అమెరికా వీడి.. మీ దేశానికి వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో వరుసగా జాతి వివక్ష దాడులు జరుగుతుండటం.. శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీష్ పటేల్ దారుణ హత్యకు గురికావడం.. దీప్ రాయ్ సహా పలువురిపై దాడులు జరగడంతో ప్రవాస భారతీయులు అభద్రత భావానికి గురవుతున్నారు. శ్వేతజాతి వారి నుంచి.. విడిచి మీ దేశానికి వెళ్లిపోండి వంటి మాటలతో ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు.
అమెరికాలోని ఒహియో రాష్ట్రం దబ్లిన్‌లోని కారా పార్క్ కమ్యూనిటీలో ప్రవాస భారతీయులు సాయంత్రం వేళల్లో కలుసుకునేవారు. వీరిలో చాలావరకు హెచ్ 1 బీ వీసా కలిగిన వారే. పార్క్‌లో పిల్లలను ఆడించేవారు. కాసేపు సరదాగా క్రికెట్ ఆడేవారు. భారత వంటకాలు, అమెరికాలో జీవితం గురించి ముచ్చట్లు చెప్పుకునేవారు. ఇదంతా గతం. ఇప్పుడు వారిలో ఆ సంతోషం మాయమైంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళన. అభద్రతాభావం. బయటకు రావాలంటే భయపడుతున్నారు. క్రికెట్, ముచ్చట్లు బంద్ చేశారు. స్థానిక శ్వేతిజాతి వారికి తాము టార్గెట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.
శ్వేతిజాతి వాళ్లు తమను మీ దేశానికి వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నారని, జాతివివక్షతో దూషిస్తున్నారని భారతీయులు వాపోయారు. రెండు దశాబ్దాలుగా ఒహియోలో ఉంటున్న మరో భారతీయుడు ఇలాంటి పరిస్థితి తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని చెప్పాడు. ఓ యువకుడు తనను మీ దేశానికి వెళ్లిపో అంటూ హేళనగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు శ్వేతిజాతి దుండగులు భారతీయులను దూషిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అక్కడక్కడా భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు.