31 కంపెనీలపై నిషేధం ఎత్తివేత
31 కంపెనీలపై నిషేధం ఎత్తివేత
Published Fri, Sep 22 2017 1:34 PM | Last Updated on Fri, Sep 22 2017 2:12 PM
సాక్షి, న్యూఢిల్లీ : నిబంధనలు ఉల్లంఘించి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న 31 కంపెనీలపై ఐఐటీలు గతేడాది నిషేధం విధించిన సంగతి తెలిసిందే. గతేడాది ఈ కంపెనీలపై విధించిన నిషేధాన్ని ఐఐటీలు ఈ ఏడాది ఎత్తివేశాయి. డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతున్న వార్షిక క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఈ కంపెనీలు పాల్గొనవచ్చని ఐఐటీలు పేర్కొన్నాయి. ఈ కంపెనీల్లో ఎక్కువగా స్టార్టప్‌లే ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను తిరస్కరించడమే కాకుండా, జాయినింగ్ తేదీల విషయంలో చేస్తున్న జాప్యాన్ని ఐఐటీలు తీవ్రంగా పరిగణించి, గతేడాది ఈ కంపెనీలపై నిషేధం విధించాయి. ప్రస్తుతం ఈ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆల్-ఐఐటీ ప్లేస్‌మెంట్ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో పాల్గొనే ముందు కంపెనీల ట్రాక్ రికార్డును ఐఐటీలు పరిగణనలోకి తీసుకోవాలని ప్లేస్‌మెంట్ సెల్‌కు కమిటీ సూచించింది. ఐఐటీ బొంబైలో జరిగిన ఏఐపీసీ 23వ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐపీసీ కోఆర్డినేటర్ తెలిపారు. ఏఐపీసీ బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ పోర్షియా మెడికల్, ఫుడ్ టెక్ కంపెనీ జుమాటో, ఆన్‌లైన్ సెల్లర్ బేబీ-కేర్ ప్రొడక్టస్ హాప్‌స్కాచ్‌లున్నాయి. నిషేధం విధించిన కొన్ని కంపెనీలు ఐఐటీ పూర్వ విద్యార్థులు నడుపుతున్నవే కావడం గమనార్హం. ఒక విద్యార్థి ఒకే ఉద్యోగం సూత్రాన్ని ఐఐటీలు పాటిస్తున్నాయి. ఆన్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఒక జాబ్ ఆఫర్ వస్తే, మరిన్ని ఇంటర్వ్యూలకు హాజరుకావడానికి వీలులేదు.
Advertisement
Advertisement