మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఇటీవల తలెత్తిన్న అంతరాయానికి కారణమైన క్రౌడ్‌స్ట్రైక్ తన వినియోగదారులకు ఉబర్ ఈట్స్ కూపన్‌కార్డు ఇచ్చి క్షమాపణలు కోరింది. విండోస్ యూజర్లకు ఇటీవల ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ మేసేజ్ రావడంతో వారి విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ విమానరంగం, ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటు అత్యవసర సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల కంప్యూటర్‌లు క్రాష్ అయినట్లు అంచనా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ఈ ఘటన వల్ల ప్రభావితమైన యూజర్లకు 10 డాలర్ల (రూ.830) విలువ చేసే ఉబర్ ఈట్స్ కూపన్‌ను ఇచ్చి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఈమెయిల్‌లో కూపన్ వివరాలు పంపించింది.
క్రౌడ్‌స్ట్రైక్ పంపించిన ఈమెయిల్‌లో..‘జులై 19న ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వీసుల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. సాంకేతిక సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించేలా సహకరించినందుకు ధన్యవాదాలు. ఓ కప్పు కాఫీ లేదా స్నాక్స్‌తో మీకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. కూపన్ కోడ్‌ని ఉపయోగించడం ద్వారా ఉబర్ ఈట్స్ క్రెడిట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు’ అని తెలిపింది. ఇదిలాఉండగా, వోచర్‌ను రెడీమ్ చేయడంలో కొందరు వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?
మైక్రోసాఫ్ట్ అంతరాయం వెనుక ఉన్న సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ భారీ నష్టాన్నే మూటకట్టుకుంది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో లోపం కారణంగా చాలా దేశాల్లోని కంప్యూటర్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment