్), ఉత్తర అమెరికా తెలుగు సమితి (ఎన్ఏటీఏ) సిలికాన్ ఆంధ్ర తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్), సెయింట్ లూయిస్ గుజరాత్ సమాజ్‌లతో పాటు అమెరికాకు చెందిన 81 భారతీయ సంఘాలన్నీ ముక్తకంఠంతో పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. భారతరత్న ఫర్ పీవీ అనే అభ్యర్థనను భారత ప్రభుత్వం గుర్తించేలా చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. పీవీ శత జయంతోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో ఆయనకు భారతరత్న వచ్చే వరకు తెలుగు సంఘాలు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక పీవీ ప్రాముఖ్యత, భారతీయ చరిత్రలో ఆయన స్థానం వివరిస్తూ... పీవీకి భారతరత్న అనే వినతి పత్రంపై ప్రవాస సంఘాలు సంతకాలు చేశాయి. అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్య నిర్వాహక బృంద సభ్యులు స్వర్ణ ప్రసాద్, గుళ్ళపల్లి శ్రీనివాస్, డాక్టర్ అశోక్ కుమార్, చింతా ప్రవీణ్, తాళ్లూరి శ్రీధర్, అశ్విన్ పటేల్, కాజా విశ్వేశ్వర రావు (సెయింట్ లూయిస్ ఎమ్ఓ), బడ్డి అశోక్, దేవబత్తిని హరి (డెట్రాయిట్, ఎమ్ఐ), మేడిచెర్ల మురళీకృష్ణ, కపిల ప్రకాష్, శరత్ చంద్ర (ఎడిసన్, ఎన్జే), పురం ప్రవీణ్ (అట్లాంటా, జీఏ), కొండెపు సుధ (డీసీ), చల్లా కవిత( వాషింగ్టన్ డీసీ),అట్లూరి శ్రీహరి (ఎల్ఏ) కల్వకోట సరస్వతి (ఓహెచ్) ఇలా చాలా మంది ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అంతేకాదు ఈ సంద్భంగా పీవీ నరసింహారావు మీద ప్రత్యేక సంచికను కూడా వెలువరించనున్నారు. తమ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మద్దతుకై ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలూ సోషల్ మీడియాలో ప్రచురిస్తున్నారు. సాధారణ పౌరులు కూడా (petition at: https://www.change.org/CTIPetitionBharatRatna4PV) ఈ లింక్ ద్వారా సంతకం చేసి తమవంతుగా మద్దతుగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఎన్ఆర్ఐ సంస్థలు కోరుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో చూడాలంటే ఈ కింది లింక్‌లు క్లిక్ చేయండి BharatRatna4PV YouTube Channel Facebook: https://m.facebook.com/BharatRatna4PV-104140028106254 YouTube: https://youtube.com/channel/UCM3UlMkHF6rWH_KEPiCnZ6A BharatRatna4PV Short Film Teaser: https://youtu.be/KTTU2cJ9ENE -
గ్రామాలకు అమెరికా వైద్యం
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు టెలీమెడిసిన్ ద్వారా సెకండ్ ఒపీనియన్ సేవలు అందించేందుకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్ ముందుకొచ్చింది. హెల్త్‌నెట్ గ్లోబల్ లిమిటెడ్ సాంకేతిక సహకారంతో ఈ సేవలను అందించనుంది. ఈ మేరకు సోమవారం తాజ్‌కృష్ణా హోటల్లో జరిగిన సమావేశంలో అపోలో గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ సంగీతారెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌రెడ్డిలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఇప్పటికే అపోలో ఆస్పత్రి హెల్త్‌నెట్ గ్లోబల్ లిమిటెడ్ సాంకేతిక సహకారంతో టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో అమెరికా వైద్యులు చేరడంతో ఈ సేవలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్లిష్టమైన వ్యాధులతో బాధపడుతూ చికిత్సలకు తగ్గని మొండి జబ్బులు, వైద్య పరీక్షలు, వాటి తాలూకు రిపోర్టులను మీసేవా కేంద్రాల ద్వారా గానీ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా గానీ ఆన్లైన్లో అమెరికాలో ఉన్న వైద్యులకు పంపిస్తారు. వారు రోగి తాలుకూ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి, జబ్బుకు కారణాలు, చికిత్సల్లో వైద్యులు అనుసరించాల్సిన పద్ధతులు, వాడాల్సిన మందులను సూచిస్తారు. తద్వారా మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సైతం నిపుణుల వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. 90 రోజుల్లో ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. సెకండ్ ఒపీనియన్ పొందాలని భావించే బాధితులు ముందస్తుగా ఆన్లైన్లో ఆయా వైద్యుల అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1982లో స్థాపించిన ఈ అమెరికన్ అసోసియేషన్‌లో ఇప్పటి వరకు 80వేలకుపైగా వైద్యులు, 40వేలకు పైగా వైద్య విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. వీరు దేశంలోని ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సహా రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచితంగా టెలీమెడిసిన్ వైద్యసేవలు అందించనున్నారు. ఇదిలా ఉంటే అపోలో ఆస్క్ టెలీమెడిసిన్ ద్వారా ఇప్పటి వరకు 10 మిలియన్ టెలీమెడిసిన్ సేవలు అందించినట్లు ఆ ఆస్పత్రి డైరెక్టర్ సంగీతారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. మాతృభూమికి కొంత సేవ చేయాలనే ఆలోచనతోనే వైద్యులు ఈ తరహా సేవలను అందించేందుకు ముందుకు వచ్చారని సురేష్‌రెడ్డి తెలిపారు. టెలీమెడిసిన్ వైద్య సేవల విషయంలో అపోలో–అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్ల మధ్య అవగాహాన ఒప్పందం కుదరడం ఒక చారిత్రక దినంగా అభివర్ణించారు. -
ఇర్మా బాధిత భారత కుటుంబాలకు అటా చేయూత
అమెరికాలో ఇటివల హరికేన్ ఇర్మా ఫ్లోరిడా రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం విదితమే. ఆ రాష్ట్రంలోని ప్రవాస భారతీయులు చాలామంది ఆ తుఫాను తాకిడికి లోనయ్యారు. కేటగిరీ -5 గా వర్గీకరించిన ఇర్మా అమెరికాకి కలిగించిన నష్టం బిలియన్లలో ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.అయితే వందలాది ప్రవాస భారతీయులు తుఫాన్‌కు గురవుతున్న విషయాన్ని అమెరికా తెలుగు సంఘం(అటా) ముందుగానే గ్రహించి వెంటనే రంగంలోకి దిగింది. అధికారిక తుఫాను హెచ్చరిక, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఉత్తర్వులు వెలువడిన వెంటనే అటా సేవా జట్టు అవసరమైన పనులను చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి పర్యవేక్షణలో, టెన్నిస్సీ,అలబామ రాష్ట్రాల ప్రాదేశిక శాఖల సహాయంతో శివకుమార్ రామడుగు అటా సేవా జట్టుకు నేతృత్వం వహించారు. అట్లేంటాకే చెందిన కిరణ్ పాశం, అనిల్ బోద్ధిరెడ్డి, వేణు పిసికే, తిరుమల పిట్టా, ప్రశాంత్ పొద్దుటూరి, శ్రీధర్ తిరుపతి, రామకృష్ణా రెడ్డి ఈ పనులలో కీలక పాత్ర పోషించారు. బాధితులకు సహాయం చేసేందుకు అటా జట్టు ఒక పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అందులోనే భాగంగా ఏర్పడ్డ ఏక్షన్ టీం ముందుగా ఒక హెల్ప్‌లైన్ నెలకొల్పి, సోషల్ మీడియా, బంధు మిత్ర వర్గాల ద్వారా ఫ్లోరిడాకు చేరవేసింది. ఇది కాక అట్లాంటా, నాష్విల్, అలబామలో నివాసముంటున్న అటా సభ్యులకు విషయాన్ని తెలియజేసి వారి ఇండ్లలో బాధితులకు నివాసం కల్పించే ఏర్పాట్లు కూడా ఆటా చేసింది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ఇతరుల వర్గీకరణ పనులను త్వరగా పూర్తిచేసి సమయానికి నిర్వాసితులకు సహాయ సహకారాల్ని అందించగలిగింది. అమెరికాలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా అట్లంటాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్వచ్చందంగా మంచి మనసుతో ఆపదలో ఉన్న సాటి భారతీయులకు స్వాగతం పలకడంలో సఫలీకృతులయ్యారు. కేవలం తెలుగువారికే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు సమస్త ప్రవాస భారత ప్రజానీకానికి సహాయ సహకారాలు అందించిన అటా సేవ టీం పలువురి ప్రశంసలందుకుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా వేయి మంది నిర్వాసితులకు ఆశ్రయం కల్పించారు. ఒక వ్యక్తి ఏకంగా 12 కుటుంబాలకు చెందిన 33 మందికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. ఇటువంటి సేవ అటాకే గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. నిర్వాసితులు అటాకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో అమెరికాలోని భారతీయ రాయభార కార్యాలయం తమ అధికారులను ఆప్రమత్తం చేసింది. అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. న్యూయార్క్ నగరం నుంచి కన్సులేట్ జనరల్ శ్రీ హుటాహుటీన అట్లాంటా నగరం చేరుకుని సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. అమెరికా తెలుగు సంఘం కొన్ని వందల మంది భారతీయులకు సంఘం సభ్యుల, వారి మిత్రుల ఇండ్లలో నివాసం కల్పించడాన్ని కొనియాడారు. ఈ సహాయ కార్యక్రమాలని గుర్తించిన స్థానిక పోలీసు వ్యవస్థ, జార్గియా రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ విభాగ అధికారులు ఫ్లొరిడా నుంచి వారిని స్వయంగా కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చిన సహాయం చేయటానికి ముందుంటామని, వారిని సంప్రదించాల్సిందిగా అమెరికా తెలుగు సంఘం సభ్యులను కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు అభినందించి వెళ్ళారు. ఫ్లొరిడా నుండి వచ్చిన మన భారతీయులకు అవసరమైన భోజన సౌకర్యాలు టేస్ట్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ యాజమాన్యం కల్పించింది. వారి బాంక్వెట్ హాల్ని 5 రోజులపాటు 24 గంటలు అటాకి సహాయం అందించడంలొ ప్రధాన పాత్ర వహించారు. శ్రీ కృష్ణ విలాస్ రెస్టారెంట్, బావర్చి రెస్టారెంట్, కాకతీయ రెస్టారెంట్ వారు భోజనం సమకూర్చడంలో ప్రధాన భూమిక వహించారు. వీరితో పాటు ఉత్తర భారతనికి చెందిన మిత్రులు సీమ గార్గ్, వినీత్ గార్గ్ ల ఆధ్వర్యంలో వారి ఇండ్లలో వంటలు వండి అందించారు. అలానే ఫ్లోరిడా మిత్రులు తిరిగి వెళ్ళే సమయంలో దారిలో తినేందుకు ఆహార పదార్థాలు, పండ్లు, పాలు, బ్రెడ్, కేకులను, మంచి నీటిని అందించి వారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. బోజనాన్ని వడ్డించేందుకు "విటి సేవ" కి చెందిన కార్యకర్తలు అన్నివేళలా ముందుండి వారి సహకారాన్ని అమెరికా తెలుగు సంఘానికి అందించారు. -
అటా ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్..
నాష్విల్లే: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (అటా) ఆధ్వర్యంలో శనివారం నాష్‌విల్లేలోని శ్రీ గణేశా ఆలయ ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీటీ సేవా, హిందూ కల్చరల్ సెంటర్ టేనస్సీలు సహకారం అందించాయి. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రత్యేక విభాగాల్లో నిపుణులైన 25 మంది డాక్టర్లు, 10 మంది వైద్య విద్యార్థులు, 20 మంది అటా వాలంటీర్లు, 10 మంది వీటీ సేవా వాలంటీర్లు, టేనస్సీ కిడ్నీ ఫౌండేషన్ నుంచి 10 మంది ఉద్యోగులు పాల్గొని సేవలందించారు. ఈ వైద్య శిబిరానికి 100 మందికి పైగా పాల్గొని ఉచిత వైద్య సేవలు పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, బీఎమ్ఐ, డయాబెటీస్, మూత్ర పరీక్షలు, కొవ్వు, గుండె సంబంధించిన వ్యాధులకు నిపుణులైన డాక్టర్లు పరీక్షలు జరిపి వైద్య సేవలందించారు. సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహనా కల్పించడమే కాకుండా చిన్న పిల్లలకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశిబిరానికి హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డాక్టర్లందరికీ అటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆడిటోరియం ఇచ్చిన శ్రీసాయి గణేశ్ ఆలయ బోర్డు సభ్యులకు కూడా అటా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో అటా చైర్మెన్ ఆల రామకృష్ణా రెడ్డి, అటా నాష్విల్లా రిజినల్ కో-ఆర్డినేటర్ నరేందర్ రెడ్డి, అటా ఫౌండేషన్ కో- చైర్మెన్ సుశీల్ చందా, కిశోర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, పునీత్ దీక్షిత్, రాధిక రెడ్డి, లావణ్య నూకల, రవళి, బింధుమాధవి తదితరులు పాల్గొన్నారు. -
సినారెకు ఆటా ఘన నివాళి
కెంటకీ: తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగుజాతి మనది అంటూ యావత్ తెలుగుజాతికి స్ఫూర్తిగా నిలిచిన మహాకవి డా. సి.నారాయణరెడ్డి మృతి పట్ల అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సంతాపాన్ని తెలిపింది. కెంటకీ, లెక్సింగ్టన్లో ఆటా సభ్యులు సాహితీ దిగ్గజం, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక్కడి మసాలా ఇండియన్ రెస్టారెంట్లో ఆటా బృందంతో పాటు తెలుగు ఎన్నారైలు సినారెకు తుది నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యానికి సినారె అందించిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, టీడీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి అనుగు, మిమిక్రీ రమేశ్, అనిల్ బొడ్డిరెడ్డి, ఆటా స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, కెంటకీ రీజనల్ కో-ఆర్డినేటర్ మహేశ్ గుండ్లూరు, అనిల్ గంటేటి, ఆటా కార్యవర్గ బృందం హేమ ప్రసాద్ సడ్డాలా, బాబు కొండవీటి, సురేశ్.ఎం, డాక్టర్ రాపూరి, రమేశ్ సొంటేనమ్, రమేశ్ మల్నేని, నయన్.ఎం, సురేశ్ పొట్లూరీ, శ్రీని ఆకుల, పార్శి, శ్రీనివాస్ సత్రశాల, శ్రీనివాస్ రెడ్డి, లెక్సింగ్టన్ తెలుగు కమ్యూనిటీ సభ్యులు పాల్గొని సాహితీ శిఖరం సినారెకు శ్రద్ధాంజలి ఘటించారు. సినారె లేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. -
ఆటా ఆధ్వర్యంలో స్వామి చిదాత్మానంద ఈవెంట్
కెంటకీ: అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో స్వామి చిదాత్మానంద ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కెంటకీ రాష్ట్రం లూయిస్‌విల్లేలోని ఓ ఆలయంలో జరిగిన ఈవెంట్లో ఆటా సభ్యులతో పాటు తెలుగు ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొన్నారు. భయాన్ని వీడాలి- ధైర్యంగా ఉండాలన్న అంశంపై స్వామి చిదాత్మానంద చెప్పిన విషయాలను అందరూ ఆసక్తిగా విన్నారు. తన మాటలతో ఆయన ఎన్నారైలలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఆటా సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఉపయోగకరమైన ఈవెంట్లను మరిన్ని చేపట్టాలని హాజరైన ఎన్నారైలు ఆటా కార్యవర్గ బృందాన్ని కోరారు. ఆటా కెంటకీ సభ్యుడు డాక్టర్ మహేశ్ గుండ్లూరు, కెంటకీ రిజనల్ కో-ఆర్డినేటర్ హేమ ప్రసాద్ సడ్డాలా, అనిల్ గంటేటి, తేజు స్వరూప్, తదితరులు ఈవెంట్‌ను నిర్వహించారు. కరుణాకర్ అసిరెడ్డి, అనిల్ బొడ్డిరెడ్డి లాంటి ప్రముఖులు చిదాత్మానంద స్వామి విచ్చేసిన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. -
ఘనంగా 'ఆటా' మహిళా దినోత్సవం
న్యూ జెర్సీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో ఘనంగా నిర్వహించారు. రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి న్యూ జెర్సీ, పెన్సిల్ వేనియా, న్యూయార్క్, డెలావేర్ , కనీక్ట్ కట్ల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఆటా న్యూజెర్సీ ప్రాంతీయ సమన్వయకర్తలు రవీందర్ గూడురు, విలాస్ జంబులలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. ఆటా మహిళా విభాగం ఛైర్పర్సన్ ఇందిరా శ్రీరాం రెడ్డి ఈ సభకు అధ్యక్షత వహించారు. న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ రీవా గంగూలీ దాస్, ఎయిర్ ఇండియా జనరల్ మేనేజర్ ఆఫ్ అమెరికా వందన శర్మ, న్యూ జెర్సీ కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ పింకిన్స్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు శక్తివంతంగా తయారు కావల్సిన ఆవశ్యకత ఉందని అతిథులు పేర్కొన్నారు. అలాగే స్త్రీలు విద్యావంతులై, ఆర్థిక స్వావలంబన సాధించుకున్ననాడే జగతికి నిజమైన ప్రగతి అని తెలిపారు. ఈ సందర్భంగా రీవా గంగూలీ దాస్, వందన శర్మ, వసంత పెర్కారిలను వారి వారి రంగాల్లో కనబరిచిన ప్రతిభకుగానూ సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తరచూ వార్తలో నిలుస్తున్న భారతీయ ప్రముఖ మహిళలపై శ్రీదేవి జాగర్లమూడి, గీతారెడ్డి, మాధవి శ్రీకోటి క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ క్విజ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఫ్యాషన్ షోలో ఇచ్చే బహుమతికి శ్రావణి ఎంపికయ్యారు. వినోదకరమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆసాంతం సభికులను అలరించాయి. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చీరెలు, బంగారు ఆభరణాల స్టాళ్లు సందడిగా కనిపించాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన నందిని దర్గుల, మాధవి అరువ, జమున పుస్కూర్, శాంతి ఇప్పన పల్లి, అరుణ గున్న, శిల్పి కుందూరు, చిత్రలేఖ జంబుల, మాధవి గూడూరు, విజిత దేవనపల్లి, జ్యోతి, నిహారిక గుడిపాటి, భాను మాగంటి, శ్రీలత రెడ్డిలకు ఆటా నిర్వాహక సంఘం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ పరమేష్ భీంరెడ్డి, మాజీ అధ్యక్షులు సుధాకర్ పెర్కారి, సంయక్త కోశాధికారి శ్రీనివాస్ దార్గుల, అడ్వైజరీ కో ఛైర్మన్ సురేష్ జిల్లా, ట్రస్టీలు పరశురామ్ పిన్నపురెడ్డి, రవి పట్లోళ్ల, వినోద్ కోడూరు, కృష్ణ ధ్యాప, శరత్ వేముల, విజయ్ కుందూరు, రఘువీర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ మాగంటి, ప్రొఫెసర్ రాజశేఖర్ వంగపాటి, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ గుడిపాటి రీజినల్ డైరెక్టర్ మహీధర్ సనపరెడ్డి, రీజినల్ అడ్వైజర్ రాజ్ చిలుములలు కార్యక్రమం జయప్రదం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. -
ఆటా నూతన కార్యవర్గం ఎంపిక
లాస్ వెగాస్: అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన కార్యవర్గం ఎంపికైంది. ఆటా ధర్మకర్తల మండలి సమావేశం నెవాడాలోని లాస్ వెగాస్‌లో ఈ జనవరి 14న నిర్వహించారు. ఆటా నూతన అధ్యక్షుడిగా కరుణాకర్ ఆసిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆటాబోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు లాస్ వేగాస్, కాలిఫోర్నియాలలోని తెలుగువారు సహా 200 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డికి మాజీ అధ్యక్షుడు సుధాకర్ పెర్కారి బాధ్యతలు అప్పగించారు. ఆసిరెడ్డితో పాటు, కొత్తగా ఎన్నుకోబడిన ధర్మకర్తల మండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2020వరకు గానూ ఆటా సభ్యుల ద్వారా ఎన్నికైన 13 మంది నూతన ధర్మకర్తల మండలి సభ్యులు భువనేశ్ బూజల, పరశురం పిన్నపురెడ్డి, వినోద్ రెడ్డి కోడూరు, జయంత్ చల్ల, క్రిష్ణ ద్యాప, రవీందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘువీర్ బండారు, మురళీ బొమ్మనవేని, సౌమ్య కొండపల్లి, కిరణ్ పాశం, రిందా కుమార్ సామ, శరత్ వేముల ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యనిర్వాహక, ధర్మకర్తల బృందం సభ్యులు ఆటా రాజ్యాంగం దాని అనుబంధ చట్టాలను గౌరవించి, పాటిస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గం పరమేష్ భీంరెడ్డిని ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఎన్నుకుంది. అధ్యక్షుడు ఆసిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా స్థాపించబడిన ప్రధాన లక్ష్యాలను సభికులకు గుర్తుచేశారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు జాతికి, వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకునేందుకు, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు, ఇతర అంశాల్లో ప్రోత్సహించడానికి ఆటా అన్ని వేళలా కృషిచేస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. తనతో పాటు ఏర్పడిన నూతన కార్యనిర్వాహక బృందం తమ తదుపరి రెండు సంవత్సరాల కోసం ప్రణాళికలను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉద్యోగావకాశాలపై అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ పై అవగాహనా సదస్సులు, అమెరికాలో ఉండే హైస్కూల్ విద్యార్థులకు SAT ఉచిత శిక్షణ, కాలేజీ ప్రవేశాలపై అవగాహన సదస్సులు, భారత్ నుంచి వచ్చే పేరెంట్స్‌కు ఉచిత ఆరోగ్య, దంత క్యాంప్‌లు నిర్వహించడం, అవసరమైన వారికి అత్యవసర సాయం అందించనున్నట్లు వివరించారు. మాజీ అధ్యక్షుడు సుధాకర్ పెర్కారి, మాజీ కార్యనిర్వాహక టీమ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటా ధర్మకర్తల మండలి, 2017-2018 కాలానికి ఈ కార్యనిర్వాహక బృందాన్ని ఎంచుకుంది. అధ్యక్షుడు: కరుణాకర్ అసిరెడ్డి అధ్యక్షుడు (ఎలెక్ట్): పరమేష్ భీంరెడ్డి కార్యదర్శి: సౌమ్య కొండపల్లి కోశాధికారి: కిరణ్ పాశం సంయుక్త కార్యదర్శి: వేణుగోపాల్ రావు సంకినేని సంయుక్త కోశాధికారి: శ్రీనివాస్ దార్గుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: మాధవి బొమ్మినేని -
ఆటా ఎన్నికల్లో తన్నులాట
నేపర్‌విల్లే: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఎన్నికల సందర్భంగా ఇద్దరు నాయకులు బూతులు తిట్టుకుంటూ తన్నుకున్నారు. ఒక వీడియోలో ఉన్నదాని ప్రకారం ఆటా సభ్యులు హరీందర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇంతలో ఆ గదిలోకి వచ్చిన హనుమంతు రెడ్డి అనే వ్యక్తి సభ్యులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా బలవంతం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన హరీందర్ దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. గొడవ పెద్దదై ఒకరినొకరు కొట్టుకునేవరకు వెళ్లింది. నామినేషన్ పత్రాల్ని తనిఖీ చేయడానికి వచ్చిన సభ్యులకు వాటిని చూపించకుండానే, హనుమంతు పత్రాలను తనతోపాటు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై హనుమంతును వివరణ కోరగా, ఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు పూర్తయ్యాక నామినేషన్ ప్రతాలను సేకరించడానికి ఆటా అధ్యక్షుడు ముగ్గురు ఆధీకృత వ్యక్తులను నియమించారని తెలిపారు. ముగ్గురిలో తానూ ఒకడినన్నారు. నేపర్‌విల్లే పోస్టాఫీసుకు నామినేషన్ పత్రాలను స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన తమపై హరీందర్, చంద్రశేఖర్ దాడి చేశారన్నారు. హరీందర్ 2013లో వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడారు. -
'జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్'
► ఎక్కడ ఉన్నా.. తెలుగువారంతా ఒక్కటే : ఎంపీ కవిత ► రెండో రోజు అంగరంగ వైభవంగా ఆటా ఉత్సవాలు ► బతుకమ్మ బోనాలతో ఘనస్వాగతం ► హాజరైన తెలంగాణ, ఏపీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు రాయికల్: ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక్కటేనని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికాలోని చికాగోలో ఆటా రజతోత్సవ వేడుకలలో రెండో రోజైన శనివారం కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ దేశంలోనైనా ఏదైనా ప్రమాదం జరిగితే తెలుగువారు ఎలా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తారని కవిత చెప్పారు. గతంలో అమెరికా అంటేనే తానా మహాసభలు, ఆటా మహాసభలు గుర్తుకు వచ్చేవని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు ఆచార సంప్రదాయాలను కాపాడటం కోసం ఆటా చేస్తున్న కృషి సహకరించిన ప్రతినిధులను అభినందించారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలు విడిపోయాయని అన్నారు. జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం అలరించింది. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ బోనాలతో సభావేదికపైకి చేరుకోవడం ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మధుయాష్కీగౌడ్, రాజగోపాల్‌రెడ్డి, ఆటా సంఘం అధ్యక్షుడు పెర్కారి సుధాకర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆటా రెండో రోజు ఉత్సవాలు
(ఆటా సమావేశాల నుంచి జీ.శ్రీనాథ్): ఆత్మీయ పరిచయాలు, కళా ప్రదర్శనలు, వ్యాపార-వాణిజ్య ఎగ్జిబిషన్లు, రాజకీయ నాయకుల ప్రసంగాలు.. ఇవీ రెండో రోజు అమెరికా తెలుగు సంఘం రజతోత్సవాల్లో ముఖ్యాంశాలు. అమెరికాలోని 50 సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కుటుంబాలకు చెందిన దాదాపు పది వేల మంది చికాగోలోని రోజ్ మంట్ కన్వెన్షన్ సెంటర్‌కు బారులు తీరారు. అమెరికాలో ఎండా కాలం సెలవులు కొనసాగుతుండడంతో పాటు బిగ్ వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున తెలుగు జనం పోటెత్తారు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆటా అధ్యక్షుడు సుధాకర్ పేర్కరీ జ్యోతి వెలిగించి ఈ వేడుకలను ప్రారంభించారు. ఇల్లినాయిస్ గవర్నర్ బ్రూస్ రానర్ తన భార్య డయానాతో కలిసి రెండో రోజు కూడా ఆటా సమావేశాలకు హాజరయ్యారు. వరుసగా రెండో రోజూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. తొలి రోజు చెప్పిన ప్రసంగాన్ని మళ్లీ రిపీట్ చేసిన వెంకయ్య.. దానికి అదనంగా మరింత విశ్లేషణను జోడించారు. చెప్పిన విషయాన్నే వేర్వేరు సామెతలు, భాషా ప్రయోగాలతో, ఆకట్టుకునే మాటలను జోడించి ఆహుతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ముందుకు దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. తాను నిద్ర పోడని, ఎవరిని నిద్ర పోనివ్వట్లేదని కొందరు కలత చెందుతున్నారని, అయితే మోదీ కష్టమంతా దేశం కోసమేనన్నారు వెంకయ్య. అలాగే గతంలోలా దేశ సంపదను తాను తినడని, ఎవరిని తిననివ్వడన్నారు. అమెరికాలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రవాస తెలుగు ప్రజలు.. తమ వంతుగా తాము పుట్టి పెరిగిన ఊర్లకు ఎంతో కొంత సాయమందించాలన్నారు. ఎంత సంపాదించినా.. అది కేవలం అద్దంలో చూసుకోడానికేనని, అదే సంపదను కొంత మొత్తం తమ వాళ్లకు అందించగలిగితే ఆ తృప్తి వేరన్నారు. ఇక్కడి ఎన్నారైలు ఇప్పటికీ వైఎస్సార్ సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. అలాంటి పాలన మళ్లీ జగన్ నేతృత్వంలో రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధికి ఎన్నారైల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. మీరందరూ ముందుకు వచ్చి అక్కడ పెట్టుబడులతో పాటూ ఇతర కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని మిథున్ రెడ్డి కోరారు. అలరించిన కార్యక్రమాలు తెలుగు వారు పెద్ద సంఖ్యలో ఒక చోట కలిస్తే పండగ. అది అమలాపురం అయినా.. అమెరికా అయినా.. అంతే సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించారు. ఆటా వేడుకల్లో ఓ వైపు సాహిత్య, కళా ప్రదర్శనలు ఆస్వాదిస్తూనే మరో వైపు షాపింగ్, గేమింగ్, యూత్ ఫెస్టివల్స్, పొలిటికల్ డిస్కషన్స్, ఇతర కార్యక్రమాలతో గడిపారు. ఆరోగ్యం ఆరోగ్యం కోసం ఆటా వేదికగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. క్యాన్సర్ నివారక యోగ థెరపీలను ప్రాక్టీస్ చేయించారు. అలాగే సూపర్ బ్రెయిన్ యోగా, మెడిటేషన్, ఒత్తిడిని నివారించేందుకు కసరత్తులు చేయించారు. పంచకర్మ, ఆయుర్వేద థెరపీలతో పాటు ఓ ప్రశ్న-జవాబుల సెషన్ నిర్వహించారు. యూత్ ఫెస్టివల్స్ తెలుగు రాష్త్రాల్లో ఉన్న యూనివర్సిటీలు, వివిధ ప్రముఖ కాలేజీల నుంచి అమెరికాలో సెటిలయిన విద్యార్థులు.. తమ తమ విద్యాసంస్థలకు సంబంధించి గెట్ టు గెదర్ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఆట పాటలతో హోరెత్తించారు. కళా ప్రదర్శనలు వివిధ నృత్యరూపాలు, కూచిపూడి, జానపదంతో సయ్యాట అనిపించారు ఇక్కడి వాళ్లు. తెలుగు గడ్డకు ఎంతో దూరంలో ఉన్నా.. ఇక్కడి కళలను మాత్రం ఆదరిస్తూనే ఉన్నామని తమ ప్రదర్శనలతో నిరూపించారు. బిజినెస్ మీటింగ్స్ ఆటా ఉత్సవాలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్లోనే దాదాపు 50 స్టాళ్లు ఏర్పాటు చేశారు. నగలు, అభరణాలు, దుస్తులు, వంటకాలకు సంబంధించిన స్టాళ్ల దగ్గర హడావిడి కనిపించింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ స్టాళ్లు ఎక్కువగా కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్మించబోతున్న వివిధ ప్రాజెక్టుల గురించి తెలుపుతూ ఎన్నారైలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వేర్వేరు రంగాల వ్యాపార వేత్తలు ఎన్నారైలతో చర్చలు జరిపారు. ఇన్వెస్ట్ మెంట్ల గురించి చర్చించారు. పెళ్లి సంబంధాలు నలుగురు తెలుగు వారు కలిస్తే.. చర్చకు వచ్చే మొదటి అంశం పెళ్లి సంబంధం. తెలుగు కన్వెన్షన్లు ఎక్కడ జరిగినా.. ఎన్నారైలలో ఇదే తాపత్రయం. వీరి ఆసక్తిని గమనించిన మాట్రిమోనియల్ కంపెనీలు.. ఆటా వేదికగా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏ అబ్బాయికి, ఏ అమ్మాయి కుదురుతుందన్న డాటా బేస్‌లతో తల్లితండ్రులకు వివరించారు. అగ్రరాజ్యంలో సెటిల్ అయినా కుల, ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం రాజీ పడకపోవడం కనిపించింది. అమెరికాలో ఫలానా రాష్ట్రంలో మా అమ్మాయి ఉంది, మాకు ఇక్కడి అబ్బాయి కోసం చూస్తున్నామని, ఇండియా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేకంటే ఇక్కడి వారి సంబంధం కోపమే చూస్తున్నామని ఓ తండ్రి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక ఆకర్షణగా బతుకమ్మ తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో బతుకమ్మ వేడుకలను ఆటాలో ప్రత్యేకంగా జరుపుకున్నారు. పలువురు తెలంగాణ ఎన్నారై మహిళలు రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలతో తరలివచ్చారు. అమ్మవారి ప్రతిమతోపాటు, త్రిశూలాలు, ఇతర పూజా సామాగ్రి.. అచ్చం తెలంగాణ సంస్కృతి కొలువు దీరినట్లు కనిపించింది. బతుకమ్మ తరలి వస్తుంటే పలువురు ఆనందంతో నృత్యం చేశారు. 'ప్రపంచంలో తెలుగు వారంతా ఒక్కటే. రాష్ట్రఆలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే విభజించినా.. విదేశాల్లో మాత్రం తెలుగు వారంతా కలిసే ఉంటారని అనడానికి ఈ వేడుకలే నిదర్శనం. విదేశాల్లో ఏ కార్యక్రమం జరిగినా, ఎవరికి సాయం కావాల్సి వచ్చినా తెలంగాణ సీఎం కెసిఆర్ ముందుంటారన్నారు. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్' అని కవిత అన్నారు. -
రేపటి నుంచే ఆటా రజతోత్సవాలు
చికాగో: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పడి 25 సంవత్సరాలు గడచిన సందర్భంగా.. మూడు రోజుల పాటు రజతోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి ఆటా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి(శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో చికాగోలోని రోజ్‌మెంట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఆటాలో ముఖ్యసభ్యులు కొందరు అరోరాలోని తమరిండ్ రెస్టారెంట్లో సమావేశమై రజతోత్సవ ఏర్పాట్లకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మూడు రోజులపాటూ ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకలకు హాజరయ్యే వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆటా అధ్యక్షుడు సుధాకర్.ఆర్.పెర్కారి తెలిపారు. అమెరికాలో నివాసముంటున్న తెలుగు వారి సంక్షేమం కోసం 25 సంవత్సరాల క్రితం ఆటా ఏర్పడింది. అప్పటి నుంచి తెలుగు రాష్ర్టాలతో పాటూ అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను ఆటా నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఆటా రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కన్వెన్షన్ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాషా పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న ఆటా వేడుకలకు తెలుగువారు భారీ ఎత్తున హాజరై భావితరాలవారికి వారధులుగా నిలవాలని కాన్ఫరెన్స్ డైరెక్టర్ కేకే రెడ్డి తెలిపారు. రజతోత్సవ వేడుకలు భావోద్వేగంతో కూడుకున్నవని నిబద్ధతతో విజయవంతం చేయడానికి తమవంతు కృషిచేస్తున్నామని ఆటా ట్రస్టీ హనుమంత్ రెడ్డి తెలిపారు. ఎంతో ఘణమైన చరిత్ర ఉన్న ఆటా ఉత్సవాలు తొలిసారి చికాగోలో 1991లో ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. కాన్ఫరెన్స్ కో కన్వీనర్ కృష్ట ముశ్యమ్, కన్వెన్షన్ మీడియా అధికార ప్రతినిధి కీర్తి కుమార్ రావూరిలు మాట్లాడుతూ మూడు రోజులపాటూ జరిగే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్టు తెలిపారు. ఇఫ్తీకర్ షరీఫ్, హరీష్ కొలసాని, భాను స్వర్గమ్లు ఆటా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో కరుణాకర్ అసిరెడ్డి, మధు బొమ్మినేని, అనిల్ బోడిరెడ్డి, కమల చిమట, జగన్ బుక్కరాజు, డా. మెహర్ మేడవరం, వెంకట్ తుడి, రమణ అబ్బరాజు, మోహన్ మన్నె, శర్మ కంకపాక, హరీశ్ కొలసాని, ఉమా కట్‌కి, పార్త పంతం, సుజాత అప్పలనేని, దినకర్ కరుమురి, రమేశ్ గారపాటి, మల్లారెడ్డి, విక్రం రెడ్డి, శ్రీనివాస్ పెదమల్లు, కరుణాకర్ రెడ్డి దొడ్డం, రామరాజు, చలమారెడ్డి బండారు, మహేందర్ ముస్కుల, రమేశ్ పూల, సాయి ప్రియారెడ్డి, ఉషా ప్రీతి, బింది గంగటి, అమర్ నీతం, యెడవల్లి మూర్తి, చాందినీ దువ్వూరి, వీజే రెడ్డి, సునితా రెడ్డి, రాధా కృష్ణా రెడ్డి, సుధీర్ వేల్పుల, రత్నాకర్ కరుమరి, రోహిణి బొక్క, రవి తొక్కల, గోవింద్‌లు పాల్గొన్నారు. -
ఆటా రజతోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు..
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పడి 25 సంవత్సరాలు గడచిన సందర్భంగా.. మూడు రోజుల పాటు రజతోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి ఆటా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూలై 1 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలోని చికాగోలోని రోజ్‌మెంట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఆటా రజతోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం జూన్ 12న ఆరోరాలో పలువురు ఆటా సభ్యులు సమావేశమయ్యారు. ఏర్పాట్ల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆటా అధ్యక్షుడు సుధాకర్.ఆర్.పెర్కారి, ఆటా ట్రస్టీ హనుమంత్ రెడ్డి, కన్వెన్షన్ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, కన్వెన్షన్ డైరెక్టర్ కేకే రెడ్డి, ఆటా కీలక సభ్యులు కృష్ట ముశ్యమ్, కమల్ చిమ్టాలు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సూక్ష్మ స్థాయి నుంచి జరుగుతున్న పనుల గురించి చర్చించారు. అమెరికాలో నివాసముంటున్న తెలుగు వారి సంక్షేమం కోసం 25 సంవత్సరాల క్రితం ఆటా ఏర్పడింది. అప్పటి నుంచి తెలుగు రాష్ర్టాలు, అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను ఆటా నిర్వహిస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాషా పరిరక్షణ ధ్యేయంగా పని చేస్తూ, అమెరికాలోని చిన్నారులకు వాటిపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని అవలంభించే విధంగా కృషి చేస్తోంది. గత సంవత్సరం డిసెంబర్లో నిర్వహించిన సంగీత, నృత్యపోటీల్లో విజేతలుగా నిలిచిన వారిచే ప్రదర్శన ఇప్పించడంతో పాటు ఆట రజతోత్సవాల్లో వారిని ఘనంగా సన్మానించనున్నారు. -
‘ఆటా’ సభలకు సీఎంకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎం కేసీఆర్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 1 నుంచి మూడు రోజుల పాటు షికాగో నగరంలో ఈ సభలను నిర్వహించనున్నారు. ఆటా వ్యవస్థాపకులు హన్మంతరెడ్డి, దామోదర్ రెడ్డి, అధ్యక్షుడు సుధాకర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఉనుగు లక్ష్మణ్ తదితరులు శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సభల్లో ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తెలుగు ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. తమ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించారని అనంతరం వారు చెప్పారు. ఆటా ప్రతినిధులతో పాటు మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎంను కలిశారు. -
ఆటా అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి
-
ఆటా అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి
సాక్షి, హైదరాబాద్: అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి ఎన్నికయ్యారు. లాస్‌వేగాస్ నగరంలో ఈ నెల 17న నిర్వహించిన ఎన్నికల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆటా బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు లాస్‌వేగాస్, కాలిఫోర్నియాలో నివసిస్తున్న 200 మంది తెలుగువారు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. కమిటీ కార్యదర్శిగా మాధవి బొమ్మినేని, సభ్యులుగా కరుణాకర్ అసిరెడ్డి, అరవింద్ ముప్పిడి ఎన్నికయ్యారు.