ఫేస్‌బుక్‌తో ఇక ఉద్యోగావకాశాలు!
పొద్దస్తమానం ఫోన్లో ఫేస్‌బుక్ ఓపెన్ చేసుకుని చాటింగ్ చేయడం, లైకులు కొట్టడం ఇదే పనా అని పిల్లలను పెద్దవాళ్లు తిడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే ఫేస్‌బుక్ వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానని చెబుతోంది. దాంతో ఇక తల్లిదండ్రులే 'కాసేపు ఫేస్‌బుక్ చూడరా' అని చెప్పే పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం అమెరికా, కెనడాలలోని యువతీ యువకులు ఫేస్‌బుక్ నుంచే నేరుగా ఉద్యోగాలకు దరఖాస్తు కూడా చేసేసుకోవచ్చట. సాధారణంగా ఉద్యోగావకాశాల గురించి చెప్పే లింక్‌డ్ ఇన్, మాన్‌స్టర్ లాంటి సైట్లలో అకౌంట్లు లేని వాళ్లకు కూడా ఫేస్‌బుక్ అకౌంట్లు తప్పనిసరిగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కొత్తగా ఆలోచించింది. అకౌంటులో పేర్కొన్న వివరాలు, విద్యార్హతలు, వయసు తదితర అంశాల ఆధారంగా వాళ్లకు సరిపోయే ఉద్యోగాలు ఏవేం ఉన్నాయో డిస్‌ప్లే చేయడంతో పాటు.. అక్కడే దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించడం బాగా ఎక్కువైంది. తాము ఈ మార్గం ద్వారానే ఉద్యోగాలు పొందినట్లు అమెరికాలోని 1.44 కోట్ల మంది యువతీ యువకులు ఓ సర్వేలో తెలిపారు. మొత్తం కంపెనీలలో 73 శాతం తాము సోషల్ మీడియాను ఉపయోగించి విజయవంతంగా రిక్రూట్‌మెంట్లు చేసుకున్నట్లు చెప్పాయి. ఇక ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవాళ్లు కూడా ఏవో కారణాల వల్ల ఉద్యోగాలు మారాలని అనుకుంటారని, అలాంటి వాళ్లకు వాళ్ల అనుభవాన్ని బట్టి అదే రంగంలో కొత్త ఉద్యోగాలు ఏవేం ఉన్నాయో తెలియజేస్తామని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ బాస్‌వర్త్ తెలిపారు. ఇటు ఉద్యోగాలు కావాలనుకునేవాళ్లతో పాటు మంచి ఉద్యోగులు కావాలని అనుకునేవాళ్లకు కూడా ఫేస్‌బుక్ ఒక మంచి అవకాశమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ మీడియా ద్వారా దరఖాస్తు చేసినప్పుడు వాళ్ల ప్రొఫైల్ ఎటూ తెలుస్తుంది కాబట్టి, వాళ్ల ఇష్టాయిష్టాలు, అభిరుచులు, ప్రవర్తన తదితర విషయాలను కూడా రిక్రూటర్లు తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఫేస్‌బుక్‌లో వచ్చే ఉద్యోగావకాశాలు అన్నీ ఒక లిస్టులా కనిపిస్తాయి. ప్రతిదాని పక్కన అప్లై నౌ అనే బటన్ ఉంటుంది. అది నొక్కితే చాలు.. అప్పటికే ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం ఆటోమేటిగ్గా ఫిలప్ అయి ఉంటుంది. వాటిలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే చేసి, అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. పెద్ద పెద్ద ఉద్యోగాలతో పాటు పార్ట్ టైం ఉద్యోగాల గురించి కూడా ఇందులో చెబుతున్నారు. ఉదాహరణకు తమకు పియానో, గిటార్, సంగీతం నేర్పించేవాళ్లు కావాలని.. గంటకు 50 డాలర్లు చెల్లిస్తామని ఒక ప్రకటన ఈమధ్య వచ్చింది. ఇలా అన్నివర్గాలకూ ఫేస్‌బుక్ ఉద్యోగావకాశాలు బాగా పనికొస్తాయని అంటున్నారు. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫీచర్ త్వరలోనే భారతదేశంలో కూడా వచ్చేస్తుందని అనుకుంటున్నారు.