డీప్‌ఫేక్‌: ‘చెడు ఎంతో.. మంచి కూడా అంతే!’ | ISB Institute of Data Science Summit On Deepfake | Sakshi
Sakshi News home page

డీప్‌ఫేక్‌: ‘చెడు ఎంతో.. మంచి కూడా అంతే!’

Published Sat, Nov 30 2024 6:13 PM | Last Updated on Sat, Nov 30 2024 6:58 PM

ISB Institute of Data Science Summit On Deepfake

హైదరాబాద్‌, సాక్షి: డీప్ ఫేక్ ల వల్ల విపరీతైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డేటా సైన్స్ సమిట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 

ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం డీప్ ఫేక్ లను ఉపయోగిస్తూ ఉన్నారని, ఏఐ ద్వారా ముఖాలను మార్చడం, సెలెబ్రిటీల వాయిస్ తో ఇతర వ్యాఖ్యలు చేసేలా  ఏఐ ద్వారా సృష్టించడం జరుగుతూ ఉన్నాయన్నారు సుధాకర్ ఉడుముల. సినీ నటుల దగ్గర నుండి, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు, ఎవరినైనా సరే ఈ డీప్ ఫేక్ ల ద్వారా ఫేక్ వార్తలను సృష్టించడం వీలవుతుంది. ఒకప్పుడు డీప్ ఫేక్ లను గుర్తించడం కాస్త సులువుగా ఉండేది.. కానీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ కారణంగా ఏది డీప్ ఫేక్, ఏది ఒరిజినల్ అని కనుగొనడం కష్టంగా మారిపోతోంది. ఏఐని మంచి కోసం ఉపయోగించకుండా చెడు కోసం ఉపయోగిస్తూ ఉండడమే ఈ పరిణామాలకు కారణమవుతోందన్నారు. 

సెలెబ్రిటీల పరువు తీయడానికి, కొందరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దాడులు చేయడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ డీప్ ఫేక్ లను ఉపయోగిస్తూ ఉన్నారు. డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా లోకి వచ్చేయడం కూడా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రముఖ  సోషల్ మీడియా సంస్థలు ఫేస్ బుక్, ఎక్స్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ కూడా చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  సోషల్ మీడియా సైట్స్ 'ఇన్ బిల్ట్ డీప్ ఫేక్ డిటెక్షన్ అల్గారిథమ్' ను తీసుకుని వస్తే వీటిని కట్టడి చేయడం సులభం అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఈ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి కాబట్టి బాధ్యత తీసుకోవాల్సింది కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లదే. ఏఐ ని రెగ్యులేట్, ఎడ్యుకేట్, డిటెక్ట్ విషయంలో సమిష్టి కృషి అవసరం.  

భారతదేశంలో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఫ్యాక్ట్ చెకర్లు మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయెన్స్ ను స్థాపించారు. అందులో భాగంగా డీప్ ఫేక్ అనాలసిస్ యూనిట్ ను కూడా తీసుకొచ్చారు. ఎవరికైనా డీప్ ఫేక్ మీద అనుమానాలు ఉంటే ఈ యూనిట్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. భారత్ లో ఫ్యాక్ట్ చెకింగ్ కు సరైన తోడ్పాటును అందించడం లేదు. మీడియా లిటరసీలో భాగంగా డీప్ ఫేక్ అంటే ఏమిటి, అవి ఎలాంటి ప్రమాదాలకు కారణమవుతాయి లాంటి వివరాలను అందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది.  

లావోస్, కంబోడియా లాంటి దేశాల్లో కూర్చొని భారతదేశంలోని పిల్లలు కిడ్నాప్ అయ్యారు, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ ఆడియో, వీడియోలను వాడుతూ మోసాలకు తెగబడుతూ ఉన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. డీప్ ఫేక్ లు ఎన్నో మోసాల్లో భాగమయ్యాయి, మీడియాలోకి చొచ్చుకొస్తున్నాయి. ఎన్నికల ఫలితాలను మార్చే ప్రమాదం కూడా ఉంది. డీప్ ఫేక్ లను వాడి అసభ్యకరమైన వీడియోలను కూడా సృష్టిస్తూ ఉన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా మన వీడియోలను ఎవరైనా డీప్ ఫేక్ చేశారా అని కూడా తెలుసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డీప్ ఫేకింగ్ రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమవుతుంది. ఆర్థికంగా కూడా చాలా ఎంతో మందికి ఇబ్బందులు ఎదురవుతాయి.

డీప్ ఫేక్ కారణంగా అటు మంచి, ఇటు చెడు.. రెండూ ఉన్నాయి. రజనీకాంత్ హీరోగా నటించిన వేట్టయాన్ సినిమాలో మలేషియా వాసుదేవన్ పాడినట్లుగా ఏఐ ద్వారా సృష్టించారు. ఇది వాసుదేవన్ కుటుంబం అంగీకారంతో జరిగింది. కానీ అన్ని సందర్భాల్లో ఇలాగే ఉండదు. కొందరు దురుద్దేశపూరితంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. మంచి ఉద్దేశ్యంతో చేస్తే ఎలాంటి తప్పు లేదని గుర్తుంచుకోవాలి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఏఐ ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించవచ్చు.

ఏఐను ఉపయోగించడంలో ప్రవర్తనా నియమావళి చాలా ముఖ్యం. ఏఐ మేకర్స్ కూడా ఇన్ బిల్ట్ డిటెక్షన్ ను తీసుకుని రావాలి. మీడియాకు చెందిన వారికి కూడా వీటిపై సరైన అవగాహన కల్పించాలి. డీప్ ఫేక్ విజువల్స్ ఉండే లోపాలను ప్రతి ఒక్కరూ గుర్తించేలా అవగాహన తీసుకుని రావాలి. హైవ్, హియా వంటి డీప్ ఫేక్ టూల్స్ గురించి తెలియజేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా దిగ్గజాలు, ప్రభుత్వాలు, ఫ్యాక్ట్ చెకర్స్ కలిసి పోరాటం చేస్తేనే డీప్ ఫేక్ తో సమస్యలను అడ్డుకోడానికి వీలవుతుంది.  ఐపీఎస్  అజయ్ కుమార్ యాదవ్ కూడా డీప్ ఫేక్ కారణంగా ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. 

. ఇంకా ఈ కార్యక్రమంలో ఐపీఎస్ రోహిత్ మాల్పని, సైబర్ పీస్ ఫౌండేషన్ ఫౌండర్ మేజర్ వినీత్ కుమార్ తో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ మేనేజ్మెంట్ కూడా భాగమైంది. కార్యక్రమాన్ని డేటా సైన్స్ సమ్మిట్ ను బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారెత్ ఓవెన్ ప్రారంభించారు. కీనోట్ స్పీకర్ గా లారా బాల్డ్విన్, దక్షిణాసియా సైబర్ లీడ్, బ్రిటిష్ హై కమిషన్ వ్యవహరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement