ఆటోమేషన్‌.. జాబ్‌ ఆఫర్లు అపారం! | Career Opportunities in Robotics And Automation in India, Salary, Jobs, Latest Trends | Sakshi
Sakshi News home page

ఆటోమేషన్‌.. జాబ్‌ ఆఫర్లు అపారం!

Published Wed, Oct 20 2021 8:11 PM | Last Updated on Wed, Oct 20 2021 8:15 PM

Career Opportunities in Robotics And Automation in India, Salary, Jobs, Latest Trends - Sakshi

డిజిటలైజేషన్‌.. ఆటోమేషన్‌.. ఇప్పుడు అన్ని రంగాల్లో వినిపిస్తున్న మాట! మానవ ప్రమేయం తగ్గించి ఆటోమేషన్‌ విధానంలో కార్యకలాపాలు నిర్వహించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకోసం రోబోటిక్‌ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) మొదలు తయారీ వరకు.. అన్ని రంగాల్లో రోబో ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా.. రోబోటిక్స్‌ రంగం యువతకు కొలువుల వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. రోబోటిక్స్‌ కొలువులు, తాజా ట్రెండ్స్, అవసరమైన నైపుణ్యాలు, అందుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. 

కొన్నేళ్ల క్రితం వరకు మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో ముఖ్యంగా ఆటోమొబైల్‌ పరిశ్రమల్లోనే ఇండస్ట్రియల్‌ రోబోల వినియోగం ఉండేది. క్రమేణా ఇది ఇతర రంగాల్లోకి దూసుకొస్తోంది. ఇప్పుడు ఐటీ, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, డిఫెన్స్,స్పేస్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో సైతం రోబో ఆధారిత కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లోని ఐటీ సంస్థలు రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌(ఆర్‌పీఏ) ద్వారా కార్యకలాపాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకోసం ఆర్‌పీఏ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ప్రయత్నంలో ఉన్నాయి.

అందుకే ఆటోమేషన్‌
డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా మానవ ప్రమేయం తగ్గించొచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అందుకోసం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లను వినియోగించాలనే ఆలోచన చేస్తున్నాయి. అంటే.. వ్యక్తులు చేయాల్సిన అనేక కార్యకలాపాలు రోబోల ద్వారా నిర్వహిస్తారు. నాస్‌కామ్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–పది మంది చేసే పనిని ఒక్క రోబో ద్వారా వేగంగా పూర్తిచేయొచ్చు. ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే సంస్థలు రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ వైపు దృష్టిపెడుతున్నాయి. 


కొత్త కొలువులు

► ముఖ్యంగా ఇటీవల కాలంలో ఐటీ విభాగంలో ఆటోమేషన్‌ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఐటీ అనుబంధ విభాగంగా పేర్కొనే బీపీఓలో చాట్‌ బోట్స్, వర్చువల్‌ అసిస్టెంట్స్‌ పేరుతో రోబో ఆధారిత సేవలు అందించాలని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు భావిస్తున్నాయి. 

► సంస్థలు నిర్దిష్టంగా ఏదైనా ఒక విభాగంలో రోబోటిక్‌ సేవలు అందించాలని భావిస్తే.. దానికి సరితూగే విధంగా ప్రోగ్రామింగ్, కోడింగ్‌ వంటివి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోబోల తయారీ, నిర్వహణ, నియంత్రణకు మానవ నైపుణ్యం తప్పనిసరి. 

పది లక్షల ఉద్యోగాలు
► నాస్‌కామ్,బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–2022నాటికి రోబోటిక్స్‌ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. 

► ఐటీ బీపీఓ రంగంలో 2022 నాటికి రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌(ఆర్‌పీఏ) ఆధారిత సేవలు 70శాతం మేర పెరగనున్నాయి. దీనికి తగ్గట్టుగా 2022 చివరి నాటికి లక్షల ఉద్యోగాలు ఆర్‌పీఏ, రోబోటిక్స్‌ విభాగాల్లో లభించనున్నాయని అంచనా. nఒక్క భారత్‌లోనే 2022 నాటికి ఆటోమేషన్‌ విభాగంలో దాదాపు మూడు లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. 

నైపుణ్యాలు 
రోబోటిక్స్‌ విభాగంలో కొలువులు అందుకోవాలంటే.. నిర్దిష్టంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, కోడింగ్‌ స్కిల్స్‌; నానో టెక్నాలజీ; డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ; సంబంధిత కోర్‌ స్కిల్స్‌ సొంతం చేసుకోవాలి. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్‌ రంగంలో రోబోటిక్స్‌ విభాగంలో రాణించాలంటే.. రోబోల రూపకల్పనకు అవసరమైన స్పీచ్‌ రికగ్నిషన్, వాయిస్‌ రికగ్నిషన్‌ వంటి వాటిపై అవగాహన ఉండాలి. అదే విధంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, మెషీన్‌ లెర్నింగ్‌ నైపుణ్యాలు కూడా రోబోటిక్‌ రంగంలో రాణించేందుకు ఉపయోగపడతాయి. కారణం..రోబోల రూపకల్పన, నిర్వహణ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారితంగా ఉండటమే.

ఈ రోబోలకు డిమాండ్‌
ఇండస్ట్రియల్‌ రోబోట్స్, మెడికల్‌ రోబోట్స్‌; హెల్త్‌కేర్‌ రోబోట్స్, హాస్పిటాలిటీ రోబోట్స్, లాజిస్టిక్స్‌ రోబోట్స్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. వీటిలోనూ సిగ్నల్‌ ప్రాసెసింగ్, రోబోటిక్‌ మోషన్‌ ప్లానింగ్, ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్,ఏఐ అండ్‌ రోబోటిక్స్‌ విభాగాలు మరింత కీలకంగా మారుతున్నాయి. 

జాబ్‌ ప్రొఫైల్స్‌
రోబోటిక్స్‌ ఇంజనీరింగ్‌ లేదా రోబోటిక్స్‌ స్పెషలైజేషన్‌ చేసిన అభ్యర్థులకు.. రోబోటిక్స్‌ టెక్నీషియన్స్, రోబోట్‌ డిజైన్‌ ఇంజనీర్, రోబోటిక్స్‌ టెస్ట్‌ ఇంజనీర్స్, సీనియర్‌ రోబోటిక్స్‌ ఇంజనీర్స్, ఆటోమేటెడ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజనీర్, అగ్రికల్చర్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్, రోబోటిక్‌ సిస్టమ్‌ ఇంజనీర్‌ వంటి జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తున్నాయి. ఈ ఉద్యోగాల్లో నియమితులైన వారికి సంస్థ స్థాయి, కార్యకలాపాల ఆధారంగా రూ.మూడు లక్షల నుంచి రూ. పది లక్షల వరకూ వార్షిక వేతనం లభిస్తోంది.

స్కిల్స్‌కు మార్గం
► ఇప్పుడు అకడమిక్‌ స్థాయి నుంచే రోబోటిక్స్‌ నైపుణ్యాలు పొందే వీలుంది.

► ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు.. బీటెక్‌ స్థాయిలోనే రోబోటిక్స్‌ను మైనర్‌గా అందిస్తున్నాయి. 

► ఎంటెక్‌ స్థాయిలో రోబోటిక్స్‌ స్పెషలైజేషన్‌తో పూర్తి స్థాయి ప్రోగ్రామ్‌లను సైతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నాయి. 

► ఎంటెక్‌లో మెడికల్‌ రోబోటిక్స్‌; సిగ్నల్‌ ప్రాసెసింగ్‌; రోబోట్‌ మోషన్‌ ప్లానింగ్‌; ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌; ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ స్పెషలైజేషన్లు అభ్యసించడం ద్వారా ఆర్‌పీఏ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.

► ఏఐసీటీఈ సైతం రోబోటిక్స్, ఏఐ విభాగాలకు సంబంధించిన స్కిల్స్‌ అందించేలా కరిక్యులం రూపొందించాలని అనుబంధ కళాశాలలకు మార్గనిర్దేశం చేసింది. 

► వీటితోపాటు సీమెన్స్, రోబోటిక్స్‌ ఆన్‌లైన్, సర్టిఫైడ్‌ ఆటోమేషన్‌ ప్రొఫెషనల్, రోబోటిక్స్‌ టెక్నీషియన్‌ అండ్‌ ఆటోమేషన్‌ ట్రైనింగ్‌ వంటి పలు సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. 

సర్టిఫికేషన్‌ కోర్సులు
► రోబోటిక్స్‌లో పూర్తి స్థాయి కోర్సులు అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు మూక్స్‌ విధానంలో పలు సర్టిఫికేషన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేసుకుని నిర్ణీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జాబ్‌ మార్కెట్‌లో పోటీ పడే అవకాశం లభిస్తుంది. పలు సంస్థలు రోబోటిక్స్‌ సర్టిఫికేషన్స్‌ అందిస్తున్నాయి. అవి..

► రోబోటిక్స్‌ టెక్నీషియన్‌ అండ్‌ ఆటోమేషన్‌ ట్రైనింగ్‌: వెబ్‌సైట్‌: www.onlinerobotics.com

► రోబో జీనియస్‌ అకాడమీ: వెబ్‌సైట్‌: www.robogenious.in

► రోబోటిక్స్‌ ఆన్‌లైన్‌: వెబ్‌సైట్‌: www.robotics.org

► సర్టిఫైడ్‌ ఆటోమేషన్‌ ప్రొఫెషనల్‌: వెబ్‌సైట్‌: www.isa.org

రోబోటిక్స్‌.. ముఖ్యాంశాలు

► రోబోటిక్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో.. వచ్చే ఏడాది చివరికి ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మేర పెరగనున్న నియామకాలు. 

► పీడబ్ల్యూసీ, నాస్‌కామ్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా నివేదికల ప్రకారం–వచ్చే ఏడాది చివరికి పది లక్షల ఉద్యోగాలు. 

► అంతర్జాతీయంగా లక్షల కొలువులు లభిస్తాయని పలు సర్వేల అంచనా. 

► రోబోటిక్‌ జాబ్స్‌ అందించడంలో మూడో స్థానంలో భారత్‌. 

► ఈ విభాగాల్లో కనిష్టంగా రూ.మూడు లక్షలు, గరిష్టంగా రూ.10–12 లక్షల వార్షిక వేతనం. 

► రోబోటిక్‌ ఇంజనీర్లు, డెవలపర్స్‌కు సగటున నెలకు రూ.50వేల నుంచి రూ.80వేల వేతనం లభిస్తోంది. 

► బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌ వంటి సర్వీస్‌ సెక్టార్లలో నెలకు రూ.60వేల వరకు వేతనం ఖాయం. n సాఫ్ట్‌వేర్, ప్రొడక్షన్, మెకానికల్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్, మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థల్లో అధిక శాతం నియామకాలు.

ఇదే మంచి అవకాశం
రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ కార్యకలాపాలు పెరుగుతూ..దానికి సంబంధించిన విభాగాల్లో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. యువత దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలి. సంబంధిత నైపుణ్యాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. రోబోలతో ఉద్యోగాలు తగ్గుతాయన్న మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి.
– ప్రొ.కె.మాధవ కృష్ణ, అసోసియేట్‌ ప్రొఫెసర్, రోబోటిక్స్‌ రీసెర్చ్‌ సెంటర్, ఐఐఐటీ–హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement