న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ 2023 సెప్టెంబర్ త్రైమాసికానికల్లా లాభాల్లోకి ప్రవేశించగలదని కంపెనీ ఎండీ, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. గతంలో ప్రకటించినట్లే వచ్చే సెప్టెంబర్‌కల్లా కంపెనీ నిర్వహణా లాభాలు ఆర్జించగలదని 22వ వార్షిక సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపులను నిర్వహిస్తున్న కంపెనీ షేరు ధరను ప్రభావితం చేయబోమని, అయితే కంపెనీ లాభదాయకంగా మారేందుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు.
2018–19 వరకూ కంపెనీ విస్తరణలో ఉన్నదని, 2019–20లో మానిటైజేషన్ బాట పట్టిందని తెలియజేశారు. షేరు ధరను తాము ప్రభావితం చేయబోమని, పలు అంశాలు ఇందుకు కారణమవుతుంటాయని వివరించారు. రూ. 2,150 ధరలో ఐపీవో చేపట్టగా వారాంతాన షేరు రూ. 771 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎండీ, సీఈవోగా మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు విజయ్ శేఖర్ శర్మను వాటాదారులు ఎంపిక చేసినట్లు కంపెనీ దాఖలు చేసిన స్క్రూటినైజర్ నివేదిక వెల్లడించింది. శర్మకు అనుకూలంగా 99.67 శాతం మంది వాటాదారులు ఓటు చేసినట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల సలహాదారు సంస్థ(ఐఐఏఎస్) శర్మ పునర్నియామకానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment