అన్ని రాష్ట్రాలకు, యూటీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.47,010 కోట్ల పరిమితి
దీన్ని జూలై 1 నుంచి రూ.60,118 కోట్లకు పెంచిన ఆర్బీఐ
ఏపీకి రూ.2,252 కోట్ల నుంచి రూ.2,921 కోట్లకు పెంపు
కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రాలకు వెసులుబాటు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితులను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెంచింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ.47,010 కోట్లు ఉండగా, జూలై 1 నుంచి ఈ పరిమితిని రూ.60,118 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక వెసులుబాటు కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితిని పెంచేందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన కమిటీ సూచనల మేరకు ఈ పరిమితులను పెంచినట్లు ఆర్బీఐ పేర్కొంది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన సెక్యూరిటీలలో పెట్టుబడుల పరిమాణం, ట్రెజరీ బిల్లుల వేలం, గ్యారెంటీ రిడెంప్షన్ ఫండ్ తదితరాల ఆధారంగా ఈ పరిమితులను పెంచినట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అత్యవసర వ్యయాలకు నిధులు లభ్యత లేని పక్షంలో ఆర్థిక వెసులుబాటుకు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లను, ఓవర్ డ్రాఫ్ట్‌ల ద్వారా ఆర్బీఐ నుంచి తాత్కాలికంగా నిధులను పొందేందుకు వెసులుబాటు కల్పిస్తారు.
ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పరిమితి రూ.2,252 కోట్లు ఉండగా.. జూలై 1 నుంచి రూ.2,921 కోట్లకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే, మిగతా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ పరిమితులను పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment