పేటీఎమ్‌ మెగా ఐపీవో రెడీ | Paytm, Sapphire Foods and Latent View Analytics to raise Rs 21,000 cr in IPOs next week | Sakshi
Sakshi News home page

పేటీఎమ్‌ మెగా ఐపీవో రెడీ

Published Sat, Nov 6 2021 2:57 AM | Last Updated on Sat, Nov 6 2021 2:57 AM

Paytm, Sapphire Foods and Latent View Analytics to raise Rs 21,000 cr in IPOs next week - Sakshi

కొద్ది రోజులుగా స్టాక్‌ మార్కెట్లతో పోటీ పడుతున్న ప్రైమరీ మార్కెట్‌ వచ్చే వారం మరింత స్పీడందుకోనుంది. డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా మూడు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టనున్నాయి. వెరసి సెకండరీ మార్కెట్‌ మరింత కళకళలాడనుంది.
 
న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లలో వచ్చే వారం ఐపీవోల సందడి నెలకొననుంది. పేటీఎమ్‌ బ్రాండుతో డిజిటల్‌ సేవలందిస్తున్న వన్‌97 కమ్యూనికేషన్స్‌తోపాటు.. కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ ఔట్‌లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్‌ ఫుడ్స్, ఐటీ సర్వీసుల సంస్థ లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌ పబ్లిక్‌ ఇష్యూలకు తెరలేవనుంది. మూడు కంపెనీల ఇష్యూలనూ కలిపితే రూ. 21,000 కోట్లను సమకూర్చుకునే అవకాశముంది.

కాగా.. ఈ వారం ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఈకామర్స్‌ వెంచర్స్, నైకా, ఫినో పేమెంట్స్‌ బ్యాంక్, పీబీ ఫిన్‌టెక్‌(పాలసీబజార్‌), ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్‌ పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టిన సంగతి      తెలిసిందే. పేటీఎమ్‌ ఐపీవో సోమవారం(8న) ప్రారంభమై బుధవారం(10న) ముగియనుంది. సఫైర్‌ ఫుడ్స్‌ ఐపీవో 9–11 మధ్య, లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌ 10–12 మధ్య పబ్లిక్‌ ఇష్యూలను       చేపట్టనున్నాయి.

పేటీఎమ్‌ జోరు
ఐపీవో ద్వారా వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ. 18,300 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు షేరుకి రూ. 2,080–2,150 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. దీంతో కంపెనీ విలువ రూ. 1.48 లక్షల కోట్లను తాకనుంది. ఐపీవో విజయవంతమైతే.. కోల్‌ ఇండియా తదుపరి రెండో పెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇంతక్రితం 2010లో కోల్‌ ఇండియా అత్యధికంగా రూ. 15,200 కోట్లు సమకూర్చుకుంది. బుధవారం పేటీఎమ్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 8,235 కోట్లు సమీకరించింది.

సఫైర్‌ ఫుడ్స్‌ ఇలా
ఐపీవోకు రూ. 1,120–1,180 ధరల శ్రేణిని సఫైర్‌ ఫుడ్స్‌ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు 1.757 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనున్నాయి. తద్వారా రూ. 2,073 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. సఫైర్‌ ఫుడ్స్‌ మారిషస్‌ 55.69 లక్షలు, డబ్ల్యూడబ్ల్యూడీ రూబీ 48.46 లక్షలు, అమెథిస్ట్‌ 39.62 లక్షలు, క్యూఎస్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ ట్రస్ట్‌ 8.5 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి.  

లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌ రూ. 474 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 126 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. ఐపీవోకు రూ. 190–197 ధరల శ్రేణిని    ప్రకటించింది. తద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్‌ వి.వెంకటరామన్‌ రూ. 60.14 కోట్లు, వాటాదారుడు రమేష్‌ హరిహరన్‌ రూ. 35 కోట్లు, గోపీనాథ్‌ కోటీశ్వరన్‌ రూ. 23.52 కోట్ల విలువైన వాటాలను ఆఫర్‌     చేయనున్నారు.  

46 కంపెనీలు
ఈ కేలండర్‌ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 46 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 80,102 కోట్లను సమీకరించాయి. ఏడాది పూర్తయ్యేసరికి ప్రైమరీ మార్కెట్‌ ద్వారా నిధుల సమీకరణ రూ. లక్ష కోట్లను మించగలదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది(2020)లో ఐపీవోల ద్వారా 15 కంపెనీలు కేవలం రూ. 26,611 కోట్లు సమకూర్చుకున్నాయి. గతంలో 2017లో మాత్రమే ఈ స్థాయిలో 36 కంపెనీలు ప్రైమరీ మార్కెట్‌ ద్వారా రూ. 67,147 కోట్లను అందుకోవడం ద్వారా రికార్డు నెలకొల్పాయి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement