ముంబై : అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీలకు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న తుది నియామక ప్రక్రియలో, మైక్రోసాఫ్ట్ విద్యార్థులకు భారీ వేతనం ఆఫర్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. టాప్ ఐఐటీల క్యాంపస్ వర్గాల సమాచారం మేరకు కంపెనీ తన రెడ్‌మాండ్ ప్రధాన కార్యాలయంలో ఐఐటీలను నియమించుకోవడానికి ఏడాదికి రూ.1.39 కోట్లను ప్యాకేజీగా ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం ప్యాకేజీ 2,14,600 డాలర్లు కాగ, దానిలో బేసిక్ వేతనం 1,08,000 డాలర్లు, పనితీరు ఆధారిత బోనస్ 21,600 డాలర్లు, జాయినింగ్ బోనస్ 15,000 డాలర్లు, నియంత్రిత స్టాక్‌యూనిట్లు 70,000 డాలర్లు ఉన్నట్టు వెల్లడవుతోంది. గతేడాది కంటే ఈ వేతనాన్ని మైక్రోసాఫ్ట్ భారీగా పెంచేసింది. గతేడాది మైక్రోసాఫ్ట్ మొత్తం ప్యాకేజీగానే 1,36,000 డాలర్లను ఆఫర్ చేసింది.
మైక్రోసాఫ్ట్ అనంతరం మరో టాప్ రిక్రూటర్‌గా అమెరికా ఆధారిత ఉబర్ టెక్నాలజీస్ ఉండబోతుందని సమాచారం. ఈ కంపెనీ కూడా బేసిక్ వేతనంగా 1,10,000 డాలర్లను ఆఫర్ చేయబోతున్నట్టు క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ బోనస్‌లు, స్టాక్ ఆప్షన్లు, మైక్రోసాఫ్ట్‌తో పోలిస్తే తక్కువగానే ఉండబోతున్నాయట. ఉబర్ టెక్నాలజీస్ ఆఫర్‌చేసే మొత్తం ప్యాకేజీ రూ.99.87 లక్షలుగా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ ప్యాకేజీలు కాన్పూర్, ముంబై, చెన్నై, బనారస్ హిందూ యూనివర్సిటీ, రూర్కే క్యాంపస్‌లకు ఆఫర్ చేయొచ్చని ప్లేస్‌మెంట్ వర్గాలు పేర్కొన్నారు. కొన్ని సార్లు తుది వేతన ప్యాకేజీలు ఇంకా ఎక్కువ ఉండొచ్చని కూడా తెలిపాయి. దీనిపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు. ఉబర్ తను అందిస్తున్న వేతన వివరాలను తెలుపడానికి తిరస్కరించింది. ఈ ఏడాది ఎనిమిది ఐఐటీ క్యాంపస్‌లు- ఢిల్లీ, చెన్నై, ఖరగ్‌పూర్, రూర్కే, గౌహతి, బీహెచ్‌యూ, ముంబై, కాన్పూర్‌లలో ప్లేస్‌మెంట్లను చేపట్టనున్నట్టు ఉబర్ ఇండియా, దక్షిణాసియా చీఫ్ పీపుల్ ఆఫీస్ విశ్‌పాల్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఐఐటీలకు ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్లు పెరిగిపోయాయి. ఇది ఇన్‌స్టిట్యూట్‌లకు గుడ్‌న్యూస్.
Comments
Please login to add a commentAdd a comment