ప్రతీకాత్మక చిత్రం
శిరీష (పేరు మార్చడమైంది) నిద్రలేస్తూనే ఫోన్ చేతిలోకి తీసుకుంది. కాసేపు ఫోన్‌లో వచ్చిన నోటిఫికేషన్స్ చూసి, విసుగనిపించి గదిలోనుంచి బయటకు వచ్చేసింది. నెల రోజులుగా ఇదే తంతు. చేస్తున్న ఉద్యోగం కరోనా కారణంగా పోయింది. ఉద్యోగం లేకుండా ఇంటిపట్టునే ఉంటే గడిచే రోజులు కావు. ఆలోచిస్తూనే తల్లి ఇచ్చిన టిఫిన్‌ను ముగించి, తిరిగి ఫోన్ అందుకుంది. అప్పుడే ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్ కావడంతో ఎవరై ఉంటారనుకుంటూ ఫోన్ రిసీవ్ చేసుకుంది. ఆ వచ్చిన ఫోన్ కాల్‌తో శిరీష్ ముఖం వెలిగిపోయింది. ఆన్‌లైన్‌లో వచ్చిన జాబ్ ఆఫర్‌కి రాత్రే అప్లై చేసింది. తెల్లవారుజామునే ఉద్యోగానికి సెలక్ట్ అయ్యినట్టు ఫోన్ వచ్చింది.
నాలుగు రోజులు గడిచాయి. ఎంత పిలిచినా శిరీష గది దాటి రావడం లేదు. దాంతో తల్లే తన గదిలోకి వెళ్లి భోజనం పెట్టి వస్తూ ఉంది. ‘ఉద్యోగం వచ్చిందని తెగ సంబరపడ్డావు. ఇప్పుడేమయ్యింది. ఇలా ఎందుకున్నావ్’ అంటూ తల్లి అడుగుతూనే ఉంది. కానీ, శిరీష మౌనంగా ఉంటోంది. ‘ఉద్యోగం లేదన్నారేమో.. అందుకే శిరీష ఇలా డల్ అయిపోయింది’ అనుకుంటూ.. కూతురును సముదాయించింది తల్లి. అర్ధరాత్రి మంచినీళ్ల కోసం లేచిన తల్లికి ఉరేసుకుంటూ కనిపించిన కూతుర్ని చూసి గుండెలదిరాయి. భర్తను లేపి, శిరీషను ముప్పు నుంచి తప్పించింది. విషయమేంటని నిలదీస్తే.. శిరీష చెప్పింది విని తల్లీతండ్రి తలలు పట్టుకున్నారు.
పర్సనల్ ఫొటోలు పంపిస్తే..
ఫోన్ ఇంటర్వ్యూలోనే జాబ్‌కి ఎంపిక చేస్తారని రవి (పేరు మార్చడమైంది) అనే వ్యక్తి రోజూ ఫోన్ చేస్తుండేవాడు. కాల్ వచ్చిన ప్రతీసారి రిప్లై ఇవ్వమంటూ కోరాడు. చేసేది ఫ్రంట్ ఆఫీస్ జాబ్ కాబట్టి, అందంగా ఉండాలని చెప్పేవాడు. శిరీష అందంగా హీరోయిన్‌గా ఉండటం వల్లే ఈ జాబ్‌కి ఎంపిక చేసినట్టుగా చెప్పేవాడు. తక్కువ వ్యవధిలో బాగా తెలిసిన వ్యక్తిలా ఫోన్‌లోనే పరిచయం పెంచుకున్నాడు రవి. పర్సనల్ ఫొటోలు షేర్‌చేయమని చెప్పాడు. జాబ్ వస్తుందనే గ్యారెంటీ మీద రవి మీద నమ్మకంతో అతడు అడిగిన విధంగా ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేసింది శిరీష. ఆ మరుసటి రోజు నుంచే ఫొటోలను అడ్డు పెట్టుకొని రవి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. శిరీష పంపించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించడంతో విధి లేక అతను అడిగిన డబ్బును కొద్ది కొద్దిగా ఇస్తూ వచ్చింది. కానీ, ఇంటి పరిస్థితి బాగోలేకపోవడం, తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే వాళ్లేమవుతారో అని భయపడి చనిపోదామని నిర్ణయించుకుంది.
16 రాష్ట్రాలు.. 600 మంది యువతులు
రిక్రూటర్‌గా నటించి దేశవ్యాప్తంగా 600 మంది మహిళలను మోసం చేసిన చెన్నైకి చెందిన టెక్కీని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. రాజ్ చెజియాన్ అనే వ్యక్తి రిక్రూటర్‌గా నటించి, 16 రాష్ట్రాలకు చెందిన యువతులను ఆకర్షించి, ఉద్యోగం నెపంతో వారి నగ్న, ప్రైవేట్ చిత్రాలను అతనితో పంచుకునేలా చేశాడు. ఎంక్వైరీలో మోసపోయిన యువతుల్లో హైదరాబాద్ నుండి కూడా 60 మంది ఉన్నట్టు గుర్తించారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో సహా పలు రాష్ట్రాల మహిళలను మోసం చేస్తూ వచ్చాడు. అతను ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నప్పుడు ఉద్యోగాల కోసం మహిళలు అప్లై చేసుకున్న పోర్టల్‌ను చూసేవాడు. మహిళా ఉద్యోగుల అప్లికేషన్లు పెరుగుతుండటం గ్రహించి, ఈ పథకం వేశాడు.
తప్పుడు పేరుతో ఫోన్ కాల్స్..
చేజియాన్ ఫైవ్ స్టార్ హోటల్ డైరెక్టర్ ప్రదీప్‌గా నటిస్తూ యువతులకు ఫోన్ కాల్స్ చేసేవాడు. మహిళలను ఇంటర్వ్యూలకు ఆహ్వానించి, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ నుండి పిలుపు కోసం ఎదురుచూడమని చెప్పేవాడు. ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం కాబట్టి అభ్యర్థి శరీర ఆకృతి గురించి సంస్థ నిబంధనలు పొందిపరిచి ఉందని, అందుకు వాట్సాప్ ద్వారా మహిళలను పలు కోణాల నుండి నగ్న చిత్రాలను పంచుకోవాలని కోరేవాడు. వీడియో కాల్ చేసి, సదరు మహిళను నగ్నంగా ఉండమని, ఆ దృశ్యాలను రికార్డు చేసేవాడు. చివరకు సైబర్ సేఫ్టీ ద్వారా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్దనున్న ల్యాప్‌టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో మహిళల నగ్న ఫోటోలు భద్రపరచి ఉండటం గమనించారు. ఈ చిత్రాలను అడ్డుగా పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నట్టు నిర్ధారించారు.
ఉద్యోగ మోసాలు గుర్తించండిలా...
►అర్హత లేకపోయినా సులువుగా ఉద్యోగం ఇస్తాం అనే విషయాన్ని నమ్మకూడదు.
►వర్క్‌ఫ్రమ్ పేరుతో అధిక ఆదాయం ఎర చూపి, అర్హత లేకపోయినా ఇచ్చే ఉద్యోగాలు దాదాపుగా మోసపూరితమైనవే అని గుర్తించాలి. తక్కువ కష్టంతో ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉద్యోగం ఎందుకు ఇస్తున్నారు అని అనుమానించాలి.
►సోషల్ మీడియా మోసాలు అధిక ఆదాయానికి బదులుగా కొన్ని సరళమైన పనులు (ఫాలో, లైక్, షేర్, కామెంట్.. వంటివి) చేయటానికి ఆఫర్ ద్వారా బాధితుడు ఆకర్షితుడవుతాడు. ఇది కూడా తగదని గుర్తించాలి.
►కెరీర్ కన్సల్టింగ్ మోసాలలో రెజ్యూమ్ రైటింగ్, ఫార్వర్డింగ్, ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదా ఇతర వృత్తి సంబంధిత సేవలను ఆఫర్ చేస్తుంటారు.
►ఇంటర్వ్యూ అయిన వెంటనే సదరు ‘ఇంటర్వ్యూయర్’ మిమ్మల్ని సంప్రదించడం, ఆఫర్లు చెప్పడం చేస్తారు.
►ఇ–మెయిళ్ళు, టెలిఫోన్ సంప్రదింపుల ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని అవతలి వారికి షేర్ చేయకూడదు.
►సాధారణ డేటా ఎంట్రీ ఉద్యోగమైనా చట్టపరమైన ఒప్పందంపై సంతకం చేయమని కోరండి.
– అనీల్ రాచమల్ల,
డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫేండేషన్ ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment