VMC
-
వీఎంసీలో డిజిటల్ పేమెంట్స్
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర ప్రజలు ఆస్తి, డ్రెయినేజీ, నీటి, ఖాళీస్థలాలు ఇతర పన్నులను ఇక తమ ఇంటి నుంచే చెల్లించేలా నగర పాలక సంస్థ (వీఎంసీ) చర్యలు చేపట్టింది. ఈ – పోస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో పన్నులు వసూలు చేసుకునేందుకు ఇప్పటికే ఒక దఫా బ్యాంకర్లతో చర్చలు జరిపింది. డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలు కల్పించింది. అతి త్వరలోనే డిజిటల్ పేమెంట్ విధానం అమలుకు చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ దిశగా అడుగులు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కుంటున్న వీఎంసీ మరో స్మార్ట్ ఆలోచనతో ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరపాలక సంస్థ వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) అమర్చింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో డంపర్ బిన్లను పర్యవేక్షిస్తోంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పంపిణీ వంటి తదితర అంశాలను స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజేషన్) ద్వారా ఎప్పటికప్పుడు నీటి సరఫరా వివరాలను పర్యవేక్షిస్తోంది. ఇటీవల నగరంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ తోపాటు వాట్సాప్, టెలిగ్రాంను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో పన్నులను కూడా డిజిటల్ విధానంలో వసూలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేయడం ద్వారా ఆడిట్ సక్రమంగా ఉంటుందని, అవినీతి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ–పోస్ ఎలా పనిచేస్తుందంటే.. వీఎంసీ పరిధిలో ఉన్న ఆస్తులు, నీటి సరఫరా, డ్రెయినేజీ, ఖాళీ స్థలాల సమాచారాన్ని డివిజన్ల వారిగా ఈ–పోస్ యంత్రాల్లో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా వార్డు సచివాలయాల సెక్ర టరీల ద్వారా సంబంధిత పన్నులు వసూలు చేస్తారు. చలానాలు, పన్నులు, చార్జీలు తదితర చెల్లింపులను డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు మొబైల్ పేమెంట్స్ ద్వారా కూడా స్వీకరిస్తారు. ఇప్పటి వరకు మీ–సేవ, ఆన్లైన్, ట్యాక్స్ కలెక్షన్ పాయింట్ల ద్వారా మాత్రమే ఆయా పన్నులు, చార్జీలు చెల్లింపులు జరిగాయి. అయితే కొన్ని రకాల సేవలు మాత్రమే ఇకపై మీ–సేవ ద్వారా చెల్లింపులకు ఆస్కారం ఉందని వీఎంసీ అధికారులు పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్లకు సంబంధించి ఆయా వార్డు సచివాలయ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి 50 ఇళ్ల పూర్తిస్థాయి సమాచారాన్ని (డోర్‌నంబర్, అసెస్మెంట్ నంబరు తదితర వివ రాలు) ఈ–పోస్ యంత్రాల్లో నమోదు చేశారు. చెల్లింపుదారులకు సంబంధించిన పూర్తివివరాలు ఈ–పోస్ యంత్రాల్లో ఉండటంతో క్షణాల్లో చెల్లింపులు జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయిల్ రన్ సందర్భంగా కొన్ని డివిజన్లలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. శివారు, కొండప్రాంతాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండకపోవటం, ఈ–పోస్ యంత్రాల బ్యాటరీ బ్యాకప్ చాలకపోవటం తదితర సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను పూర్తిస్థాయిలో అధిగమించి నగరవ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ పేమెంట్లు అమలు చేయటానికి వీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక పక్కాగా ఆడిట్ పన్నులు, ఇతర యూజర్ చార్జీలను డిజిటల్ విధానంలో వసూలు చేయడం ద్వారా ప్రతి పైసాకు ఆడిట్ సక్రమంగా ఉంటుంది. సిబ్బంది పనితీరు మెరుగుపడుతుంది. క్షేత్రస్థాయిలో జరిగే అవినీతి కొంత వరకు తగ్గుతుంది. ఇప్పటికే కొన్ని డివిజన్లలో ట్రయల్ రన్ నిర్వహించాం. త్వరలో నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. – స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ -
మటన్ కొనేటప్పుడు జాగ్రత్త!
సాక్షి,విజయవాడ: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మటన్ మాఫియా గుట్టును కార్పొరేషన్ అధికారులు శనివారం రట్టు చేశారు. విజయవాడకు అక్రమంగా తరలించిన పోటెళ్ళ తలలు ,కాళ్ళును స్వాధీనం చేసుకున్నారు. హౌరా ఎక్స్‌ప్రెస్ రైల్లో వచ్చిన పదహారు బాక్సులను పట్టుకున్నారు. సీజ్ చేసిన పదహారు బాక్సులను వీఎంసీ సిబ్బంది నిర్జన ప్రదేశంలో పూడ్చేశారు. వీటిని యూపీ నుంచి ఢిల్లీకి, అక్కడినుంచి విజయవాడ కు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేపు ఆదివారం కావటంతో నిల్వ ఉంచిన మాంసం అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఈ మాఫియా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కబేళాలోని మాంసం మాత్రమే కొనుగోలు చేయాలని వీఎంసీ అధికారులు సూచించారు. చదవండి: అద్దె మాఫీ.. వారికి ఉపశమనం.. -
వీఎంసీలో ఇకపై ఎలక్ట్రిక్ కార్లు
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరపాల క సంస్థ నగరంలో పర్యావరణ హితమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది.. ఇందన ఖర్చు పొదుపుతో పాటు, పర్యావరణ పరిరక్షణకోసం ఎలక్ట్రికల్ వాహనాలను ప్రవేశ పెట్టనుంది.. ముందుగా వీఎంసీ అధికారులకు ఆ వాహనాలు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.. వచ్చే నెలలో విజయవాడ నగర రోడ్లపై ఎలక్ట్రికల్ వాహనాలు రయ్‌మంటూ దూసుకుపోనున్నాయి వాణిజ్యరాజధానిగా పేరున్న విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని నివా రణతో పాటు వీఎంసీ నిర్వాహణలో ఉన్న వాహనాల ఇంధన ఖర్చును పొదుపుచేసే క్రమంలో పర్యావరణ హితమైన వాహనాలను వినియోగించేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ వాహనాలను విజయవాడలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.. వచ్చే అక్టోబర్ నెలాఖరులోపు నగరపాలక సంస్థ కు ఈ కార్లును అందుబాటులోకి తేనున్నారు.. తొలివిడతగా వీఎంసీ అధికారులు ఈ వాహనాల ను ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.. ఈక్రమంలో వీఎంసీలో ఉన్న 24 మంది అధికారులకు ఈ–కార్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. నోయీడా కంపెనీతో ఒప్పందం వీఎంసీ నోయీడాకు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్‌తో ఆరునెలల క్రితం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి 24 కార్లను వీఎంసీ రిజర్వ్ చేసింది. ఒక్కో కారు ఖరీదు రూ.12 నుంచి 15 లక్షల లోపు ఉంటుం దని అధికారులు తెలిపారు.. ఒక్కో కారుకు ప్రతి నెల రూ. 20 వేల ఈఎంఐ చొప్పున 72 నెలలపాటు చెల్లించేలా, అలాగే ఐదేళ్ల ఏళ్లపాటుసర్వీస్ కలిపి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అధిక బ్యాటరీ సామర్థ్యంతో గంట చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు తిరిగే ఈ కార్లకు నగరంలోని బ్యాటరీ బంక్‌లు కూడా ఏర్పాటవుతాయని, నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఏలూరు, బందరురోడ్డులో తొలుత రెండుబ్యాటరీ బంకులను ఏర్పాటు చేయటానికి ఈఈఎస్ఎల్ సంస్థ ప్రణాళికలు రూపొం దిస్తుందని అధికారులు తెలిపారు. సొంతకార్లే అద్దెకార్లుగా..! వీఎంసీలో వివిధ విభాగాల్లో ఉన్న అధికారులు దొడ్డిదారిలో వారి సొంతవాహనాలనే అద్దెవాహనాలుగా చూపుతూ వీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సొంతకార్లకు కూడా వీఎంసీ నుంచి అద్దె తీసుకుంటూ తమ సొంతపనులకు సైతం వినియోగిస్తున్నారని ఆరోపణల ఉన్నాయి. వీఎంసీలో దాదారు 80 శాతం అధికారులు ఒనర్ప్లేట్తో ఉన్న కార్లను వినియోగించటంపై కౌన్సిల్‌ల్లో కూడా పలుమార్లు ఈ అంశంపై రచ్చజరిగిన సంగతి తెల్సిందే.. సొంత కార్ల వినియోగంపై పలుమార్లు చర్చ జరిగినా అధికారులు పట్టించుకోక పోగా దర్జాగా సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ– కార్లతో తగ్గనున్న ఆర్థిక భారం వీఎంసీలో వివిధ విభాగాల అధికారులకు కేటా యించిన వాహనాల నిర్వహణ అంతా వీఎంసీనే చూసుకుంటుంది. కమిషనర్, అడిషనల్ కమీషనర్, సీఎంవోహెచ్ మినహా మిగిలిన అధికారుల కార్లన్నీ అద్దెప్రాతిపదికన ప్రతినెలా రూ. 25–45 వేల వరకు అద్దె చెల్లిస్తున్నాయి. కార్పొరేషన్లో ఆయా విభాలకు చెందిన 50 మంది అధికారులకు కారును సమకూర్చాల్సి వస్తుంది. దీనికిగాను ఆయా కార్ల నిర్వహణకు 12 లక్షల నుంచి రూ. 15 లక్షల చొప్పున ఏడాదికి రూ. కోటిన్నర అవుతుం ది. వీటి నిర్వహణలో తొలుత 24 కార్లను ఆయా విభాగాల అధికారులకు కేటాయింపు జరిపేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండో విడతగా మిగిలిన అధికారులకు కూడా సమకూర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
భిక్షగాళ్ల దీనవ్యథ : కదిలిస్తే కన్నీరే..!
మాసిన గడ్డం..ఏపుగా పెరిగిన జుట్టు.. దుర్వాసన వచ్చే దుస్తులు. కాళ్లు, చేతులకు గాయాలతో అమ్మా, అయ్యా అంటూ చేయి చాస్తూ నగరంలో సంచరించే భిక్షగాళ్లను చూస్తే కొందరు జాలి చూపి చేతిలో చిల్లర వేస్తారు..మరికొందరు చీదరించుకుంటారు.. కానీ ఆ చీదరింపు వెనుక గాయపడిన మనస్సు ఉంటుంది.. ఒకప్పుడు అందరిలా దర్జాగానే బతికిన వారే.. కానీ విధి రాతకు తలొగ్గి కడుపు నింపుకొనేందుకు చేతులు చాస్తున్నారు.. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్యర్యంలో జరిపిన ప్రత్యేక డ్రైవ్‌లో పట్టుబడిన వారి మనోగతం వింటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే.. – సాక్షి,అమరావతిబ్యూరో బంగారు లచ్చన్న విజయవాడకు చెందిన లచ్చన్న గతంలో నగరపాలక సంస్థలో వెహికల్ డిపోలో కార్మికుడిగా పనిచేశాడు. విశాఖజిల్లా గుడిచర్లకు చెందిన నాగమణితో వివాహమైంది. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూమార్తె. అందరిలానే వారికి చదువులు చెప్పించి వారిని ఉన్నతంగా బతికేలా చేశారు. ముగ్గురు కొడుకులు ప్రస్తుతం వివిధ వృత్తులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కుమార్తెను బావమరిదికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. చేతికొచ్చిన పిల్లలు ఆదుకుంటారని ఆశించిన లచ్చన్నకు నిరాశే మిగిలింది. 2013లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన్ను కొన్నేళ్లు ఇంట్లో ఉంచుకున్న బిడ్డలు ఆపై మొహం చాటేశారు. ప్రస్తుతం పక్షవాతం రావడంతో కాలు, చేయి పనిచేయడం లేదు. కర్రసాయంతో రెండేళ్లుగా భిక్షమెత్తుకుంటున్నాడు. ఈయన సతీమణి మాత్రం పుట్టింటి వారి దగ్గరే ఉంటుంది. జేమ్స్ అంథాల్ విశాఖజిల్లా రేగడ ప్రాంతానికి చెందిన వాడు. అదే ప్రాంతానికి చెందిన రాములమ్మను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆ బిడ్డలను ఉన్నతస్థాయిలో ఉంచాలని ముఫ్పై ఏళ్లు సికింద్రాబాద్‌లోని బొయినపల్లి వద్ద ఫంక్షన్ హాలులో వర్కర్‌గా పనిచేశాడు. అనుకున్నట్లే బిడ్డలను చదువులు చదివించి ఉన్నతస్థాయికి ఎదిగేలా చేశాడు. ఈయన పెద్దకుమారుడు విశాఖ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మరో అబ్బాయి పెయింటర్ వృత్తి చేసుకుంటున్నాడు. కుమార్తె చదువుకొని మంచి స్థాయిలోనే ఉంది. కానీ వారికి తండ్రి భారమయ్యాడు.రెండేళ్లుగా ఇంటిని వదిలి తమిళనాడుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు. రంజిత్ తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వ్యక్తి. మెకానిక్‌గా పనిచేసే∙రంజిత్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్ఎంను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ కలహాలతో రంజిత్ ఇంట్లో గొడవపడి గత 8 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చేశాడు. విజయవాడలో మెకానిక్‌గా పనిచేస్తూ మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. అనారోగ్యం బారిన పడి భిక్షమెత్తుకోవడం అలవాటు చేసుకున్నాడు. అందరిలాగానే కుటుంబంతో కలిసి దర్జాగా జీవించాల్సి ఉన్నా.. తన విధి రాత బాగా లేక దీనస్థితిలో బతుకుతున్నానంటూ బాధను వ్యక్తం చేశాడు.. పగవాడికి ఇలాంటి కష్టం రాకూడని ఆవేదన చెందాడు. -
గ్రీన్ అంబులెన్స్...చెట్టంత అండ...
మొక్కలు నాటడం ఒక్క ఎత్తయితే... వాటిని పరిరక్షించుకోవడం మరో ఎత్తు. చాలామందికి మొక్కలను నాటడం మాత్రమే తెలుసు. ఆ తరువాత ఆ విషయాన్ని మరిచిపోతారు. మనిషిలాగే చెట్లు కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటాయి. మనిషి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్‌లు ఆఘమేఘాల మీద సంబంధిత ప్రదేశానికి చేరుకుంటాయి. చెట్లకు మాత్రం ఈ సౌకర్యం ఎందుకు ఉండకూడదనే ఉద్దేశంతో వడోదర(గుజరాత్)లోని స్వచ్ఛందసంస్థ ‘పగ్‌డాండ్’ వడోదర మున్సిపల్ కార్పోరేషన్ (వియంసీ) సహకారంతో ‘గ్రీన్ అంబులెన్స్’ సదుపాయాన్ని ప్రారంభించింది.నగరంలో ఒకప్పుడు వేలాది మొక్కలు నాటిన ఈ సంస్థ... ఆ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి, వాటిని ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించడానికి మూడు చక్రాల గ్రీన్ అంబులెన్స్‌లను ఉపయోగిస్తుంది.‘ఫలానా చోట మొక్కల ఆలనా పాలనా ఎవరూ పట్టించుకోవడం లేదు’‘ఫలానా చోట మొక్కలను పశువులు తింటున్నాయి’‘నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయి’... ఇలాంటి ఫోన్ కాల్స్ ఆ స్వచ్ఛంద సంస్థ హెల్ప్ లైన్‌కు రాగానే... వెంటనే ‘గ్రీన్ అంబులెన్స్’ రంగంలోకి దిగుతుంది. నీళ్లు, ఎరువులు... ఇలా చెట్ల సంరక్షణకు అవసరమైన అన్ని రకాల వస్తువులు, ఏర్పాట్లు ఇందులో ఉంటాయి. నగరంలో నాటిన మొక్కల్లో 13 శాతం మాత్రమే బతుకుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ‘గ్రీన్ అంబులెన్స్’లతో రంగంలోకి దిగింది ‘పగ్‌డాండ్’మొక్కల విలువ గురించి విస్తృత అవగాహన కలిగించడం, మొక్కల్ని నాటడం, ఇతరుల చేత నాటించడం, వాటి సంరక్షణకు పాటు పడడం... తన కార్యరంగాలుగా ఎంచుకుంది ‘పగ్‌డాండ్’పర్యావరణ సంరక్షణలో స్థానిక ప్రభుత్వ శాఖలను క్రియాశీలంగా భాగస్వాములను చేయడం, బడులలో ఎకో క్లబ్‌లను స్థాపించడంలాంటి పనులు చేçస్తుంది ‘పగ్‌డాండ్’.‘‘గ్రీన్ అంబులెన్స్‌ల గురించి చాలామంది ఆసక్తిగా అడుగుతుంటారు. వినూత్నమైన ఆలోచన అని ప్రశంసిస్తుంటారు. నగరంలో గ్రీన్ అంబులెన్స్‌ల ప్రవేశం తరువాత మొక్కల సర్వైవల్ రేట్ పెరిగింది’’ అంటున్నారు ‘పగ్‌డాండ్’ ఫౌండర్ ట్రస్టీ నిషిత్ దాండ్.కొన్ని సందేశాలకు వేదికలు, ఉపన్యాసాలు అక్కర లేదని ఈ గ్రీన్ అంబులెన్స్‌లు నిరూపిస్తున్నాయి. రోడ్డు మీద వెళుతున్న ఈ గ్రీన్ అంబులెన్సులు చెట్ల విలువ, పరిరక్షణ గురించి మౌనసందేశాన్ని మోసుకెళుతున్నట్లుగా ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి గ్రీన్ అంబులెన్స్‌ల గురించి మాత్రమే కాదు... పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. వడోదర ‘గ్రీన్ అంబులెన్స్’ల స్ఫూర్తి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే... నాటిన ప్రతి చెట్టు క్షేమంగా ఉంటుంది. మనల్ని క్షేమంగా చూస్తుంది. ఫీజు అక్కర్లేదు మొక్క నాటితే చాలు! చత్తీస్గడ్, అంబికాపూర్‌లోని ‘శిక్షా కుటీర్’ అనే స్కూల్ చెట్ల సంరక్షణకు వినూత్నంగా ప్రయత్నిస్తుంది. పిల్లలను స్కూల్లో చేర్పించే సమయంలో పేరెంట్స్ కొన్ని మొక్కలను తప్పనిసరిగా నాటాల్సి ఉంటుంది. తాము నాటిన మొక్క ఒకవేళ చనిపోతే దాని స్థానంలో వేరొక మొక్క నాటాల్సి ఉంటుంది. పేరెంట్స్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉంటే కొన్ని మొక్కలు నాటితే చాలు! ట్రీ హెల్ప్‌లైన్ ఢిల్లీ ప్రభుత్వం చెట్ల సంరక్షణకు చాలా కాలం క్రితమే ‘ట్రీ హెల్ప్ లైన్’ను ప్రారంభించింది. చెట్లకు ఎవరైనా హాని కలిగిస్తున్నా, ఎక్కడైనా చెట్లు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయవచ్చు. ‘ఫలానా చోట ఉన్న చెట్టుకు ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది’లాంటి సలహాలు కూడా ఇవ్వవచ్చు. ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రవేశపెట్టిన ఈ టోల్–ఫ్రీ నంబర్ ట్రీ హెల్ప్ లైన్ మంచి ఫలితాన్ని ఇచ్చింది. -
స్కాడా వెబ్సైట్ ఆవిష్కరణ
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ద్వారా అందించే రక్షిత తాగునీటి సరఫరాను ఆ¯ŒSలై¯ŒS ద్వారా ప్రజలు వీక్షించేలా ఏర్పాటు చేసిన స్కాడా వెబ్సైట్(స్మార్ట్వాటర్ డిస్టిబ్య్రూష¯ŒS మోనిటరింగ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. స్కాడా వెబ్సైట్ పనితీరును మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియ¯ŒS సీఎంకు వివరించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వ, వినియోగం, హెడ్‌వాటర్ వర్కŠస్ నుంచి రిజర్వాయర్‌కు ఎంతనీరు ఎన్ని గంటల్లో చేరుతోందనే వివరాలను వెబ్సైట్ద్వారా తెలుసుకోవచ్చన్నారు. తద్వారా నీటి సమస్యల్ని పరిష్కరించడంతో పాటు లీకేజీలను అరికట్టవచ్చన్నారు. నగర పరిధిలో 63 రిజర్వాయర్లు ఉండగా, 52 రిజర్వాయర్లను స్కాడాకు అనుసంధానం చేశామని, త్వరలోనే మిగితావి అనుసంధానం చేస్తామని కమిషనర్ చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి పి.నారాయణ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్షి్మ, పబ్లిక్‌హెల్త్ సీఈ మోజేస్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కనక వర్షం..!
విజయవాడ సెంట్రల్/విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విద్యుత్, మున్సిపల్ శాఖలకు మేలు చేసింది. బిల్లులు చెల్లించేందుకు పాత రూ.500, రూ.1,000 నోట్లు తీసుకునేలా ఆ శాఖల అధికారుల రచించిన పథకం œలించింది. ముందస్తు ప్రచారం లేకపోయినా రెండు శాఖలకు ఒక్క రోజులోనే భారీగా ఆదాయం సమకూరింది. మొండి బకాయిలు సైతం వసూలయ్యాయని ఆయా శాఖల అధికారులు తెలిపారు. పాత రూ.500, రూ.1,000 నోట్లతో వివిధ రకాల పన్నులు, బిల్లులు చెల్లించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. దీంతో విజయవాడ సర్కిల్ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ బిల్లులు వసూలయ్యాయి. ఇందులో అత్యధికం పాత బకాయిలు ఉన్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. సాధారణంగా రోజూ రూ.3.5 కోట్లు వరకు బిల్లులు వసూలు అయ్యేవి. అయితే పాత పెద్ద నోట్లు తీసుకుంటామని అధికారులు ప్రకటించడంతో ఒక్క శుక్రవారమే రూ.6 కోట్ల వరకు వసూలయ్యాయి. ఈ నెల 14వ తేదీ వరకు పాత రూ.500, రూ.1,000 నోట్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. కార్పొరేషన్‌కు భారీ ఆదాయం విజయవాడ నగరపాలక సంస్థకు శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 9.15 గంటల వరకు రూ.4,76,27,747 మేర పన్నులు వసూలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు పన్నులు చెల్లించేందుకు అవకాశం ఉండటంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్ రావడం కార్పొరేషన్ చరిత్రలో రికార్డు అని అధికారులు చెప్పారు. సాధారణ రోజుల్లో రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు పన్నులు వసూలవుతాయి. మార్చి 31వ తేదీ రూ.2.50 కోట్ల మేర పన్నులు వసూలవుతాయని రెవెన్యూ ఉద్యోగులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచే మూడు సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో పన్నులు కట్టించుకోవడం ప్రారంభించారు. అన్ని కేంద్రాల వద్ద బకాయిదారులు క్యూ కట్టారు. కృష్ణలంక పాతపోలీస్ స్టేషన్ రోడ్డు, పటమట సర్కిల్–3 కార్యాలయం, ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడివద్ద, మీ–సేవా కేంద్రాల్లో పన్ను వసూళ్ల తీరును కమిషనర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశారు. మరో మూడు రోజులు వసూళ్లు పెద్ద నోట్లతో మరో మూడు రోజుల పాటు పన్నులు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు తెలిసింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి వరకు చెల్లింపులు జరపవచ్చని అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థకు మొండి బకాయిలు రూ.100 కోట్లపైనే ఉన్నాయి. ఈక్రమంలో గడువు పెంపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో కనీసం రూ.30 కోట్ల మేర పన్నులు వసూలు చేయాలని కసరత్తు చేస్తున్నారు. -
సందడే సందడి
-
నో మురుగు!
– వందశాతం భూగర్భ డ్రైనేజీ – కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ – కోర్టుకేసులు, పీసీబీ మొట్టికాయలే కారణం – కొత్తగా 80 వేల కనెక్షన్లు ఇవ్వాలని అంచనా విజయవాడ సెంట్రల్ : విజయవాడ నగరంలో నూరు శాతం యూజీడీ(అండర్‌గ్రౌండ్ డ్రెయినేజ్) కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. నగరంలోని ప్రతి ఇంటికి అండర్ గౌండ్ డ్రెయినేజ్ కనెక్షన్లను తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు త్వరలో డివిజన్ స్థాయిలో మేళాలు నిర్వహించేందుకు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. నగరంలో 1.87 లక్షల గృహాలకు సంబంధించి ఆస్తిపన్ను వసూలవుతుండగా, 62 వేల యూజీడీ కనెక్షను మాత్రమే ఉన్నాయి. అపార్ట్మెంట్లు, గ్రూపుహౌస్లు సంబంధించి ఒక్కో కనెక్షనే ఉంటుంది కాబట్టి వాటిని మినహాయించినా ఇంకా సుమారు 80 వేలకు పైగా యూజీడీ కనెక్షన్లు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులు లెక్కతేల్చారు. కోర్టుకేసులు, కాలుష్యనియంత్రణ మండలి (పీసీబీ) అక్షింతలే తాజా కార్యాచరణకు కారణం. మురుగంతా కాలువల్లోకే యూజీడీ కనెక్షన్ల కోసం త్వరలో డివిజన్ స్థాయి మేళాలు జరపాలని కమిషనర్ వీరపాండియన్ ప్రస్తావించగా కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. సిటీలో అత్యధిక ప్రాంతాల్లోని మురుగు, వ్యర్థాలు దశాబ్ధాలుగా ఏలూరు, బందరు, రైవస్ కాల్వల్లో కలుస్తున్నాయి. ఇదే నీటిని సాగు, తాగు అవసరాలకు వాడుతున్న గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు వంటి నగరాలు సహా వందలాది గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు గతంలో కోర్టులను ఆశ్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్లకు పని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎస్టీపీ)లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో ఇప్పటి వరకు నగరపాలక సంస్థ యూజీడీ కనెక్షన్ల మంజూరుపై పెద్ద దృష్టి పెట్టలేదు. జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా నగరంలో యూజీడీ పనులకు రూ.500 కోట్ల ఖర్చు చేశారు. ప్రస్తుతం సింగ్‌నగర్, రామలింగేశ్వరనగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో ఎస్టీపీలు వినియోగంలో ఉన్నాయి. ఒన్‌టౌన్ ప్రాంతంలో రైల్వేశాఖ అభ్యంతరాల వల్ల పైప్‌లైన్ నిర్మాణ పనులకు బ్రేక్‌పడింది. సుమారు 20 కోట్ల ఖర్చుతో వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. వంద కోట్ల ఆదాయ లక్ష్యం నూరుశాతం యూజీడీ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా కాల్వల్లో కాలుష్యానికి చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక సంక్షోభంలోనున్న నగరపాలక సంస్థకు దండి గా ఆదాయం వచ్చే అవకాశం ఉం ది. 80 వేలకు పైగా కనెక్షన్లు మం జూరు చేయడం ద్వారా రూ.80 కోట్ల నుంచి రూ.100కోట్ల ఆదా యం వస్తుందని లెక్కలేస్తున్నారు. -
మీ కృషి వల్లే అవార్డుల పంట
విజయవాడ సెంట్రల్ : మీ (ఉద్యోగుల) అందరి కృషి వల్లే నగర పాలక సంస్థకు అవార్డుల పంట పండిందని కమిషనర్ జి.వీరపాండియన్ అన్నారు. స్కాచ్ సిల్వర్ అవార్డుతోపాటు వివిధ కేటగిరీల్లో ఐదు అవార్డుల్ని సాధించినందుకు గాను మినిస్ట్రీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు చాంబర్లో కమిషనర్ కల్సి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ సంస్కరణల అమల్లో అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే అవార్డులు దక్కాయన్నారు. జాతీయస్థాయిలో పలు నగరాల మధ్య జరిగిన పోటీలో మూడోస్థానంలో నిలవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే మరిన్ని అవార్డులు రావడం తథ్యమన్నారు. టీం వర్కే తన విజయరహస్యమన్నారు. సబ్ కలెక్టర్ సృజన కమిషనర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మినిస్ట్రీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డి.ఈశ్వర్, జి.అజయ్ ఉద్యోగులు పాల్గొన్నారు -
ప్రజాసాధికార సర్వేలోబెజవాడ లాస్ట్
ప్రజాసాధికార సర్వే రాష్ట్రంలో 65 శాతం పూర్తయింది. విజయవాడ నగరంలో మాత్రం రెండు శాతం మాత్రమే చేయగలిగారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంతో పాటు సమాచారం చెప్పేందుకు ప్రజల నుంచి సహకారం లభించడం లేదు. దీనికి తోడు సాంకేతిక సమస్యలు సిబ్బందిని వేధిస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు కమిషనర్, సబ్ కలెక్టర్ యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. విజయవాడ సెంట్రల్ : ప్రజాసాధికారిక సర్వే నిర్వహణలో నగరపాలక సంస్థ చతికిలపడింది. రాష్ట్రంలో చివరి స్థానంలో నిల్చొంది. అధికారుల్లో హైరానా మొదలైంది. కమిషనర్ జి.వీరపాండియన్, సబ్ కలెక్టర్ బి.సృజన దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. సోమవారం కౌన్సిల్ హాల్లో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎన్నికల సర్వేలో పోలింగ్స్టేçÙన్లలలో బీఎల్ఓలుగా పనిచేసిన వారందరినీ కూడా ప్రజాసాధికారిక సర్వే బాధ్యతలు అప్పగించారు. అవసరమైన మేర ట్యాబ్‌లు, ఐరిస్‌లు అందిస్తామని కమిషనర్ ‡ స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఇంటింటికి వెళ్లాల్సిందిగా సూచించారు. పదిరోజులే గడువు పదిరోజుల్లో సర్వే ప్రక్రియను నూరుశాతం పూర్తి చేయాలని కమిషనర్ డెడ్‌లైన్ విధించారు. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు 25 గృహాలను సర్వే చేయాల్సిందిగా టార్గెట్ పెట్టారు. విధి నిర్వహణలో అలసత్వం వహించేవారిపై దండన తప్పదని హెచ్చరించారు. సర్వే నిర్ణహణలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సూపర్వైజర్లు, అసిస్టెంట్ కమిషనర్ల దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సాగించాలన్నారు. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండానే అర్జీలను దాఖలు చేయవచ్చన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. అదనపు కమిషనర్ నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సుబ్బారావు, సిటీప్లానర్ శ్రీనివాసులు, వీఏఎస్ శ్రీధర్, అర్బన్ తహశీల్దార్ శివరావు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు ఎన్నో కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్‌తో పాటు సాంకేతిక ఇబ్బందులు సర్వేను వెంటాడుతున్నాయన్నది ఉద్యోగుల ఆరోపణ. నాలుగు గృహాల్లో సర్వే పూర్తయ్యే సరికి ట్యాబ్‌ల్లో చార్జింగ్ అయిపోతోందని పేర్కొంటున్నారు. పేదలు సర్వేకు సహకరించడం లేదన్నది వారి వాదన. 3.50 లక్షల కుటుంబాలు సగటున నగరంలో ఉంటే ఇప్పటి వరకు 7 వేల కుటుంబాల నుంచి మాత్రమే వివరాలు సేకరించగలిగామని చెబుతున్నారు. కొండప్రాంతాలు, మురికివాడల్లో ఉదయాన్నే పనులకు వెళితే పొద్దుపోయాక కానీ ఇల్లు చేరే పరిస్థితుల్లేవు. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో సర్వే కత్తిమీద సాములా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. -
కమాండ్ కంట్రోల్ రూం పనుల్ని వేగవంతం చేయండి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ రూం పనుల్ని వేగవంతం చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. సోమవారం పనుల్ని పరిశీలించారు. నత్తనడకన సాగుతుండటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరలో పనుల్ని పూర్తి చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నగరంలో చెత్త, నీటి సరఫరా తదితర అంశాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవచ్చన్నారు. కృష్ణా పుష్కరాల్లో ప్రయోగాత్మకంగా దుర్గాఘాట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పనిచేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. చీఫ్ ఇంజనీర్ ఎంఏ.షుకూర్, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) నరసింహమూర్తి, ఈఈ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
బెజవాడ సిగలో ‘స్వచ్ఛ’ అవార్డులు
విజయవాడ సెంట్రల్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాజెక్టుల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను నగరపాలక సంస్థకు ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. జాతీయస్థాయి స్వచ్ఛంద పౌరసేవా సంస్థ స్కోచ్ స్వచ్చ స్మార్ట్‌సిటీ, స్వచ్ఛభారత్ 2016 అవార్డుల్ని ప్రకటించింది. జాతీయస్థాయిలో మూడోస్థానాన్ని బెజవాడ దక్కించుకుంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంఓయూడీ సెక్రటరీ రామచంద్రన్ చేతులమీదుగా మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ అవార్డుల్ని అందుకున్నారు. కొన్నేళ్ళుగా అవార్డుల కోసం ఎదురు చూస్తున్న కార్పొరేషన్ కల నెరవేరింది. డిజిటల్ డోర్ నెంబర్ భవన యజమాని పేరు, ఇంటి డోర్‌నెంబర్, ఆస్తిపన్ను అసెస్మెంట్ నెంబర్‌తో గృహాన్ని ఫొటోతీసి ఆన్లైన్ ద్వారా ఎనిమిది అంకెల డిజిటల్ నెంబర్‌ను కేటాయించారు. స్మార్ట్‌ఫోన్‌లో కొత్త డిజిటల్ డోర్నెంబర్ను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే రూట్‌మ్యాప్ తెలుస్తోంది. డోర్ నెంబర్ ఆధారంగా నగరంలో ఏ ప్రాంతంలో ఉన్నది తేలిగ్గా గుర్తించేందుకు వీలవుతోంది. నగర పరిధిలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పోలీస్స్టేషన్లు, సినిమా థియేటర్లు, మల్టీపర్పస్ కాంప్లెక్స్‌ల చిరునామాను డిజిటల్ అడ్రసింగ్ విధానం ద్వారా తెలిగ్గా తెలుసుకొనే వీలు కల్పించారు. ఆన్లైన్ సేవలు నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) నిబంధనలకు అనుగుణంగా గృహ నిర్మాణాలను అన్లైన్ ప్లాన్లను మంజూరు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రపథమంగా గతేడాది నవంబర్‌లో ఈ విధానాన్ని నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 1,867 ప్లాన్లు మంజూరు చేశారు. దరఖాస్తుదారుడు సంబంధిత పత్రాలన్నీ సమర్పించినట్లైతే ఇరవై నిమిషాల్లో ప్లాన్ మంజూరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుదారుల ఫోన్ నెంబర్, ఐడీ నమోదు చేస్తున్నారు. ప్లాన్ ఏదశలో ఉందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గృహనిర్మాణదారులు తెలుసుకొనే వీలు కల్పించారు. సమయం, వ్యయం వృథా కాకూడదన్నదే ఆన్లైన్ ప్లానింగ్ లక్ష్యం. సోలార్ సిటీ ఆర్థిక సంక్షభంలో ఉన్న నగరపాలక సంస్థలో విద్యుత్ బిల్లుల్ని తగ్గించేందుకు సోలార్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, కౌన్సిల్‌హాల్, హెడ్వాటర వర్క్స్, రామలింగేశ్వరనగర్, సింగ్‌నగర్ ప్రాంతాల్లోని సూయేజ్ట్రీట్మెంట్ ప్లాంట్ల్లో రూ.5 కోట్ల వ్యయంతో సోలార్ విద్యుత్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎన్విరో పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇందులో ప్రధాన కార్యాలయం, కౌన్సిల్హాల్లో సోలార్ విద్యుత్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. కార్పొరేషన్, కౌన్సిల్ హాల్‌కు గతంలో నెలకు రూ.2.70 లక్షలు విద్యుత్ బిల్లులు రాగా ఇప్పుడు రూ.1.08 లక్షలు వస్తోంది. మిగిలిన మూడు ప్రాంతాల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. వారం పది రోజుల్లో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా నగరంలోని మరో ఇరవై ప్రాంతాల్లో సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కార్పొరేషన్ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఆధార్ అటెండెన్స్ ప్రజారోగ్యశాఖలో బోగస్ అటెండెన్స్‌కు చెక్ పెట్టేందుకు ఆధార్ బేస్డ్ అటెండెన్స్‌ను అమలు చేస్తున్నారు. ఉద్యోగ, కార్మికులకు ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. పారిశుధ్య కార్మికులు ఎప్పుడు విధులకు వచ్చింది. ఎంతమంది హాజరైందనే వివరాలను పసిగడుతున్నారు. ఒకరి బదులు మరొకరు హాజరయ్యే విధానానికి కళ్లెం పడింది. వర్కర్ల గైర్హాజర్ శాతం తగ్గుముఖం పట్టింది. మూడు సెకన్ల వ్యవధిలోనే హాజరు నమోదయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. బోగస్ మస్తర్లను అరికట్టడం ద్వారా కొంతమేర అవినీతిని అరికట్టగలిగారు. స్మార్ట్‌సిటీ మొబైల్ యాప్ స్మార్ట్‌సిటీ మొబైల్ యాప్ ద్వారా నగరపాలక సంస్థ సేవల్ని సరళతరం చేశారు. అర్జీలు, ఫిర్యాదులు యాప్ ద్వారా పంపే అవకాశం కల్పించారు. నీటి సరఫరా, డ్రెయినేజ్, కుళాయి కనెక్షన్లు, ఆస్తిపన్ను తదితర అంశాలు, చిన్నపాటి సమస్యల్ని యాప్‌ద్వారా ఫిర్యాదు చేసి పరిష్కరించుకొనే అవకాశం కల్పించారు. దీనికి ప్రజల నుంచి స్పందన బాగానే ఉంది. -
నీటిమీటర్లపై వైఎస్సార్సీపీ సంతకాల సేకరణ
గాంధీనగర్: విజయవాడ నగరంలో నీటి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక లెనిన్ సెంటర్లో నీటిమీటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రజల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు. నీటి మీటర్లు పెట్టి, వినియోగానికి అనుగుణంగా ఛార్జీలు వసూలు చేయాలని మంత్రి నారాయణ ఇటీవల ఓ ప్రకటన చేసిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అత్యవసరంగా కార్పొరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీటి మీటర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీలతోపాటు కార్పొరేటర్లు భవకుమార్, దామోదర్, నాయకులు పాల్గొన్నారు.