ISB hyderabad
-
దేశంలో నంబర్‌వన్ ఐఎస్బీ
రాయదుర్గం: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరోసారి దేశంలోని బిజినెస్ స్కూళ్లలో టాప్‌లో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్–2024ను సోమవారం విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్‌లో వరుసగా మూడవ ఏడాదీ హైదరాబాద్ ఐఎస్బీ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆసియా స్థాయిలో నంబర్–2గా గుర్తింపు పొందింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ర్యాంకింగ్స్‌ను ప్రతి ఏటా విడుదల చేస్తుంటారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా.. భవిష్యత్తు ఉపయోగం విషయంలో ఐఎస్బీ నంబర్ వన్ స్థానం పొందింది. బోధనా పద్ధతులు, మెటీరియల్స్ విషయంలో 25, డబ్బుకు తగిన విలువలో 15, తయారీ రంగంలో 27, ప్రోగ్రామ్ డిజైన్‌లో 28వ స్థానం పొందింది. గత ఏడాది 29..ఈ ఏడాది 26 అంతర్జాతీయ స్థాయిలో చూస్తే (గ్లోబల్ ర్యాంకింగ్స్) ఈ ఏడాది ఐఎస్బీ 26వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ర్యాంకు మెరుగుపర్చుకోవడం విశేషం. 2023లో ఐఎస్బీ 29వ స్థానంలో నిలిచింది. కాగా దేశంలో ఐఎస్బీ మూడేళ్లుగా నంబర్ వన్ స్థానంలో నిలువడంపై విద్యాసంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెరి్నంగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రొఫెసర్ దీపామణి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రపంచానికి భవిష్యత్తు నాయకులను అందజేసే అంతర్జాతీయ స్థాయి నిర్వహణ సంస్థగా ఐఎస్బీ భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు సంస్థ డీన్ పర్యవేక్షణలో అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. -
దేశంలో నంబర్‌వన్ బిజినెస్ స్కూల్ ‘ఐఎస్బీ’
సాక్షి, రాయదుర్గం: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ స్కూల్‌గా మరోసారి గుర్తింపు పొందింది. అదేవిధంగా ప్రపంచంలో 29వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్–2023ని సోమవారం ప్రకటించారు. గతేడాది ప్రపంచస్థాయిలో 38వ స్థానంలో ఉన్న ఐఎస్బీ ఈసారి 29వ స్థానంలో నిలవడం విశేషం. ఈ ర్యాంకులతో ఐఎస్బీ అసాధారణమైన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లకు మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినట్లయింది. ఇక భవిష్యత్‌లో అనుకూలించే ప్రోగ్రామ్‌ల విభాగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ ర్యాంకు పొందిన ఐఎస్బీ.. ఎఫ్టీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ఓపెన్ ర్యాంకింగ్ 2023లో దేశంలో మూడవ స్థానం, ప్రపంచంలో 65వ స్థానంలో నిలిచింది. కాగా గ్రోత్ పారామీటర్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఐఎస్బీ డిప్యూటీ డీన్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ప్రొఫెసర్ దీపామణి మాట్లాడుతూ ఎఫ్టీ ర్యాంకింగ్‌లో ఉన్నతస్థానంతో పాటు భవిష్యత్తు ఉపయోగం పారామీటర్‌లో నంబర్ వన్ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుత ర్యాంకింగ్ తాము మరింతగా కష్టించి పనిచేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సమిష్టి కృషికి ఇది నిదర్శనమన్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్తో భేటీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే! -
ప్రపంచాన్ని నిడిపించగల సత్తా భారత యువతలో ఉంది: ప్రధాని మోదీ
-
బడా కంపెనీలు నడపడమే కాదు.. చిరు వ్యాపారులనూ గుర్తుపెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులై వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులు పెద్దపెద్ద కంపెనీలను నడపడమే కాకుండా చిన్న వ్యాపారాలను, వ్యాపారులనూ గుర్తుపెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిరు వ్యాపారులకు టెక్నాలజీని అందుబాటులోకి తేవడంతోపాటు కొత్త మార్కెట్లను గుర్తించి వారికి చేరువ చేయాలని సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐఎస్బీ 20వ వార్షికోత్సవం, 2022 పీజీపీ విద్యార్థుల స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఐఎస్బీ హైదరాబాద్ క్యాంపస్‌తోపాటు మొహాలీ క్యాంపస్ విద్యా ర్థులతో ఉమ్మడిగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధాని ప్రోత్సాహకాలు అందించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ అమృత ఘడియల్లో ఐఎస్బీ విద్యార్థులు తమ వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలనూ జోడించి ముందడుగు వేయాలని కోరారు. వారికి ఇదో గొప్ప అవకాశమన్నారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించిన ఐఎస్బీ ఇప్పుడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న బిజినెస్ స్కూల్‌గా అవతరించిందని చెప్పారు. సంస్కరణల ఫలాన్ని దేశం చూస్తోంది... గత ప్రభుత్వాలు అసాధ్యంగా భావించిన అనేక పాలనా సంస్కరణలను తాము వేగంగా చేపట్టడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన రిఫార్మ్ (సంస్కరణలు), పెర్ఫార్మ్ (పనిచేయడం), ట్రాన్స్‌ఫార్మ్ (మార్పు తీసుకురావడం) నినాదం ఫలితాలను దేశం ఇప్పుడిప్పుడే చూస్తోందని ప్రధాని తెలిపారు. జీ–20 దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మొదలుకొని.. స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగంలో తొలి స్థానానికి, ఇంటర్నెట్, రిటైల్ రం గాల్లో రెండో స్థానానికి, స్టార్టప్‌ల రంగం, అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో మూడోస్థానంలో ఉండటాన్ని ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నా రు. ఇందులో ప్రభుత్వం మాత్రమే కాకుండా ఐఎస్బీ, వృత్తి నిపుణుల భాగస్వామ్యమూ ఉందన్నారు. భారతీయులకు, భారతీయ ఉత్పత్తులకూ తమ ప్రభుత్వ హయాంలో కొత్త గుర్తింపు, గౌరవం దక్కాయని, దేశ సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు, పరిష్కార మార్గాలు ఇప్పుడు ప్రపంచస్థాయిలో అమలవుతున్నాయని వివరించారు. దేశంలో వ్యాపారాభివృద్ధికి, విస్తరణకు ఇప్పుడున్న విస్తృత అవకాశాలను ఐఎస్బీ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. 2014 తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చర్యలను ఐఎస్బీతోపాటు మేనేజ్మెంట్ విద్యార్థులు తమ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అమలు చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలు లభిస్తాయని మోదీ తెలిపారు. సంబంధిత వార్త: నమో హైదరాబాద్.. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అప్డేట్స్ మీపై నమ్మకం ఉంది... కరోనాను ఎదుర్కొన్న తీరు భారత్ సత్తాను ప్రపం చానికి మళ్లీ చాటిందని ప్రధాని చెప్పారు. ఈ దేశ యువత ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్న నమ్మకం తనకుందన్నారు. విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రధాని మరోసారి ఈ విషయాన్ని చెబుతూ ‘నాకు మీపై నమ్మకం ఉంది. మీకు మీపై ఆ నమ్మకం ఉందా?’ అని ప్రశ్నించి.. ‘ఉంది’ అన్న సమాధానాన్ని రాబట్టారు. కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా ఇప్పుడు దేశం ఫిన్‌టెక్, వైద్యం, వైద్య విద్య, క్రీడల్లాంటి అనేక రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోందని, అద్భుత ప్రగతి సాధిస్తోందని ప్రధాని గణాంకాలతో వివరించారు. ప్రజల భాగస్వామ్యం కూడా పెరిగిన కార ణంగానే స్వచ్ఛ భారత్, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర హోం సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐఎస్బీ డీన్ పిల్లుట్ల మదన్‌తోపాటు చైర్మన్ హరీశ్ మన్వానీ, మొహాలీ క్యాంపస్ ముఖ్యాధికారి రాకేశ్ భారతీ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ వేదికపై ఉన్న ప్రముఖులను పేర్లతో పలకరించినా తలసానిని మాత్రం తెలంగాణ మంత్రిగానే ప్రస్తావించడం గమనార్హం! -
ప్రధాని హైదరాబాద్ పర్యటన: వ్యతిరేక ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ కంటే ముందుగా ఆయన హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 12గం.50ని.కు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఆపై ఒంటిగంట నుంచి పదిహేను నిమిషాల పాటు బీజేపీ నేతలతో భేటీ అవుతారు. ఆపై బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో హెచ్‌సీయూకి చేరుకుంటారు ప్రధాని. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో.. ఐఎస్బీకి వెళ్తారు. ఐఎస్బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ఆయన బేగంపేట్ చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు. బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. మోదీ వ్యతిరేక ఫ్లెక్సీలు ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా.. ఆయనకు స్వాగతం చెబుతూ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే అక్కడక్కడ వ్యతిరేక ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. మొత్తం పదిహేడు చోట్ల ప్రధానిని ప్రశ్నిస్తూ.. ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలంటూ టీఆర్ఎస్ నేతలు వీటిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. -
తెలంగాణకు మోదీ..అపూర్వ స్వాగతం పలికేలా భారీ ఏర్పాట్లు..షెడ్యూల్ ఇదే..
Modi Telangana Tour, సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రానికి రానున్నారు. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అదీగాక, కేంద్రంలో కాంగ్రెసేతర ప్రధానిగా ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మోదీకి అపూర్వమైన రీతిలో స్వాగతం పలకనుంది. గతంలో ప్రధాని పదవిని చేపట్టాక గుజరాత్లో అడుగిడినప్పుడు మోదీకి అక్కడ స్వాగతం పలికిన పంథాలో ఇక్కడా ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చే మోదీకి రాష్ట్ర ముఖ్యనాయకులు స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై నుంచి భారీగా తరలివచ్చే కార్యకర్తలు, ప్రజలకు మోదీ అభివాదం చేస్తారు. దాదాపు 10 నిమిషాలపాటు ఇక్కడివారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సంబంధిత వర్గాల నుంచి అనుమతి లభించినట్టు తెలుస్తోంది. ప్రధాని పర్యటనకు సుమారు 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ పర్యటనతో ఫుల్ జోష్ రాష్ట్ర బీజేపీలో మోదీ హైదరాబాద్ పర్యటన కొత్త ఉత్సాహం నింపుతోంది. దాదాపు 20 రోజుల వ్యవధిలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు రాష్ట్రానికి రావడం పార్టీకి శుభపరిణామంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలు రాష్ట్రపార్టీకి, శ్రేణులకు మంచి ఊపునిస్తున్నాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా జాతీయస్థాయి ముఖ్యనేతలు వరస పర్యటనలకు వచ్చేలా జాతీయ నాయకత్వం కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. మోదీకి స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల కోసం మొత్తం ఆరుసెట్ల నాయకుల లైనప్‌లను పార్టీ రూపొందించింది. మోదీ చెంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ, డా.కె.లక్ష్మణ్, టి.రాజాసింగ్, ఇతరనేతలు ఉండే అవకాశాలున్నాయి. బేగంపేట నుంచి హెచ్సీయూకు వెళ్లేటప్పుడు హెలికాప్టర్లో మోదీ వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెళ్లనున్నారు. అవకాశాన్ని బట్టి బండి సంజయ్ కూడా వెళ్లే అవకాశముంది. ప్రధాని హెచ్‌సీయూ నుంచి రెండు కి.మీ. దూరంలోని ఐఎస్బీకి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు. ప్రధాని హాజరుకానున్న ఐఎస్బీ స్నాతకోత్సవానికి పాస్‌లు ఉంటేనే అనుమతిస్తారు. సుమారు 1,200 మంది విద్యార్థులకు పాస్‌లు జారీ చేసినట్లు తెలిసింది. కేసీఆర్ తీరుతో ప్రజలు విసిగిపోయారు: కె.లక్ష్మణ్ ప్రధాని మోదీ ఐఎస్బీ స్నాతకోత్సవంలో విద్యార్ధులకు దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకపోవడం శోచనీయం. ముఖ్యమంత్రికి ముఖం చెల్లక బెంగుళూరు పర్యటన పేరుతో తప్పించుకు తిరుగుతున్నారు. విదేశీ పర్యటనలో ప్రవాస భారతీయులు ప్రధానికి బ్రహ్మరథం పడుతుండగా ఇక్కడ కేసీఆర్ మాత్రం రాజకీయాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఇక్కడి రైతుల బాధలను పట్టించుకోకుండా ఉత్తరాది రైతులను ఆదుకుంటామని చెప్పడం విచారకరం. అన్ని వర్గాల ఆశలను అడియాసలు చేసిన కేసీఆర్ తీరుపై ప్రజలు విసిగిపోయారు. ప్రధాని మోదీ షెడ్యూల్ హైదరాబాద్‌లో రెండున్నర గంటల పాటు సాగనున్న మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 1:25 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎస్, డీజీపీ, మేయర్ స్వాగతం పలుకుతారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి 1:50 గంటలకు హెచ్‌సీయూ క్యాంపస్‌లో దిగుతారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో 2 గంటలకు ఐఎస్బీకి చేరుకుంటారు. 3:15 గంటల దాకా ఐఎస్బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ప్రసంగిస్తారు. 3:20 గంటలకు ఐఎస్బీ నుంచి బయలుదేరి 3:30కు హెచ్సీయూకు వస్తారు. 3:50 గంటలకు బేగంపేటకు చేరుకొని 3:55 గంటలకు విమానంలో చెన్నైకి పయనమవుతారు. -
ISB Hyderabad: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది నగరంలోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్బీ). దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఈ కళాశాల. గురువారం ఐఎస్బీ స్నాతకోత్సవం, వార్షికోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనుండటం దీని ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఐఎస్బీ విశిష్టతలపై ప్రత్యేక కథనం ఇదీ.. స్థాపన ఇలా.. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహకారంతో పలువురు వ్యాపారవేత్తలు నగరంలోని గచ్చిబౌలిలో 260 ఎకరాల విస్తీర్ణంలో 1999 డిసెంబర్ 20న ఐఎస్బీని ఏర్పాటు చేశారు. ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ శంకుస్థాపన చేశారు. ఇది లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, లండన్ బిజినెస్ స్కూళ్లతో భాగస్వామ్య సంబంధాలు కలిగి ఉంది. ► ఐఎస్బీకి దేశంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, పంజాబ్‌లోని మొహలీలో క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. ఇది ఏఎంబీఏ, ఈక్యూయూఐఎస్, ఏఏసీఎస్బీల ద్వారా అక్రిడిటేషన్ల ‘ట్రిపుల్ క్రౌన్’ పొందిన ప్రపంచంలోని 100వ కళాశాలల్లో ఐఎస్బీ ఒకటి. గచ్చిబౌలిలోని ఐఎస్బీ క్యాంపస్‌కు ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. 930 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నారు. అప్పట్లో ప్రముఖుల సందర్శన.. ఐఎస్బీ గచ్చిబౌలి క్యాంపస్‌ను డిసెంబర్ 2, 2001న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రారంభించారు. 2006 డిసెంబర్ 5న డాక్టర్ మన్మోహన్సింగ్ క్యాంపస్‌కు విచ్చేశారు. 2006 మార్చి 1న అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సందర్శించారు. 2002 జనవరి 2న సింగపూర్ అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ పరిశీలించారు. 2002 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఐఎస్బీ క్యాంపస్‌ను సందర్శించారు. (క్లిక్: బేగంపేటలో మోదీ స్వాగత సభ?) ప్రపంచంలో 38వ స్థానం.. ఐఎస్బీ తాజాగా 2022లో ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ప్రోగ్రామ్స్ ర్యాంకింగ్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్‌లో ప్రపంచంలోనే 38వ స్థానం పొందింది. ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ స్కూల్‌గా కూడా ర్యాంకింగ్‌ను సాధించింది. ఎఫ్టీ ర్యాంకింగ్, అధిక– నాణ్యత పరిశోధన, విద్య కోసం భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్‌లో ఉంచింది. ఇదిలావుండగా ఐఎస్బీ ఫ్యూచర్ యూస్ పారామీటర్‌లో అంతర్జాతీయంగా 7వ స్థానంలో నిలిచింది. ‘డీ ల్యాబ్స్’తో నూతన ఆవిష్కరణలు.. ఐఎస్బీలోని గచ్చిబౌలి క్యాంపస్‌లో డీ ల్యాబ్స్ పేరిట నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ కేంద్రాన్ని 2015లో ప్రారంభించారు. దీంట్లో ఇప్పటి వరకు 125కు పైగా స్టార్టప్‌లను వివిధ రంగాలలో ఏర్పాటు చేశారు. దీనికి అంతర్జాతీయ ఇంక్యుబేటర్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవలే కేంద్రం రూ.5 కోట్ల నిధులను స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కింద మంజూరు చేసింది.70 స్టార్టప్‌లకు దాదాపు 350 కోట్ల నిధుల సేకరణ కోసం స్టార్టప్‌లు ముందంజ వేశాయి. ప్లేస్‌మెంట్స్‌లోనూ టాపే.. ► ప్లేస్‌మెంట్స్‌లోనూ ఐఎస్బీ దేశంలోనే టాప్‌గా నిలుస్తోంది. ప్రతియేటా 100 శాతం విద్యార్థులు ఉద్యోగాలు పొందడం విశేషం. 2019–20లో ఏడాదికి సరాసరి వేతనం రూ.42 లక్షలు, అత్యల్పంగా రూ.24.10 లక్షల వేతనం, 20–21లో సరాసరి వేతనం రూ.72 లక్షలు, అత్యల్పంగా రూ.27 లక్షల వేతనం లభించింది. 2021–22లో సరాసరి వేతనం రూ.34.07 లక్షలుగా పొందారు. ► 2019–20లో 1,504 ఆఫర్లు, 20–21లో 1,195 ఆఫర్లు, 2021–22లో 2,066 ఆఫర్లను విద్యార్థులు పొందారు. (క్లిక్: మోదీ హైదరాబాద్ టూర్; ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్) ► అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, హనీవెల్, యాక్సిస్ బ్యాంక్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, జెన్‌ప్యాక్ట్, విప్రో, సీకే బిర్లా గ్రూపు, కేపీఎంజీ, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, టెక్ మహీంద్ర, డీబీఎస్ బ్యాంక్, డిలాయిట్ యూఎస్ఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలు ప్లేస్మెంట్లో పాల్గొన్నాయి. ఐఎస్బీ–20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని పాల్గొనడం విశేషం.. ఐఎస్బీ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఆయన హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌ల విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ క్యాంపస్‌లో మొక్కను నాటి స్మారక ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఐఎస్బీ మై స్టాంప్, ప్రత్యేక కవర్‌ను విడుదల చేస్తారు. అకడమిక్ స్కాలర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పతకాలను కూ డా ప్రధాని చేతుల మీదుగా పంపిణీ చేస్తాం. – ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ఐఎస్బీ డీన్ -
మోదీ హైదరాబాద్ టూర్; ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (గురువారం) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి మధ్యలో ఉన్న ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని లేదా ఉద్యోగుల హాజరు సమయాలలో మార్పులు చేసుకోవాలని ఆయా కంపెనీలకు పోలీసులు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా: ► గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, మజీద్ బండ, హెచ్‌సీయూ డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలి. ► లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేవారు హెచ్‌సీయూ డిపో దగ్గర లెఫ్ట్ తీసుకుని మజీద్ బండ, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కి చేరుకోవాలి. ► విప్రో నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపనపల్లి ఎక్స్ రోడ్, హెచ్ సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల నుంచి లింగంపల్లికి వెళ్లాలి. ► విప్రో నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర రైట్ తీసుకుని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్, ఎల్ఆండ్ టీ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కి చేరుకోవాలి. ► కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కి వెళ్లేవారు కేబుల్ బ్రిడ్జ్ పైకి ఎక్కే ర్యాంప్ దగ్గర రైట్ తీసుకుని రత్నదీప్, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కి వెళ్లాలి. (క్లిక్: రెండో దశ మెట్రో రూట్ చేంజ్!) డ్రోన్లను ఎగురవేయొద్దు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భద్రత చర్యలలో ఐఎస్బీ, గచ్చిబౌలి స్టేడియం ప్రాంతాలలో డ్రోన్లను ఎగరేయడానికి అనుమతి లేదు. ఆయా ప్రాంతాల చుట్టూ 5 కి.మీ. పరిధిలో పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు నిషేధం విధించారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. (క్లిక్: హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!) -
ఐఎస్బీ విద్యార్థులకు భలే బొనాంజా
సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ విద్యకు నగరంలో క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. నగరంలో ఈ విద్యకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ కోర్సు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అత్యధిక వేతనాలతో పలు బహుళజాతి కంపెనీల్లో కొలువులు దక్కినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. తాజాగా ఓ విద్యార్థికి రూ.34 లక్షల వార్షిక వేతనం దక్కినట్లు పేర్కొన్నాయి. హైదరాబాద్ నగరంతోపాటు మొహాలీలో ఉన్న తమ విద్యాసంస్థకు ఈ ఏడాది సుమారు 270 కంపెనీలు ప్రాంగణ నియామకాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపాయి. ఆయా కంపెనీలు 2,066 ఉద్యోగాలను ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాయి. వీటిలో దేశ, విదేశాలకు చెందిన పలు కార్పొరేట్, బహుళజాతి కంపెనీలుండడం విశేషం. వర్చువల్ విధానంలో చేపట్టిన నియామకాల్లో పలువురు విద్యార్థినీ విద్యార్థులు అత్యధిక వేతనంతో కొలువులు సాధించినట్లు ప్రకటించాయి. గతేడాది సరాసరిన అత్యధికంగా లభించిన వేతన ప్యాకేజీ రూ.28.21 లక్షలు కాగా.. ఈసారి రూ.34 లక్షలకు పెరగడం విశేషం. కొలువులు.. ప్యాకేజీల జాతర.. ► ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మేనేజ్మెంట్ విద్యలో పీజీ చేస్తున్న వారిలో 39 శాతం మంది మహిళలే ఉండడం విశేషం. అత్యధిక వేతనాలు దక్కించుకున్న వారిలోనూ 41 శాతం మంది అతివలే ఉన్నట్లు వర్సిటీ ప్రకటించింది. తమ సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విద్యనభ్యసిస్తున్న వారు సుమారు 929 మంది ఉన్నట్లు తెలిపింది. పలు రంగాల్లో అగ్రభాగాన ఉన్న కంపెనీలు తమ విద్యార్థులకు కొలువులు ఆఫర్ చేసినట్లు ప్రకటించింది. మేనేజ్మెంట్, సాంకేతికత, కన్సల్టింగ్ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఐటీ,అనుబంధ రంగాలకు చెందిన కంపెనీలు సైతం 26 శాతం కొలువులను తమ విద్యార్థులకు ఆఫర్ చేసినట్లు ఐఎస్బీ ప్రకటించింది. ► బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలు సుమారు 10 శాతం కొలువులిచ్చాయట. కార్పొరేట్ ఫైనాన్స్, ట్రెజరీ, ప్రైవేట్– బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, మేనేజ్మెంట్, ఎఫ్ఎంసీజీ, రిటెయిల్, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లోనూ 5 శాతం చొప్పున తమ విద్యార్థులు జాబ్స్ దక్కించుకున్నట్లు వెల్లడించింది. ఈ– కామర్స్ రంగంలో 8 శాతం మంది జాబ్స్ లభించినట్లు తెలిపింది. (క్లిక్: ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ..) -
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సివిల్ ఏవియేషన్ మధ్య కీలక ఒప్పందం
దేశంలోని ప్రీమియం బిజినెస్ ఇన్సిస్టిట్యూట్లలో ఒకటిగా ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్, సివిల్ ఏవియేషన్ శాఖల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ ఉషా పధీ, ఐఎస్బీ డిప్యూటీ డీన్ మిలింద్ సోహానీ ఒప్పంద పత్రాల మీద సంతకం చేశారు. కొత్త సిలబస్ దేశీయంగా ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన ప్రయాణాలను చేరువ చేసే లక్క్ష్యంతో కేంద్రం ఉడాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ప్రాంతీయ, జిల్లా కేంద్రాలలో ఎయిర్‌పోర్టులు అభివృద్ది చేయనుంది. ఈ రీజనల్ కనెక్టివిటీ పథకం యొక్క ప్రభావం, ప్రయోజనాలు తదితర అంశాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లోతైన పరిశోధన చేపట్టి నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ నివేదికను ఓ కేస్ స్టడీగా ఇతర విద్యాలయాల్లో, అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్స్టిట్యూట్లలో ఉపయోగించుకుంటామని పౌర విమానయాన శాఖ చెబుతోంది. ట్రాఫిక్ పెరిగింది కోవిడ్ సంక్షోభం తర్వాత టూరిజం, భక్తులు ఎక్కుగా వచ్చే ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ పెరిగినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. -
హైదరాబాద్ ఐఎస్బీ.. దేశంలోనే టాప్!
