పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర ప్రజలు ఆస్తి, డ్రెయినేజీ, నీటి, ఖాళీస్థలాలు ఇతర పన్నులను ఇక తమ ఇంటి నుంచే చెల్లించేలా నగర పాలక సంస్థ (వీఎంసీ) చర్యలు చేపట్టింది. ఈ – పోస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో పన్నులు వసూలు చేసుకునేందుకు ఇప్పటికే ఒక దఫా బ్యాంకర్లతో చర్చలు జరిపింది. డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలు కల్పించింది. అతి త్వరలోనే డిజిటల్ పేమెంట్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటోంది.
డిజిటల్ దిశగా అడుగులు
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కుంటున్న వీఎంసీ మరో స్మార్ట్ ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరపాలక సంస్థ వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) అమర్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో డంపర్ బిన్‌లను పర్యవేక్షిస్తోంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పంపిణీ వంటి తదితర అంశాలను స్కాడా (సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్) ద్వారా ఎప్పటికప్పుడు నీటి సరఫరా వివరాలను పర్యవేక్షిస్తోంది. ఇటీవల నగరంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ తోపాటు వాట్సాప్, టెలిగ్రాంను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో పన్నులను కూడా డిజిటల్ విధానంలో వసూలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేయడం ద్వారా ఆడిట్ సక్రమంగా ఉంటుందని, అవినీతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ–పోస్ ఎలా పనిచేస్తుందంటే..
వీఎంసీ పరిధిలో ఉన్న ఆస్తులు, నీటి సరఫరా, డ్రెయినేజీ, ఖాళీ స్థలాల సమాచారాన్ని డివిజన్ల వారిగా ఈ–పోస్ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా వార్డు సచివాలయాల సెక్ర టరీల ద్వారా సంబంధిత పన్నులు వసూలు చేస్తారు. చలానాలు, పన్నులు, చార్జీలు తదితర చెల్లింపులను డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు మొబైల్ పేమెంట్స్ ద్వారా కూడా స్వీకరిస్తారు.
ఇప్పటి వరకు మీ–సేవ, ఆన్‌లైన్, ట్యాక్స్ కలెక్షన్ పాయింట్ల ద్వారా మాత్రమే ఆయా పన్నులు, చార్జీలు చెల్లింపులు జరిగాయి. అయితే కొన్ని రకాల సేవలు మాత్రమే ఇకపై మీ–సేవ ద్వారా చెల్లింపులకు ఆస్కారం ఉందని వీఎంసీ అధికారులు పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి ఆయా వార్డు సచివాలయ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి 50 ఇళ్ల పూర్తిస్థాయి సమాచారాన్ని (డోర్‌నంబర్, అసెస్‌మెంట్ నంబరు తదితర వివ రాలు) ఈ–పోస్ యంత్రాల్లో నమోదు చేశారు. చెల్లింపుదారులకు సంబంధించిన పూర్తివివరాలు ఈ–పోస్ యంత్రాల్లో ఉండటంతో క్షణాల్లో చెల్లింపులు జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయిల్ రన్ సందర్భంగా కొన్ని డివిజన్లలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. శివారు, కొండప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండకపోవటం, ఈ–పోస్ యంత్రాల బ్యాటరీ బ్యాకప్ చాలకపోవటం తదితర సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో అధిగమించి నగరవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ పేమెంట్లు అమలు చేయటానికి వీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇక పక్కాగా ఆడిట్
పన్నులు, ఇతర యూజర్ చార్జీలను డిజిటల్ విధానంలో వసూలు చేయడం ద్వారా ప్రతి పైసాకు ఆడిట్ సక్రమంగా ఉంటుంది. సిబ్బంది పనితీరు మెరుగుపడుతుంది. క్షేత్రస్థాయిలో జరిగే అవినీతి కొంత వరకు తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో ట్రయల్ రన్ నిర్వహించాం. త్వరలో నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం.
– స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment