బెజవాడ సిగలో ‘స్వచ్ఛ’ అవార్డులు
బెజవాడ సిగలో ‘స్వచ్ఛ’ అవార్డులు
Published Fri, Sep 9 2016 8:27 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
విజయవాడ సెంట్రల్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాజెక్టుల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను నగరపాలక సంస్థకు ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. జాతీయస్థాయి స్వచ్ఛంద పౌరసేవా సంస్థ స్కోచ్ స్వచ్చ స్మార్ట్‌సిటీ, స్వచ్ఛభారత్ 2016 అవార్డుల్ని ప్రకటించింది. జాతీయస్థాయిలో మూడోస్థానాన్ని బెజవాడ దక్కించుకుంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంఓయూడీ సెక్రటరీ రామచంద్రన్ చేతులమీదుగా మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ అవార్డుల్ని అందుకున్నారు. కొన్నేళ్ళుగా అవార్డుల కోసం ఎదురు చూస్తున్న కార్పొరేషన్ కల నెరవేరింది.
డిజిటల్ డోర్ నెంబర్
భవన యజమాని పేరు, ఇంటి డోర్‌నెంబర్, ఆస్తిపన్ను అసెస్‌మెంట్ నెంబర్‌తో గృహాన్ని ఫొటోతీసి ఆన్‌లైన్ ద్వారా ఎనిమిది అంకెల డిజిటల్ నెంబర్‌ను కేటాయించారు. స్మార్ట్‌ఫోన్‌లో కొత్త డిజిటల్ డోర్‌నెంబర్‌ను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే రూట్‌మ్యాప్ తెలుస్తోంది. డోర్ నెంబర్ ఆధారంగా నగరంలో ఏ ప్రాంతంలో ఉన్నది తేలిగ్గా గుర్తించేందుకు వీలవుతోంది. నగర పరిధిలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పోలీస్‌స్టేషన్లు, సినిమా థియేటర్లు, మల్టీపర్పస్ కాంప్లెక్స్‌ల చిరునామాను డిజిటల్ అడ్రసింగ్ విధానం ద్వారా తెలిగ్గా తెలుసుకొనే వీలు కల్పించారు.
ఆన్‌లైన్ సేవలు
నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్‌బీసీ) నిబంధనలకు అనుగుణంగా గృహ నిర్మాణాలను అన్‌లైన్ ప్లాన్‌లను మంజూరు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రపథమంగా గతేడాది నవంబర్‌లో ఈ విధానాన్ని నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 1,867 ప్లాన్లు మంజూరు చేశారు. దరఖాస్తుదారుడు సంబంధిత పత్రాలన్నీ సమర్పించినట్లైతే ఇరవై నిమిషాల్లో ప్లాన్ మంజూరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారుల ఫోన్ నెంబర్, ఐడీ నమోదు చేస్తున్నారు. ప్లాన్ ఏదశలో ఉందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గృహనిర్మాణదారులు తెలుసుకొనే వీలు కల్పించారు. సమయం, వ్యయం వృథా కాకూడదన్నదే ఆన్‌లైన్ ప్లానింగ్ లక్ష్యం.
సోలార్ సిటీ
ఆర్థిక సంక్షభంలో ఉన్న నగరపాలక సంస్థలో విద్యుత్ బిల్లుల్ని తగ్గించేందుకు సోలార్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం, కౌన్సిల్‌హాల్, హెడ్‌వాటర వర్క్స్, రామలింగేశ్వరనగర్, సింగ్‌నగర్ ప్రాంతాల్లోని సూయేజ్‌ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల్లో రూ.5 కోట్ల వ్యయంతో సోలార్ విద్యుత్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ఎన్విరో పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇందులో ప్రధాన కార్యాలయం, కౌన్సిల్‌హాల్లో సోలార్ విద్యుత్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. కార్పొరేషన్, కౌన్సిల్ హాల్‌కు గతంలో నెలకు రూ.2.70 లక్షలు విద్యుత్ బిల్లులు రాగా ఇప్పుడు రూ.1.08 లక్షలు వస్తోంది. మిగిలిన మూడు ప్రాంతాల్లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. వారం పది రోజుల్లో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా నగరంలోని మరో ఇరవై ప్రాంతాల్లో సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కార్పొరేషన్ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది.
ఆధార్ అటెండెన్స్
ప్రజారోగ్యశాఖలో బోగస్ అటెండెన్స్‌కు చెక్ పెట్టేందుకు ఆధార్ బేస్డ్ అటెండెన్స్‌ను అమలు చేస్తున్నారు. ఉద్యోగ, కార్మికులకు ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. పారిశుధ్య కార్మికులు ఎప్పుడు విధులకు వచ్చింది. ఎంతమంది హాజరైందనే వివరాలను పసిగడుతున్నారు. ఒకరి బదులు మరొకరు హాజరయ్యే విధానానికి కళ్లెం పడింది. వర్కర్ల గైర్హాజర్ శాతం తగ్గుముఖం పట్టింది. మూడు సెకన్ల వ్యవధిలోనే హాజరు నమోదయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. బోగస్ మస్తర్లను అరికట్టడం ద్వారా కొంతమేర అవినీతిని అరికట్టగలిగారు.
స్మార్ట్‌సిటీ మొబైల్ యాప్
స్మార్ట్‌సిటీ మొబైల్ యాప్ ద్వారా నగరపాలక సంస్థ సేవల్ని సరళతరం చేశారు. అర్జీలు, ఫిర్యాదులు యాప్ ద్వారా పంపే అవకాశం కల్పించారు. నీటి సరఫరా, డ్రెయినేజ్, కుళాయి కనెక్షన్లు, ఆస్తిపన్ను తదితర అంశాలు, చిన్నపాటి సమస్యల్ని యాప్‌ద్వారా ఫిర్యాదు చేసి పరిష్కరించుకొనే అవకాశం కల్పించారు. దీనికి ప్రజల నుంచి స్పందన బాగానే ఉంది.
Advertisement
Advertisement