రాయదుర్గం (హైదరాబాద్): గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) మరో అరుదైన ఘనత సాధించినట్లు ఐఎస్బీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్సీఎం జర్నల్ లిస్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఎస్సీఎం జర్నల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రీసెర్చ్ జర్నల్ పబ్లికేషన్స్‌లలో ప్రచురించబడిన పరిశోధనా పత్రాలను పరిగణిస్తుంది. ప్రధానంగా విశ్లేషణాత్మక, అనుభావిక రంగాలలో పరిశోధన పత్రాలపై దృష్టి పెడుతుంది. ఈ క్రమంలో ఉత్తమ నిర్వహణ పరిశోధన విశ్వవిద్యాలయాలు, బీ–స్కూల్స్, సంస్థల ర్యాంకింగ్స్‌ను ఎస్సీఎం జర్నల్ లిస్ట్ 2015–20 కాలానికి ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో ఐఎస్బీ దేశంలోని బిజినెస్ స్కూళ్ళలో మొదటిస్థానంలో, ప్రపంచస్థాయిలో 64వ స్థానంలో నిలిచింది. ఇక్కడ చదవండి: రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే.. ‘సేఫ్’ జోన్లోకి సైబర్ వాంటెడ్స్ -
‘జియో’కు ఏం ఎక్కువ, మాకేం తక్కువా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రముఖ ఉన్నత విద్యా సంస్థలను కాదని ఇంకా ఆవిర్భవించని ‘జియో ఇనిస్టిట్యూట్’ విద్యా సంస్థకు ‘ఎమినెన్స్ (అత్యున్నత)’ హోదాను కేంద్ర ప్రభుత్వ కల్పించడాన్ని ఈ హోదా కోసం జియోతో పోటీ పడిన సంస్థలేవీ ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అలా పోటీ పడిన 27 ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఓపీ జిందాల్ యూనివర్శటీ, అజీం ప్రేమ్‌జీ యూనివర్శిటీ, అశోక యూనివర్శిటీ, నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న విద్యా సంస్థల పురోగతి రికార్డును పరిగణలోకి తీసుకోకుండా ఎంత అద్భుతమైన ప్రణాళికలను చూపించినప్పటికీ రాబోయే విద్యా సంస్థ అద్భుతమైన పురోగతిని సాధిస్తుందని ఎలా విశ్వసిస్తారని ఈ హోదా దక్కని విద్యా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ‘జియో ఇనిస్టిట్యూట్’ను ప్రతిపాదించిన రిలయెన్స్ గ్రూపునకు దేశంలో చాలా మంచి పేరున్నందున, ఆ గ్రూప్ చేపట్టిన అన్ని ప్రాజెక్టులు విజయవంతంగా నడుస్తున్నందున, విద్యా సంస్థ కోసం 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినందున, సంస్థను ఏర్పాటు చేసిన 10 ఏళ్లలోనే ప్రపంచంలోని టాప్ 500 ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటిగా నిలిస్తుందని పూర్తి విశ్వాసం కలిగినందున ఆ సంస్థకు ‘ఎమినెన్స్’ హోదా ఇచ్చామని ఇటు ఎంపిక కమిటీ, అటు కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే ఈ హోదా కోసం యూజీసీ ప్రతిపాదించిన ప్రమాణాల మేరకే హోదా ఇచ్చారా ? అన్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పడం లేదు. ‘గ్రీన్‌ఫీల్డ్’ కేటగిరీ కింద ఇచ్చామంటూ చెప్పిందే చెబుతూ సమర్థించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయోత్నిస్తోంది. ఎందులో జియోతో తాము సరితూగమో చెప్పండని ఈ గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కిందనే దరఖాస్తు చేసుకున్న తమిళనాడులోని ప్రతిపాదిత క్రియా యూనివర్శిటీ (దీనికి మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సలహాదారు), ఒరిస్సా వేదాంత యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని ప్రముఖ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ కింద ఎందుకు దరఖాస్తు చేసుకున్నారని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా, యూనివర్శిటీ, డీమ్డ్ యూనివర్శిటీ హోదాలేని ఉన్నత విద్యా సంస్థలు గ్రీన్‌ఫీల్డ్ క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని 2017, నవంబర్ 17న యూజీసీ వివరణ ఇచ్చిందని, ఆ వివరణ మేరకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. తమ సంస్థలో భారతీయ విద్యార్థులతోపాటు విదేశీ విద్యార్థులు కూడా గణనీయంగా చదువుతున్నారని పేర్కొంది. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఒకే ఒక్క సంస్థకు అత్యున్నత హోదా ఇస్తున్నారని తెలియడంతో అది కాస్త జియోకే దక్కుతుందని తాము భావించామని, అందుకు ఆ సంస్థకు, ప్రభుత్వానికున్న రాజకీయ, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సమీకరణలు కారణం కావొచ్చని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని విద్యా సంస్థల యాజమాన్యాలు మీడియా ముందు వ్యాఖ్యానించాయి. ‘ఎమినెన్స్’ హోదా కింద ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రోత్సహకాలు ఏమీ ఉండకపోయినా విద్యా సంస్థపై పెట్టే పెట్టుబడులకు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. చదవండి: రిలయెన్స్ మీద అంత మోజెందుకు? -
ఆ విద్యార్థులకు సగటు వేతనం రూ.22లక్షలు
న్యూఢిల్లీ : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) హైదరాబాద్ తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ విద్యార్థుల ఫైనల్ ప్లేస్ మెంట్లను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూటర్లను ఈ బీస్కూల్ 38 శాతం పెంచింది. దీనిలో భాగంగా మొత్తం 1,113 జాబ్ ఆఫర్స్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. సగటు వేతనం కింద రిక్రూటర్లు రూ.22 లక్షలను ఆఫర్ చేసినట్టు ఐఎస్బీ పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రైవేట్ రంగంలోనూ లీడర్ షిప్ పొజిషన్లకు విద్యార్థులు రిక్రూట్ అయినట్టు తెలిపింది. ఐఎస్బీ రిక్రూట్ మెంట్ సంస్థల్లో ఐటీ రంగ కంపెనీలే తొలిస్థానంలో నిలిచాయి. ప్రస్తుతం ఐటీ రంగం అనిశ్చితి పరిస్థితుల్లో కొనసాగుతున్నప్పటికీ, ఐఎస్బీ విద్యార్థులకు ఐటీ/ఐటీఈఎస్ రంగాలు మొత్తం ఆఫర్లలో 20 శాతం, 21 శాతం ఆఫర్లను ప్రకటించాయి. వీటి తర్వాత బీఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, ఫార్మా రంగాలు నిలిచినట్టు ఐఎస్బీ పేర్కొంది. 400కు పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ క్యాంపస్ ఆఫర్లలో పాల్గొన్నాయి. టాప్ రిక్రూటర్లుగా మెక్కిన్సీ అండ్ కంపెనీ, బీఎస్జీ, ఆపిల్, మైక్రోసాఫ్ట్, సిటీ బ్యాంకు, నోవర్టీస్, అమెజాన్, కాగ్నిజెంట్, హిందూస్తాన్ యూనీలివర్ లిమిటెడ్, జోన్స్ లాంగ్ లాసాల్లె, హవెల్స్, రెవిగో, పీ అండ్ జీ, లెండింగ్ కార్ట్, రిలయన్స్ జియో, మైండ్ ట్రీ కన్సల్టింగ్, రోనాల్డ్ బెర్జర్ లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఏడాది పబ్లిక్ అడ్వకసీ, స్ట్రాటజీ పోస్టులకు 21 జాబ్ ఆఫర్లను ఈ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేసింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, సిటీ బ్యాంకు, యస్ బ్యాంకు, ఫిల్లిప్స్ ఇండియా లిమిటెడ్, టెక్ మహింద్రా, మ్యాక్స్, గెన్ ప్యాక్ట్ సంస్థలు లీడర్ షిప్ పొజిషన్లనే ఐఎస్బీ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేశాయి. యాక్సిస్ బ్యాంకు, అశోక్ లేల్యాండ్ లు మహిళా గ్రాడ్యుయేట్లను తమ లీడర్ షిప్ పొజిషన్లకు ఎంపికచేసినట్టు ఐఎస్బీ చెప్పింది. కార్గిల్, ఆపిల్, ల్యాండ్ మార్క్ గ్రూప్, బేకరెంట్, క్రెడిట్ యాక్సిస్ ఆసియా వంటి అంతర్జాతీయ సంస్థలు తొలిసారి ఐఎస్బీ విద్యార్థులను తమ కంపెనీల్లో రిక్రూట్ చేసుకున్నట్టు ఐఎస్బీ హైదరాబాద్ పేర్కొంది.