ప్రజాసాధికార సర్వేలోబెజవాడ లాస్ట్
ప్రజాసాధికార సర్వేలోబెజవాడ లాస్ట్
Published Tue, Sep 13 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
ప్రజాసాధికార సర్వే రాష్ట్రంలో 65 శాతం పూర్తయింది. విజయవాడ నగరంలో మాత్రం రెండు శాతం మాత్రమే చేయగలిగారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంతో పాటు సమాచారం చెప్పేందుకు ప్రజల నుంచి సహకారం లభించడం లేదు. దీనికి తోడు సాంకేతిక సమస్యలు సిబ్బందిని వేధిస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు కమిషనర్, సబ్ కలెక్టర్ యాక్షన్‌ప్లాన్ రూపొందించారు.
విజయవాడ సెంట్రల్ :
ప్రజాసాధికారిక సర్వే నిర్వహణలో నగరపాలక సంస్థ చతికిలపడింది. రాష్ట్రంలో చివరి స్థానంలో నిల్చొంది. అధికారుల్లో హైరానా మొదలైంది. కమిషనర్ జి.వీరపాండియన్, సబ్ కలెక్టర్ బి.సృజన దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. సోమవారం కౌన్సిల్ హాల్లో సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎన్నికల సర్వేలో పోలింగ్‌స్టేçÙన్లలలో బీఎల్‌ఓలుగా పనిచేసిన వారందరినీ కూడా ప్రజాసాధికారిక సర్వే బాధ్యతలు అప్పగించారు. అవసరమైన మేర ట్యాబ్‌లు, ఐరిస్‌లు అందిస్తామని కమిషనర్ ‡ స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఇంటింటికి వెళ్లాల్సిందిగా సూచించారు.
పదిరోజులే గడువు
పదిరోజుల్లో సర్వే ప్రక్రియను నూరుశాతం పూర్తి చేయాలని కమిషనర్ డెడ్‌లైన్ విధించారు. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు 25 గృహాలను సర్వే చేయాల్సిందిగా టార్గెట్ పెట్టారు. విధి నిర్వహణలో అలసత్వం వహించేవారిపై దండన తప్పదని హెచ్చరించారు. సర్వే నిర్ణహణలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ కమిషనర్ల దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ సాగించాలన్నారు. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండానే అర్జీలను దాఖలు చేయవచ్చన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిందిగా సూచించారు. అదనపు కమిషనర్ నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సుబ్బారావు, సిటీప్లానర్ శ్రీనివాసులు, వీఏఎస్ శ్రీధర్, అర్బన్ తహశీల్దార్ శివరావు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బందులు ఎన్నో
కృష్ణా పుష్కరాల ఎఫెక్ట్‌తో పాటు సాంకేతిక ఇబ్బందులు సర్వేను వెంటాడుతున్నాయన్నది ఉద్యోగుల ఆరోపణ. నాలుగు గృహాల్లో సర్వే పూర్తయ్యే సరికి ట్యాబ్‌ల్లో చార్జింగ్ అయిపోతోందని పేర్కొంటున్నారు. పేదలు సర్వేకు సహకరించడం లేదన్నది వారి వాదన. 3.50 లక్షల కుటుంబాలు సగటున నగరంలో ఉంటే ఇప్పటి వరకు 7 వేల కుటుంబాల నుంచి మాత్రమే వివరాలు సేకరించగలిగామని చెబుతున్నారు. కొండప్రాంతాలు, మురికివాడల్లో ఉదయాన్నే పనులకు వెళితే పొద్దుపోయాక కానీ ఇల్లు చేరే పరిస్థితుల్లేవు. ఈక్రమంలో ఆయా ప్రాంతాల్లో సర్వే కత్తిమీద సాములా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు.
Advertisement