మాసిన గడ్డం..ఏపుగా పెరిగిన జుట్టు.. దుర్వాసన వచ్చే దుస్తులు. కాళ్లు, చేతులకు గాయాలతో అమ్మా, అయ్యా అంటూ చేయి చాస్తూ నగరంలో సంచరించే భిక్షగాళ్లను చూస్తే కొందరు జాలి చూపి చేతిలో చిల్లర వేస్తారు..మరికొందరు చీదరించుకుంటారు.. కానీ ఆ చీదరింపు వెనుక గాయపడిన మనస్సు ఉంటుంది.. ఒకప్పుడు అందరిలా దర్జాగానే బతికిన వారే.. కానీ విధి రాతకు తలొగ్గి కడుపు నింపుకొనేందుకు చేతులు చాస్తున్నారు.. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్యర్యంలో జరిపిన ప్రత్యేక డ్రైవ్‌లో పట్టుబడిన వారి మనోగతం వింటే కళ్లు చెమ్మగిల్లాల్సిందే.. – సాక్షి,అమరావతిబ్యూరో
బంగారు లచ్చన్న విజయవాడకు చెందిన లచ్చన్న గతంలో నగరపాలక సంస్థలో వెహికల్ డిపోలో కార్మికుడిగా పనిచేశాడు. విశాఖజిల్లా గుడిచర్లకు చెందిన నాగమణితో వివాహమైంది. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూమార్తె. అందరిలానే వారికి చదువులు చెప్పించి వారిని ఉన్నతంగా బతికేలా చేశారు. ముగ్గురు కొడుకులు ప్రస్తుతం వివిధ వృత్తులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. కుమార్తెను బావమరిదికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. చేతికొచ్చిన పిల్లలు ఆదుకుంటారని ఆశించిన లచ్చన్నకు నిరాశే మిగిలింది. 2013లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన్ను కొన్నేళ్లు ఇంట్లో ఉంచుకున్న బిడ్డలు ఆపై మొహం చాటేశారు. ప్రస్తుతం పక్షవాతం రావడంతో కాలు, చేయి పనిచేయడం లేదు. కర్రసాయంతో రెండేళ్లుగా భిక్షమెత్తుకుంటున్నాడు. ఈయన సతీమణి మాత్రం పుట్టింటి వారి దగ్గరే ఉంటుంది.
జేమ్స్ అంథాల్ విశాఖజిల్లా రేగడ ప్రాంతానికి చెందిన వాడు. అదే ప్రాంతానికి చెందిన రాములమ్మను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆ బిడ్డలను ఉన్నతస్థాయిలో ఉంచాలని ముఫ్పై ఏళ్లు సికింద్రాబాద్‌లోని బొయినపల్లి వద్ద ఫంక్షన్ హాలులో వర్కర్‌గా పనిచేశాడు. అనుకున్నట్లే బిడ్డలను చదువులు చదివించి ఉన్నతస్థాయికి ఎదిగేలా చేశాడు. ఈయన పెద్దకుమారుడు విశాఖ జిల్లాలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మరో అబ్బాయి పెయింటర్ వృత్తి చేసుకుంటున్నాడు. కుమార్తె చదువుకొని మంచి స్థాయిలోనే ఉంది. కానీ వారికి తండ్రి భారమయ్యాడు.రెండేళ్లుగా ఇంటిని వదిలి తమిళనాడుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ పొట్టపోసుకుంటున్నాడు.
రంజిత్ తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన వ్యక్తి. మెకానిక్‌గా పనిచేసే∙రంజిత్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఏఎన్‌ఎంను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ కలహాలతో రంజిత్ ఇంట్లో గొడవపడి గత 8 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చేశాడు. విజయవాడలో మెకానిక్‌గా పనిచేస్తూ మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. అనారోగ్యం బారిన పడి భిక్షమెత్తుకోవడం అలవాటు చేసుకున్నాడు. అందరిలాగానే కుటుంబంతో కలిసి దర్జాగా జీవించాల్సి ఉన్నా.. తన విధి రాత బాగా లేక దీనస్థితిలో బతుకుతున్నానంటూ బాధను వ్యక్తం చేశాడు.. పగవాడికి ఇలాంటి కష్టం రాకూడని ఆవేదన చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment