మెయిన్‌లోనూ మనోళ్లు టాప్‌ గేర్‌లో | 100 percentile for 22 Telugu students in JEE Main Save translation | Sakshi
Sakshi News home page

మెయిన్‌లోనూ మనోళ్లు టాప్‌ గేర్‌లో

Published Fri, Apr 26 2024 4:45 AM | Last Updated on Fri, Apr 26 2024 4:45 AM

100 percentile for 22 Telugu students in JEE Main Save translation

జేఈఈ మెయిన్‌లో 22 మంది తెలుగు విద్యార్థులకు వంద పర్సంటైల్‌ 

ఈసారి పెరిగిన కటాఫ్‌... జనరల్‌కు 93 

దేశంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 2.5 లక్షల మందికి, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మందికి అర్హత  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్‌)లో ఈ ఏడాది కూడా తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి 11 జాతీయ ర్యాంకుల్లో మూడింటిని తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు. 
 

సంగారెడ్డి జిల్లాకు చెందిన హందేకర్‌ విదిత్‌ ఐదో ర్యాంకు, ముత్తవరపు అనూప్‌ 6వ ర్యాంకు, వెంకట సాయితేజ మాదినేని 7వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, దేశంలో 56 మందికి వందశాతం పర్సంటైల్‌ వస్తే, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. అందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. 
 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించగా, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మంది ఆ జాబితాలో ఉన్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు, తుది మెరిట్‌ జాబితాను విడుదల చేసింది.  

ఫలితాల్లో మూడో స్థానంలో తెలంగాణ
జేఈఈ మెయిన్‌లో అత్యుత్తమ పర్సంటైల్‌ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో ఉత్తరప్రదేశ్‌ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఈ ఏడాది ఎక్కువ మంది జేఈఈ మెయిన్‌ రాయడంతో అన్ని కేటగిరీల్లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్‌ పెరిగింది.  
 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్‌ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో మే 10 వరకు గడువు ఉంది. మే 17 నుంచి 26 మధ్య అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్‌ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్‌ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీ చేస్తారు. 

వంద పర్సంటైల్‌ సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులు
తెలంగాణ: హందేకర్‌ విదిత్‌(5), ముత్తవరపు అనూప్‌(6), వెంకట సాయితేజ మాదినేని(7), రెడ్డి అనిల్‌(9), రోహన్‌ సాయిబాబా(12), శ్రీయాశస్‌ మోహన్‌ కల్లూరి(13), కేసం చెన్నబసవరెడ్డి(14), మురికినాటి సాయి దివ్య తేజరెడ్డి(15), రిషి శేఖర్‌ శుక్లా(19), తవ్వ దినేశ్‌ రెడ్డి(24), గంగ శ్రేయాస్‌(35), పొలిశెట్టి రితిష్‌ బాలాజీ(39), తమటం జయదేవ్‌ రెడ్డి(43), మావూరు జస్విత్‌(49), దొరిసాల శ్రీనివాసరెడ్డి (52). 

ఆంధ్రప్రదేశ్‌: చింటు సతీష్‌ కుమార్‌ (8), షేక్‌ సూరజ్‌ (17), మాకినేని జిష్ణు సాయి(18), తోటంశెట్టి నిఖిలేష్‌(20), అన్నరెడ్డి వెంకట తనిష్‌ రెడ్డి(21), తోట సాయికార్తీక్‌ (23), మురసాని సాయి యశ్వంత్‌ రెడ్డి(36). 

ఈడబ్యూఎస్‌ విభాగంలో తొలి 6 స్థానాల్లో ఇద్దరు ఆంధ్రా, నలుగురు తెలంగాణ  విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేసం చెన్న­బసవ­రెడ్డి మొ­దటిస్థానంలో నిలవగా, తోటంశెట్టి నిఖిలేష్‌ మూడో స్థానంలో నిలి­చాడు.
    తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో మరువూరి జస్వంత్‌ వందశాతం, ఎస్టీ కోటాలో జగన్నాధం మోహిత్‌ 99 శాతం పర్సంటైల్‌ సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో చుంకిచర్ల శ్రీచరణ్‌ జాతీయ ర్యాంకర్‌గా నిలిచారు. 

ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: హందేకర్‌ విదిత్‌
జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా తండ్రి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా, తల్లి ప్రభుత్వ టీచర్‌. వారి చేయూతతోనే నేను ముందుకెళ్లాను. నాకు ఐఐటీ–బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలని ఉంది. ఆ తర్వాత స్టార్టప్‌ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్‌తోనే ఈ ర్యాంకు సాధించాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement