ఆ విద్యార్థులకు సగటు వేతనం రూ.22లక్షలు
ఆ విద్యార్థులకు సగటు వేతనం రూ.22లక్షలు
Published Tue, Jun 20 2017 3:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
న్యూఢిల్లీ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) హైదరాబాద్ తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ విద్యార్థుల ఫైనల్ ప్లేస్ మెంట్లను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూటర్లను ఈ బీస్కూల్ 38 శాతం పెంచింది. దీనిలో భాగంగా మొత్తం 1,113 జాబ్ ఆఫర్స్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. సగటు వేతనం కింద రిక్రూటర్లు రూ.22 లక్షలను ఆఫర్ చేసినట్టు ఐఎస్బీ పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రైవేట్ రంగంలోనూ లీడర్ షిప్ పొజిషన్లకు విద్యార్థులు రిక్రూట్ అయినట్టు తెలిపింది. ఐఎస్బీ రిక్రూట్ మెంట్ సంస్థల్లో ఐటీ రంగ కంపెనీలే తొలిస్థానంలో నిలిచాయి.
ప్రస్తుతం ఐటీ రంగం అనిశ్చితి పరిస్థితుల్లో కొనసాగుతున్నప్పటికీ, ఐఎస్బీ విద్యార్థులకు ఐటీ/ఐటీఈఎస్ రంగాలు మొత్తం ఆఫర్లలో 20 శాతం, 21 శాతం ఆఫర్లను ప్రకటించాయి. వీటి తర్వాత బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, ఫార్మా రంగాలు నిలిచినట్టు ఐఎస్బీ పేర్కొంది. 400కు పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ క్యాంపస్ ఆఫర్లలో పాల్గొన్నాయి. టాప్ రిక్రూటర్లుగా మెక్కిన్సీ అండ్ కంపెనీ, బీఎస్జీ, ఆపిల్, మైక్రోసాఫ్ట్, సిటీ బ్యాంకు, నోవర్టీస్, అమెజాన్, కాగ్నిజెంట్, హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్, జోన్స్ లాంగ్ లాసాల్లె, హవెల్స్, రెవిగో, పీ అండ్ జీ, లెండింగ్ కార్ట్, రిలయన్స్ జియో, మైండ్ ట్రీ కన్సల్టింగ్, రోనాల్డ్ బెర్జర్ లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది పబ్లిక్ అడ్వకసీ, స్ట్రాటజీ పోస్టులకు 21 జాబ్ ఆఫర్లను ఈ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేసింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, సిటీ బ్యాంకు, యస్ బ్యాంకు, ఫిల్లిప్స్ ఇండియా లిమిటెడ్, టెక్ మహింద్రా, మ్యాక్స్, గెన్ ప్యాక్ట్ సంస్థలు లీడర్ షిప్ పొజిషన్లనే ఐఎస్బీ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేశాయి. యాక్సిస్ బ్యాంకు, అశోక్ లేల్యాండ్ లు మహిళా గ్రాడ్యుయేట్లను తమ లీడర్ షిప్ పొజిషన్లకు ఎంపికచేసినట్టు ఐఎస్బీ చెప్పింది. కార్గిల్, ఆపిల్, ల్యాండ్ మార్క్ గ్రూప్, బేకరెంట్, క్రెడిట్ యాక్సిస్ ఆసియా వంటి అంతర్జాతీయ సంస్థలు తొలిసారి ఐఎస్బీ విద్యార్థులను తమ కంపెనీల్లో రిక్రూట్ చేసుకున్నట్టు ఐఎస్బీ హైదరాబాద్ పేర్కొంది.
Advertisement
Advertisement