‘ఆటా’ సభలకు సీఎంకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎం కేసీఆర్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 1 నుంచి మూడు రోజుల పాటు షికాగో నగరంలో ఈ సభలను నిర్వహించనున్నారు. ఆటా వ్యవస్థాపకులు హన్మంతరెడ్డి, దామోదర్ రెడ్డి, అధ్యక్షుడు సుధాకర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఉనుగు లక్ష్మణ్ తదితరులు శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సభల్లో ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తెలుగు ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. తమ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించారని అనంతరం వారు చెప్పారు. ఆటా ప్రతినిధులతో పాటు మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎంను కలిశారు.