మొదట పోస్ట్ చేసింది తెలంగాణ నుంచే అంటూ నివేదిక ఇచ్చిన ‘ఎక్స్’
ఒక ల్యాండ్ లైన్ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ అయినట్టు గుర్తింపు
ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన, వైరల్ చేసిన వారిపైనా ఢిల్లీ స్పెషల్ సెల్ ఆరా
తెలంగాణలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డీప్‌ఫేక్ వీడియో ఎక్కడ నుంచి వచ్చిందనే సందేహానికి తెరపడింది. ఆ ఫేక్ వీడియోను మొదట పోస్ట్ చేసినది తెలంగాణ నుంచేనంటూ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. మొదట పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ‘ఎక్స్’ నుంచి మరింత సమాచారం కోసం వేచి చూస్తున్నారు.
ల్యాండ్ లైన్ ఐపీ అడ్రస్ నుంచి..
గత నెల 23న మెదక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ గెలిస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ మాట్లాడినట్టు ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఎక్స్, ఫేస్‌బుక్ ఖాతాల్లో అది వైరల్‌గా అయి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా నలుగురిని అరెస్టు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీశ్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు జారీ చేశారు.
మరోవైపు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ముందు పోస్ట్ చేశారన్న దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్, ఫేస్‌బుక్‌లను స్పెషల్ సెల్ పోలీసులు ఆదేశించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చిన ‘ఎక్స్’ సంస్థ.. తొలుత ఆ వీడియో పోస్ట్ అయినది తెలంగాణ నుంచేనని వెల్లడించింది. ఒక ల్యాండ్‌లైన్ ఐపీ అడ్రస్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయినట్టుగా పేర్కొంది. అయితే ఎవరు చేశారనేది ఇంకా వెల్లడించలేదు.
దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మళ్లీ ‘ఎక్స్’కు లేఖ రాశారు. కచ్చితంగా ఎవరి ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది? ఎక్స్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది వీక్షించారు? ఎవరెవరు షేర్ చేశారు? కామెంట్లు/లైకులు తదితర సమగ్ర వివరాలు ఇవ్వాలని కోరారు. ‘ఎక్స్’ సంస్థ ఒకట్రెండు రోజుల్లో సమగ్ర నివేదిక అందించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment