ఒప్పంద పత్రాలను చూపుతున్న సంగీతారెడ్డి, సురేష్‌రెడ్డి తదితరులు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు టెలీమెడిసిన్ ద్వారా సెకండ్ ఒపీనియన్ సేవలు అందించేందుకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్ ముందుకొచ్చింది. హెల్త్‌నెట్ గ్లోబల్ లిమిటెడ్ సాంకేతిక సహకారంతో ఈ సేవలను అందించనుంది. ఈ మేరకు సోమవారం తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగిన సమావేశంలో అపోలో గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ సంగీతారెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌రెడ్డిలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఇప్పటికే అపోలో ఆస్పత్రి హెల్త్‌నెట్ గ్లోబల్ లిమిటెడ్ సాంకేతిక సహకారంతో టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో అమెరికా వైద్యులు చేరడంతో ఈ సేవలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్లిష్టమైన వ్యాధులతో బాధపడుతూ చికిత్సలకు తగ్గని మొండి జబ్బులు, వైద్య పరీక్షలు, వాటి తాలూకు రిపోర్టులను మీసేవా కేంద్రాల ద్వారా గానీ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా గానీ ఆన్‌లైన్‌లో అమెరికాలో ఉన్న వైద్యులకు పంపిస్తారు. వారు రోగి తాలుకూ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి, జబ్బుకు కారణాలు, చికిత్సల్లో వైద్యులు అనుసరించాల్సిన పద్ధతులు, వాడాల్సిన మందులను సూచిస్తారు.
తద్వారా మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సైతం నిపుణుల వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. 90 రోజుల్లో ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. సెకండ్ ఒపీనియన్ పొందాలని భావించే బాధితులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో ఆయా వైద్యుల అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1982లో స్థాపించిన ఈ అమెరికన్ అసోసియేషన్‌లో ఇప్పటి వరకు 80వేలకుపైగా వైద్యులు, 40వేలకు పైగా వైద్య విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. వీరు దేశంలోని ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సహా రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచితంగా టెలీమెడిసిన్ వైద్యసేవలు అందించనున్నారు. ఇదిలా ఉంటే అపోలో ఆస్క్ టెలీమెడిసిన్ ద్వారా ఇప్పటి వరకు 10 మిలియన్ టెలీమెడిసిన్ సేవలు అందించినట్లు ఆ ఆస్పత్రి డైరెక్టర్ సంగీతారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. మాతృభూమికి కొంత సేవ చేయాలనే ఆలోచనతోనే వైద్యులు ఈ తరహా సేవలను అందించేందుకు ముందుకు వచ్చారని సురేష్‌రెడ్డి తెలిపారు. టెలీమెడిసిన్ వైద్య సేవల విషయంలో అపోలో–అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్‌ల మధ్య అవగాహాన ఒప్పందం కుదరడం ఒక చారిత్రక దినంగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment