2023–24లో దేశవ్యాప్తంగా 2.90 లక్షల ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు
దేశంలో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్డు, డిజిటల్ చెల్లింపులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దేశంలో 2016లో పెద్దనోట్లు రద్దు చేసిన అనంతరం వచ్చిన మార్పుల్లో భాగంగా కార్డు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏకంగా రోజుకు సగటున 800 ఆన్‌లైన్ ఆర్థిక మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నివేదిక వెల్లడించింది. సుమారు రూ.2,110 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలిపింది. – సాక్షి, అమరావతి
అధిక మోసాలు ఈ రూపాల్లోనే
» బ్యాంకు ఖాతాదారులు సైబర్ ముఠాల మాటలు నమ్మి తమ ఓటీపీ, ఇతర వివరాలను వారికి తెలియజేయడం వల్లే అధికంగా ఆరి్థక మోసాలు జరుగుతున్నాయి.
» ఖాతాదారులు బోగస్ ఈ–కామర్స్ సైట్లకు నిధులు బదిలీ చేయడం ద్వారా పాల్పడుతున్న మోసాలు రెండో స్థానంలో ఉన్నాయి.
» బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్/బ్రీచ్ ద్వారా పాల్పడుతున్న నేరాలు మూడో స్థానంలో ఉన్నాయి.
» బ్యాంకు ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆధార్, పాన్ కార్డ్, ఓటీపీ వివరాలను ఇతరులకు తెలియజేయకూడదని ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది. తమ వివరాలను ఇతరులకు వెల్లడించడం ద్వారాగానీ, అనధికారిక లావాదేవీలతో సంభవించే ఆరి్థక మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవని, దీనిపై 2017లోనే నిబంధనలు రూపొందించామని గుర్తుచేసింది.
ఆర్‌బీఐ నివేదికలోని ప్రధాన అంశాలు
»2023–24లో దేశంలో 2.90 లక్షల ఆన్‌లైన్ ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 800 కేసులు నమోదు కావడం గమనార్హం.
» రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082 నమోదయ్యాయి. మిగిలిన కేసులతో కలిపి 2023–24లో మొత్తంమీద 2.90లక్షల ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు.
» 2016 తర్వాత ఆన్‌లైన్ ఆర్థిక నేరాల్లో గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
» ఆన్‌లైన్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరాల ముఠాలు భారీస్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2,110 కోట్లు కొల్లగొట్టాయి. వాటిలో రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కేసుల్లో మొత్తం రూ.1,457 కోట్లు స్వాహా చేశారు. రూ.లక్ష కంటే తక్కువ కొల్లగొట్టిన కేసుల్లో మొత్తం రూ.653 కోట్లు దోచుకున్నారు.
2023–24 లో దేశంలో ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు ఇలా..
» మొత్తం కేసులు 2.90 లక్షలు
» రోజుకు నమోదైన సగటు కేసులు 800
» రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082
» మొత్తం స్వాహా చేసిన మొత్తం రూ. 2,110 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment