ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీల్లో బాలికలకు 14 శాతం సీట్లను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సూచన మేరకు ఐఐటీల కౌన్సిల్, జాయింట్ అడ్మిషన్ల బోర్డు బాలికలకు ప్రత్యేక సీట్లను కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఐఐటీల్లో చేరుతున్న వారిలో అత్యధికంగా బాలురే ఉంటున్నారు. బాలికలు 12 శాతం వరకే ఉంటున్నారు. గతేడాది ఐఐటీల్లో ప్రత్యేకంగా 4 శాతం సీట్లు బాలికలకు కేటాయించిన విషయం తెలిసిందే.
కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ నుంచి ఎంపికయ్యే విద్యార్థుల్లో బాలికలకు ప్రత్యేక మెరిట్ లిస్ట్ విడుదల చేయాలని సూచించింది. మొత్తంగా 2020 నాటికి బాలికలకు ఐఐటీల్లో 20 శాతం సీట్లు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సీట్లను పూర్తిగా సూపర్ న్యూమరీ కింద కేటాయించ నుంది. 2014–15 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన బాలికల్లో 8 శాతం మందికే ఐఐటీల్లో సీట్లు లభించాయి. 2015 –16లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 4,600 మంది బాలికలు అర్హత సాధించగా, వారిలో 850 మందికే ప్రవేశాలు లభించాయి.
2016–17లోనూ దాదాపు అదే పరిస్థితి. ఇక 2017–18 ప్రవేశాల లెక్కల ప్రకారం ఐఐటీల్లో ప్రతి వంద మంది విద్యార్థుల్లో బాలికలు ఆరుగురే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 2017–18 విద్యా సంవత్సరంలో బాలికల కోసం ప్రత్యేకంగా 4 శాతం సీట్లు పెంచారు. వచ్చే మూడేళ్ల పాటు కూడా ఇలాగే బాలికలకు సీట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment