
సాక్షి, న్యూఢిల్లీ: బిజినెస్ స్కూళ్లు ప్లేస్‌మెంట్‌ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బిజినెస్ స్కూల్ విద్యార్ధుల్లో కేవలం 20 శాతం మందికే జాబ్ ఆఫర్లు వస్తున్నాయని పరిశ్రమ సంస్థ అసోచామ్ అంచనా వేసింది. ఈసారి ప్లేస్‌మెంట్ ఇయర్ ఇటీవల ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొందని ఆందోళన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు, నిరుత్సాహకర వ్యాపార వాతావరణం, నూతన ప్రాజెక్టులు నిలిచిపోవడం వంటి కారణాలతో బీ స్కూల్ విద్యార్ధులకు జాబ్ ఆఫర్లు తగ్గిపోయాయని అసోచామ్ అభిప్రాయపడింది.
గత ఏడాది బీ స్కూల్ ప్లేస్‌మెంట్ 30 శాతంగా ఉంటే ఇప్పుడు 20 శాతం బీ స్కూల్ విద్యార్థులకే జాబ్ ఆఫర్లు పరిమితమయ్యాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వేతన ప్యాకేజీలు కూడా 40-45 శాతం తక్కువగా ఉన్నాయని వివరించింది.
ఓ కోర్సుపై మూడు నాలుగేళ్ల సమయం వెచ్చించి రూ లక్షలు ఖర్చు చేయడంపై తల్లితండ్రులు, విద్యార్ధులు పునరాలోచిస్తున్నారని కూడా అసోచామ్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఏఈసీ) తెలిపింది. 400 విద్యా సంస్థల్లో తగినంత విద్యార్ధులు లేకపోవడంతో ఆయా సంస్థల మనుగడ ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దసంఖ్యలో బీ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులను తమ సంస్థల్లోకి ఆకర్షించలేకపోతున్నట్టు తమ అథ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. 2015 నుంచి ఇప్పటివరుకూ 250 పైగా బిజినెస్ స్కూళ్లు మూతపడ్డాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment